Saturday 4 July 2015

గోవులను సంరక్షించుకుందాం


శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలకుడైనాడు. ‘ఆహార శుద్ధౌ సత్వశుద్ధిః’ అని శాస్త్ర వచనం. సరైన ఆహారాన్ని తీసుకుంటే వ్యక్తిలో శాంతగుణం పెరుగుతుందనీ శ్లోకార్థం. అందుకే మన మహర్షులు గోవుల్ని పెంచి ఆ క్షీరాన్ని స్వీకరించి సత్వగుణ సంపన్నులైనారు.

ఆవు విశ్వమాత. ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలనీ ఆరాధించినట్లేనని మన పురాణాలు చెబుతున్నాయి. గోవును, ‘గోమాత’ అని పిలుస్తారు. కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు కాబట్టి భారతీయులకు పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవనసరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని వహించింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తున్నాయి.

పూర్వం బ్రహ్మ అచేతనాలైన నదులు, పర్వతాలు మున్నగు వాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతమును అగ్ని నుంచి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు. శరీరం కొరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వలన గోవు ఒక్కటే ఉత్పన్నమైంది. గోవుకు వేదప్రమాణమైన ప్రాముఖ్యత ఉంది. అగ్ని సంబంధమగు హోమంవలన గోవు జన్మించుటచేత గోవునకు అగ్ని హోత్రమని పేరు వచ్చింది. మన వేదాలలో ‘గో’ మహాత్మ్యాన్ని ఉపదేశించి వివరించే మంత్రాలనేకం ఉన్నాయి. గోమాతకు సకల సంపదలకు పుట్టిల్లుగా అధర్వణ వేదం కీర్తించగా, ఋగ్వేదం ‘గవా తుల్యం నోపశ్యామినృణే త్వామ్’ అని పలుకగా, నిరుపమానమైన ఔన్నత్యం ఆవుకి ఉన్నదని యజుర్వేదం ప్రశంసించింది. ఆవులో దేవతా శక్తులున్నాయని, అతీంద్రియ దర్శనశక్తి కలిగిన మన మహర్షులు దర్శించి చెప్పారు. అందుకే గోవులున్నచోట కుండలినీ శక్తి అధికంగా ఉంటుంది. గోవును సేవించడం వలన, గ్రహ దోషాలు తొలగిపోతాయని, గోవుకి ఆహారం సమర్పించడం ద్వారా పితృదేవతలకి పిండప్రదానం చేయలేని వారికి పిండప్రదానం చేసిన ఫలితం లభిస్తుందని మన పురాణాలు పేర్కొన్నాయి.

ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘‘నాథా! జనులు పాపము నుండి విముక్తి చెందుటకు ఏదైనా మార్గమును, తరుణోపాయమును తెలుపమ’’ని అడగగా - శివుడు పార్వతీదేవితో ‘‘గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. పాదములందు పితృ దేవతలు, కాళ్ళయందు సమస్త పర్వతాలు, దంతములందు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జేష్ఠాదేవి, కళ్ళయందు - సూర్యచంద్రాదులు, చెవులయందు శంఖచక్రాలు, కంఠమున విష్ణుమూర్తి, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, వెన్నునందు వరుణ దేవుడు, అగ్నిదేవుడు, తోకలో చంద్రుడు, చర్మమున ప్రజాపతి, రోమావళి యందు త్రిశంకకోటి దేవతలు నివసించెదరు. అందువల్ల గోమాతను పూజించి ఆయురారోగ్యములను, అష్టైశ్వర్యములను పొందవచ్చునని, గోవులకు ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుందని, గోమాతను నమస్కరించి ప్రదిక్షణం చేస్తే భూమండలమంతా ప్రదిక్షణం చేసినంత ఫలము కలుగుతుందని’ చెప్పాడు. భారతీయ గోజాతి అన్ని దేశాల ఆవులకన్నా సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుందని, ఆవునేతిని నిప్పుమీద వేస్తే వచ్చే ధూమం పర్యావరణాన్ని కాలుష్య రహితం చేస్తుందని యజ్ఞయాగాదులవల్ల తెలుస్తోంది. అటామిక్ రేడియేషన్ నుండి రక్షణ పొందగల శక్తి ఆవు పాలల్లో ఉందని రష్యన్లు తెలిసికొన్నారు. మన ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. హిందూ మతంలో గోరక్షణ అత్యంత ప్రధానమైనది. అన్నివిధాలా ఆవు మనకు మేలే చేస్తోంది. బ్రతికీ, మరణించీ కూడా ఉపకారమే చేస్తోంది. కనుక గోవులను సంరక్షించుకుందాం!

No comments:

Post a Comment