జ్యోతిష్య శాస్త్రం

జ్యోతిష్యం శాస్త్రం అనటానికి కొన్ని ఆదారాలు.
జ్యోతిష్యం మూఢనమ్మకంగా కొందరు భావించినా జ్యోతిష్యం "శాస్త్రం" అనడానికి చాలా ఆదారాలు ఉన్నాయి. మన మెదడులోని ద్రవాలలో నవ గ్రహాలకు సంబంధించిన ఖనిజాలు ఉంటాయి. గ్రహాలు పరస్పర ప్రభావం కలిగివుంటాయి. అదేవిధంగా మనిషిపై కూడా ఆ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. మానవ మస్తిష్కం గ్రహ గతులకు స్పందిస్తుంది.
సూర్యోదయం ప్రభావంతో మన శరీరాలు హార్మోన్లను విడుదల చేయడంతో మనం మేల్కొంటాం. చంద్రగమనం కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. సముద్రపు అలలు, స్త్రీల ఋతుచక్రం, మానవుల మస్తిష్కం చంద్రగమన ప్రభావానికి లోనౌతాయి. సీజనల్ మెంటల్ డిజార్డర్ గా పిలువబడే (Seasonal Affective Disorder (SAD)) అనే మానసిక రోగం కూడా చలికాలంలో సూర్యుడు చాలాఎక్కువ సేపు కనపడకపోవడం వల్ల సంభవిస్తుంది.
అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుడు భూమికి దగ్గరగా రావడం, దూరంగా జరగడం వంటి మార్పుల వల్ల సముద్రపు అలల్లో తేడాలు వస్తాయి. అదేవిధంగా మానవుల దేహంలోని నీరు కూడా ఆ ప్రభావానికి లోనవుతుంది. మానవులలో ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి రుజువు కొందరు అమావాస్య పౌర్ణమి రోజుల్లో విపరీత ప్రవర్తనను చూపడం. ముఖ్యంగా మానసిక రోగులకు ఆరోజుల్లో పిచ్చి ఇంకా ఎక్కువ అవడం. ఒక్క చంద్రుడే కాదు ఇతర గ్రహాలు కూడా మనపై ప్రభావాన్ని చూపిస్తాయి. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ క్లైమెటాలజీ The American Institute of Medical Climatology వారు Philadelphia పోలీస్ డిపార్టామెంట్ వారికి సాయపడటానికి ఒక రీసెర్చ్ ని నిర్వహించారు.
మానవ ప్రవర్తనపై పౌర్ణమి ప్రభావం మీద జరిపిన ఆ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూసాయి. ఆ పరిశోధన ప్రకారం పౌర్ణమి రోజుల్లో హత్య, విచక్షణా రహితంగా వాహనాల్ని నడిపి ఇతరుల మరణానికి కారణమవడం, అవసరానికి కాకుండా హాబీ పరంగా, మరోరకంగా తప్పకుండా దొంగతనం చేసి తీరాలనే తపన, ఇతరులమీద పగతీర్చుకోవాలనే కోరిక మొదలైనవి ఎక్కువగా రికార్డయ్యాయి. ఆ రకమైన నేరాలు ఆ రోజుల్లో ఎక్కువగా జరిగాయి. Miami విశ్వవిధ్యాలయానికి చెందిన Arnold Lieber అనే మానసిక శాస్త్రవేత్త మియామీలో గత 15 సంవత్సరాలలో జరిగిన 1,887 హత్యలకు పౌర్ణమి, అమావాస్యలకు గల సంబంధాన్ని గూర్చి పరిశోధనలు చేసి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మానవహనన ధుర్ఘటనలు ఎక్కువగా జరిగి మిగతా రోజుల్లో అవి తక్కువగా ఉన్నాయని గుర్తించారు.
W. Buehler అనే జర్మన్ శాస్త్రవేత్త పరిశోధనలో నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో 10 శాతం అధికంగా స్త్రీలు గర్భం ధరించడం జరిగింది. నెలలో చంద్రుని భూమికి దూరంగా ఉన్నకాలంలో (పరిమానం తగ్గుతూ కనిపించే సమయంలో) కన్నా చంద్రుని పరిమానం పెరుగుతూ కనిపించే కాలంలో గర్బం దాల్చినప్పుడు మగ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా పరిశోధనలు తేల్చాయి.
ప్రాచీన గణిత శాస్త్రవేత్త భాస్కరుడు తన కూతురు లీలావతి జాతకం ప్రకారం ఆమె భర్త మరణిస్తాడని తెలుసుకుని ఏ ముహూర్తానికి ఆమె వివాహం జరిగితే ఆమెకు వైధవ్యం ప్రాప్తిస్తుందో తెలుసుకుని ఆ ముహూర్తానికి కాకుండా వేరే ముహూర్తానికి వివాహం జరిపించాలని ఒక గడియారాన్ని తయారుచేస్తాడు. కుండలో నీరు పోసి అడుగున చిన్న రంధ్రం ద్వారా నీరు ఒక్కొక్క చుక్క కింద పడేలా ప్లాన్ చేస్తాడు. దాని ఆధారంగా కాలాన్ని తెలుసుకుంటాడు. కానీ చివరికి కుమార్తె వివాహం జరిగి ఆమెకు జాతకం ప్రకారం వైధవ్యం ప్రాప్తింస్తుంది.
జాతక దోషాన్ని నివారించలేకపోయానని చింతిస్తూ తాను గడియారంగా మలచిన కుండ ను పరిశీలిస్తాడు. ఆ కుండ అడుగున చిన్న ముక్కు పుడక కనపడుతుంది. జరిగిన వాస్తవం ఏమిటంటే భాస్కరుని కుమార్తె లీలావతి ఆడుకుంటూ కుండలోకి తొంగిచూసినప్పుడు ఆమె ముక్కుపుడక జారి కుండలో పడి గడియారం గతి తప్పుతుంది. అందువల్ల భాస్కరుడు తాను అనుకున్న ముహూర్తానికి కాకుండా జాతకం ప్రకారం దోషం ఉన్న ముహూర్తానికే తన కూతురు వివాహం జరిపించి తరువాత బాధపడతాడు. ఇది జ్యోతిష్య శాస్త్రం గురించి ఒక వృత్తాంతం.

జ్యోతిష్యం వేదంగాలలో ఒకటి. వేద పురుషునికి కన్ను వంటిది. అంటే వేదాలను అధ్యయనం చేసేటప్పుడు వేదంగామైన జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉండాలి. వేదకర్మలు నిర్వహించటానికి కాలం చాలా ముఖ్యమైనది. కాలానుగుణంగా యజ్ఞయాగాదులు నిర్వహించటం కోసం జ్యోతిష్య శాస్త్రం ఆవిర్భవించింది. "జ్యోతి" అంటే వెలుగు. జ్యోతిష్య శాస్త్రమంటే వెలుగును తెలిపే శాస్త్రం. కానీ ఈ శాస్త్ర విజ్ఞానమంతా నేడు భవిష్యత్తుని తెలుసుకొనే విద్యగా ప్రఖ్యాతి గాంచింది. జ్యోతిష్యశాస్త్రం ఒక అపురూపమైన విజ్ఞానం. అది నమ్మకం కాదు. భవిష్యత్తుని తెలపటం అందులో ఒక చిన్న భాగం మాత్రమే. ఆధునిక విజ్ఞానం గ్రహాల మధ్య ఉండే దూరాన్ని '"కాంతి సంవత్సరం"లో లెక్కిస్తుంది. కాంతిసంవత్సరం అంటే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం. ఒక నక్షత్రం మనకు కనిపిస్తూ ఉంది అంటే దాని నుంచి మనకు ప్రసారమయ్యే కాంతి కనపడటానికి కొన్ని వందల, వేల కాంతి సంవత్సరాల కాలం పడుతుంది. అట్లాగే మన ప్రాచీన భారతీయులు కూడా సూర్యకాంతి ఆధారం చేసుకొని కాలగణన చేసి గ్రహ గతులను నిర్ణయించారు. అలాగే శుభ, అశుభ కాలాలను, ప్రకృతి వైపరీత్యాలను, గ్రహగతులతో అనుసంధానం చేసి మానవ జీవితాలపై అన్ని గ్రహాల ప్రభావాన్ని కనుగొన్నారు. అదే నేడు "జ్యోతిష్య శాస్త్రం"గా ప్రసిద్ధి చెందింది. వరాహమిహురుడు తన జ్యోతిష్యశాస్త్ర గ్రంథమైన "బృహత్ జాతక"లో మొదటి శ్లోకంలో "జ్యోతిష్యశాస్త్రం" సంసారమనే సముద్ర యానాన్ని దాటేందుకు "దిక్సూచి" వంటిది అని అంటాడు. దీనిని బట్టి జ్యోతిష్యశాస్త్రం కాలాన్ని తెలియజేసే మార్గదర్శి అని మనకు అర్థమవుతున్నది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులలో సంచరిస్తున్నపుడు మనిషిపై వాటి యొక్క భావాన్ని వివిధ కోణాల నుండి దర్శింపచేస్తుంది. మనిషి పుట్టిన స్థలాన్ని, కాలాన్ని అనుసరించి 'జన్మకుండలి'ని రచిస్తారు. ఆ జన్మ సమయంలో ఉండే గ్రహాల స్థితిగతుల ఆధారంగా మనిషి యొక్క జాతకాన్ని సూచిస్తారు. ఈ విజ్ఞానం అంతా కూడా ఎన్నో జ్యోతిష్య గ్రంథాలలో పొందపరచబడి ఉంది. ఇది ఒక మహాసముద్రం వంటిది. ఇందులో ప్రసిద్ధి గాంచినవి:
1. పరాశరుని - 'హోరశాస్త్రం'.
2. వరాహమిహురుని - 'బృహత్ జాతక'.
3. కళ్యాణ శర్మ - 'సారావళి'.
4. జైమినీ మహర్షి - 'జైమినీ సిద్ధాంతం'.
5. మంత్రేశ్వరుడు - 'జలదీపిక'.
6. భ్రుగు మహర్షి - 'భ్రుగు సంహిత'.
భారతీయ జ్యోతిష్య విజ్ఞానం ప్రతి శాస్త్రంలోనూ అనుసంధానింపబడి ఉంది. ఆయుర్వేదంలో కూడా 'రోగి' జన్మకుండలిని అనుసరించి వైద్యం చేసే విధానం ఉంది. గృహ నిర్మాణం, వ్యవసాయం, ప్రయాణం, యుద్ధాలు, వివాహాది సంస్కారాలలో, చివరకు దైనందిన కార్యక్రమాలలో తిథి, నక్షత్రం చూడకుండా పనులు ప్రారంభించనంతంగా ఈ శాస్త్రం భారత జనజీవనంలో మమేకమైనది. జ్యోతిష్యశాస్త్రం ఒట్టి బూటకమని, అది మనుషులను మోసం చేసే ప్రక్రియ అని, ఇది అసలు శాస్త్రం కాదనీ, కేవలం మూఢ నమ్మకం అనీ ఎందరో విమర్శకులు చెబుతున్నా ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్యశాస్త్రం ప్రాముఖ్యత తగ్గటం లేదు. ఆధునిక వైద్య శాస్త్రం కూడా అన్ని రోగాలకు నివారణ ఇవ్వదు. ఒక వైద్యుడు రోగం నయం చేసినట్టు మరో వైద్యుడు నయం చేయలేడు. ఒక వైద్య విధానం చెప్పిన దానిని మరో వైద్య విధానం వ్యతిరేకిస్తుతింది. అయినా వైద్యాన్ని విజ్ఞానం అంటాముకాని నమ్మకం అనం. అలాగే జ్యోతిష్యం విజ్ఞానమా? నమ్మకమా? అన్నది వాళ్ళ విచక్షణకే వదిలివేద్దాం. దీనిని ఉపయోగించుకొని ముందుగా పోయే వారిని ఎవరూ నిరోధించలేరు.
నాడీ జ్యోస్యం:-
మనయొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే తాళపత్ర గ్రంథాలు భారతదేశంలో కొన్ని కుటుంబాల వద్ద ఉన్నాయి. ఆ కుటుంబాలు వాటిని వంశ పరంపరగా, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాయి. "శివపార్వతుల" సంభాషణగా, సిద్ధులందించిన ఈ విజ్ఞాన నిధిని "నాడీ జ్యోతిష్యం" అంటారు. దక్షిణ భారతదేశంలో తమిళనాడులోని 'చిదంబరం' పట్టణానికి దగ్గర గల 'వైదీశ్వరన్ కోయిల్' అనే గ్రామంలో కొన్ని కుటుంబాల వద్ద ఈ తాళపత్రాలు ఉన్నాయి. ఈ తాళపత్రాలనే నాడీ పత్రాలు అంటారు. ఇప్పుడు మనకు లభిస్తున్న తాళపత్రాలు కొన్ని మాత్రమే. కనుక అందరి వృత్తాంతాలు ఈ నాడీ పత్రాలలో ఉండవు. కొన్ని తాళపత్ర గ్రంథాలను ఆనాటి తంజావూరు మహారాజు 'రెండవ షర్ఫోజి'వారు 'సరస్వతీ మహల్' గ్రంథాలయంలో ఉంచగా, వాటిని బ్రిటిషు వారు స్వాధీన పరుచుకొన్నట్టు తెలుస్తున్నది. బ్రిటిషు వారి నుంచి వాటిని సంపాదించి కొందరు విదేశీయులు వీటితో వ్యాపారం చేస్తున్నారు. ఈ నాడీ 'జోస్య' విధానం మొదట వ్యక్తి తన చేతి బొటన వేలిముద్ర ఇవ్వాలి. దీని ఆధారంగా నిపుణులు తాళపత్ర గ్రంథాలను పరిశీలించి ఆ వ్యక్తి వివరాలను తెలియజేస్తారు, అవి సరిపోలితే తదుపరి పరిశీలన ప్రారంభిస్తారు. ఆ లభించిన వారికి తండ్రి పేరు, తల్లి పేరుతో సహా పుత్రుల, భార్య పేరు తెలియజేయటం కూడా అబ్బురపరచే విషయం. ఇందులో కూడా నేడు కొందరు నకిలీ నాడిజోస్యులు ప్రవేశించి శాస్త్రాన్ని వ్యాపారపరంగా వాడుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రక్రియను కనుగొన్న సిద్ధులను, పరంపరగా దీనిని కాపాడుకుంటున్న కుటుంబాలను మనం అభినందించాలి. మన కృతజ్ఞతలు తెలియజేయాలి.

No comments:

Post a Comment