Sunday, 5 July 2015

స్వధర్మాన్ని పాటించండి

మన పూర్వకర్మానుసారం ఈశ్వరుడు జన్మను విధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నవి. ఈశ్వరుడు మనలను ఏ మతంలో, ఏ శాఖలో, ఏ సంప్రదాయంలో పుట్టించాడో తడనుసారం జీవితం గడుపుతూ కర్మక్షాళనం చేసుకొని పురుషార్థాన్ని సాధించాలి. మన జాతికో, శాఖకో ఏర్పడిన ఆచార్యోపదేశం అనుసరించితే చాలు. ఆ సిద్ధాంతాలు అసంపూర్ణములైననూ ఫరవాలేదు.
కర్మ శేషముండడం వాళ్ళ జీవునికి పూర్ణత్వం అవగతమవడం లేదు. కానీ ఏ మతంలో పుట్టామో ఆ మతాచారం అసంపూర్ణమైనా పూర్ణ కర్మ కషాయానికి అదే సహాయపడుతుంది. ఎవనికి అనన్య భక్తియున్నదో, తన్ను పూర్తిగా భగవంతునికి అర్పణ చేసుకుంటున్నాడో, వానికి ఈశ్వరుడు ఎన్నడూ ప్రణష్టుడు కాదు. ఈశ్వరానుగ్రహం అతనికి అన్ని కాలములలోనూ ఉంటుంది. "ఈ జీవితాన్ని నాకు నీవు ప్రసాదించావు. నేను నా సంప్రదాయాచార్యుని పాదములను నమ్ముకొన్నాను". అని ఎవడైతే తన కులధర్మాన్ని అస్ఖలిత శ్రద్ధతో పాటిస్తున్నాడో, వానికి ఈశ్వరుడు పరిపూర్ణత అనుగ్రహిస్తాడు.
మన ఆచార్యుడే ఈశ్వరుడన్న విశ్వాసం మనకుండవలె. గురువుకు స్వాత్మార్పణ చేసుకుంటే అది ఈశ్వరార్పణే. గురువు వద్ద చేసే ప్రపత్తి ఈశ్వర ప్రపత్తియే. ఈ విషయం ఉపనిషత్తులను పారాయణ చేసేటపుడు చెప్పే శాంతి పాఠంలో వున్నది.
యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యోవై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై
తంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే!!
"ఎవడు బ్రహ్మను పూర్వము సృష్టించాడో, వేదములతనికి అనుగ్రహించాడో, ఆ ప్రకాశరూపుని, బుద్ధి ప్రేరకుని,, మోక్షార్థం శరణుచెందుతున్నాను".
ఒక సంప్రదాయాన్ని అనుసరించక స్వబుద్ధిపై ఆధారపడేవానికి అనర్థమే కలుగుతుంది. అట్టివారు చేసే హాని మూర్ఖులు చేసే హానికంటే అధికం. ఒక సంప్రదాయాన్ని అనుసరించనివాడు మూర్ఖుడని భగవత్పాదులు ఉపదేశ సాహస్రిలో చెప్పారు. జ్ఞానలాభానికి గురుభక్తి అవసరం. పుస్తకాలు చదివినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందన్న నిశ్చయం లేదు

No comments:

Post a Comment