Sunday, 26 July 2015

ఏకాదశి ఉపవాసం చేయ్యండిలా

ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునే వారు దశమి రోజునుంచే కొన్ని తప్పని సరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలైన పదార్థాలు ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి.
ఏకాదశి రోజు ఉదయం: దంతాధావనం చేయకుండా నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకుని నమలాలి. నోట్లో వేలు పెట్టి గొంతు శుభ్రపరచుకోవాలి. చెట్లనుంచి ఆకులను తుంచకూడదు. చెట్టునుంచి రాలిన ఆకునే వాడాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నీటితో 12 సార్లు పుక్కలించాలి. ఆ తర్వాత స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవద్గీత పఠనం చేయాలి లేదా పురోహితుడు చదువుతుంటే మీరు వినాలి.
" ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు సహస్రనామాలను జపించండి. విష్ణు భగవానుడిని స్మరించి ప్రార్థించండిలా... హే త్రిలోక నాథా! నా గౌరవం నీ చేతిలో ఉంది. కాబట్టి నేను చేసిన ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి శక్తిని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి.
ఒకవేళ ఏమరుపాటుతో తప్పుడు కార్యక్రమాలతో సంబంధమున్నవారితో మాట్లాడితే సూర్యనారాయణ దేవుడిని దర్శించుకుని ధూప, దీప నైవేద్యాలతో శ్రీహరిని పూజించి క్షమించమని వేడుకోండి. ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. ఎందుకంటే చీమలు మొదలైన సూక్ష్మ జీవులు చనిపోతాయనే భయం ఉంటుంది. అంటే చిన్న ప్రాణికికూడా హాని కలుగచేయకూడదు. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడకూడని మాటలుకూడా మాట్లాడాల్సివస్తుంది.
ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజు వీలైనంత ఎక్కువగా దాన, ధర్మాలు చేయాలి. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకూడదు. దశమితో కలిసి వచ్చే ఏకాదశిని వృద్ధ ఏకాదశిగా పేర్కొంటారు. ముఖ్యంగా వైష్ణవులు యోగ్య ద్వాదశి కనుక వస్తే ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. త్రయోదశి వచ్చే ముందే వ్రతాన్ని పూర్తి చేసి వ్రత పారాయణ చేయాలి.
ఫలాహారంలో క్యారెట్టు, గోభీ, పాలాకూరలాంటి ఇతర ఆకుకూరలు వాడకూడదు. అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష, బాదం, పిస్తా మొదలైన పండ్లను ఆహారంగా తీసుకోవాలి. మీరు ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం భగవంతునికి సమర్పించి ఆ తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు తులసీ దళం సమర్పించాలి. ద్వాదశిరోజున బ్రాహ్మణులకు తీపి పదార్థాలు, దక్షిణ ఇవ్వాలి. కోపగించుకోకుండా మంచి మాటలు మాట్లాడాలి. ఈ వ్రతం చేసేవారు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు.
గమనిక: ఉపవాసం అంటే దేవునికి మనః పూర్వకంగా దగ్గరగా ఉండడమే, అంతేకాని ఆహారం అస్సలు తినకుండా శరీరాన్ని భాదపెట్టడం కాదు. తేలికైన ఆహారం తీసుకుంటూ భగవంతుడ్ని అనుక్షణం తలుచుకోవడమే ఉపవాసానికి సరైన నిర్వచనం.

No comments:

Post a Comment