Saturday 11 July 2015

నారదముని వైకుంఠయాత్ర


ఒకసారి నారదముని భూలోకములో తన పని ముగించుకుని వైకుంఠములో శ్రీవిష్ణుమూర్తి దర్శనార్ధము బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆయనకు ఓ యోగి కనబడ్డాడు. ఆ యోగి ఎంతోనియమనిష్టలతో సాధనలో నిమగ్నమైయున్నట్లు కనబడ్డాడు. నారదమునిని చూడగానే ఆ తేజోమయుడెవరో తెలుసుకోవాలని ఆ యోగి "మీరెవరూ? ఎక్కడనుండి ఎక్కడకు వెడుతున్నారు " అని ప్రశ్నించాడు. అందుకు నారదముని "నేను నారదమునిని. భూలోకమునుండి వైకుంఠములో నున్న భగవంతుని దర్శనార్ధము వెడుతున్నాను." అని చెప్పాడు. అందుకు ఆ యోగి సంతోషించి, "స్వామీ! అయితే నాకు ఈ జననమరణ చక్రమునుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో కనుక్కుని రండి" నారదముని "అలాగే" నని ఆయన దగ్గరనుండి పయనైపోయాడు. దారిలో నారదముని ఒక చర్మకారుడు తారసపడ్డాడు. అతను నారదమునిని చూచి "మీరెవరూ? ఎక్కడనుండి ఎక్కడకు వెడుతున్నారు " అని ప్రశ్నించాడు. అందుకు నారదముని "నేను నారదమునిని. భూలోకమునుండి వైకుంఠము భగవంతుని దర్శనార్ధము వెడుతున్నాను." అని చెప్పాడు. అందుకు ఆ చర్మకారుడు సంతోషించి "స్వామీ! అయితే నాకు ఈ జననమరణ చక్రమునుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో కనుక్కుని రండి" నారదముని "అలాగే" నని వైకుంఠము చేరుకున్నాడు. వైకుంఠములొ నారదముని భగవంతుని సేవించుకుని తిరిగి బయలుదేరి వెడుతూ " స్వామీ! ఆ యోగికి, ఆ చర్మకారునికి మోక్షము ఎప్పుడు లభిస్తుందో చెప్పండి. నేను తిరుగుప్రయాణంలో వారికి తెలియచేయాలి" అని ప్రార్ధించాడు. అందుకు భగవంతుడు "ఆ యోగికి మరో వందజన్మలలో మోక్షము రాగలదు. ఆ చర్మకారునికి మాత్రము ఇదే కడపటి జన్మము. ఈ జన్మ తరువాత ఆతనికి మోక్షము లభించగలదు" అని చెప్పి "మరో మాట. వాళ్ళు నువ్వు నన్ను చూచినప్పుడు నేనేమి చేస్తున్నానో చెప్పు అని ప్రశ్నిస్తారు. అందుకు నీవు "భగవంతుడు చిన్నసూదిలోనుండి ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు" అని చెప్పు నారదా!" అని తనయోగ స్థితిలోకి వెళ్ళిపోయాడు.
నారదముని తన తిరుగుప్రయాణంలో యోగికి "తమకు మరో వందజన్మలలో మోక్షము లభించగలదు అని భగవంతుడు తెలిపినారు" అని చెప్పాడు. అందుకు యోగికి చాలా కోపము వచ్చినది. "మీరు నారదముని అని చెప్పగానే నాకు అనుమానము వచ్చినది. అసలు మీరు వైకుంఠము వెళ్ళారా? భగవంతుని చూచారా? ఇంత నియమనిష్టలతో ఉన్నా నాకు ఇంకా వందజన్మలేమిటీ? చూడబోతే మీరెవరో మోసగాడిలా కానవస్తున్నారు. మీరు భగవంతుని చూచినట్లయితే, అప్పుడాయన ఏమి చేస్తున్నారో చెప్పండి?" అని గద్దించి పలికాడు.
అందుకు నారదముని "భగవంతుడు చిన్నసూదిలోనుండి ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు" అని చెప్పాడు. అందుకాయోగి, " నేను అనుమానించినదే నిజము. ఇది సాధ్యమా? చిన్నసూదిలో ఏనుగు ఎలా దూరుతుంది? నువ్వు నిజముగా భగవంతుని చూడలేదు. నీవు నారదమునివి కావు" అని దుర్భాషలాడాడు.
నారదముని ఆయన దగ్గరనుండి చర్మకారుని దగ్గరకు వెళ్ళాడు. "తమకు ఇదే చివరి జన్మ. ఈ జన్మ తరువాత తమరు భగవంతునిలో ఐక్యము కాగలరు" అని తెలియపరిచాడు. అందులకా చర్మకారుడు ఎంతో సంతోషించి " మీరు భగవంతుని సేవిస్తున్నప్పుడు నా స్వామి ఏమి చేస్తున్నారో తెలుపవలసినది" అని ప్రార్ధించాడు. నారదముని నేను భగవంతుని దర్శిస్తున్నప్పుడు "భగవంతుడు చిన్నసూదిలోనుండి ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు" అని పలికాడు. అప్పుడా చర్మకారుడు దానికి ఎంతో సంతోషించి స్వామిని స్తుతిస్తూ,నృత్యము చేస్తూ, కళ్ళవెంబడి ఆనందభాష్పాలు రాలుస్తూ కిందపడి దొర్లుతూ ఆనందపడసాగడు. నారదముని ఏమీ తెలియనివాడిలా "నాయనా! ఏనుగును సూదిలో దూర్చటము నీకు వింతగా లేదా?" అని అడిగాడు. అందులకా చర్మకారుడు తను నివసిస్తున్న మర్రివృక్షమునీడలోనుండి ఓ మర్రివిత్తనమును చూపిస్తూ, "ఓ నారదమునీ! ఈ మర్రి విత్తనమును చూడండి!. ఈ విత్తనములో అనేకానేకమైన మహా మర్రి వృక్షములను దాచివుంచిన ఆ భగవంతునికి ఎయ్యది అసాధ్యము!. భగవంతుని మహిమలు అత్యద్భుతములు" అని నారదముని పాదాలచెంత వ్రాలాడు.

No comments:

Post a Comment