Sunday 5 July 2015

సదాచారము

వేదశాస్త్రాలలో, ఉత్తమ గ్రంథాలలో సదాచారమే ముఖ్యమని చెప్పబడింది. సదాచార పరాయణుల ప్రవర్తనను బట్టియే ధర్మము పుడుతుంది సర్వాగమానాం ఆచారః ప్రథమం పరికల్పితః - ఆచార ప్రభవో ధర్మః అని చెప్పబడింది. సదాచారమునకే సద్వర్తనము, సచ్చరితము, సద్వృత్తము, శీలము, సత్ప్రవర్తన వంటి పర్యాయ పదాలు ఎన్నో కలవు. మనిషికి సర్వోన్నతమైన అలంకారం సత్ప్రవర్తనయే.
విద్యావంతులకు వినయం, ధనికులకు సౌజన్యం, పరాక్రమ వంతులకు ఓర్పుతో మాట్లాడటం అలంకారం. జ్ఞానులకు ఇంద్రియ నిగ్రహం, శాస్త్రపండితులకు వినయం ఆభరణం. సంపన్నులైన వారికి సత్కార్య నిర్వహణ, దానబుద్ధిని కలిగియుండుట అలంకారం. తపఃశక్తి సంపన్నులకు కోపం లేకపోవడం, సర్వ సమర్థులకు సహనం ఉండడం, ధర్మాత్ములకు కపటబుద్ధి లేకపోవడం అలంకారము. పై అన్ని గుణాలకు మూలకారణమైన సత్ప్రవర్తన (సదాచారము) అందరికి శ్రేష్ఠమైన అలంకారము.
ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమః
జ్ఞానస్యోపశమః శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయః
అక్రోధస్తపసః క్షమా ప్రభవితుః ధర్మస్య నిర్వ్యాజతా
సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణమ్‌॥
అని భర్తృహరి మహాకవి పేర్కొనెను.
పతి ఒక్కరూ ప్రయత్నపూర్వకంగా సత్ప్రవర్తనను కలిగియుండాలి. సంపదలు వస్తాయి, పోతాయి. పోయిన (ఖర్చయిన) సంపదలను తిరిగి (రాబట్టుకునే) సంపాదించుకునే మార్గాలున్నాయి. కానీ ఒక్కసారి సత్ప్రవర్తనను విడిచి చెడు మార్గంలో పయనించిన వాడు తిరిగి తన పూర్వస్థితిని పొందలేడు. అందువల్ల సత్ప్రవర్తనను విడువకుండా ఉండాలి అని మహాభారతంలోని ఈ శ్లోకం ఉద్బోధిస్తున్నది.
వృత్తం యత్నేన సంరక్షేత్ విత్తమేతి చ యాతి చ
అక్షీణో విత్తతః క్షీణః వృత్తతస్తు హతో హతః॥
సదాచారీ భవేల్లోకే దర్శనీయస్తు సర్వదా అనే సూక్తి సదాచారపరుడే అందరికీ మార్గదర్శకు డు అని తెలుపుచున్నది. సదాచారం కలిగిన పెద్దల జీవితాన్ని స్ఫూర్తిగా గ్రహించి మానవులు సత్ప్రవర్తనను కలిగియుండుటకే బ్రహ్మదేవుడు సదాచారవంతులైన సత్పురుషులనెందరినో సృష్టించాడని మహాభారతంలోని శాంతిపర్వంలో చెప్పబడింది. అట్టి సదాచార పరులను అనుసరించే ప్రయత్నం చేద్దాం.
సముద్రాల శఠగోపాలాచార్యులు

No comments:

Post a Comment