Sunday, 5 July 2015

ఆత్మ సాక్షాత్కారం

ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముల స్థితి ఎట్లా వుంటుందో, తక్కినవారు గ్రహించలేరు. విచక్షణతో చూస్తే ఈ విభేదమంతా వారు వారు కల్పించుకున్నది కాదనీ, వారి మాటల, చేతల, ప్రోద్బలమంతా ఈశ్వర చోదితమని తెలుస్తుంది. అరుణాచల శ్రీరమణ భగవాన్ జీవితంలో భక్తులకు, మేధావులకు, ఆధ్యాత్మిక సంపన్నులకు కూడా ఎన్నో విషయాలు అర్థం కావు. ఆయన ఈ సమాజంలోని ఈ ద్వందాలు దాటిన మహర్షి అనీ, సర్వేశ్వరుడే అని నమ్మినవారినీ, నమ్మనివారికి కాని భగవాన్ ఏ మనిషికి, ఏ పరిస్థితులలో ఏ విధంగా మాట్లాడుతారో, ఏవిధంగా బోధనలు చేస్తారో అంతుపట్టని విషయం. శ్రీరమణాశ్రమంలో భగవాన్ చుట్టూ జరిగే వాటిలో ఆయనకు ఎంత సంబంధంవుందో చెప్పలేం. సంబంధం వుండనూ వుంది, ఉండనూ లేదు. ఉందంటే వుంది, లేదంటే లేదు. శ్రీరమణ మహర్షి ఆశ్రమంలో తరుచూ జరిగే లోపాలు, పక్షపాతాలు, ఘోరాలు అన్యాయాల్ని ప్రశ్నించిన భక్తుల్ని ఒక్కోసారి సుతిమెత్తగా మరోసారి మేఘ గర్జనగల భీర స్వరంతో మీరు ఆశ్రమాన్ని సంస్కరించడానికి వచ్చారా? ఈ మాత్రం దానికి అంత దూరం నుండి రావడం దేనికి? మీమీ దేశాలలో సంస్కరించడానికి ఏమీ లేవా? మీరు వచ్చిన పని ఏదో చూసుకొని వెళ్లరాదా? అంటూ భగవాన్ నర్మగర్భంగా ప్రశ్నిస్తే ఆయనను అర్థం చేసుకొన్న వారు మహాగీతోపనిషత్తుగా భావించి నమస్కరించేవారు. అర్థంకానివారు అంధకారంలో పడి తమను తామూ సమర్థించుకొంటూ తమ మార్గమే సరైన మార్గమని అహంభావం ప్రదర్శించేవారు. తాను మనసారా విశ్వసించని విషయాన్ని కూడా భక్తుల వత్తిడితో ‘సరే’ అని ఆమోదించేవారు. ఆదరించి, ఆశ్రయం కల్పించాల్సిన భక్తులను స్వాప్నిక దృష్టితో కలల్లో కనబడి రమ్మంటారు. భగవాన్ పిలుపుకు ఆగలేని ఆతృతా, ఎప్పుడు దర్శన భాగ్యం కలుగుతుందా అని సుదూర ప్రాంతాలనుంచి పరుగు పరుగున దరిచేరితే భాగవాన్ ఆత్మీయతతో ఆదరించి కరుణారసం కురిపిస్తాడని ఆశిస్తే భగవాన్ అటువైపు కూడా తల తిప్పని పరిస్థితి. ఎదుట వున్నా పలుకరించని పరిస్థితి. ఆతురతతో ఎదురుచూసిన భక్తుని పలుకరించరు. చిరునవ్వు నవ్వరు. కొన్ని రోజులైనా నెలలయిన అతని కోసం అహర్నిశలూ ఆత్రతతో ఎదురుచూస్తున్నా పలుకరించరు? అనుగ్రహించరు? భగవాన్ ఎప్పుడు అక్కున చేర్చుకుంటారో? అసలు పట్టనట్లే ఆవలకు నెట్టివేస్తాడో అంతా ఈశ్వరేచ్ఛ. భగవాన్ వైఖరి ఎప్పటికప్పుడు మారేది. ఆయన ఏ ఆనంద నిబిడీకృతమైన తేజోశూన్యంలోకో, కిటికీలోనుంచి అనంతపుదిక్కుల అంచుల్ని దాటి చూస్తున్నపుడు, ఆయన ధ్యాన ముద్రలో కూర్చున్నపుడు సాక్షాత్ దక్షిణామూర్తిని తలపించేవారు. భక్తులు ఆ దివ్యానంద స్థితిని పరికించి అరుణాచల పరమేష్టి ఆత్మసాక్షాత్కారం కళ్ళకు అగుపించేది.

మృత్యువువాతన పడిన దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. అంతటితో అంతవరకు నిత్యం అనుసరిస్తున్న నేను అనేది అంతమైనట్లేనా? ‘నేను’ అనేది అనంతంగా సాక్షాత్కరిస్తుంటే ఆ ‘నేను’ ఎవరో తెలుసుకో. నేను, నాది అనే విషయాన్ని విస్మరించు. నేను అనే బ్రహ్మపదార్థాన్ని తెలుసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం. కనుక నేను అనేది ఈ దేహంకాదు. నాకు మృత్యువు లేదు అని భావించేటప్పటికి అతనికి జ్ఞానోదయమయింది. నేను అనేది మనసు ఆలోచన కాక, అది అనుభవమైపోయింది. మన మనసుగాక మనలో ఆత్మ అనేది వుందనీ, ఆ ఆత్మను తలచుకుంటే మనకింక బాధలుండవనీ ‘నేనెవరు?’ అనే విచార మార్గం వల్ల ఆ ఆత్మని తెలుసుకోగలమనీ భగవాన్ అంటారు. శ్రీరమణ మహర్షి ఆశ్రమానికి ఒక భక్తుడు వెళ్ళారు. భగవాన్‌ను ఉద్దేశించి ‘‘స్వామీ! నా మనస్సు నేను చెప్పినట్టు దాని ఇష్టం వచ్చినట్లు విచారిస్తోంది. అందువల్ల నాకు అశాంతి కలుగుతోంది. నా మనసును స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు మార్గం ఏదీ? అని భక్తుడు ప్రశ్న ముగించకముందే భగవాన్ కరుణారసమైన వాక్కులతో జీవితంలో సాధకుల యత్నమంతా అందుకోసమే. ఆ మనసుని అరికట్టడానికే, జ్ఞాన, భక్తి, కర్మ మార్గములన్నీ దానికోసమే. జ్ఞాన మార్గం ద్వారా మనసును నేను కాను అని తెలుసుకుని మనసును నిరోధించవచ్చు. కర్మమార్గంలో- ఏదో ఒక కర్మయందు మనసును లగ్నం చెయ్యడంవల్ల మనసు నిలిచిపోతుంది. భక్తిమార్గంలో మనసుని సర్వదా ఇష్టదైవం మీదికి పోనిచ్చి, ఆ ప్రార్థన పూజ సేవలలో మనసుని వుంచడంవల్ల కొంతకాలానికి ఆ మూర్తియందే లగ్నమై నిలబడిపోతుంది. అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం. నీ ఇష్టదైవం పటంగాని, విగ్రహం గాని, నీ మనసులో తీరికైనప్పుడల్లా ధ్యానించుకో- దానివల్ల నీ మనసు నిలబడిపోతుంది

No comments:

Post a Comment