Sunday 29 November 2015

కుజదోషం

పరాశర మహర్షి కుజదోషం గురించి చెబుతూ ద్వితీయం, చతుర్థం, సప్తమం, అష్టమం, వ్యయం స్థానాలలో కుజుడు ఉంటే కుజదోషం అని చెప్పారు. 'ధనే వ్యయే చ పాతాలే జామిత్రే చాష్టమే కుజే/ స్థితః కుజః పతిం హన్తి న చేచ్ఛు భయతే క్షితః/ ఇందోరప్యుక్తగేహేషు స్థితః భౌమోధవా శనిః/ పతిహంతాస్త్రీ యాశ్చైవం వరస్యయది స్త్రీ మృతిః" - పరాశర మతం.లగ్నం నుండి, చంద్రుడి నుండి,శుక్రుడి నుండి పైన చెప్పబడిన స్థానములలో కుజుడు వుంటే కుజదోషం అని చెప్పారు.
అమ్మాయికి ఒకరికే ఈ దోషం ఉంటే ‘పతిహంతా’ అన్నారు. హంతా అంటే పతిని చంపును అని కేవలం నిర్ణయం పనికిరాదు.సంస్కృతం ప్రకారం ‘హనహింసాయాం’ అనే ధాతువు నుండి హంతా అంటే హింస అని అర్థమవుతోంది. పతిహంతా అంటే పతిని హింసించునది అని కూడా తీసుకోవాలి. కుజదోషం స్థాయి నిర్ణయం చేయునప్పుడు కుటుంబ స్థానం, సుఖ స్థానం, సంతాన స్థానం, ఆయుర్దాయం వంటివి కూడా పరిధిలోకి తీసుకొని పరిశీలించి నిర్ణయించాలి. కుజుడు యొక్క స్థితి స్థానబలం నీచక్షేత్రం, మిత్రక్షేత్రం స్వక్షేత్రం ఉచ్ఛ క్షేత్రం వంటి వాటి ఆధారంగా చేసికొని నిర్ణయించి ఫలితాలు చెప్పాలి. భౌమః అధవా శనిః కుజదోషం మాదిరిగా శనిదోషం కూడా చూడాలి.శని ఆయుష్కారుడు కావున ఆయనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
‘నచేచ్ఛు భయు తేనితః’ అని వున్న కారణంగా శుభ గ్రహముల వీక్షణ లేదా శుభ గ్రహముల కలయిక ఉంటే కుజదోషం ఉండదు. శుభ గ్రహముల కలయిక అంటే శుభ గ్రహములతో 10 డిగ్రీలలోపు కలయిక ఉండాలి. 10 డిగ్రీలు దాటిన తరువాత శుభ గ్రహం ఉంటే ఉపయోగం ఉండదు.
ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా అని చెప్పిన శ్లోకం దేద కేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిధున కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు. వృషభం తులలో పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు ఉంటే కుజదోషం ఉండదు.
మేష వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి నాల్గవ ఇంట కుజుడు వున్న దోషం ఉండదు. మకర కుంభ లగ్నంలో పుట్టిన వారికి సప్తమంలో కుజుడు వున్న దోషం ఉండదు. ధనస్సు మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు వున్న దోషం ఉండదు. సింహం కుంభం లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు అని దేవకేరళ అనే గ్రంథమందలి విశేషం.
మేష వృశ్చికములు కుజుడికి స్వక్షేత్రములు. మకరము ఉచ్ఛ కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. మృగశి, ధనిష్ఠ, చిత్త నక్షత్రములు కుజ ఆధిపత్యం వున్న నక్షత్రములు అందువలన ఈ నక్షత్రములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. పుట్టిన సమయానికి కుజదశ వెళ్లిపోయినా వైవాహిక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధిలోకి తీసుకోనవసరం లేదు.
చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచంలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువ. కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారుడు కుజుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కళత్ర కారకుడు శుక్రుడు. కలహకారుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో కలహ కాపురం తప్పదు. ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి విషయంగా కుజదోషం లేకపోతే వారు సుబ్రహ్మణ్య ఆరాధనలు నిత్యం చేస్తే కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వస్తుంది.
కుజదోషం ఉందని మంచి సాంప్రదాయమైన కుటుంబం నుండి వచ్చిన వివాహా సంబందాలను వదులుకోవద్దు.కుజదోష నివారణకు చాలా పరిహారాలు ఉన్నాయి.కుజ దోషానికి చాలా మినహాయింపులు ఉన్నాయి.జాతక చక్రాన్ని పరిశీలించి కుజుడు ఉన్న స్ధితిని బట్టి కుజ దోష ప్రభావం ఉన్నదో లేదో తెలుసుకొని కుజుడికి సంబందించిన పరిహారాలు చేసుకుంటే కుజ దోష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించవచ్చు.

No comments:

Post a Comment