Sunday, 5 July 2015

కలియుగ ఉపద్రవాలని ఎదుర్కొనగలిగే సాధనమే భగవద్గీత

కురుక్షేత్ర యుద్ధం ఆరంభమైన పదకొండవనాడు భీష్మపితామహుడి తీవ్రమైన ప్రతాపానికి తట్టుకోలేని స్థితి అర్జునుడిలో ఏర్పడ్డప్పుడు భగవంతుడు మధ్యలోకి చేరాల్సి వచ్చింది. చక్రం పట్టాల్సి వచ్చింది. భీష్ముణ్ణి అణచాల్సి వచ్చింది, అందుకు అర్జునుడిని తయరుచేసుకోవాల్సి వచ్చింది. భీష్ముణ్ణి పడగొట్టడం పాండవులకూ ఇష్టం లేదు అటు కౌరవులకూ ఇష్టం లేదు. మరి ఇరువువురికీ తాతగారిపై ప్రేమ ఉంటుంటే వీరంతా ఏం చేస్తున్నట్లు అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి. ఇంతవరకు అడగలేదు కనుక సంజయుడు చెప్పలేదు, పెద్దలు అడగనిదే చెప్పకూడదు అని తెలిసిన యోగ్యుడు కనుక ఇంత వరకు జరిగినదేమీ చెప్పలేదు. అడిగాక చెప్పాల్సిన అవసరం వచ్చింది కనుక చెప్పాడు.
యుద్ధ ఆరంభానికి అందరూ శంఖం పూరించి సిద్ధపడ్డాక అర్జునుడికి జాలి కలిగి యుద్ధం చేయను అని ధనుర్భాణాలని క్రింద పాడేసి చతికిల పడ్డాడు. ఎందుకు అలా చతికిల పడ్డాడో అది భగవద్గీత మొదటి అధ్యాయం అయ్యింది. అర్జునుడు యుద్ధం చేయను అన్నడు కానీ ప్రక్కన ఉన్న కృష్ణుడు కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసి తిరిగి యుద్ధ సుముఖుడిగా తీర్చి దిద్దాడు. అప్పుడు "కరిష్యే వచనం తవా", నీవు చెప్పినట్లు చేస్తా అంటూ అర్జునుడు క్రింద పాడవేసిన ధనుర్భాణాలని తీసుకొని యుద్ధానికి ఉఙ్ముఖుడయ్యాడు. అట్లా సంజయుని ఉపదేశం సాగింది.
అట్లా అర్జునుడిని శక్తివంతుడిగా జ్ఞాన వంతుడిగా తీర్చి దిద్దడానికి భగవంతుడు చేసిన ఉపదేశమే భగవద్గీత. అయితే అర్జునుడు యుద్ధం చేయను అని కొన్ని కారణాలు చెప్పాడు. అది చేస్తే కలిగే అనర్థాలు చెప్పాడు, అరిష్టాలు చెప్పాడు. జనం అంతా పోతారు, మిగిలిన వ్యక్తులు అంతా పాడై పోతారు. నియమాలు నశించిపోతాయి. అవసరమైన శక్తి కలిగిన మానవజాతి నశిస్తుంది. మిగిలిన వారికి అవసరాలు పెరుగుతాయి, తీర్చుకోవడానికి రకరకాల క్షుద్రమైన పనులు చేస్తారు, లోకం అంతా అస్తవ్యస్థం అయిపోతుంది అని చెప్పాడు, ఇక్కడున్న వాళ్ళే కాదు పైకి వెళ్ళిన వారి వ్యవస్థ కూడా చెడిపోతుంది అన్నాడు అర్జునుడు. కృష్ణుడు లోకపు వ్యవస్థ అస్తవ్యస్థం అవుతుందని తెలిసే యుద్ధం చేయించాడు.
ఎందుకని? కలియుగం ఎంతెంత పెరుగుతుంటే మనుషుల్లో శక్తి క్షీణిస్తుంది. నియమాలు నిష్ఠలు అదే స్థాయిలో దిగజారుతాయి. ఇది తప్పదు, కాల ప్రభావం చేత గడిచేదే. చెట్ల ఆకులు వసంత ఋతువులో వస్తాయి, అవే శీతాకాలంలో రాలి పోతుంటాయి, ఇది ప్రకృతి నియమం. ఇది మార్చతగినది కాదు. దాని కోసం దిగులు చెందాల్సిన అవసరం లేదు అట్లానే కృత యుగంలోంచి కలియుగానికి వచ్చేసరికి వ్యక్తుల్లో ఆపగలిగేది ఏదీ ఉండదు. కానీ అలాంటి సమయంలో కూడా సవ్యంగా ఉండాలి అని కోరే వారు ఉండక పోరు, అలాంటి వారికి ఒక రక్షణ కవచం కలిగించాలి అని భగవంతుడు భావించాడు. పడే వానను మనం ఆపలేం కానీ అది మనకు ఆటంకం కాకుండా ఉండటానికి సాధనాలని మనం సిద్ధం చేసుకోవడం బుద్ధిమంతుడి లక్షణం. అట్లానే కలియుగంలో రకరకాల ప్రలోభాలు బలహీనతలు చోటుచేసుకుంటాయి. వాటిని ఆపకుండా మనం ఏమీ చేయలేము. అందుకు యుద్ధం మానినా ఏమీ లాభం లేదు. అలాంటి పరిణామాలు ఏర్పడ్డప్పుడు అందులో పడి కొట్టుకుపోకుండా ఉండాలని కోరుకునే ఏకొందరికైనా ఒక రక్షణ కవచాన్ని నేనిస్తా అని భగవంతుడు భగవద్గీతోపదేశాన్ని ఇచ్చాడు. అది కేవలం అర్జునుడి కోసమే కాదు. అర్జునుడికి కర్తవ్య ఉపదేశం చేయడం ద్వారా ఈ కలియుగంలో ఏర్పడే ఉపద్రవాలను ఎదుర్కొనడానికి సాధనంగా అందించిన మహోపదేశం భగవద్గీత. ఈ నాడు అన్యాయాలు చేసేవారు లేకపోలేరు, అయినా భగవద్గీతని ఆసరాగా తీసుకోగలిగితే మనం ముందుకుపోగలుగుతాం.

No comments:

Post a Comment