Sunday 5 July 2015

శుచి - శుభ్రత

సాధారణంగా మూత్ర విసర్జన చేస్తే పాద ప్రక్షాళన చేసుకొని ఆచమనం చేస్తాడు శుచి సంపన్నుడైనటువంటి వాడు. మలమూత్ర విసర్జనలు చేసిన తరువాత చేయవలసిన విధులు మనకు కొన్ని ఉన్నాయి. శుద్ధి చేసుకోవడం అనేది. ఇప్పుడసలు స్నానాదులే ప్రశ్నార్థకాలు అయిపోయాయి. నీళ్ళు పోసుకోవడం వేరు, స్నానం చేయడం వేరు. స్నానం చేయడం అంటే పాపహరణ మంత్రములతో స్నానం చేయాలి. అఘమర్షణ మంత్రములు అని చెప్తారు. శ్రోత్రీయుడైన వాడు అలా చేస్తాడు. ఆ విజ్ఞానం తెలియనప్పుడు గంగా స్మరణ, గోవింద నామ స్మరణ, ఇష్టదేవతా స్మరణ చేస్తూ స్నానం చేయాలి. అది స్నానం అంటారు. లేకపోతె నీళ్ళు పోసుకోవడం అవుతుంది. అదేవిధంగా శౌచం. మలమూత్ర విసర్జనలు అయిన తర్వాత ఆ వస్త్రములతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో దేవతలు ఉండరు. అందుకు వాటిని శుభ్రంగా తడుపుకోవడం, ఆచమనం చేయడం అటు తర్వాత అన్న స్వీకరణకు కానీ దేనికైనా అర్హత ఉంటుంది. అన్నం తినేటప్పుడు కొన్ని నియమాలు. ఇవన్నీ శుచులు చెప్పారు. ఈ శుచి చేయడం వల్ల ఏమిటంటే ఎక్కడ శుచి ఉంటుందో అక్కడ దేవత ఉంటుంది. అనాచారం, అశుచి ఈ రెండూ ఉంటే కలిపురుషుడికి entry లభిస్తుంది. అయితే ఆ రోజులలో నల చక్రవర్తిలో ప్రవేశించడానికి చిన్న ఆధారం దొరికింది. ఇప్పుడు పాపం windows ఏమిటి doors యే open చేసి అన్నిరకాలుగా ఆహ్వానం పలుకుతున్నాం కలిపురుషుడిని. ఆయనకి పాపం ఎక్కడ ఉండాలో తెలియని విస్తృతమైన చోట్లు దొరుకుతున్నాయి. కావలసినంత అనాచారం, దురాచారం. పైగా దైవభక్తులు ఎంత పెరిగిపోయాయో. భక్తులు చాలా మంది పెరిగి పోయారు. భక్తులు పెరగలేదు, భయాలు పెరిగాయి. దేవుడిని కూడా తమ అవసరాలు తీర్చుకోవడానికి సాధనగా వాడుకున్నారు అంతే. డబ్బు సంపాదనకు అనేక సాధనాలు ఉన్నట్లే దేవుడికి దణ్ణం పెట్టడం, కొబ్బరికాయ కొట్టడం కూడా ఒకటైపోయింది. కానీ భగవంతుడు ధర్మ ప్రియుడు, శుచి ప్రియుడు. అందుకే అమ్మవారు “సదాచార ప్రవర్తికా, దుష్టదూరా దురాచారశమనీ దోషవర్జితా”. ఒకవైపు దోషం, దురాచారం చేసేస్తూ ఏం పరవాలేదండీ అని చెప్పే గురువొకడు. ఈ అనాచారాలు, దురాచారాలు పాటిస్తూనే పారాయణలు చేసే వారు మరొకవైపు. ఆటంకపు రోజులలో కూడా సహస్రనామాలు చదవవచ్చు అని ఒకరు చెప్తారు. అవన్నీ కలుపుకుంటే ఇంకా సహస్ర నామాలు ఎందుకండీ? మైలలు ఇవన్నీ కలిపి పారాయణలు చేస్తే లాభం లేదు. అందుకే అన్నమాచార్య చెప్తారు “ముట్టులేని కూడు ఒక ముద్దడైన చాలు తిట్టు లేనిదిన్ బ్రతుకు ఒక దినమైన చాలు, అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతమొక్కతారమైన చాలు ” – అశౌచంతో తినే పిండివంటలకన్నా శౌచంతో తినే కాసింత భోజనం చాలు అని చెప్పాడు. అందుకు శుచికి ప్రాధాన్యం ఇచ్చిన దేశం మనది.

No comments:

Post a Comment