Monday, 6 July 2015

ధనుర్భంగం-అష్టాక్షరిని సూచిస్తుంది

విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను తన వెంట మిథిలా నగరానికి తీసుకొచ్చి, ఆ ధనస్సును చూడాలి అనుకుంటున్నారు అని చెప్పాడు. జనకుడు ఆ ధనస్సు యొక్క చరిత్ర చెప్పి, ఇప్పటివరకు దేవతలనుండి మొదలుకొని వీరూ వారు అని ప్రశ్న లేదు ఎందరో వచ్చి కనీసం ఎత్తలేక పోయారు. దాన్ని ఎత్తితే సీతమ్మను వివాహం ఆడాలి అనే షరతు పెట్టి తెప్పించాడు. ఆ ధనస్సుని ఎనిమిది చక్రాల బండిపై ఉంది, దాన్ని ఐదు వేల మంది కండలు తిరిగి బలం కల్గిన వారు తీసుకు వచ్చారు. ఇది అక్కడి సన్నివేశం. ధనస్సు ఉన్న బండికి ఎందుకు ఎనిమిది చక్రాలు ? ఎందుకు దాన్ని ఐదు వేల మంది లాక్కోచ్చారు ? ఈ సన్నివేశం వేదంలోని ఒక రహస్యార్థాన్ని వివరిస్తుంది.

ఎనిమిది చక్రాలు అంటే ఎనిమిది అక్షరాలు కలిగిన, జ్ఞానం ఇవ్వగల నారాయణ అష్టాక్షరి మహామంత్రం. అది ఓంకారపు సారం. ఓంకారాన్ని ధనస్సుతోకానీ, శంఖంతోకానీ పోల్చుతారు. ఎనిమిది అక్షరాల మంత్రం ఓంకారం యొక్క అర్థాన్ని తెలుపుతాయి. ధనస్సు కల్గిన బండిని ఐదువేల మంది మోసుకురావడమే దాని అర్థం యొక్క సాంకేతం. ఓంకారం తెలుపేది ఐదు అర్థాలను. ఒంటికి బలిమి అంటే మనం ఎముకలు, కండలు గట్టిగా ఉండటం. జ్ఞానానికి బలం అంటే ఏమి ? ఎందరెందరు ఎటు చెబితే అటూ చెప్పినట్టుగా కొట్టుకుపోకుండా, ప్రమాణంతో గట్టిపడి వాడికంటూ ఒక విశ్వాసం చెదరక నిలిస్తే అది సరియైన జ్ఞానం. జ్ఞానం అనేది ఎవడైనా వచ్చి వాడికున్న విశ్వాసాన్ని చెదిర్చే ప్రయత్నం చేస్తే అది కదల ఉండగలగటం ఒక బలం అయితే, ఎదుటివాడికి సరియైన సమాధానం చెప్పగలగడం సరియైన బలం అని చెప్పవచ్చు. ఐదింటికి సంబంధించిన జ్ఞానమే జ్ఞానం అంటే. అవి నేనెవరు, వాడెవరు, పొందాల్సింది ఏమి, నేను ఎట్లా పొందడం, ఎందుకు పొందలేక పోతున్నాను. ఈ ఐదింటిని స్పష్టంగా చెప్పగలదు ఓంకారం, అందుకే ఐదువేల మంది తోసుకొచ్చిన బండి అని సంకేతంగా చెప్పారు.
శ్రీరామ చంద్రుడు ఒక్క సారిగా ఆధనస్సును ఎత్తాడు . దాన్ని సంధించడానికి దానికి ఉన్న నారిని కట్టగానే ఒక్క సారిగా ధనస్సు రెండు ముక్కలైంది. ధనస్సు యొక్క ఒక భాగం శ్రీరామ చంద్రుడి చేతిలో ఉంది, రెండో భాగం ఆ నారి ద్వారా వ్రేలాడుతోంది. ఇది అప్పటి దృశ్యo. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆధనస్సు ఎవ్వరికీ వంగలేదు ఒక్క రాముడికే వంగింది. ఓంకారంలో ఉన్న అర్థాన్ని ప్రకాశింప జేయడానికే ధనుర్భంగం చేసి ఒక ఖండాన్ని తన చేతిలో పట్టుకొని చూపించాడు. అట్లా పట్టుకొని నిలబడడమే ఒక రహస్యం.

ఓంకారానికి తాత్పర్యమేమి ? ఆ తాత్పర్యాన్ని చూపించడమే ఆయన లక్ష్యం. ఓంకారం అంటే 'అ' అనే అక్షరం, 'మ' అనే అక్షరం మద్యన 'ఉ' అనే అక్షరం ఉంది. 'అ' అనేది భగవంతుడి మొదటి నామం. అక్షరాణం అకారో స్మి అని చెప్పుకున్నాడు కృష్ణుడు. ఇది నేను అని చెప్పడానికి ధనస్సుని విరిచి ఒక ఖండాన్ని పట్టుకుని ఇది నేను అని చూపాడు. రెండో ఖండం 'అ' తో కలిసి ఉండే జీవుడు, అంటే మనం. 'మ' అనేది 'మన్ జ్ఞానే మన్ అవభోదనే' జ్ఞానం అనేదే ఆకృతిగా, గుణంగా కలవాడు. అ కి మ కి మధ్యన ఉన్న ఉకారమే ధనస్సు యొక్క రెండు ఖండాల మధ్య ఉన్న నారి. ఉకారం భగవంతుడికి జీవుడికీ మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. లోకంలో మనం అనుకునే సంబంధాలు ఒకనాడు ఉంటాయి, ఒకనాడు పోతాయి. జీవుడికి భగవంతుడికి ఉన్న సంబంధం తీసేస్తే పోదు. సూర్యుడికి కిరణాలకి ఉన్న సంబంధం లాంటిది. అట్లా జీవుడికి దేవుడికి ఉన్న సంబంధం విడరానిది అని తెలియజేయడానికి ధనస్సు యొక్క పై ఖండానికి క్రింద ఖండానికి మధ్యన ఉన్న త్రాడు. అది చెప్పడానికే రాముడు పట్టుకొని చూపాడు. మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఇది అది అని పరిమితం కాదు అన్ని సంబంధాలు ఉంటాయి. ఇది భగవంతుడి ఒక్కడితోనే ఇట్లాంటి సంబంధం. ఇది తరగదు, నశించదు, చెదరదు. ఆ సంబంధాన్ని మనం మరిచాం కానీ ఆయన ఎప్పుడు మరవడు.

ఇది నిరూపించడం కోసమే ఆనాడు రామచంద్రుడు ధనుర్భంగం చేసి చూపాడు. అమ్మను వేరుగా స్వామిని వేరుగా సేవించుకునే సంప్రదాయం కాదు మనది, అందుకే వారిరువురిని ఒక చోట చేర్చి సేవించుకొనేందుకు 'సీతారామ కళ్యాణం'.

No comments:

Post a Comment