Sunday, 12 July 2015

ఆశ్రయ పరిత్యాగ దోషం


శ్రీ స్కాంద పురాణము లోని కథ
ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యమ్. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనమూ ధన్యులమ్.
మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది
“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.
ఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.
చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.
తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.
భగవత్ బంధువుల్లారా!
ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.

No comments:

Post a Comment