పూర్వం ఒకసారి దక్షిణ భారతదేశంలో 12 సంవత్సరాల తీవ్రమైన కరువు వచ్చింది. ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. గౌతమ మహర్షి మహాతపశ్శక్తి సంపన్నుడు. ఆయన తన తపస్సుతో సూర్యుడిని, గాయత్రిమాతను మెప్పించి చెల్లిన వెంటనే మొలకెత్తి పంటనిచ్చే విత్తనాలు వరంగా పొందాడు. ఆ విత్తనాలతో తన ఆశ్రమాన్ని ఆస్రయించిన వారందరికి భోజానాదులు ఏర్పాటు చేశాడు. మామూలు ప్రజలు, ఋషులు, మునులు కూడా ఆశ్రయం పొందారు. ఇంతగొప్ప పని చేస్తున్న గౌతమున్ని చూసి కొందరు ఋషులకు అసూయ కలిగింది. ఇదిలా ఉండగా, దక్షిణభారతదేశపు క్షామం తీరలంటే అది గౌతముని వల్లనే సాధ్యమవుతుందని, గౌతముడు శివుడిని మెప్పించి గంగను తీసుకురాగలడని గ్రహించాడు.
అప్పుడు గణపతి తన శక్తి అయిన జయను వెంటబెట్టుకుని, తాను బ్రాహ్మణరూపాన్ని ధరించి, జయను మాయాగోవుగా మార్చి, గౌతమమహర్షి ఆశ్రమంలో పంటలపై వదిలాడు. ఆ గోవు మొత్తం పంటను మేయసాగింది. ఇది గమనించిన గౌతముడు గోవును కొట్టడం తప్పని, చిన్న ధర్భపుల్లను తీసుకుని దాన్ని అదిలించాడు. అది మాయాగోవు కనుక ఆ ధర్భపుల్ల తగలగానే మరణించింది. బ్రాహ్మణరూపంలో ఉన్న గణపతి వెంటనే 'గో హత్య! గో హత్య!' అని అరిచాడు. సమీపంలో ఉన్న వారందరూ పరుగుపరుగున వచ్చి, గోహత్యాపాతకం చుట్టుకున్న గౌతమునితో తాము ఉండలేమని, ఆయన పెట్టే భోజనం తినలేమని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్నామని చెప్తారు. అప్పటికే గౌతముని మీద అసూయతో ఉన్న ఋషులు గౌతముని తలోమాట అంటారు. కొందరు రాళ్ళతో కొడతారు. అయినా గౌతముడు వారిని బ్రతిమిలాడి, చేసిన పాతకం నుంచి బయటపడే మార్గం చూపించమని వేడుకుంటాడు.
అదే అవకాశమని భావించి బ్రాహ్మణరూపంలో ఉన్న గణపతి శివుని జటాజూటంలో ఉన్న గంగను తచ్చి, చచ్చిపడిన ఈ గోవు శరీరంపై నుంచి ప్రవహింపజేస్తే పాతకం నశిస్తుందని చెప్తాడు. అప్పుడు గౌతమ మహర్షి బ్రహ్మగిరి వెళ్ళి పరమశివుని గూర్చి తపస్సు చేస్తాడు. శివుడు కరుణించి ఒకనాడు తన జటాజూటంలో బంధించిన గంగలో నుంచి ఒక ధారను విడుస్తాడు. అదేకాక అక్కడ తాను త్ర్యంబకేశ్వరుడిగా వెలుస్తాడు. అక్కడ తీర్ధంలో ఉద్భవించిన గంగ గౌతమమహర్షితో కలిసి ప్రయాణం చేసి, పాపికొండలను చీల్చుకుని, గోమృత కళేబరం మీది నుంచి పారుతుంది. ఆ కారణంగా ఆ ప్రదేశానికి గోష్పాద క్షేత్రం అనే పెరు వచ్చింది. కాలక్రమంలో అది గోవూరుగా మారి ఇప్పుడు కొవ్వూరు అయింది. ఇప్పటికి ఆ ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి, కొవ్వూరుకు మధ్యనే గోదావరి ప్రవహిస్తుంది. గోదావరి కూడా గంగ తో సమానమైంది. అందువల్ల దీనికి దక్షిణగంగా అని పేరు. గౌతముడు కారణంగా వచ్చింది కనుక గౌతమీ అని, గోవు కోసం వచ్చింది కనుక గోదావరి అని పేరు. అటువంటి పవిత్రగోదావరిని భువికి తీసుకువచ్చిన గౌతమమహర్షి విగ్రహాలు గోదావరీ తీరమంతటా ఉండాలి.
No comments:
Post a Comment