Tuesday, 7 July 2015

అక్క మహాదేవి

అక్క మహాదేవి ఇప్పటికీ శ్రీశైలం దేవాలయంలోపల కనిపిస్తుంది. స్థల వృక్షమైనటువంటి మద్ది చెట్టు ప్రక్కన ఆ మహాతల్లియొక్క పెద్ద విగ్రహం వుంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుట్టుతో కప్పుకొని ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగం పట్టుకొని ఉంటుంది. అక్కమహాదేవి ఒకానొకప్పుడు దక్షిణ దేశంలో ఉండే కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనే ఒక గ్రామంలో జన్మించింది. మహా సౌందర్యరాశి. మల్లికార్జునుని యొక్కఅనుగ్రహంతో జన్మించింది. తండ్రి పేరు నిర్మల శేఠ్ . తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారామెని. ఆవిడ పెద్దది అవుతుంటే ఆవిడయొక్క అందచందాల గురించి విన్నాడు అక్కడ రాజ్యాన్ని పరిపాలించే ప్రభువు. కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు. ఆమె అందచందాల గురించి తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మను నేను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమె ఏమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బ్రతకలేదు. కాబట్టి మేము పిల్లనివ్వం అన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని, కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి "ఇలా అంటున్నాడు ప్రభువు, ఎదిరించలేము" అని. ప్రభువును పిలిపించండి, నేను మాట్లాడతాను అన్నది అక్కమాంబ. ప్రభువు వచ్చాడు. ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తరుడైపోయాడు ప్రభువు. ఆమె అన్నది నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహమాడతాను. నువ్వు శివభక్తి నాకోసం కృతకంగా అనుకరించడం కాదు. శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకొని శివభక్తియందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసుకున్న నాడు నేను వివాహం చేసుకుంటాను. నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను అని నీకు అనుమానమైతే నీ అంతఃపురానికే వచ్చి వుంటాను. కానీ ఒక్క నియమం. ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా, నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను అన్నది. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. తమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెను కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా! నేను నియమం పెట్టినా శివలింగాన్ని ఆరాధన చేస్తూండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో పట్టుకున్నావో ఆ బట్ట నీముఖం మీద పడేస్తున్నాను అని అమె వివస్త్రయై ఆ బట్ట తీసి ఆయన ముఖాన పడేసి తన కబరీ బంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించినటువంటి తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు గనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది.

No comments:

Post a Comment