Monday 13 July 2015

పరమాచార్య వాణి

శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ శరవణభవాయ నమః
శ్రీమాత్రే నమః
ఓమ్ నమః శివాయ
శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీరామదూతం శిరసా నమామి
మూడవరకం స్నానం గోధూళి స్నానం, దీనిని వాయవ్యం అంటారు, ఇది వాయు సంబంధమైనది. అందుకే ఎప్పుడైనా గోవులు వెళ్ళేటప్పుడు వాటి వెనుకగా నడిస్తే, ఆ ధూళి గాలికి ఎగిరి మన మీద పడితే, అప్పుడు మనం వాయు స్నానం / గోధూళి స్నానం చేసినట్లు.
నాలుగవ రకం స్నానం దివ్యస్నానం, ఇది ఆకాశ సంబంధమైనది. అనగా ఎప్పుడైనా ఎండగా ఉండగానే వర్షం కూడా పడుతూ ఉంటే, ఆ వస్తున్న జలాలు దేవలోకం నుంచి వచ్చినట్లుగా శాస్త్రం చెప్పినది. ఆ సమయంలో మనం ప్రయత్న పూర్వకముగా వెళ్ళి, ఆ వర్షంలో నిలబడితే అప్పుడు మనం దివ్య స్నానం చేసినట్లు.
ఇక ఐదవ రకం స్నానం బ్రహ్మస్నానం. ఇది పృథ్వి సంబంధమైనది. మనం సాధారణంగా పూజలు, హోమాలు, అభిషేకాలు చేసే ముందు, ఒక కలశ స్థాపన చేసి, అందులోని జలాలలోకి గంగాది పుణ్య నదులను ఆవాహన చేసి, ఆ తర్వాత మంత్ర జపం పూర్తి చేసిన (ఉదకశాంతి మొ..) తర్వాత, మంత్రపూరితమైన ఆ జలాలను, దర్భలతో పూజ చేస్తున్న బ్రాహ్మణులు మన మీద జల్లుతారు. అలా దర్భల నుంచి మన మీద చిలకబడిన ఆ మంత్రపూరిత జలములచే మనం బ్రహ్మస్నానం చేసినట్లు".
"ఆచారములు పాటించడం వలన మనలో శౌచం పెరుగుతుంది, కుటుంబములో క్రమశిక్షణ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజములో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. ఆచార సాంప్రదాయములను పాటించడం వలన దీర్ఘాయుష్మంతులౌతారు, సత్సంతానం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఆచార అనుష్టానములను పాటించడం వలన వ్యక్తులలో తేజస్సు పెరుగుతుంది, అందవికారం తగ్గుతుంది (ఇక్కడ అందం అంటే కేవలం బాహ్య అందం ఒక్కటే కాదు). ఆచార, అనుష్టానములను పాటించగా పాటించగా, వ్యక్తి పుట్టుకతో ఎటువంటి రూపుతో ఉన్నా, ఆతని తేజస్సు పెరిగి, నలుగురి చేత గౌరవింపబడి, ఎవరైనా అతనిని మొదటి సారి చూసినా సరే నమస్కార యోగ్యతని పొందుతాడు. చక్కని సదాచారం పాటించే వ్యక్తి, స్నానం చేసి, విభూతి/కుంకుమలు ధరించి, పూజ చేసి బయటకి వచ్చినప్పుడు చూస్తే, ఎటువంటి వారైనా ఆయన తేజస్సుకి నమస్కరించ వలసినదే. ఆచారాన్ని అనుష్టించడం వల్ల మనం నమస్కార యోగ్యతని, పూజనీయతని పొందుతాము".



"రాబోయే తరంలో, వేదం చదవడం రాని బ్రాహ్మణుడు ఒక్కరూ ఉండకూడదు. ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడానికి కాదు బ్రాహ్మణులు, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే అతి ముఖ్యమైన కర్తవ్యం బ్రాహ్మణుడిది. ఈ విధంగా బ్రాహ్మణుడు వేద ధర్మాన్ని అనుష్టించడం కేవలం మన దేశ ఐక్యతకే కాదు, యావత్ ప్రపంచానికి శ్రేయస్సు కలిగిస్తుంది"


"ప్రతీ రోజూ మనం నిద్రించబోయే ముందు, ఈ రోజు నేను ఎవరికైనా సహాయ పడ్డానా అని మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. 63 మంది నాయనార్లలో ఒకరైన తిరునావుక్కరసర్ అనే నాయనార్ పాడిన తేవరంలో ఈ విధంగా చెప్పబడినది....'ఏ రోజైతే మనం భగవంతుడి నామాన్ని స్మరించమో ఆ రోజు మనం మరణించిన వాళ్ళతో సమానం, అసలు పుట్టనట్లే లెక్క'. అదే విధంగా ఏ రోజైతే మనం ఏ కొంచెమైనా కూడా మానవ/సమాజ సేవ చేయమో... ఆ రోజు మనం మరణించినట్లే/లేదా పుట్టనట్లే. ఇది ఎలా అంటే, ఎవరికైనా బంధు వర్గంలో ఎవరైనా శరీరం వదిలిపెడితే, వారికి మృతాశౌచం ఉంటుంది. వారికి కలిగిన మృతాశౌచం వల్ల పవిత్రమైన పుణ్య కార్యాలలో పాల్గొనే అధికారం లేదు. అలాగే మనం ఏ రోజైనా ఎవరికీ సహాయపడకుండా, కొంచెం కూడా పుణ్యానికి దగ్గరగా వెళ్లకపోతే, ఆ రోజు, మనమే స్వయంగా మరణించిన వాళ్లతో సమానము, ఆ అశౌచము వల్లనే మనం ఏ కొద్దిగా కూడా ఎవరికీ సహాయపడలేక పోయాము అని గుర్తు"

 "స్త్రీలు ప్రతీ రోజూ తలస్నానం చేయనవసరం లేకుండా, పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుందని, మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదే మగవాడు అయితే, ప్రతీ రోజూ తప్పని సరిగా తలస్నానం చేయవలసినదే. స్త్రీలకి మాత్రం మన శాస్త్రం ఈ మినహాయింపు ఇచ్చినది. అలాగే ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత, ఆ గర్భంలో ఉన్న జీవి పూర్తి స్థాయిలో పెరిగిన తరువాత, ఆ గర్భిణీ స్త్రీ ఏ వ్రతములు, ఉపవాసములు చేసినా ఫలించవు అని శాస్త్ర వాక్యం. అంటే అలా నెలలు నిండిఉన్న తల్లిని కష్టపెట్టకుండా ఉండాలని శాస్త్రమే ఇచ్చిన మినహాయింపు.

అలాగే ఒక బ్రహ్మచారి తనకు ఎంత ఆహారం కావలన్నా తినవచ్చు, కానీ అది సాత్త్విక ఆహారం మాత్రమే అయి ఉండాలి. వ్రతములు, ఉపవాసములు బ్రహ్మచారులకు శాస్త్రం నిర్దేశించలేదు. ఇలా ఎందుకంటే, చిన్నతనములోనూ మరియు వృద్ధాప్యంలోనూ శరీరానికి సరిపడ పోషణ అవసరం. చిన్నతనంలో ఎదుగుదల కొరకు, వృద్ధాప్యంలో శరీరం నిలబడే ఓపిక కొరకు. అలాగే ఆరోగ్యం బాగుగా లేని వారి కొరకు కూడా శాస్త్రం అనేక మినహాయింపులను శాస్త్రం ఇచ్చినది.

ఈ విధంగా మినహాయింపులు శాస్త్రం అంగీకరించడం పక్షపాతంతో కాదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మనకి ఆచార అనుష్టానాల పట్ల ఎంత భక్తి విశ్వాసాలున్నా, వాటిని ఆచరించలేని దౌర్బల్య స్థితిలో ఒక్కోసారి ఉండవచ్చు, అప్పుడు ఈశ్వరుడు, ఆయన యొక్క అవ్యాజమైన కారుణ్యంతో, ఆచార అనుష్టానంలో కలిగే ఆ లోపాలని క్షమిస్తాడు. అందుకోసమే, శాస్త్రం మనకి కొందరికి, కొన్ని సందర్భాలలో/పరిస్థితులలో ఆ మినహాయింపులను సమ్మతించినది.

ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ పరిస్థితులలో శాస్త్రం ఆయా మినహాయింపులను ఇచ్చినదో, ఆ కష్టం తీరిపోయిన తర్వాత, మళ్ళీ మన ఆచారము అనుష్టానము యథావిధిగా కొనసాగాలి తప్ప.

కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కోసమో, కొందరు వ్యక్తుల కోసమో (ఉదాహరణ స్త్రీలకు పైన చెప్పిన స్నానం ఉదాహరణ..) శాస్త్రం సమ్మతించిన మినహాయింపులను, సార్వజనీకముగా స్వీకరించి, ఆచార అనుష్టానములను వదలరాదు".

పంచభూత స్నానం
"స్నానం ఐదు రకాలుగా మన శాస్త్రంలో చెప్పబడినది. దీనినే పంచ భూతస్నానం అంటారు. మనం సాధారణంగా స్నానం అంటే చెంబుతో నీళ్ళు తీసి తలమీద పోసుకోవడం అనుకుంటాము, కానీ అది స్నానమే కాదు. నదిలో మన తల పూర్తిగా మునిగేలా చేస్తే అది స్నానం అని శాస్త్రవాక్యం. దీనినే అవకహం అంటారు. ఇది మొదటి రకం స్నానం, ఇది వరుణ సంబంధమైనది.
రెండవరకం స్నానం విభూతి స్నానం, దీనిని ఆగ్నేయం అంటారు. ఇది అగ్ని సంబంధమైనది.

పరమాచార్య స్వామి వారు పైన చెప్పిన శాస్త్ర వాక్కులతో పాటు, మరొక విషయం కూడా మన పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పారు, మనం సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఈ పంచభూత స్నానం తప్పనిసరిగా చేయాలి అని.
స్నానం ఏ దిక్కుకి నిలబడి చేయాలి?
"శాస్త్రంలో మనం చేసే ప్రతీ పనీ అది భగవంతుడి పూజ అయినా, లౌకికమైన పనులయినా సరే అన్నిటినీ ఆధ్యాత్మిక దృష్టి కోణంలో చూడబడినది. ఉదయాన్నే లేచి పళ్ళు తోమడం దగ్గర నుంచి, పడుకునేవరకు, సంతానాన్ని కనడం, అంత్యేష్టి సంస్కారం ఇలా అన్ని రకాల పనులూ ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూడడం మన శాస్త్రాలు నేర్పుతాయి. అందుకే ప్రతీ పని చేయడానికి, ఏ విధంగా చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామో, ఆ విధంగా శాస్త్రం విధి విధానాలను మనకు అందించినది. ఉదాహరణకు, నదిలో స్నానం చేయాలి అంటే, నదీ ప్రవాహం వెళ్ళే దిక్కువైపు నిలబడి స్నానం చేయాలి. ప్రవాహానికి ఎదురుగా చేయకూడదు. అలాగే నది కాకుండా, నిలబడి ఉన్న ఒక సరస్సు/చెరువులలో స్నానం చేయాలంటే, అప్పుడు తూర్పు దిక్కుగా నిలబడి స్నానం చేయాలి.
ఎప్పుడైనా మనం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేయవలసి వచ్చినది అనుకోండి.... ఉదాహరణకి గ్రహణం అప్పుడో, ఎవరైనా చనిపోయారని వార్త తెలిసినప్పుడో, అప్పుడు ఎలా?? ఇలాంటి వాటిని కూడా మన పూర్వ ఋషులు దర్శించి, శాస్త్రాలను మనకందించారు. ఇటువంటి పరిస్థితిలో (రాత్రి పూట గ్రహణం అప్పుడు కానీ, మృతాశౌచం వల్ల కానీ) చెరువు/సరస్సులో కానీ స్నానం చేయవలసి వస్తే, తూర్పుకి కానీ, పడమరకి గానీ తిరిగి స్నానం చేయాలి అని శాస్త్ర వాక్యం. అదే రాత్రి పూట ఇంట్లోనే ఉన్న బావి దగ్గర కానీ, బక్కెట్లో నీళ్ళు తీసి చెంబుతో పోసుకునే విధంగాగానీ స్నానం చేయవలసి వస్తే, అప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే స్నానం చేయాలి".



"అశౌచంగా ఉండడం వల్ల (శరీరాన్ని, దుస్తులను శుభ్రంగా ఉంచుకోక పోవడం, అన్ని వేళలా అందరినీ తాకడం వంటివి..) కలిగే దుష్ఫలితాలు కానీ, 'మడి'గా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ మన కంటికి కనబడవు. కనబడవు కదా అని, చాలా మంది నమ్మరు మరియు వీటిని మూఢ నమ్మకాలు అని చెప్తారు.
కానీ మన శాస్త్రాలు చెప్పినది పరమసత్యం. శాస్త్ర వాక్యాలను మనం ఎంతగా దూరంగా పెడుతూ, మడి ఆచారాల నుంచి దూరంగా వెడుతున్నామో అంతగా మనలో అస్వస్థత పెరుగుతోంది, అనేక పవిత్రమైన పుణ్య స్థలాలలో కూడా ప్రమాదాలలో జన నష్టం జరుగుతూ ఉండడం, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతూ ఉండడం, అనావృష్టి, భూకంపాలు అన్నీ పెరుగుతున్నాయి.

ఇన్ని జరుగుతున్నా, వీటికి ప్రథాన కారణం "మనం శాస్త్రం చెప్పినట్టుగా ఆచార వ్యవహారాలను పాటింక పోవడం" అని అంగీకరించలేక పోవడం నా** దృష్టిలో పెద్ద మూఢ నమ్మకం".


ఆచార అనుష్టానముల వలన ప్రయోజనం

"ఆకలి కూడా ఒక వ్యాధి వంటిదే. మనకి ఏదైనా వ్యాధి వస్తే ఔషధం సేవించట్లేదా.. అలాగే ఆకలి అనే వ్యాధిని మాన్పడానికి ఆహారము కూడా ఔషధములా పరిమితంగా సేవించాలి. రోజుకి ఒక్క సారి భోజనం, ఒక్కసారి ఫలాహారం స్వీకరించి ఉండగలిగితే అది సర్వోత్తమైనది. అలా వీలుకాకపోతే, రోజుకి రెండు సార్లు భోజనం, ఒకసారి అల్పాహారం (టిఫిన్) స్వీకరించే విధానంలో అయినా, ప్రతీ సారీ తీసుకునే పదార్ధం తగుపాళ్ళలో పరిమితంగా ఉండాలి. మన సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం మరియు నేటి ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రముల ప్రకారం కూడా మనం భోజనం ఎప్పుడూ కడుపు పూర్తిగా నిండేవరకు భుజించకూడదు. జీర్ణాశయంలో సగం వరకు (అంటే సుమారుగా ఎంత తింటే కడుపు పూర్తిగా నిండి పోతుందో అందులో సగం..) మాత్రమే భోజనం చేయాలి, మిగతా సగంలో సగం వరకు అనగా జీర్ణాశయంలో నాలుగో వంతు నీళ్ళు త్రాగాలి. ఇక మిగిలిన నాలుగో వంతు జాగా ఖాళీగా ఉంచాలి.
మామూలు రోజుల్లో అలా రోజుకి రెండు సార్లు భోజనం, ఒకసారి అల్పాహారం భుజించినా, శని, సోమ, గురు వారాల్లోనూ, అమావాస్య తిథులలోనూ, మన ఇలవేల్పు/కులదైవము ప్రకారం ఆ దేవతా స్వరూపము యొక్క ప్రీతికరమైన/ప్రతీక ఐన రోజులలో అనగా... షష్ఠి, కృత్తిక, చతుర్థి, ప్రదోషం వంటి రోజులలో... రోజుకి ఒకసారి భోజనం, ఒకసారి ఫలహారం మాత్రమే భుజించాలి. ఆదివారం నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత, ఎటువంటి భోజనం తీసుకోరాదు. రాత్రి పూట పెరుగు తినరాదు. రాత్రి పూట పెరుగుని మజ్జిగలా చేసుకుని త్రాగవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట పాలు త్రాగరాదు. ప్రతీ పక్షానికి (పదిహేను రోజులకి ఒకసారి), ఒక రోజు సంపూర్ణ ఉపవాసం ఉండాలి, అనగా ఏకాదశి తిథులలో అన్నమాట".

** ఇక్కడ 'నా' అంటే శ్రీశ్రీశ్రీ పరమాచార్య స్వామి వారు అని గమనించగలరు.

No comments:

Post a Comment