Saturday 1 August 2015

శనేశ్వరమూర్తి కొలువుదీరిన "శని శింగణాపూర్"

శింగణాపురం గ్రామంలో సర్వం శ్రీ శనేశ్వరుడే. మహారాష్టల్రో వున్న శింగణాపురం గ్రామంలో శ్రీ శనేశ్వరుడు కొలువై ఉండటం వల్ల ఆ గ్రామం శని శింగణాపురంగా ప్రసిద్ధిగాంచింది. అక్కడ కొలువై వున్న శనేశ్వరునికి దేశవిదేశాలనుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకోవటంతో నేడు పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతుంది.
శని శింగణాపురంకు తానే రక్షకునిగా ఉంటానని స్వామి ఆ గ్రామ ప్రజలకు అభయం ఇచ్చాడు. అందువల్ల శని సింగణాపురం గ్రామంలో ఉన్న ఇళ్ళకు, దుకాణాలకు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు తలుపులు, తాళాలు ఉండవు. కేవలం పరదాలు మాత్రమే ఉంటాయి. చివరికి వస్తుసామగ్రిని కూడ శనేశ్వరుడే కాపాడుతాడని ఆ గ్రామ ప్రజల విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచి పోలీస్‌స్టేషన్ ఉన్నా ఓ కేసు కూడ నమోదు కాలేదు. గ్రామంలో కొలువుదీరిన శనేశ్వరుని స్వామిపైనే భారం వుంచి ప్రజలు తలుపులు, తాళాలు, కిటికీలు లేకుండా జీవిస్తున్నారు.
350 సంవత్సరాల క్రితం క్షేత్రంలో కొలువుదీరిన శనేశ్వరమూర్తి శింగణాపురంలో వెలసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఆనాడు ఈ గ్రామం చాలా చిన్నది. గ్రామానికి సమీపంలోని పణసవంకకు భారీగా వరద వచ్చింది. వరద తగ్గిన తరువాత నేరేడు చెట్ల మధ్య ఇరుక్కుని వున్న నల్లరాయిని గొర్రెల కాపరులు చూశారు. చేతిలో వున్న కర్రలతో గట్టిగా రాయిని కొట్టారు. చివరికి బలంగా వున్న కర్రతో రాయిని గుచ్చటం జరిగింది. గుచ్చిన ప్రాంతం నుంచి రక్తం రావటంతో భయంతో గొర్రెల కాపరులు గ్రామానికి పరుగులు తీసి తాము చూసిన సంఘటనను ప్రజలకు వివరించారు. ప్రజలు వచ్చి గొర్రెల కాపరులు చెప్పిన నల్ల రాయిని, కారుతున్న రక్తపుదారలను చూశారు. చెట్లుమధ్య వున్న రాయిని ప్రజలు కదిలించి తమ గ్రామానికి తీసుకొనివెళ్ళటానికి విశ్వప్రయత్నాలు చేసారు. నల్లని రాయి కదల లేదు. ప్రజలు గ్రామానికి తిరిగి వెళ్ళారు.
అదేరోజు రాత్రి గ్రామంలో వున్న వ్యక్తికి స్వామి కలలోకి వచ్చి తాను శనేశ్వరుడనని మామ, అల్లుడు వరస కలిగినవారు, మామ, అల్లునికి చెందిన నల్లని ఎద్దులు తీసుకొని వచ్చి మూర్తిని గ్రామానికి తీసుకొని వెళ్ళాలని చెప్పిన శని మహాత్ముడు ఆకాశం మొత్తం తనకు నీడ అని, తనకు ఎటువంటి నీడ అవసరం లేదని, తాను బాహాటముగా ఉండుటకు ఇష్టపడతానని, కాబట్టి ఏ ఆలయనిర్మాణమూ అక్కరలేదని, ప్రతినిత్యం పూజ చేస్తూ శనివారాలలో తప్పకుండా 'తైలాభిషేకం' చేయమని చెప్పాడట. తను స్వయంభుగా వెలసిన ఆపల్లెకు ఇకమీదట బందిపోటుల, దోంగల, దోపిడిదారుల, కన్నము వేసే దొంగల భయం ఎప్పటికీ ఉండజాలదని మాట ఇచ్చి అదృశ్యం అయ్యాడట.గ్రామ ప్రజలు స్వామి కలలో చెప్పిన ఆజ్ఞమేరకు నల్లని రాయిని మామ, అల్లుడు కదిలించి పైకి లేపి గ్రామానికి తీసుకొని వచ్చి ప్రతిష్టించినట్లు స్థల పురాణం.
5.6 అడుగులు పొడవూ, 1.6 అడుగుల వెడల్పు కలిగివున్న ఈ మూర్తినే కట్టపై ప్రతిష్ఠించి శనేశ్వరునిగా పూజలు చేస్తున్నారు. శనీశ్వరమూర్తిని ప్రతిష్ఠించారు. కాని శనేశ్వరునికి గుడి లేదు. ప్రతిష్ఠించిన మూర్తి ఎంత వాన, గాలి, రాత్రిపగలు చలి వేడి అన్నింటినీ చవిచూస్తూ భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. అయ్యప్ప మాలను ధరించినవారికి ఎలాగైతే శనిదోషం పరి హారం అవుతుందో అలాగే శింగణా పురం శనేశ్వరుడిని దర్శించుకున్నవారికి శని దోషం పరిహారమ వుతుందని భక్తుల నమ్మకం.
శనేశ్వరమూర్తి శింగణాపురంలో నేటికీ, (ఈ కలియుగంలో కూడా) ఏ ఇంటికి తలుపు లుండవు! దుకాణాలకు, ఇళ్ళకు, ఆలయాలకు, చివరికి ప్రభుత్వకార్యాలయాలకు కూడా తలుపులు ఉండవు!!!. ఈ వూళ్ళో ఉన్న తపాలా కార్యాలయానికి కూడా తలుపులు, తాళాల లేకపోవడం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. శనీశ్వరుడి నిభగవానుని యందు భయముచే, శనిభగవానుని ఆలయము వద్ద ఒక కిలోమీటరు వ్యాసార్థం లోపల ఉన్న నివాస స్థలములు, గుడిసెలు, దుకాణములు మొదలైనవాటి వేటికి తలుపులు కాని తాళాలు కాని ఉండవు. శింగణాపూర్ అనబడే ఈ ఊరిలో ఎప్పుడూ కూడా దొంగతనము లేదా దోపిడి జరగలేదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయుటకు ప్రయత్నించినా వారు అక్కడికక్కడే ఊరి పొలిమేర దాటేలోగా రక్తం కక్కుకుని చనిపోయారు. ఇతరులు చాలామంది దీర్ఘకాల అనారోగ్యం, మానసిక సమతుల్యత లేకపోవడం వంటి వివిధరకాల శిక్షలు అనుభవించారు.

No comments:

Post a Comment