Tuesday 7 July 2015

హర హర, ఎన్ని పాపాలు చేసినా హరించుకుపోయాయి ఆ నామం వల్ల...




ఇంద్రసేనుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పంచమహాపాతకాలు మూటకట్టుకున్నాడు. ఇంకొక పనిలేదు. ఎప్పుడూ మాట్లడనివి రెండు మాటలే – ఆహర, ప్రహరస్వ. ఆహర – ఎత్తుకురండి, ఆయనకంటికి ఏది కనపడితే అది ఎత్తుకురండి అనేవాడు. ప్రహరస్వ – కొట్టండి. బ్రతికున్నన్నాళ్ళూ ఆ రెండు మాటలే అన్నాడు. ఎవడైనా కాలధర్మం చెందాలిగా. ఒకానొకనాడు శరీరం జర్జరీభూతం అయిపోయింది, పడిపోయాడు. యమధర్మరాజుగారి భటులు వచ్చారు. యమలోకానికి తీసుకు వెళ్ళిపోతున్నారు. యమధర్మరాజు “అరెరె మహాపుణ్యాత్ముడురా..వీడిని ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు. వీడు పుణ్యాత్ముడా? అని ముక్కున వేలేసుకున్నారు. “మీకు తర్వాత చెప్తాను..ముందు తప్పు చేసినందుకు ఆయనకు నమస్కారం చేయండి”. ఈలోగా కైలాసం నుంచి శివకింకరులు వచ్చారు. వాళ్ళకి అప్పజెప్పి పంపించేశారు. ఆయనని కైలాసానికి తీసుకెళ్ళారు. ఆశ్చర్యపోయాడు నన్ను కైలాసానికి తీసుకువచ్చారు పొరబడ్డారా? ఏమిటి? అని. పరమశివుడు ఆయన కనపడగానే గబగబా ఆసనం మీద ప్రక్కకి జరిగి రావోయ్ అని అర్థసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. తెల్లబోయాడు, నన్ను అంత సింహాసనం మీద పరమశివుడు ప్రక్కన కూర్చోబెట్టుకోవడమా? ఎందుకు నన్ను పిలుస్తున్నారు మహాప్రభో? నేను చేసినవన్నీ పాతకాలే. నువ్వు బ్రతికున్నన్నాళ్ళు అన్నమాట ఏమిటి? – ఆహర, ప్రహారస్వ; ఎత్తుకురండి, కొట్టండి.
ఎప్పుడూ హర హర, ఎన్ని పాపాలు చేసినా హరించుకుపోయాయి ఆ నామం వల్ల. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా అగ్నిహోత్రం కాలుస్తుంది. తెలిసి త్రాగినా తెలియక త్రాగినా విషం ప్రాణం తీస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా శివనామం పాపాలు తీసేస్తుంది. “హరహర మహాదేవ శంభోశంకర” అన్నారు అందుకే. శివనామం అంత గొప్పది. తెలిసి గానీ, తెలియక గానీ పలికినంత మాత్రం చేత అంతటి అభ్యున్నతిని కల్పించగలదు. శివపరివారం చేయగలదు.
కాబట్టి శంకరుడి పరివారం అంటే నిజానికి ఎంతమందిని అని నేను చెప్పగలను. శివపరివారం కానిదంటూ లోకంలో ఏముంది?
భూరంభాం స్యనలోనిలోంబర మహర్నాధో హిమాంశుః పుమా
నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!!
అన్నీ ఆయనే. కాంచీపురంలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. అన్నీ ఆయనే అయినప్పుడు దీనిమీద ఉన్నవారంతా ఆయన పరివారం గాక క్రొత్తగా ఎవరౌతారు? ఇక పర్వతాలు, నదులు, సముద్రాలు అంటారా? ఆయన పర్వత రాజపుత్రి. కాబట్టి మామగారు పర్వతం. దానిమీద ఉండే చెట్లు, ఆ పర్వతాలలో పుట్టిన నదులు, నదులకు భర్తలైనటువంటి సముద్రాలు అల్లుళ్ళు, మహర్షులు, కిన్నెరలు, కింపురుషులు, ఆయన భక్తులు, పరివారము కానివారెవ్వరు? కానీ ఒక దేవాలయాన్ని, ఉపాసనని ప్రమాణంగా చేసుకొని మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఎవరెవరిని స్మరించవలసి వుంటుందో వారిని స్మరించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. “ఏకశ్శబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ట ప్రయుక్తః స్వర్గే లోకే కామదుఃఖ్భవతి!” పరమభక్తితో ఒక్కమాట చెప్పుకున్నా చాలు స్వర్గలోకంనుంచి సమస్త కామ్యములను అది వర్షిస్తుంది. అందులో సందేహం లేదు.

No comments:

Post a Comment