Sunday, 26 July 2015

భార్యాభర్తల అనుబంధం

భార్యాభర్తల అనుబంధం సృష్టిలో అపూర్వమయింది. భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు కృతజ్ఞతగా ఉండాలి. ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఇదినిజం. అప్పుడే కుటుంబం అన్న మాటకు అర్థం ఉంటుంది. భార్యలు బానిసలు కారు, వాళ్ళు మనకు సేవ చేయడానికి, చేసి పెట్టడానికి ఉన్నారని భావించడం తప్పు. వాళ్ళు మనకు లొంగిపోయి ఉండడానికి పెళ్ళి ఒక అనుమతి పత్రంగా భావించ కూడదు.
ఒక కుటుంబంలో భార్యా భర్త వాళ్ళకిద్దరు పిల్లలు. భర్త ఉద్యోగం చేస్తాడు. పొద్దున్న వెళ్ళి రాత్రికి తిరిగి వస్తాడు. భార్య ఇంటి పనితో రోజంతా బిజీగా ఉంటుంది. కానీ భర్త ఆ కుటుంబంలో పనిచేసే వాడు నేనొక్కడినే. భార్య ఇంటిపట్టున ఉంటూ సుఖపడిపోతుందనుకున్నాడు. భార్య మీద ఒక రకమయిన “ఈర్ష్య” లాంటిది కలిగింది. దాంతో ఒకరోజు భగవంతుణ్ణి ప్రార్థించాడు “స్వామీ! పగలు వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడుతున్నా. నా కష్టం నా భార్య గుర్తించడం లేదు. ఆమెకు అది తెలిసి రావాలి. ఆమె ఇంటి పట్టున ఉండి సుఖపడిపోతోంది. నా కష్టం తెలిసి రావాలంటే ఆమెను నాలాగా, నన్ను ఆమెలాగా మార్చెయ్యి తండ్రీ” అని వేడుకున్నాడు.
దేవుడు అతని మొర ఆలకించి భార్యను భర్తగా భర్తను భార్యగా మార్చాడు. అబ్బా! దేవుడు నా మీద దయదలిచాడు. ఇప్పుడు నేను ఇంటి పట్టున సుఖంగా ఉండవచ్చు అనుకున్నాడు.
ఇక రోజువారీ కార్యక్రమం మొదలయింది. భార్య రూపంలోని భర్త ఉదయాన్నే ఐదు గంటలకు లేచి స్నానం చేసి, పిల్లల్ని లేపి స్నానాలు చేయించి, టిఫిన్‌ రెడీ చేసి, వంట చేసి క్యారీయర్లు సర్ది అందర్నీ ఆఫీసుకు, స్కూళ్ళకు సిద్ధం చేశాడు. భర్త రూపంలోని భార్య రెడీ అయి ఆఫీసుకు వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళాకా బట్టలు ఉతికి, పిండి సాయంత్రానికి పనుల్ని ముగించాడు. ఈలోగా కరెంటు బిల్లులు, పాల బిల్లులు కట్టాడు.
సాయంత్రానికి అందరూ తిరిగి వచ్చాకా పిల్లల హోంవర్కు చేయించి రాత్రి వంట సిద్ధం చేసి గొడ్డుచాకిరీతో అలసిపోయాడు.
పదిరోజులు గడిచేసరికి తన భార్య రోజూ ఎంత కష్టపడుతుందో తెలిసివచ్చింది. అనవసరంగా ఆమె సుఖపడుతోందని అపోహపడ్డాను అనుకున్నాడు. ఇంటికన్నా ఆఫీసే పదిలమని మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థించాడు. “స్వామీ! ఈ బాధ నేను పడలేను. నేను ఆఫీసుకే వెళతాను. దయచేసి నన్ను నన్నుగా నా భార్యను నా భార్యగా మార్చు తండ్రీ” అని వేడుకున్నాడు.
దేవుడు ప్రత్యక్షమై “ప్రస్తుతానికి వీలుపడదు. ఎందుకంటే నువ్వు గర్భవతివి, తొమ్మిది నెలలు ఆగాలి” అన్నాడు.
దాంతో భార్య రూపంలో ఉన్న భర్త బావురుమన్నాడు!.

No comments:

Post a Comment