Sunday 26 July 2015

ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదు?


దోసిళ్లతో దూసుకోమంటూ ప్రకృతి ప్రసాదించిన అపురూప వరాలు ... ఉసిరికాయలు. స్వచ్ఛంగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించేలా ఇవి నోరూరిస్తుంటాయి. ఇవి తినేసి మంచినీళ్లు తాగితే తియ్యగా అనిపిస్తూ వుంటాయి కనుక, అందుకు చిన్నపిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఊళ్లో వాళ్లంతా కలిసినా ఉసిరికాయంత మేలు చేయలేరని అంటూ వుంటారు. అంతగా ఉసిరికాయ అందరి జీవితాల్లోను ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆయుర్వేద వైద్య విధానంలోను ఉసిరికాయను విరివిగా వాడుతుంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉసిరికాయ ప్రముఖమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. ఇక ఉసిరికాయ పచ్చడిని ఇష్టపడని వారంటూ వుండరు. కొత్తగా ఉసిరికాయ పచ్చడి పెట్టిన రోజున తినడానికి ఇష్టపడేవాళ్లు కొందరైతే, పాత ఉసిరికాయ పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్లు మరికొందరు.
అందరూ అంతగా ఇష్టపడే ఉసిరికాయ పచ్చడిని 'ఆదివారం' తినకూడదని పెద్దలు చెబుతుంటారు. రాత్రి సమయాల్లో ఆ పేరును కూడా పలకకూడదని అంటూ వుంటారు. అయితే అందుకు గల కారణమేమిటో తెలియక చాలామంది తికమకపడుతుంటారు. సాధారణంగా రాత్రి సమయాల్లో ఉసిరిచెట్లపై సర్పాలు ఉంటూ వుంటాయి. ఆ సమయంలో ఉసిరికాయలను గురించి మాట్లాడుకుంటే, ఆ సర్పాలకు ఆహ్వానం పలికినట్టుగా అవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుంచి వుంది.
ఇక రాత్రి సమయాల్లో శరీర ఉష్ణోగ్రత తక్కువగా వుంటుంది. అలాంటి సమయంలో మరింత చలువచేసే ఉసిరికాయను తినడం వలన అనారోగ్యం కలుగుతుందని అంటారు. ఇక రవికి - శుక్రుడికి గల శత్రుత్వం గురించి తెలిసిందే. ఉసిరికాయలోని ఆమ్లగుణం శుక్రుడికి చెందినది కనుక, రవివారమైన ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదని చెబుతుంటారు.

No comments:

Post a Comment