Sunday, 5 July 2015

భారతీయ వాస్తుశాస్త్రం

భారతీయ వాస్తుశాస్త్రం -- ఒక చిన్న పరిశీలన
నేడు పాశ్చాత్యులను మంత్రముగ్ధులని చేస్తూ తనవైపు ఆకర్షిస్తున్న భారతీయ విద్యలలో "వాస్తుశాస్త్రం" ముఖ్యమైనది. భావన నిర్మాణంలో ప్రకృతి సమతుల్యం అవసరమని భావిస్తూ నేటి ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లు తదనుగుణంగా భవన నిర్మాణ చట్టాలలో ఎన్నో శాసనాలు రావడానికి కృషి చేస్తున్నారు. 'పంచ భూతాత్మక ప్రకృతితో సమతుల్యత పాటించి, నిర్మించే భారతీయ భవన నిర్మాణ విజ్ఞానమే "వాస్తుశాస్త్రం". భారతీయులు కేవలం "స్థూల జగత్తు"కే పరిమితం కాకుండా, ఈ జగత్తును నడిపించే 'సూక్ష్మ శక్తులకు' పెద్దపీట వేసి వాస్తు రచన గావించారు. వాస్తుశాస్త్రంలో మానవుని సుఖజీవనం ఆశించి, పంచభూతాత్మకమైన ప్రకృతిలోని పలు శక్తి కేంద్రాలు, శక్తి రేఖలను, శక్తి మండలాలను 'గృహక్షేత్రం'లో అనుసంధానం చేశారు. భారత విజ్ఞానం మానవుడు గృహాన్ని ఒక "చేతన వస్తువు" గానే పరిగణించి ఈ శాస్త్రాన్ని ప్రబోధించాడు. "వసంత్యస్మిన్నితి వాస్తుః" అనగా ఉండదగిన వసతిని గురించి చెప్పేది వాస్తు అని అర్థం. హిందూ దేవాలయాల నిర్మాణం ఆగమ శాస్త్రం, వాస్తుశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నిర్మింపబడినది. ప్రాచీన భారతంలో రాజప్రాసాదాలు, నగరాలు, గృహాలు ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించేవారు. వాస్తుశాస్త్రం, స్తపత్య వేదం - అథర్వణ వేదంలోని భాగం. మత్స్య పురాణంలో తెలుపబడిన 18 మంది వాస్తు శాస్త్రోపదేశకులు.
1. భ్రుగువు, 2. అత్రి, 3. వశిష్టుడు, 4. విశ్వకర్మ, 5. మయుడు, 6. నారదుడు, 7. నగ్నజిత్, 8. విశాలా మొదలైనవారు. ఇక మత్స్య పురాణం, స్కంధ పురాణం, అగ్ని పురాణం, గరుడ పురాణం, విష్ణు పురాణాలలో అనేక ప్రాసాద నిర్మాణాలగురించి వివరించారు.
భారతీయ ప్రసిద్ధ వాస్తుశాస్త్ర గ్రంథాలు:
1. కశ్యప మహాముని రచించిన "కశ్యప శిల్పము".
2. వరాహమిహురుడు రచించిన "భ్రుహత్ సంహిత".
3. మయుడు రచించిన "మయామత వాస్తుశాస్త్రం".
4. విశ్వకర్మ రచించిన "విశ్వకర్మ వాస్తుశాస్త్రం".
5. భోజమహరాజు రచించిన "సమరాంగణ సూత్రధార". ఇంకా అపరాజితపృశ్చ, జయపృశ్చ మొదలైన గ్రంథాలు ఉన్నాయి. రామాయణంలో అయోధ్యనగర వర్ణనలో ఆ నగరం వాస్తు సిద్ధాంతం ప్రకారం నిర్మించబడినది అని తెలుస్తున్నది. హనుమంతుడు లంకా నగరం వీక్షిస్తూ ప్రతి ప్రాసాదము వాస్తు దోషం లేకుండా అతి సుందరంగా నిర్మించబడినది అని చెబుతాడు.
మహాభారతంలో "మయుడు" నిర్మించిన "మయసభ" భవనం పదివేల హస్తాల పరిధిగా సమకోణ చతురస్రాకారంలో ఉన్నదని వ్యాసుడు వివరించాడు. ఇంద్రప్రస్త పురంలో పలు ఎత్తైన భవనములు నిర్మించబడినవని తెలియజేశాడు. వాస్తుపురుషమండలం అంటే అది ఒక శక్తి మండలం. 8 X 8 = 64, లేక 9 X 9 = 81 అను సమకోణ చతురస్రపు భూమికని "ఎనర్జీ గ్రిడ్" అని అంటారు. భవననిర్మాణం కానీ, గృహ నిర్మాణం కానీ చేపట్టినపుడు ఈ క్రింది అంశాలను వాస్తుశాస్త్రం పరిగణలోకి తీసుకుంటుంది. 1. భూమి స్వాభావం, 2. గృహయజమాని యొక్క జన్మకుండలి, 3. వాస్తు పురుష మండలితో అనుసంధానింపబడిన గృహనిర్మాణ శైలిని, 4. ప్రవేశ ద్వారాల, కిటికీల యొక్క స్థానాలను, 5. బ్రహ్మస్థానం, 6. అష్టదిక్పాలకుల అనుగ్రహ ప్రాప్తిని ఉద్దేశించే గదుల నిర్మాణం, 7. ఎత్తు నిర్ణయం. గృహానికి ఈశాన్యంలో నీటి బావి, పూజామందిరం; ఆగ్నేయంలో వంటగది; నైరుతిలో యజమాని నివాసం; వాయువ్యంలో స్నానాలు, మరుగుదొడ్డి నిర్మించిన యెడల మంచిదని వాస్తుశాస్త్రం తెలుపుతుంది. గృహ మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఇది ఎంతో ప్రాముఖ్యతగల ప్రదేశం. గృహ నిర్మాణంలో ఈ ప్రదేశాన్ని కప్పు లేకుండా వదిలిపెట్టడం, దివ్యశక్తిని గ్రహించేందుకు, గృహంలో నివసించేవారికి, యజమానికి మరింత శుభదాయకం. ముఖ్యంగా భావనానికి తూర్పు, ఉత్తర దిశలలో ఎక్కువ ఖాళీ స్థలం ఉంచి, నైరుతి ఎత్తుగానూ, ఈశాన్యం పల్లంగానూ ఉన్నచో అట్టి గృహానికి శుభమని తెలుపుతున్నది.
( వారెవరో అన్నంత మాత్రాన మన శ
.ాస్త్రం "మూర్ఖత్వం" అవదు, అనిపించుకోదు )

No comments:

Post a Comment