Thursday 3 December 2015

గురుగ్రహ దోష నివారణకు హయగ్రీవస్తోత్రం..


జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.
సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.
జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే
జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.
హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.
హయగ్రీవస్తోత్రం
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||
ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||

Wednesday 2 December 2015

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం




శత్రు బాధలు, పిశాచ బాధలు, ఆరోగ్య సమస్యలువున్నవారు ప్రతినిత్యము అత్యంత శ్రద్ధతో శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం పఠించిన వారికి తప్పక శుభములు చేకూరగలవు.
ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ , పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.
ఒక్కొక్క ముఖానికి 3 నేత్రాలు .పూర్ణ రుద్రావతారం విభీషణుని కుమారుడు.నీలుని కొరకు అవతరించినమూర్తి
శ్లో || విభీషణ సుతో నిలః సతతం సాధుపూజితః పంచవక్ర్త హనుమంత ముపాసే త్సమృద్దిభాక్
మూలమంత్రము : “ ఓమ్ హరి మర్కట మర్కటాయస్వాహా ”
శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం
భావం:-
వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,
దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .

Sunday 29 November 2015

కార్తీక ‘దామోదర’మాసం


కార్తీకంలో పౌర్ణమి చంద్రుడు కృత్తికా నక్షత్రంపై సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. కార్తీక మాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో పెట్టే ఒక్కొక్క దీపానికి ఒక ప్రాముఖ్యం ఉంది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినపుడు మనలోని అజ్ఞానాంధకారాలు తొలిగిపోతాయి. ‘పరంజ్యోతి’ని ఆరాధన చేస్తున్నా అనే అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపనం చేస్తుంది. దీపానికి అంతటి శక్తి ఉంది.
కార్తీక మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడుకట్టి చిన్నపాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. ఆ దీపం ధ్వజస్తంబంపై వెలుగులీనుతూ ఈశ్వరునికి ఉత్సవం నిర్వహిస్తుందనే భావనతో ఇలా చేస్తుంటారు.
కార్తీక మాసంలో శివారాధనకు ఎంతటి ప్రాశస్త్యం ఉందో, విష్ణు ఆరాధనకు అంతే విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తూ ‘దామోదరమావాహయామి’ లేదా ‘త్య్రయంబకమావాహయామి’ అని అంటారు. దామోదర నామం విష్ణు సంబంధమైనది. త్య్రయంబకం అంటే పరమశివుడు. ఈ నామాలు చెబుతూ తమ తమ ఇష్ట దైవాలను ఆవాహన చేస్తారు. ఈ దీపకాంతులు మనలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసి ఆధ్యాత్మిక సాధన సజావుగా సాగేలా ప్రోత్సహిస్తుంది. ఉపాసనాశక్తిని పెంచుకోవడానికి కార్తీక మాసం అనుకూలమైన సమయం.
ఈ మాసంలో ఆలయాలలో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభీష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి ‘అశుతోషుడు’ అన్న పేరు వచ్చింది. ‘అభిషేక ప్రియః శివః’ శివునికి అలంకారాలతో రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తినుంచుకుని శివుడ్ని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు.
శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగ చేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసినవారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివునిని శ్రీవృక్ష పత్రములతో (బిల్వదళములు) పూజించిన స్వర్గమున లక్ష సంవత్సరములు జీవించును. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు, ఏకకాలంలో రెండురూపాలని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధ నారీశ్వరునిగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివదర్శనంచేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయములో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్య కార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహా లింగార్చన, సహస్ర లింగార్చన ఉత్తమోత్తమమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సర మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణుని కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు.
‘కార్తీక దామోదర ప్రీత్యర్ధం’ అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికి ఈ మాసం ఉతృష్టమైంది. కార్తిక మాసంలో ఏమంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం. ‘కార్త్తిక పురాణం’ రోజుకో అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటినుండి సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నదీ స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నదీ జలాలు కొండలలోను, కోనలలోను, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరాను గ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు.
మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్య తిథులలోనైనా స్నానం ఆచరించాలి. కార్తీక మాసం మొదలునుండే ‘ఆకాశదీపం’ ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యలలో గృహమందు, పూజామందిరంలోను, తులసి సన్నిధిలోను, ఆలయమలలో దీపారాధన, ఇహ, పర సౌఖ్యాలను కలగచేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రశస్త్యం. దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమం. మంచి నూనె మధ్యమము. ఏకాదశి అత్యంత విశేషమైనది. ‘ఉత్థానైకాదశి’ కార్తీక శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి లాంటి దినాలుప్రశస్తమైనవి.

భగినీ హస్త బోజనం


‘భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు. ‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట.కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న
పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం.
సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు, చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజుకార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమనగా... యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి *యమ ద్వితీయ* అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మనుపరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు, ఘనంగా సారె పెట్టి చెల్లెలిని పంపించాడు.
ఒకప్పుడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి- మర్యాద, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ * భగినీ హస్త భోజన * విశిష్టత.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.

కుజదోషం

పరాశర మహర్షి కుజదోషం గురించి చెబుతూ ద్వితీయం, చతుర్థం, సప్తమం, అష్టమం, వ్యయం స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషం అని చెప్పారు. 'ధనే వ్యయే చ పాతాలే జామిత్రే చాష్టమే కుజే/ స్థితః కుజః పతిం హన్తి న చేచ్ఛు భయతే క్షితః/ ఇందోరప్యుక్తగేహేషు స్థితః భౌమోధవా శనిః/ పతిహంతాస్త్రీ యాశ్చైవం వరస్యయది స్త్రీ మృతిః" - పరాశర మతం.లగ్నం నుండి, చంద్రుడి నుండి,శుక్రుడి నుండి పైన చెప్పబడిన స్థానములలో కుజుడు వుంటే కుజదోషం అని చెప్పారు.
అమ్మాయికి ఒకరికే ఈ దోషం ఉంటే ‘పతిహంతా’ అన్నారు. హంతా అంటే పతిని చంపును అని కేవలం నిర్ణయం పనికిరాదు.సంస్కృతం ప్రకారం ‘హనహింసాయాం’ అనే ధాతువు నుండి హంతా అంటే హింస అని అర్థమవుతోంది. పతిహంతా అంటే పతిని హింసించునది అని కూడా తీసుకోవాలి. కుజదోషం స్థాయి నిర్ణయం చేయునప్పుడు కుటుంబ స్థానం, సుఖ స్థానం, సంతాన స్థానం, ఆయుర్దాయం వంటివి కూడా పరిధిలోకి తీసుకొని పరిశీలించి నిర్ణయించాలి. కుజుడు యొక్క స్థితి స్థానబలం నీచక్షేత్రం, మిత్రక్షేత్రం స్వక్షేత్రం ఉచ్ఛ క్షేత్రం వంటి వాటి ఆధారంగా చేసికొని నిర్ణయించి ఫలితాలు చెప్పాలి. భౌమః అధవా శనిః కుజదోషం మాదిరిగా శనిదోషం కూడా చూడాలి.శని ఆయుష్కారుడు కావున ఆయనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
‘నచేచ్ఛు భయు తేనితః’ అని వున్న కారణంగా శుభ గ్రహముల వీక్షణ లేదా శుభ గ్రహముల కలయిక ఉంటే కుజదోషం ఉండదు. శుభ గ్రహముల కలయిక అంటే శుభ గ్రహములతో 10 డిగ్రీలలోపు కలయిక ఉండాలి. 10 డిగ్రీలు దాటిన తరువాత శుభ గ్రహం ఉంటే ఉపయోగం ఉండదు.
ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా అని చెప్పిన శ్లోకం దేద కేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిధున కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు. వృషభం తులలో పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు ఉంటే కుజదోషం ఉండదు.
మేష వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి నాల్గవ ఇంట కుజుడు వున్న దోషం ఉండదు. మకర కుంభ లగ్నంలో పుట్టిన వారికి సప్తమంలో కుజుడు వున్న దోషం ఉండదు. ధనస్సు మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు వున్న దోషం ఉండదు. సింహం కుంభం లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు అని దేవకేరళ అనే గ్రంథమందలి విశేషం.
మేష వృశ్చికములు కుజుడికి స్వక్షేత్రములు. మకరము ఉచ్ఛ కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. మృగశి, ధనిష్ఠ, చిత్త నక్షత్రములు కుజ ఆధిపత్యం వున్న నక్షత్రములు అందువలన ఈ నక్షత్రములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. పుట్టిన సమయానికి కుజదశ వెళ్లిపోయినా వైవాహిక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధిలోకి తీసుకోనవసరం లేదు.
చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచంలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువ. కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారుడు కుజుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కళత్ర కారకుడు శుక్రుడు. కలహకారుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో కలహ కాపురం తప్పదు. ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి విషయంగా కుజదోషం లేకపోతే వారు సుబ్రహ్మణ్య ఆరాధనలు నిత్యం చేస్తే కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వస్తుంది.
కుజదోషం ఉందని మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిన వివాహా సంబందాలను వదులుకోవద్దు.కుజదోష నివారణకు చాలా పరిహారాలు ఉన్నాయి.కుజ దోషానికి చాలా మినహాయింపులు ఉన్నాయి.జాతక చక్రాన్ని పరిశీలించి కుజుడు ఉన్న స్ధితిని బట్టి కుజ దోష ప్రభావం ఉన్నదో లేదో తెలుసుకొని కుజుడికి సంబందించిన పరిహారాలు చేసుకుంటే కుజ దోష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించవచ్చు.

నవగ్రహ దోషములు-స్నానౌషధములు


నవగ్రహ దోషములు-స్నానౌషధములు సిద్ధౌషధ సేవలవలన రోగములు,మంత్ర జపమువలన సకల భయము తీరునట్లుగా ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.
సూర్య గ్రహ దోషము తొలగుటకు: మణిశిల,ఏలుకలు,దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.
చంద్ర గ్రహ దోషము తొలగుటకు: గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మంచిగంధములు,స్పటికము_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.
కుజ గ్రహ దోషము: మారేడు పట్టూ,ఎర్రచందనము,ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.
బుధ గ్రహ దోషము: ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
గురు గ్రహదోషమునకు: మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం,తేనే _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శుక్ర గ్రహదోషము: యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము,కుంకుమ పువ్వు_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
శని గ్రహ దోషము: నల్ల నువ్వులు,సుర్మరాయి,సాంబ్రాణి,సోపు, _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.
రాహు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.
కేతు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం,మేజ మూత్రం ,మారేడు పట్ట_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.

కార్తీక పౌర్ణమి శ్లోకం


'కార్తిక' మాసం సంవత్సరంలోని సర్వమాసాలకంటే మహిమాన్వితమైనది.కార్తీక మాసం నెలరోజులూ రోజూ సాయం సంధ్య వేళ పూజా స్థలములో, తులసి కోటవద్ద, ఇంటిముందు దీపాలను వెలిగించి నమస్కరించే ఆచారం మన హిందువులకు అనాదిగా వస్తున్నది. రోజూ కుదరకపోయినా కార్తీక పూర్ణిమ నాడు తప్పక వెలిగిస్తారు.అలా వెలిగించిన దీపంలో దామోదరుని ఆవాహన చేసి, ఈక్రింది శ్లోకాన్ని చెప్పి ప్రార్థన చేయాలి.
కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే... ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః
చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమిమీద నివసించే ప్రతీ ఒక్కజీవికీ కూడా ఈదీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి.
కార్తీక మాసమంతా స్నానం, దానం ఉపవాసం చేసే శక్తిలేని వారు కనీసం ఒక్క కార్తీక పౌర్ణమి నాడైనా వీటిని ఆచరిస్తే కార్తీక పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రోక్తి.ఈ మాసంలో ఉపవాసం పాటించేవారు ఏక భుక్తం, నక్తభోజనం చేస్తారు. నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమినాడు లేదా యేయైనా కార్తీక సోమవారాలు నక్తములున్నా పుణ్య ప్రదమే.కార్తీకపౌర్ణమినాడు సత్‌ బ్రాహ్మణుని ఆహ్వానించి భోజనం పెట్టి దీప దానం చేస్తూ
''సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపచ్చుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ''
అనే శ్లోకం పఠించాలి.
'దీపం జ్యోతి పరబ్రహ్మ:'' దీపం జ్ఞానానికి ప్రతీక. ఈ దీపదానం వలన జ్ఞానం, ఆయు:వృద్ధి, విద్య, సకల భోగాలు కలుగుతాయని శాస్త్రం. ఈ దీపదానం కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది. ఎవరైతే దీపదానం చేస్తారో వారివారి పాపాలన్నీ నశించిపోతాయని వశిష్ఠవచనం.
ఒక వత్తితో దీపదానం సద్భుద్ధిని, తేజస్సుని ఇస్తుంది. నాలుగు వత్తుల దీపదానం రాజ సమానులను చేస్తుంది. పదివత్తుల దీపదానం రాజకీయ సిద్ధినిస్తుంది. ఏ బది వత్తుల దీపదానం దేవత్వాన్నిస్తుంది. వెయ్యి వత్తుల దీపదానం ఈశ్వర కృపకు పాత్రుల్ని చేస్తుంది. వెండి, ప్రమిదలో పైడిపత్తి వత్తులు వేసి, ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని దానం చేయ డంవల్ల వచ్చే పుణ్యం నంతమైనదిగా, వెండి ప్రమిదలో బంగారు వత్తులు వేసి, దానం చేస్తే జన్మరా హిత్యం పొందు తారని మన పురాణాలు తెల్పుతు న్నాయి.

Friday 27 November 2015

జాతకులు గ్రహాల శాంతులకు దీపారాధన

జాతకులు గ్రహాల శాంతులకు దీపారాధన
గ్రహాల శాంతులకు ఈ విధంగా దీపారాధన చేయడం ద్వారా జాతకులు సుఖసంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణలు అంటున్నారు.
జాతకపరంగా నవగ్రహ పరివర్తనను అనుసరించి శుభ, అశుభఫలితాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గ్రహాధిపత్యంతో కలిగే అశుభ ఫలితాలను తప్పించేందుకు నవగ్రహ ఆరాధన చేయడం మంచిదని జ్యోతిష్కులు సూచిస్తున్నారు.
ఇందులో బాగంగా నవగ్రహ పూజలో దీపారాధనకు వాడాల్సిన వత్తులు, దీపారాధనలో ఉపయోగించాల్సిన నూనెలు గురించి తెలుసుకుందాం... సూర్యారాధనలో కుంకుమ వర్ణపు ఏకవత్తిని ఎర్రరంగు ప్రమిదెలో వెలిగించి పూజచేయాలి. దీపారాధనలో ఆవునేతిని ఉపయోగించాలి.
అదేవిధంగా చంద్ర గ్రహ పూజలో ఏకిన దూదితో తయారు చేయబడిన రెండు వత్తులను వెండి ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనలో నేతిని వాడాలి. కుజ గ్రహ పూజలో కుంకుమ రంగు వర్ణంలో ఉన్న మూడు వత్తులను ఎర్రటి ప్రమిదెలలో వెలిగించాలి. దీపారాధనలో నువ్వుల నూనెను వాడాలి.
అలాగే బుధ గ్రహ పూజలో తెల్లజిల్లేడు వత్తులను నాలుగింటిని ఎర్రటి ప్రమిదెలో తమలపాకు వేసి వెలిగించాలి. ఇందులో దీపారాధనకు గాను కొబ్బరి నూనెను వాడాల్సి ఉంటుంది. ఇక గురుగ్రహ పూజచేయటానికి తామర వత్తులతో తయారు కాబడిన ఐదు వత్తులను కంచు ప్రమిదెలలో వేసి వెలిగించాలి. దీపారాధనలో నేయిని ఉపయోగించాలి.
శుక్ర గ్రహ పూజలో కూడా తామర వత్తులతో తయారు చేసిన ఆరు వత్తులను వేసి వెలిగించాలి. దీపారాధనకు ఆవునేతిని వినియోగించాలి. శని గ్రహ పూజకు నల్లని ఏడు వత్తులను స్టీలు ప్రమిదెలో వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వినియోగించాలి.
ఇక రాహు గ్రహ పూజకు నలుపు వర్ణం కలిగిన ఎనిమిది వత్తులను నిమ్మకాయ డొప్పలో వెలిగించాలి. దీపారాధనలో అష్టమూలికా తైలాన్ని వినియోగించాలి. కేతు గ్రహ పూజలో తెల్లజిల్లేడుతో తయారు కాబడిన తొమ్మిది వత్తులను ఉపయోగించాలి. దీపారాధనలో కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఇలా ఆయా గ్రహాల శాంతులకు పైవిధంగా దీపారాధన చేయడం ద్వారా జాతకులు సుఖసంతోషాలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణలు అంటున్నారు.

కరక చతుర్థి వ్రతo

స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే 'కరక చతుర్థి' వ్రతాన్ని కార్తీక బహుళ చవితి రోజున చేస్తారు....
సాధారణంగా కార్తీక పౌర్ణమితో కార్తీకమాస విశిష్టత పూర్తవుతుందని చాలామంది అనుకుంటూ వుంటారు గానీ ... ఇందులో నిజంలేదు. కార్తీక పౌర్ణమి తరువాత వచ్చే సోమవారాలే కాదు ... మిగతా రోజులు కూడా ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. ఈ రోజుల్లో కూడా ఆచరించదగిన నోములు ... వ్రతాలు ఎన్నో చెప్పబడ్డాయి.
కార్తీక పౌర్ణమి రోజున అనేక దీపాలను వెలిగించి ... శివయ్యకి ఆనందాల హారతులు పట్టిన తరువాత, 'కార్తీక బహుళ పాడ్యమి' ... ' కార్తీక బహుళ విదియ' ... 'కార్తీక బహుళ తదియ' వస్తాయి.
కార్తీక బహుళ పాడ్యమి రోజున 'లావణ్యా వ్రతం' ... కార్తీక బహుళ విదియ రోజున 'అశూన్య వ్రతం' ... కార్తీక తదియ రోజున 'భద్రావ్రతం' చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని చెప్పబడుతోంది. ఇక ఆ తరువాత వచ్చే 'కార్తీక బహుళ చవితి' కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగివుంటుంది. స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే 'కరక చతుర్థి' వ్రతాన్ని ఈ రోజున చేస్తారు.
అత్యంత శక్తిమంతమైన ... మహిమాన్వితమైన వ్రతాలలో ఒకటిగా కరక చతుర్థి వ్రతాన్ని భావిస్తుంటారు. ఈ కారణంగా చాలామంది ఈ రోజున ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించే వారు ... ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, చంద్రోదయం వరకూ ఉపవాసం చేయాలి. శివ పార్వతులతో కూడిన గణపతిని పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది.

గోమాత గురించి కొన్ని నిజాలు

''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....
గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా
* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
* ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.
* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.
- గాంధీజీ.
''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.
- మహ్మద్ ప్రవక్త.
''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''.
- ఏసుక్రీస్తు.
''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''.
- హజరత్ మహమ్మద్.
''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''.
- బర్మార్డ్ మేక్ ఫెడన్.
''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''.
- హకీల హజ్మల్ ఖాన్.
''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.
- తోహస్-వి-హింద్ బిజహరు.
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే....
''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు''
''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''
''వందేగోమాతరం''

Monday 7 September 2015

దారిద్ర దుఃఖ దహన

విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ,

కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ |

కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ,

దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా ||1||



గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ,

కాళాంతకాయ భుజగాధిప కంకణాయ |

గంగాధరాయ గజరాజ విమర్దనాయ,

దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా ||2||



భక్త ప్రియాయ భవరోగ భయాపహాయ,

ఉగ్రాయ దుఃఖ భవ సాగర తారణాయ |

జ్యోతిర్మయాయ గుణ నామ సునృత్యకాయ,

దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా ||3||



చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ,

ఫాలేక్షణాయ మనికుండల మండితాయ|

మంజీరపాద యుగళాయ జటాధరాయ,

దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా ||4||



పంచాననాయ ఫణి రాజ విభూషణాయ,

హేమాంశుకాయ భువనత్రయ మండితాయ|

ఆనంద భూమి వరదాయ తమోపహాయ,

దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా ||5||



భాను ప్రియాయ భవ సాగర తారణాయ,

కాలాంతకాయ కమలాసన పూజితాయ|

నేత్రత్రయాయ శుభ లక్షణ లక్షితాయ,

దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా||6||



రామ ప్రియాయ రఘునాధ వర ప్రదాయ,

నామ ప్రియాయ నరకార్ణవ తారణాయ|

పుణ్యేషు పుణ్య భరితాయ సురార్చితాయ,

దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా||7||



ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ,

గీతప్రియాయ వృషభేశ్వర వాహనాయ|

మాతంగ చర్మ వసనాయ మహేశ్వరాయ,


దారిద్ర దుఃఖ దహనాయ నమశ్శివాయా||8||

Wednesday 26 August 2015

తిధులు

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.
ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి,12. శుక్ల ద్వాదశి,13. శుక్ల త్రయోదశి,14. శుక్ల చతుర్దశి,15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి,2. కృష్ణ విదియ,3. కృష్ణ తదియ,4. కృష్ణ చవితి,5. కృష్ణ పంచమి.
మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి,7. శుక్ల సప్తమి,8. శుక్ల అష్టమి,9. శుక్ల నవమి,10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి7. కృష్ణ సప్తమి,8. కృష్ణ అష్టమి,9. కృష్ణ నవమి,10. కృష్ణ దశమి.
అధమ తిధులు:- 12. శుక్ల ద్వాదశి,3.శుక్ల తదియ,4.శుక్ల చవితి,5.శుక్ల పంచమి.11.కృష్ణ ఏకాదశి,12.కృష్ణ ద్వాదశి,13.కృష్ణ త్రయోదశి,14.కృష్ణ చతుర్ధశి,15.అమావాస్య.
సంకల్పతిధి;-ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.
తిధి సంధి:-పంచమి,షష్ఠి లయొక్కయు,దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.ఈ సంధిన జననమైన యెడల పితృగండం.
గండతిధి:-పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.శుభకార్యాలు చేయరాదు.
పంచ పర్వతిధులు :-అష్టమి,చతుర్ధశి,అమావాస్య,పౌర్ణమి,సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు.ఇవి శుభకార్యాలకు పనికిరావు.
పక్ష రంధ్ర తిధులు:-చవితి మొదటి 8 ఘడియలు,షష్ఠి మొదటి 9 ఘడియలు,అష్టమి మొదటి 14 ఘడియలు,నవమి మొదటి 25 ఘడియలు,ద్వాదశి మొదటి 10 ఘడియలు,చతుర్ధశి మొదటి 5 ఘడియలు.ఈ ఘడియలలో వివాహం చేయరాదు.మిగిలిన ఘడియలు శుభప్రధములు.
పితృకార్యములకు తిధి:-అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం,రెండవ భాగం సంగమ కాలం,మూడవ భాగం మధ్యాన్నం,నాల్గవ భాగం అపరాహ్నం,ఐదోభాగం సాయంకాలం .ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.

గ్రహాలు అవస్ధలు

శ్లో;-దీప్తాస్స్వస్ధో ముదిత శ్శాన్త శ్శక్తోని పీడితో భీతః
వికలః ఖలశ్చకధితో నవ ప్రకారో గ్రహౌహరినా!
దీప్తావస్ధ,స్వస్ధావస్ధ,ముధితావస్ధ,శాంతావస్ధ,శాక్తావస్ధ,పీడావస్ధ,భీతావస్ధ,వికలావస్ధ,ఖలావస్ధ,దీనావస్ధ అను పది అవస్ధలలో రవ్వాది గ్రహములు ఏదో ఒక అవస్ధ పొందుదురు.
1)దీప్తావస్ధ:-గ్రహాలు ఉచ్చక్షేత్రంలో ఉంటే పొందే అవస్ధ. దీప్తావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో కీర్తి ప్రతిష్ఠలు,సకల సంపదలు కలుగును.
2)స్వస్ధావస్ధ:-గ్రహాలు స్వస్ధానంలో ఉన్నచో పొందే అవస్ధ.స్వస్ధానం యందున్న గ్రహం యొక్క దశలలో ధనం,సుఖాలు,సౌఖ్యాలు, కలుగును.
3)ముధితావస్ధ:-గ్రహాలు మిత్రక్షేత్రమందున్నప్పుడు పొందే అవస్ధ.ముధితావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో దనము,భోగాలు,రాజయోగాలు కలుగును.
4)శాంతావస్ధ:-గ్రహాలు సమక్షేత్రంలోను,శుభవర్గు యందున్న గ్రహం పొందే అవస్ధ. శాంతావస్ధ యందున్న గ్రహం యొక్క దశలలో శాంతము,సుఖము,భోగాలు,ధనం,విద్యార్జన,పరోపకార బుద్ధి,దర్మబుద్ధి కలుగును.
5)శాక్తావస్ధ:-గ్రహాలు వక్రించినప్పుడు పొందే అవస్ధ.గ్రహాలు వక్రత్వమును వీడి రుజుగతి యందున్నప్పుడు పొందే అవస్ధ.శాక్తావస్ధ యందున్న గ్రహం మూడవ వంతు,లేదా నాల్గవ వంతు బలం కలిగి తనకి సంబందించిన ఫలితాలను క్రమక్రమంగా ఇచ్చేదరు.శాక్తావస్ధ రవిచంద్రులకు ,రాహు కేతువులకు ప్రాప్తించదు. భోగాలు కీర్తిని పొందుతారు.
6)పీడావస్ధ:-గ్రహాలకు వేధ కలిగిన,గ్రహ యుద్ధమునందు ఓడిపోయినను రాశ్యాంతరమునందు ఉన్నను ఈ అవస్ధ కలుగును.కార్యహాని,వ్యతిరేకత,ఆటంకాలు,భాధలు,రోగం,శత్రుభాదలు,,బందువులు దూరమగును.
7)దీనావస్ధ:-గ్రహాలు శత్రుక్షేత్రం లో ఉన్నప్పుడు,అధి శత్రు గ్రహముల యొక్క రాశులయందున్నప్పుడు పొందే అవస్ధ. మరియు పనులలో ఆటంకాలు,శత్రుత్వము పొందగలరు.
8)ఖలావస్ధ:-గ్రహాలు నీచ క్షేత్రంలో ,శత్రు నవాంశ నందు,పాప షడ్వర్గుల యందు ఉన్నప్పుడు ఈ అవస్ధ పొందును.కలహాలు,నష్టాలు కలిగించును.
9)బీతావస్ధ:-గ్రహాలు అతిచారం,నీచ నవాంశ (గ్రహాలు రాశిచక్రంలో ఉచ్ఛలో ఉండి నవాంశ చక్రంలో నీచలో ఉన్నప్పుడు)పొందే అవస్ధ.బీతావస్ధ పొందిన గ్రహ దశలో దన నష్టము,దరిద్రం,కలుగును.
10)వికలావస్ధ:-గ్రహాలు అస్తంగత్వం పొందినప్పుడు ఏర్పడే అవస్ధ. వికలావస్ధ పొందిన గ్రహా దశలలో అశాంతి,అస్ధిరత్వము,రోగాభివృద్ధి కలుగును.

ద్విపుష్కర, త్రిపుష్కర యోగాలు

ధర్మం విధి నిషేధాత్మకం, కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేయరాదు. కొన్ని సమయాల్లో కొన్ని పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉదాహరణకు త్రిపుష్కర, ద్విపుష్కర యోగాల్లో వస్తు లాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతం అవుతూ ఉంటాయి. మన చేతిలో లేని నష్టాలు మొదలగువాని విషయం ఎలా ఉన్నా మనం చేసే పనుల్తో డబ్బు ఇవ్వడం, అప్పు తీర్చడం మొదలైనవి పునరావృతమైతే మరల మరల చేయాల్సి వస్తే కష్టం కదా! అందుకని ఆయా సమయాల్లో ఇవ్వవలసినవి గాని ఇష్టపూర్వకంగా ఇచ్చేవి ఇవ్వకుండా జాగ్రత్త పడవచ్చు.
ద్విపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు. విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. ధనిష్ట, చిత్త, మృగశిర నక్షత్రాలు కలిసినపుడు ద్విపుష్కర యోగం. ఈ రోజుల్లో వస్తువు పోయినా, లభించినా ఆ క్రియలు మరల జరుగుతాయి.
త్రిపుష్కర యోగం: ఆది, మంగళ, శనివారాలు, విదియ, సప్తమి, ద్వాదశి తిథులు. విశాఖ, ఉత్తర, పూర్వాభాద్ర, పునర్వసు, కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలు కలిస్తే త్రిపుష్కరయోగం. ఈ రోజుల్లో మృతి, వస్తులాభాలు, నష్టాలు, డబ్బు ఇవ్వడం మొదలైనవి మూడుసార్లు పునరావృతమవుతాయి. కాబట్టి ఆ రోజుల్లో మరల మరల జరగరాదనుకునే పనులు చేయకుండా జాగ్రత్త పడాలి.ఈ యోగాలలో దానధర్మాలు చేయవచ్చు గానీ, లౌకిక కార్యాలలో డబ్బు ఇవ్వకపోవడం మంచిది. ఈ రోజులలో అప్పిస్తే తిరిగిరాదు సరికదా! మనమే మరల మరల ఇస్తుండాల్సి వస్తుంది. అత్యవసరం కానపుడు మందులు వాడకండి. వాడితే మళ్ళీ మళ్ళీ వాడాల్సి వస్తుంది. అదే విధంగా ఈ రోజుల్లో ఆపరేషన్లు చేయించకుండా ఉంటే మంచిది. మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఇబ్బంది. మళ్ళీ మళ్ళీ చేయవచ్చు అనే పనులు చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం వలన ఇబ్బంది కలిగే పనులు చేయకండి. ఇలాగే అప్పు చేయడానికి సోమవారం మంచిది. త్రిపుష్కర, ద్విపుష్కర యోగాలు లేని మంగళవారం అప్పు తీర్చడానికి మంచిది. మంగళవారం అప్పు కొంతైనా తీరుస్తే అప్పుగా త్వరగా తీరుతుంది. బుధవారం అప్పు ఇవ్వడానికి గాని, తీసుకోవడం గాని లేదా దేనికైనా డబ్బు ఇవ్వడంగాని మంచిది కాదు.
అప్పు ఇస్తే తిరిగి వసూలు కావడానికి ఇబ్బంది కలిగే నక్షత్రాలు ఉత్తర, ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, విశాఖ, రోహిణి, కృత్తిక, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, మూల, జ్యేష్ఠ, స్వాతి.

కుజ దోషం పరిహారాలు

కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు.
ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
అని మన పూర్వ మహర్షులు వర్ణించారు. ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.
కుజ దోషంగా చెప్పబడే స్థానాలు: రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట కుజుడు ఉండకూడదని.
కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు.
పరిహారాలు:-ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉండి కుజ గాయత్రి డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి. కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.
సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
పిల్లలు లేని దంపతులు ఏడు మంగలవారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.
కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.
కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
కుజదశలో కుజుని అంతర్దశకు....ఉత్తరకాండ ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.
కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ యాభై ఎనిమిదవసర్గ, తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
కుజ దశలో కేతు అంతర్దశకు-- యుధకాండ నూట పదహారు సర్గ , ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
కుజ దశలో శని అంతర్దశకు -- అరణ్యకాండ డెభై వ సర్గ -- నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
కుజుదశలో బుధ అంతర్దశ --- బాలకాండ పదహారవసర్గ -- ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
కుజు దశలో గురు అంతర్దశ -- సుందర కాండ యాభై ఒకటి సర్గ--- అరటిపండ్లు నైవేద్యము.
కుజ దశలో శుక్ర అంతర్దశకు --- సుందరాకాండ యాబై మూడు సర్గ -- పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం
.
కుజ దశలో రవి అంతర్దశకు --- బాలకాండ ఇరై మూడు సర్గ -- చామ కారెట్ దుంప నైవేద్యము.
కుజదశలో రవి అంతర్దశకు --- బాలకాండ పదిహేడవ సర్గ-- పాలు, పాయేసం నైవేద్యము

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తివంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు.
తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

కార్తవీర్యార్జున స్తోత్రముః


కార్తవీర్య ఖలద్వేషి కృతవీర్య సుతోబలి
సహస్రబాహు శత్రుఘ్నో రక్త్రవాసా ధనుర్ధః
రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తు అభీష్టదః
రాజసైతాని నామాని కార్తవీర్యస్య యః పఠేత్
సంపదః తస్య జాయంతి జనాస్తస్య వషంఘదః
అనాయతాషు క్షేమలాభయుతం ప్రియమ్.
కార్తవీర్యార్జునోనామ రాజా బాహు సహస్రభృత్
తస్య స్మరణ మాత్రేన హృతం నష్టం చ లాభయతి
కార్తవీర్యః మహాబాహో సర్వ దుష్ట విభర్హణః
సహస్రబాహుం సాహస్రం స
రక్తాంబరం రక్తకిరీట కుణ్డలమ్,
చోరాని దుష్టభయ నాశనం ఇష్టదం తం
ధ్యాయేత్ మహాబల విజ్హృంభిత
కార్తవీర్యం యస్య సంస్మరణాదేవ
సర్వ దుఃఖ క్షయోభవేత్ తం నమామి మహావీర్యార్జునమ్
కార్తవీర్యజం హైహయాధిపతేస్తోత్రం
సహస్ర వర్తనం క్రియం వాంచితార్థప్రదం నరాణామ్
శూద్ర దయైర్యాతి నామ శ్రుతమ్
ఇతి దమర తంత్రే ఉమామహేశ్వర సంవాదే
కార్తవీర్యస్తోత్రమ్ సంపూర్ణమ్.

Friday 21 August 2015

పితృకర్మలు ఎందుకుచేయాలి?

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .
శ్లోకం : "దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే "
దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు బోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు బోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము

Saturday 15 August 2015

హనుమాన్ చాలీసా

ధ్యానం:
అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం
యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలీం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరుణౌ రఘువర విమలయశ జోదాయక ఫలచారి
బుద్ధిహీనతను జానికై సుమిరౌ పవన కుమార్
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్
చౌపాయి:
1. జయ హనుమాన ఙ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర ||
2. రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవన సుతనామా ||
3. మహావీర విక్రమ బజరంగీ |
కుమతినివార సుమతి కేసంగీ ||
4. కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా ||
5. హాథ వజ్ర ఔధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవుసాజై ||
6. శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన ||
7. విద్యావాన గుణీ అతి చాతుర |
రామకాజ కరివేకో ఆతుర ||
8. ప్రభు చరిత్ర సునివేకో రసియా |
రామలఖన సీతా మన బసియా ||
9. సూక్ష్మరూప ధరి సియహి దిఖావా |
వికటరూప దరి లంక జరావా ||
10. భీమ రూపధరి అసుర సంహారే |
రామచంద్రకే కాజ సంవారే ||
11. లాయ సజీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ||
12. రఘుపతి కీన్హీబహుత బఢాయీ |
తమ్మమ ప్రియ భరతహి సమభాయీ ||
13. సహస్ర వదన తుమ్హరో యశగావై |
అసకహి శ్రీపతి కంఠలగావై ||
14. సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా ||
15. యమ కుబేర దిగపాల జహాతే |
కవి కోవిద కహిసకే కహాతే ||
16. తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా ||
17. తుమ్హరో మంత్ర విభీషణ మానా |
లంకేశ్వర భయే సబ జగజానా ||
18. యుగ సహస్ర యోజన పరభానూ |
లీల్యో తాహి మధుర ఫలజానూ ||
19. ప్రభు ముద్రికా మేలిముఖ మాహీ |
జలధిలాంఘిగయే అచరజనాహీ ||
20. దుర్గమ కాజ జగతకే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ||
21. రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే ||
22. సబ సుఖలహై తుమ్హారీ శరనా |
తుమ రక్షక కాహూకో డరనా ||
23. ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనో లోక హాంకతే కాంపై ||
24. భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై ||
25. నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరంతర హనుమత వీరా ||
26. సంకటతే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జోలావై ||
27. సబ పర రామ తపస్వీరాజా |
తినకే కాజ సకల తుమ సాజా ||
28. ఔర మనోరధ జోకోయి లావై |
సోఇ అమిత జీవన ఫలపావై ||
29. చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా ||
30. సాధు సంతకే తుమ రఖవారే |
అసుర నికందన రామదులారే ||
31. అష్ఠసిద్ధి నౌనిధికే దాతా |
అస వర దీన్హా జానకీ మాతా ||
32. రామ రసాయన తుమ్హారే పాసా |
సదా రహో రఘుపతికే దాసా ||
33. తుమ్హరే భజన రామకోపావై |
జన్మ జన్మకే దుఃఖ బిసరావై ||
34. అంత కాల రఘువరపుర జాయీ |
జహా జన్మకే హరిభక్త కహాయీ ||
35. ఔర దేవతా చిత్తన ధరయీ |
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ||
36. సంకట హటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బలవీరా ||
37. జై జై జై హనుమాన గోసాయీ |
కృపాకరో గురుదేవకీ నాయీ ||
38. యహా శతవార పాఠకర కోయీ |
ఛూటహి బంది మహా సుఖ హోయీ ||
39. జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ||
40. తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహాడేరా ||

Friday 14 August 2015

శ్రావణమాసం పవిత్రత

నేటి నుండి శ్రావణ మాసం ప్రారంభం ! ఈ మాసం గొప్ప పవిత్రమైనది. ఈ నెలలో వివిధ సాధనలు ఉత్తమ ఫలితలనిస్తాయి. ఈ మాసం ఏకభుక్తం ( ఒంటిపూట భోజనం), నక్త వ్రతం ( పగలంతా ఉపవాసముండి రాత్రి ఆరంభంలో భగవన్నివేదిత ఆహారం స్వీకరించడం ) పాటించితే చక్కని ఫలితాలు లభిస్తాయి. నెలంతా శివునకు, విష్ణువునకు అభిషేకం చేస్తే అన్ని అరిష్టాలు తొలగుతాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో గొప్ప వ్రతం సోమవార వ్రతం . శ్రావణ సోమవారాలు ఉపవాసము, లేదా నక్తవ్రతం చేయడం ఉత్కృష్టం, శివప్రీతికరం.
సోమవార వ్రతం కార్యం శ్రావణే వై యథావిధి
శక్తేనో పోషణం కార్యం అథవా నిడిభోజనం
శ్రావణ సోమవార వ్రతం మహిమాన్వితమైనది. శక్తి కలిగిన వారు ఉపవాసం చేయవచ్చు. లేనివారు పగలంతా ఉపవాసముండి రాత్రి ప్రారంభంలో శివునకు నివేదించిన ఆహారాన్ని ( ప్రసాదాన్ని స్వీకరించాలి) .
శ్రావణమాసం వచ్చిందంటే, పిల్లలనుండి పెద్దల వరకు ఆనందించని వారుండరు. నూతన వధువులకు, గృహిణులకు, బ్రహ్మచారులకు, గృహస్థులకు, లౌకికానందాన్నే కాక ఆధ్యాత్మికానందాన్ని కూర్చేది శ్రావణం. ఈ మాసంలో గృహాలన్నీ పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో ఏర్పడిన లక్ష్మీ శోభతో నిండి, ఉజ్జ్వలంగా ప్రకాశిస్తాయి.
ఆధ్యాత్మిక దృష్టితో చూచినప్పుడు వర్షర్తువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలంగా చెప్పబడినది. అసలు 'శ్రావణ'మనే ఈ మాస నామమునందే వేదకాలమనే అర్ధం ఉన్నది. శ్రవణమనగా "వినుట"అని అర్థం. వేదము గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే 'స్వాధ్యాయ'మనేది మరో నామం.
వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణమందు చెప్పబడినది. దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది.
స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.
పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమనాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి, వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారినుండి బహుమతులను పొండి హృదయ పూర్వకంగా ఆనందిస్తారు. "గృహిణీ గృహముచ్యతే" అని చెప్పినందున, గృహిణులు ఆనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ ఆనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా సంతోషాన్ని కలిగించేదవుతున్నది.
ఈ మాసంలోనే బహుళ అష్టమినాడు శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమనాడు, బ్రహ్మచారులు గాని, గృహస్థులు గాని, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నది.
ఇక కర్షకులు మెరుపులతో, గర్జనలతో కూడిన మేఘాలు వర్షధారలతో దేశమును చల్ల పరచునపుడు మేఘాలు వర్షాధారలతో దేశమును చల్లపరుచునపుడు కృష్యాడి కార్యములు నిర్విఘ్నంగా సాగాగాలవని, తమ మనోరథాలు నెరవేరబోతున్నాయని ఆనందిస్తారు. ఈ విధంగా శ్రావణ మాసం సర్వులకూ ఆనందాన్నిస్తుం

Thursday 13 August 2015

దుర్గాదేవి స్తోత్రం

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
(భాగ -ప్ర -౮)
ఇది దుర్గాదేవి స్తోత్రం...."అమ్మ" అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన పోతన్న గారి అసమాన ప్రతిభ....భక్తుడికీ,భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి పిలుపు....,"దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా,ప్రేమగా పిలుచుకునే భావనని,భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు నా శతకోటి వందనాలు..........నా నిత్యపూజలో ఎన్ని స్తోత్రాలు చదివినా,ఎన్ని మంత్రాలు జపించినా,,’అమ్మ’పూజ మొదలెట్టేది మాత్రం ఈ తియ్యటి పిలుపుతోనే..ఈ మహామంత్రంతోనే....
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ------ అసలు స్త్రీ దేవతలంతా దుర్గనుండే పుట్టారట!! లక్ష్మీ,సరస్వతీ,పార్వతులు..చిట్టచివరకు గంగానమ్మ వరకు గూడా దుర్గమ్మ అంశతో పుట్టినవారేనట!! అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింపబడ్డది........ పురుష లక్షణంకల దేవతలందఱు విష్ణువునుండి గాని,శివుడినుండి గాని పుట్టినట్టు చెప్పబడరు.... కాని కాళీ,దుర్గ,లలిత,మహేశ్వరి,పార్వతి,లక్ష్మి,సరస్వతి మొదలైన దేవతలు..వారాహి,చండీ,బగళా మొదలైన మాతలు....రేణుక ఇత్యాది శక్తులు...చివరకు గ్రామదేవతలు కూడా శ్రీమహాదుర్గా దేవతాంశసంభూతులుగా చెప్పబడతారు...దీనికి కారణమేమిటి?
ఏమిటంటే?
ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది....పురుషుడు ప్రాణదాత, స్త్రీ శరీరదాత్రి.....అసలు ఈ కార్యకారణ సంఘాతమంతా పంచభూతాలనుండి పుడుతోంది.....చేతన రూపమైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు..............కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం...అంతా ఒక ముద్ద...ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహారమై, పంచేంద్రియ లక్షణ భూతమై పుడుతోంది....(పంచభూతాలంటే భూమి,గాలి,నీరు,అగ్ని,ఆకాశం....పంచేంద్రియాలంటే ప్రపంచాన్ని చూసే కళ్ళు, రకరకాల వాసనలు పీల్చే ముక్కు, ప్రతి పదార్థం రుచినీ తెలిపే నాలుక, ఈ సృష్టిలో శబ్దాలన్నిటినీ వినిపించే చెవులు, స్పర్శని తెలియజేసే చర్మం...ఈ ఐదిటివల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి)............కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటోంది...అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది.....బహుజీవులుగా పుడుతోంది, చస్తోంది,,మళ్ళాజన్మిస్తోంది.............కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు.అది సర్వదా ఒక్కటే శక్తి.......రూపాన్ని బట్టి, దేశకాల పరిస్థితులని బట్టీ భిన్నమౌతుందే కాని,,,, చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మనిబట్టి మారదు......అదే మహాశక్తి.....ఆమే దుర్గ....
చాల పెద్దమ్మ-------- ఆమె సనాతని....ఇప్పటిదికాదు....ఎప్పటిదో......ఈ సృష్టి ఉన్నప్పుడూ,లేనప్పుడూ ఆమే ఉంది..
సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ ---------- నాకు మొదట్నుంచీ ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చదివితే ఓ లాగా అనిపిస్తాయి......కలిపి చదివితే---- సురారులు అంటే రాక్షసులు..వారి తల్లి దితి...వీళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు,బాధ....మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపారడి తీర్చింది మన అమ్మలగన్నయమ్మ(ఆఱడి అంటే గాయం,బాధ....పుచ్చుట అంటే మాన్పటం).............
విడదీసి చదివితే------సురారులమ్మ----ఆ తల్లి దేవతలకే కాదు,రాక్షసులకీ తల్లే....మంచివాళ్ళకీ,చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా!!.....కడుపాఱడి పుచ్చినయమ్మ----మనకి ఏ బాధ వచ్చినా,కష్టమొచ్చినా తీర్చేది ఆ అమ్మేకదా (శ్యామశాస్త్రుల వారి కడుపు బాధ కూడా)...
తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ----- వేల్పుటమ్మల అంటే సర్వదేవతామూర్తులయందు నిలిచిఉండెడిదని.....తనని లోనుగా తలచిన వారికి మనసులోనే నిలిచిఉంటుందని అర్థం.....
కృపాబ్ధియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్------అలాంటి అమ్మవు, మాయమ్మవు, సముద్రమంత కృపతో మాకు సర్వసంపదల్నీ (అంటే ధనమే కాదు,విద్యనీ,కవితా శక్తినీ,ఆయురారోగ్యాల్నీ) ప్రసాదించు తల్లీ!!!

Tuesday 11 August 2015

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||

దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||