Wednesday, 26 August 2015

వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తివంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు.
తొలుత పసుపు తో గణపతి ని చేసి పూజించి, కలశం లోనికి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అథాంగ పూజచేయవలెను. దాని తరువాత అష్టోత్తరశతనామ పూజతో నామాలను చదివి, దూప, దీప, నైవేద్యాలను తాబూలాలని సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండివంటలూ, పండ్లూ మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి. చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదువకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మీ గా భావించి వాయనమీయవలెను.

No comments:

Post a Comment