Thursday, 30 July 2015

వ్యాస పౌర్ణిమి లేదా గురు పూర్ణిమ

గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజంచే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ (ఆంగ్లం: Guru Purnima) అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమహాముని పుట్టిన రోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఉంది.
ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.[1]
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు
ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
'గురుర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వర :
గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమ :' గురుపూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్ఠత ఏమిటో తెలుసా? పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట.
ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు.
వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.
ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు.
ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు.
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు.
వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు.
ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు. కాబట్టి వ్యాస పూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక..!

Tuesday, 28 July 2015

పితృ దోష నివారణ

పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతానా భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. నియమిత కాకులకు మరియు కుక్కలకు బోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు బోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము

Sunday, 26 July 2015

భార్యాభర్తల అనుబంధం

భార్యాభర్తల అనుబంధం సృష్టిలో అపూర్వమయింది. భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు కృతజ్ఞతగా ఉండాలి. ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ ఇదినిజం. అప్పుడే కుటుంబం అన్న మాటకు అర్థం ఉంటుంది. భార్యలు బానిసలు కారు, వాళ్ళు మనకు సేవ చేయడానికి, చేసి పెట్టడానికి ఉన్నారని భావించడం తప్పు. వాళ్ళు మనకు లొంగిపోయి ఉండడానికి పెళ్ళి ఒక అనుమతి పత్రంగా భావించ కూడదు.
ఒక కుటుంబంలో భార్యా భర్త వాళ్ళకిద్దరు పిల్లలు. భర్త ఉద్యోగం చేస్తాడు. పొద్దున్న వెళ్ళి రాత్రికి తిరిగి వస్తాడు. భార్య ఇంటి పనితో రోజంతా బిజీగా ఉంటుంది. కానీ భర్త ఆ కుటుంబంలో పనిచేసే వాడు నేనొక్కడినే. భార్య ఇంటిపట్టున ఉంటూ సుఖపడిపోతుందనుకున్నాడు. భార్య మీద ఒక రకమయిన “ఈర్ష్య” లాంటిది కలిగింది. దాంతో ఒకరోజు భగవంతుణ్ణి ప్రార్థించాడు “స్వామీ! పగలు వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడుతున్నా. నా కష్టం నా భార్య గుర్తించడం లేదు. ఆమెకు అది తెలిసి రావాలి. ఆమె ఇంటి పట్టున ఉండి సుఖపడిపోతోంది. నా కష్టం తెలిసి రావాలంటే ఆమెను నాలాగా, నన్ను ఆమెలాగా మార్చెయ్యి తండ్రీ” అని వేడుకున్నాడు.
దేవుడు అతని మొర ఆలకించి భార్యను భర్తగా భర్తను భార్యగా మార్చాడు. అబ్బా! దేవుడు నా మీద దయదలిచాడు. ఇప్పుడు నేను ఇంటి పట్టున సుఖంగా ఉండవచ్చు అనుకున్నాడు.
ఇక రోజువారీ కార్యక్రమం మొదలయింది. భార్య రూపంలోని భర్త ఉదయాన్నే ఐదు గంటలకు లేచి స్నానం చేసి, పిల్లల్ని లేపి స్నానాలు చేయించి, టిఫిన్‌ రెడీ చేసి, వంట చేసి క్యారీయర్లు సర్ది అందర్నీ ఆఫీసుకు, స్కూళ్ళకు సిద్ధం చేశాడు. భర్త రూపంలోని భార్య రెడీ అయి ఆఫీసుకు వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళాకా బట్టలు ఉతికి, పిండి సాయంత్రానికి పనుల్ని ముగించాడు. ఈలోగా కరెంటు బిల్లులు, పాల బిల్లులు కట్టాడు.
సాయంత్రానికి అందరూ తిరిగి వచ్చాకా పిల్లల హోంవర్కు చేయించి రాత్రి వంట సిద్ధం చేసి గొడ్డుచాకిరీతో అలసిపోయాడు.
పదిరోజులు గడిచేసరికి తన భార్య రోజూ ఎంత కష్టపడుతుందో తెలిసివచ్చింది. అనవసరంగా ఆమె సుఖపడుతోందని అపోహపడ్డాను అనుకున్నాడు. ఇంటికన్నా ఆఫీసే పదిలమని మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థించాడు. “స్వామీ! ఈ బాధ నేను పడలేను. నేను ఆఫీసుకే వెళతాను. దయచేసి నన్ను నన్నుగా నా భార్యను నా భార్యగా మార్చు తండ్రీ” అని వేడుకున్నాడు.
దేవుడు ప్రత్యక్షమై “ప్రస్తుతానికి వీలుపడదు. ఎందుకంటే నువ్వు గర్భవతివి, తొమ్మిది నెలలు ఆగాలి” అన్నాడు.
దాంతో భార్య రూపంలో ఉన్న భర్త బావురుమన్నాడు!.

శనిగ్రహా దోషానివారణ

శని శ్రమకారకుడు. శనిగ్రహా దోష నివారణకు నిత్యం ఉదయాన్నే వాకింగ్ గాని,దేవాలయ ప్రదక్షణలు గాని చేసిన శనిగ్రహా భాదలనుండి కొంతవరకు విముక్తి కలుగుతుంది..అలాగే గుర్రపు నాడ రింగును కుడి లేదా ఎడమ చేతి మద్యవ్రేలుకి ధరించి శని గ్రహా వ్రేలుకి శ్రమ కలిగి కొంతమేరకు శనిగ్రహా భాదలనుండి విముక్తి పొందవచ్చు.
ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు. శనివారం త్రయోదశి తిథి కలిసివస్తే ఆరోజుని శనిత్రయోదశి అంటారు. ఈరోజు శనికి అత్యంత ప్రీతికరమైనది. ఈయనకు తిల తైలాభిషేకం శ్రేష్టం. గోచారరీత్యా శని మేషాది రాశుల్లో సంచరిస్తాడు. అంటే 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏల్నాటి శని ప్రభావం ఉంటుంది.
జాతకునికి గోచారరీత్యా తన జన్మరాశి (జన్మ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి) నుంచి 12,1,2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏలినాటి శని అని వ్యవహరించడం జరుగుతోంది. 12 రాశుల్లో సంచరిస్తున్నప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు.జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలనం సూచనలు.
రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆశలు కల్పించి నిరాశ కల్పిస్తాడు. రుణబాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి. జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు.
రెండవ పర్యాయము (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి.
మూడవ పర్యాయం వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు, అపమృత్యుభయం వంటి చికాకులు ఎదుర్కొంటారు. అలాగే జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరిస్తున్నప్పుడు అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషకారకమే.
అర్ధాష్టమ శని:- జన్మరాశి నుంచి నాల్గవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, స్థిరాస్తి,వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. స్థానచలనం ,వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.
అష్టమ శని:- జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు వంటి ఫలితాలు ఉంటాయి.
దశమ శని:- జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.
అయితే జాతకచక్రంలో శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, గోచారంలో గురు బలం ఉన్నప్పుడు ఏల్నాటి శని అంతగా బాధించడు. ఈ దోషాలు ఉన్న వారు శనికి తైలాభిషేకాలు, జపాదులు చేయించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది.
---------
జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు “Evil Eye”బాగా ఉపయోగపడుతుంది. “Evil Eye” నరఘోష నివారణకు ఇంటికి గాని,వ్యాపార సంస్ధలలో గాని,ఆపీసులకు గాని బయటపక్కన తగిలిస్తే ఎటువంటి నరదృష్టి ప్రభావాలు ఉండవు.జాతకంలో నీచశని,జన్మ శని,ఎల్నాటిశని,అష్టమ శని,అర్ధాష్టమ శని,శని దశలు నడిచే వారు “Evil Eye”ఇంటికి గాని,గదికి గాని పశ్చిమ దిక్కు ఉంచి ప్రతిశనివారం ధూపం వేసిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది. శని వాయు తత్త్వము కలిగి పడమర దిక్కును సూచించును.
శనిగ్రహ దోష ప్రభావం ఎక్కువగా ఉన్నవారికి దీర్ఘకాల అనారోగ్యాలు,సరియైన నిద్ర,ఆకలి లేకపోవటం,చేస్తున్న పనిలో ఆటంకాలు ఎదుర్కోవటం,అవమానాలు ఉన్నవారు “Evil Eye”ఇంటిలో పశ్చిమ దిక్కున ఉంచిన శనిగ్రహ భాదల నుండి విముక్తి కలుగుతుంది.చదువుపై శ్రద్ధ లేని పిల్లల రూంలో “Evil Eye”ని ఉంచిన చదువుపై శ్రద్ధ కలుగుతుంది.అనారోగ్య భాదలు ఉన్న రోగి గదిలో “Evil Eye”కట్టిన రోగ నిరోదక శక్తి పెరిగి రోగం తొందరగా నయం అయ్యే అవకాశం ఉంది.
శని పేరు చెప్పగానే ప్రజల మనస్సులలో ఒక విధమైన భయం .కానీ శని న్యాయమూర్తిలా వ్యవహరించి చెడు మార్గాన వెళ్ళే వ్యక్తిని దండించి సరియైన పంధాన నడిచే దారి చూపిస్తాడు సరియైన సమయంలో మంచి దెబ్బ కొట్టి వారిని చైతన్యవంతులను జేసి తిరిగి తప్పులు చేయకుండా ప్రత్యక్షంగా హెచ్చరిస్తాడు. శని వేసే శిక్షల వల్ల గాయం పైకి కనిపించిన ఆ వ్యక్తిలో మార్పు స్పష్టంగా దర్శనమిస్తుంది.
శని గోచారక్రమంలో రాశిచక్రాన్ని చుట్టి వచ్చుటకు ముప్పై సంవత్సరములు పడుతుంది . శని గ్రహము తనకక్ష్యలో పరి భ్రమణము చేస్తూన్నప్పుడు ఒక్కొక్క రాశిలో రెండున్నరసంవత్సరముల చొప్పున పన్నెండు రాశులలో ౩౦ సంవత్సరములు పడుతుంది.
ఆకారంలో శనిగ్రహం గురుగ్రహం కంటే చిన్నగ్రహం.శని సంచారం గోచారంలో చాలా నెమ్మదిగా ఉంటుంది.మిగతా గ్రహాలకంటే ఎక్కువ కాలం రాశిలో సంచరిస్తాడు కాబట్టి మానవుని జీవితంపై నిప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది.శని సుమారు 135 రోజుల వరకు సామాన్యవేగంతో సంచరించిన తరువాత 105 రోజుల వరకు వక్రమార్గంలో పయనించి ప్రభావితం చేస్తాడు.శని దృష్టి పశ్చిమంపై ఉండి అక్కడే అస్తమించడం వల్ల పడమర దిక్కుని శని దిక్కుగా చెప్తారు.శాంతి ప్రక్రియలు చేపట్టిన దోష ప్రభావం తగ్గి మేలు కలుగుతుంది.
శనివారం ఉదయం నువ్వులనూనెతో శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేసి నువ్వులనూనెతో గాని,ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిళిని నైవేద్యం పెట్టాలి.తరువాత ఈ క్రింది శ్లోకం చదవాలి.
శని బాధా వినాశాయ ఘోర సంతాప హారిణే I
కనకాలయ వాసాయ భూతనాధాయతే నమః II
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ I
క్షిప్రం నాశయ హే దేవ!శని బాధా వినాశక II
భూత బాధా మహాదుఃఖ మధ్యవర్తిన మీశమాం I
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక II
అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం I
సంభవంతి దురంతాని తాని నాశయమే ప్రభో II
మాయా మోహన్యానంతాని సర్వాణి కరుణాకర I
దూరి కురు సదాభక్త హృదయానందదాయక II
అనేక జన్మ సంభూతాన్ తాప పాపాన్ గుహేశ్వర I
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత నందతే II
ఉన్మాదోధ్భూత సంతాపా గాధకూపాద్మహేశ్వర I
హస్తావలంబం దత్వా మాం రక్షరక్ష శనైశ్చర II
దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవనం I
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే II
ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే పఠించిన శనిదోషం తొలగిపోవును.

ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదు?


దోసిళ్లతో దూసుకోమంటూ ప్రకృతి ప్రసాదించిన అపురూప వరాలు ... ఉసిరికాయలు. స్వచ్ఛంగా కనిపిస్తూ చూడగానే తినాలనిపించేలా ఇవి నోరూరిస్తుంటాయి. ఇవి తినేసి మంచినీళ్లు తాగితే తియ్యగా అనిపిస్తూ వుంటాయి కనుక, అందుకు చిన్నపిల్లలు ఆసక్తి చూపుతుంటారు. ఊళ్లో వాళ్లంతా కలిసినా ఉసిరికాయంత మేలు చేయలేరని అంటూ వుంటారు. అంతగా ఉసిరికాయ అందరి జీవితాల్లోను ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆయుర్వేద వైద్య విధానంలోను ఉసిరికాయను విరివిగా వాడుతుంటారు. ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉసిరికాయ ప్రముఖమైన పాత్రను పోషిస్తూ వుంటుంది. ఇక ఉసిరికాయ పచ్చడిని ఇష్టపడని వారంటూ వుండరు. కొత్తగా ఉసిరికాయ పచ్చడి పెట్టిన రోజున తినడానికి ఇష్టపడేవాళ్లు కొందరైతే, పాత ఉసిరికాయ పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్లు మరికొందరు.
అందరూ అంతగా ఇష్టపడే ఉసిరికాయ పచ్చడిని 'ఆదివారం' తినకూడదని పెద్దలు చెబుతుంటారు. రాత్రి సమయాల్లో ఆ పేరును కూడా పలకకూడదని అంటూ వుంటారు. అయితే అందుకు గల కారణమేమిటో తెలియక చాలామంది తికమకపడుతుంటారు. సాధారణంగా రాత్రి సమయాల్లో ఉసిరిచెట్లపై సర్పాలు ఉంటూ వుంటాయి. ఆ సమయంలో ఉసిరికాయలను గురించి మాట్లాడుకుంటే, ఆ సర్పాలకు ఆహ్వానం పలికినట్టుగా అవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుంచి వుంది.
ఇక రాత్రి సమయాల్లో శరీర ఉష్ణోగ్రత తక్కువగా వుంటుంది. అలాంటి సమయంలో మరింత చలువచేసే ఉసిరికాయను తినడం వలన అనారోగ్యం కలుగుతుందని అంటారు. ఇక రవికి - శుక్రుడికి గల శత్రుత్వం గురించి తెలిసిందే. ఉసిరికాయలోని ఆమ్లగుణం శుక్రుడికి చెందినది కనుక, రవివారమైన ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదని చెబుతుంటారు.

రవిగ్రహ దోష నివారణకు “సన్ స్టోన్ మాల”

తండ్రి, ఆత్మ, ఇతరులకు అపకారం కోరని మనస్తత్వం, ధన ప్రాదాన్యం ,కటువుగా కోపంగా మాట్లాడటం ,మిరియాలలో కారానికి రవి ,మిరియాలకు సంస్కృతంలో మరిచం అనే పేరుంది. మరిచం అంటే సూర్యుడు అని అర్థ్ధం. సూర్యభగవానుడికి ఉండే శక్తి, సూర్యకిరణాల్లోని వేడి మిరియాలకు ఉంటాయని దీని భావం. మిరియాలు జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థల్లోని స్తబ్దతను తొలగించటమే కాకుండా శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది.ఇతరులపై ప్రభావం చూపి వారిపై అధికారాన్ని చూపిస్తారు.
మనుషులను పరిపాలించటం.ఆరోగ్యకరమైన ఉష్ణశక్తి,కంటి అనారోగ్యాలు,క్యారెట్ రవి గ్రహానికి చెందినది కావటం వలన క్యారెట్ తింటే కంటి సమస్యలు ఉండవు.గర్వం కలవాడు.పెద్ద మనిషిగా వ్యవహరించటం, శిరోవ్యాధి తులా లగ్నంలో రవి ఉన్న,ఇంకా బలహీన శత్రుక్షేత్రాలలో రవి ఉన్న శిరోవేదన కలుగుతుంది.రవి కోపం పైకి కనపడదు.దీర్ఘకాలిక కోపాన్ని కలిగి ఉంటారు.పొగిడితే క్షమించే గుణం.ప్రభుత్వ ఉద్యోగం,పిరికితనం,భయాన్ని లోపల దాచుకోవటం వలన హృదయ సంభందించిన రోగాలు వస్తుంటాయి.రాగి ,ఉదయాన్నే రాగి చెంబులో నీరు త్రాగటం ఆరోగ్యానికి మంచిది.
తూర్పు దిక్కును తెలియజేస్తుంది.సంపాదనాతత్వం కలిగి ఉండటం వలన కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. శక్తి, పితృచింత, ఆత్మాభిమానం, శివోపాసన, ధైర్యం, బుద్ధి, ఆరోగ్యం, పిత్తము, కార్యనిర్వహణాశక్తి, బుద్ధిబలం, అశ్రద్ధ కారణంగా దుర్వ్యయము, యజ్ఞము, దినబలము, సౌమ్యత, రాగి, దేవాలయము, గిరిగమనం, కీర్తి, అధికారం, ఎముక, స్వల్పకేశము, ప్రవర్తన, క్షత్రియ, పాషాణము, భూషణము,లోక వ్యవహార నైపుణ్యం కలిగి ఉంటారు.
లావునడుము, రక్తవర్ణము, రాజసము, రోషము, కారము, పొట్టి, తూర్పుదిశ, జ్ఞానోదయము, ప్రవాళము, రాజ్యము, స్వస్థల స్వాధికారలాభము, పరాక్రమమునకు ఘనత, జనవిరోధం, శతృభయం, యుద్ధం, ఉద్యోగం, వైద్యం, సౌఖ్యం, భార్యాబిడ్డల హాని, పితృభృత్యాది విరోధం, ఆత్మజ్ఞానం, వీపుపై భాగం, పక్కలు, హృదయము, స్త్రీల యందు ఎడమకన్ను, పురుషులయందు కుడికన్ను పై ప్రభావం, ఆరోగ్యము, ప్రాణధాతువులు, గౌరవమైన పదవులు, బిరుదులు, అభివృద్ధి, రాజకీయములు, పరిపాలనాధికారులు మొదలైనవి రవి కారకత్వములు.

ఏకాదశి ఉపవాసం చేయ్యండిలా

ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునే వారు దశమి రోజునుంచే కొన్ని తప్పని సరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలైన పదార్థాలు ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి.
ఏకాదశి రోజు ఉదయం: దంతాధావనం చేయకుండా నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకుని నమలాలి. నోట్లో వేలు పెట్టి గొంతు శుభ్రపరచుకోవాలి. చెట్లనుంచి ఆకులను తుంచకూడదు. చెట్టునుంచి రాలిన ఆకునే వాడాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నీటితో 12 సార్లు పుక్కలించాలి. ఆ తర్వాత స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవద్గీత పఠనం చేయాలి లేదా పురోహితుడు చదువుతుంటే మీరు వినాలి.
" ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు సహస్రనామాలను జపించండి. విష్ణు భగవానుడిని స్మరించి ప్రార్థించండిలా... హే త్రిలోక నాథా! నా గౌరవం నీ చేతిలో ఉంది. కాబట్టి నేను చేసిన ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి శక్తిని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి.
ఒకవేళ ఏమరుపాటుతో తప్పుడు కార్యక్రమాలతో సంబంధమున్నవారితో మాట్లాడితే సూర్యనారాయణ దేవుడిని దర్శించుకుని ధూప, దీప నైవేద్యాలతో శ్రీహరిని పూజించి క్షమించమని వేడుకోండి. ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. ఎందుకంటే చీమలు మొదలైన సూక్ష్మ జీవులు చనిపోతాయనే భయం ఉంటుంది. అంటే చిన్న ప్రాణికికూడా హాని కలుగచేయకూడదు. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడకూడని మాటలుకూడా మాట్లాడాల్సివస్తుంది.
ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజు వీలైనంత ఎక్కువగా దాన, ధర్మాలు చేయాలి. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకూడదు. దశమితో కలిసి వచ్చే ఏకాదశిని వృద్ధ ఏకాదశిగా పేర్కొంటారు. ముఖ్యంగా వైష్ణవులు యోగ్య ద్వాదశి కనుక వస్తే ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. త్రయోదశి వచ్చే ముందే వ్రతాన్ని పూర్తి చేసి వ్రత పారాయణ చేయాలి.
ఫలాహారంలో క్యారెట్టు, గోభీ, పాలాకూరలాంటి ఇతర ఆకుకూరలు వాడకూడదు. అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష, బాదం, పిస్తా మొదలైన పండ్లను ఆహారంగా తీసుకోవాలి. మీరు ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం భగవంతునికి సమర్పించి ఆ తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు తులసీ దళం సమర్పించాలి. ద్వాదశిరోజున బ్రాహ్మణులకు తీపి పదార్థాలు, దక్షిణ ఇవ్వాలి. కోపగించుకోకుండా మంచి మాటలు మాట్లాడాలి. ఈ వ్రతం చేసేవారు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు.
గమనిక: ఉపవాసం అంటే దేవునికి మనః పూర్వకంగా దగ్గరగా ఉండడమే, అంతేకాని ఆహారం అస్సలు తినకుండా శరీరాన్ని భాదపెట్టడం కాదు. తేలికైన ఆహారం తీసుకుంటూ భగవంతుడ్ని అనుక్షణం తలుచుకోవడమే ఉపవాసానికి సరైన నిర్వచనం.

Thursday, 23 July 2015

కుమారస్వామి జననం

కుజగ్రహ దోష నివారణకు శివపురాణంలోని కుమారఖండం లోని కుమారస్వామి జననం పఠించాలి.
శివపురాణంలోని నాలుగవదైన 'కుమార ఖండము
కుమారస్వామి జననం
ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|
కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్పవృక్షం కుజుడు.
కైలాసంలో కాపురం ఉంటూన్న పార్వతీపరమేశ్వరులు! కామసుఖాలలో లీనమై, తమదైన శృంగారలోకం లోనికి వెళ్లిపోయారు.
లోకరీతి ననుసరించి, పార్వతీదేవి గర్భందాల్చే స్థితి కలగాలంటే - సురతకేళి అవసరం గనుక వారిరువురూ శృంగారకేళికి సమాయత్తమైనారు. కాని, లేకుంటే శివుని అంశన - ఏ అవయవం నుంచి అయినా...చివరికి జటాజూట చాలనం వల్లనైనా సంతానం కలగడం అతి మామూలు విషయం.
అదీగాక - తారకాసురుడు కోరిన ప్రకారం, తనను సంహరించు అతడు శివవీర్య సంజాతుడై ఉండాలి! దేవతల్లో, మామూలు మానవులవలె అధోరేత స్ఖలనం ఉండదు. ఊర్ధ్వరేతస్కులు అధోరేతస్కులవడానికి ఎంతోకాలం గడపాలి!
అయితే, ఎంతకాలం సురత క్రీడ సాగుతున్నప్పటికీ - అటువంటి దాఖలాలు ఏవీ కనబడడం లేదు. పార్వతీదేవి గర్భధారణ జరగడం లేదు.
ఈలోపున తారకాసురుడి పీడ తారాస్థాయిని ఇంకా మించిపోతోంది. లోకాల హాహాకారం గగన తలాన్ని తాకి ప్రతిధ్వనిస్తోంది. లోకాల మనుగడకు ముఖ్య ఆధారమైన ప్రాణవాయువు సైతం స్తంభించి పోగల దుర్ద్హశ దాపురించింది.
అంతలో విష్ణుమూర్తి చెంత చేరారు మళ్లీ సుదర్శనుడితో సహా ఎవరికీ దిక్కుతోచలేదు.
"మనం చేయగలిగినదంతా చేశాం! ఇకపై చేయగలిగింది, ఆ పరమశివుడి దయపై ఆధారపడి మాత్రమే ఉన్నది. ఆయననే శరణు వేడడం ఉత్తమం" అంటూ సురసమితిని యావత్తూ వెంటబెట్టుకొని సుదర్శనుడు కైలాసదర్శనానికి బయల్దేరాడు.
అంతఃపురంలో...లోపలెక్కడో పార్వతీదేవి యందు అత్యంత అనురక్తుడై సరస క్రీడలో మునిగి ఉన్నాడు పరమేశ్వరుడు.
ముఖద్వారం దగ్గరే అందరూ మోకరిల్లి పెద్దపెట్టున "నమః పార్వతీ పతయే! నమః శంకర మహాదేవాయ నమః ఆశ్రితవరదాయ! నమోనమః" అంటూ ఎలుగెత్తి మొరలారంభించారు దేవగణాలు.
దేవతల మొర ఆయనకు శయ్యాసుఖ భంగముకాగా, బైటికొచ్చాడు శివుడు. దేవతలంతా ఆయన ఎదుట సాష్టాంగపడ్డారు.
సరిగ్గా తనకు రేతఃపతనం జరుగుతూన్న సమయంలో, బైటకు వచ్చేసినందున, అంతా సక్రమంగా జరిగే అవకాశం లేకపోయిందనీ; ఇక దేవతలకోరికలు సత్వరమే తీరాలంటే, తన రేతాన్ని వారే స్వీకరించాల్సి వుంటుందనీ తెలిపాడు పరమేశ్వరుడు.
దేవతలందరి తొందరింపువల్ల, పావురం రూపంలో అగ్నిదేవుడు శివరేతాన్ని స్వీకరించేశాడు తప్ప, అది పార్వతీదేవి ఆగ్రహకారణ మవుతుందనీ - శాపంగా పరిణమిస్తుందనీ అగ్ని తెలుసుకోలేకపోయాడు.
పార్వతి జరిగిన దాంతా చూశాక, దేవతలందరూ స్వార్ధ ప్రయోజనం కోసమే శివారాధన చేశారనీ; అందువల్ల నాశనమైనది తన సుఖమేననీ అర్ధమైంది. వారివల్లనే తాను సంతానవతి అయ్యే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయిందని బాధపడి పోయిన పార్వతీదేవి, తన ఉసురు కొట్టిన పాపానికి దేవతలందరికీ కూడా వారి వారి భార్యల యందు సంతానం కలుగకూడదని శాపం ఇచ్చింది.ఇచ్చా పూర్వకంగా అగ్ని శివరేతాన్ని పుచ్చుకున్నందున, అతడ్ని సర్వభక్షకుడిగా నిత్యం కష్టాలపాలయ్యేలా శపించింది.
అగ్నిదేవుడా శివవీర్య తాపాన్ని తట్టుకోలేక వాయువు సహాయం కోరి, హిమవంతుడి ద్వారా గంగానదిలో విలీనమైపోయేలా ఆ ఉగ్రాగ్ని వీర్యాన్ని విసర్జించాడు. కాని ఆ వేడిధాటికి తట్టుకోలేక, గంగమ్మ తన కెరటాలతో దానిని విచ్చిన్నం చేస్తూ రెల్లు పొదల్లోకి చేర్చింది. అలా మార్గశిర శుద్ధ షష్ఠినాడు - కుమారస్వామి ఆవిర్భావానికి సహకరించింది గంగమ్మ తల్లి.

భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల కిందటే ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ నిజంగా ఉండేదా?

భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల కిందటే ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ నిజంగా ఉండేదా? మరైతే మనమెందుకు ఇంత వెనుకబడి ఉన్నాం???
భారతీయ పురాతన విజ్ఞానాన్ని గురించి చెబితే, కనుబొమ్మలు ఎగరేస్తూ, చెబుతున్నవాడని పిచ్చోడి లాగా చూస్తూ చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. వీరి దృష్టిలో భారతీయులకు అంటే "" తన పూర్వీకులకు"" అసలేమీ తెలియదు. బ్రిటిష్ వాడు వచ్చాకే దేశంలో టెక్నాలజీ ప్రవేశించింది. అంతకుముందు మనం ఆటవికులం, .
ఇది నిజమేనా?
ముందుగా పాశ్చాత్య దేశాలలో సైన్స్ వికాసం ఎలా జరిగిందో చూద్దాం. కేవలం 450 సంవత్సరాల కిందనే గెలీలియో నుంచి పశ్చిమ దేశాలలో ప్రయోగ విజ్ఞానం ప్రారంభం అయింది. అంతకు ముందు కోపర్నికస్‌ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అంతకుముందు ఏ సమస్య ఎదురైనా అరిస్టాటిల్ ను ప్రమాణంగా తీసుకొనేవారు. అరిస్టాటిల్ " ఒకే ఎత్తునుంచీ వదిలితే ఎక్కువ బరువున్న వస్తువు బరువు తక్కువగా ఉన్న వస్తువు కన్న ముందుగా కింద పడుతుందని" ప్రతిపాదన చేసాడు. యూరప్ లో ఇది పరమ ప్రమాణం అయింది. గెలీలియో ఇది తప్పని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. అతన్ని మంత్రగాడన్నారు. కళ్లతో చూసినా నమ్మలేదు.
క్రీశ 139 లో టాలెమీ ""భూ కేంద్రిత విశ్వం "" సిధాంతాన్ని ప్రతిపాదించాడు. 1543 లో కోపర్నికస్‌ ""సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని"" ప్రతిపాదించాడు. ప్రజలు ఒప్పుకోలేదు.
గెలీలియో మళ్ళీ అదే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వారతన్ని గృహనిర్బంధం చేసారు. 78 ఏళ్ల వయసులో అంధుడై చనిపోయాడు.
టైకో బ్రూనో ఇదే సిద్ధాంతాన్ని మళ్ళీ చెప్పాడు. 8 ఏళ్ళు జైల్లో పెట్టి, అయినా బుద్ధి రాలేదని 1600 సంవత్సరం లో సజీవ దహనం చేసి చంపారు.
ఈ ఉదాహరణలు చాలు 500 ఏళ్ల కింద పాశ్చాత్యుల సైన్స్ దృక్పథం ఎలా ఉండేదో తెలుసుకోవడానికి.
కానీ భారతదేశంలో వేలాది సంవత్సరాల నుంచి విద్యా,విఙ్ఞాన రంగాల్లో పూర్తి స్వేచ్ఛ ఉండేది. మన విఙ్ఞానవికాసంలో మూఢనమ్మకాలు చోటుచేసుకోలేదు.తర్కము, ప్రత్యక్ష అనుభవానికే ప్రాధాన్యత ఇవ్వబడినది. ఇక్కడ ఋషులే శాస్త్రజ్ఞులు. ఋషులే అధ్యాపకులు, ఋషులే డాక్టర్లు, ఋషులే సమాజ నిర్మాతలు. ఋషులంటే బ్రాహ్మణులు కాదు, అందులో అన్ని వర్ణాల వారూ ఉన్నారు. వ్యాసుడు, కణాదుడు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్టు, వరాహమిహిరుడు, శుశ్రుతుడు, చరకుడు, పరాశరుడు, భరద్వాజుడు, అగస్త్యుడు, మయుడు, నాగార్జునుడు, భోజుడు, కౌటిల్యుడు, బోధిధర్ముడు పతంజలి, వాత్స్యాయనుడు ఇలాకొన్ని వందల మంది శాస్త్రజ్ఞులు భారతావని విఙ్ఞానవికాసంలో మనకు ఉగ్గు పోసారు.
ఐతే మన దేశంలో ఎన్నడూ అవసరాలకు మించి లేదా అర్హతలకు మించి సామాన్యులకు విద్యాబోధన చేయబడలేదు. ఇది కూడా సమాజంలో సమతౌల్యం కోసమే.
కానీ విద్యార్థులకు సకల విద్యలు నేర్పబడ్డాయి. ఇందుకు తార్కాణాలే నలంద, తక్షశిల యూనివర్సిటీలు. ఆకాలంలోనే ప్రపంచంలోని నలుమూలల నుంచి కనీసం 10,000 మంది తక్కువ గాకుండా ఒక్కో వర్సిటీలో చదివేవారు. అయితే మనపై జరిగిన సాంస్కృతిక దాడులలో ఈ విఙ్ఞాన భాండాగారాలలోని వ్రాతప్రతులన్నీ తగులబెట్టబడ్డాయి.నిరాటంకంగా నెల రోజులు ఈ పుస్తకాలు తగలబడ్డాయంటే ఇక ఆలోచించండి.
ఇక మన పండితుల ద్వారా లేదా విదేశీ రాయబారుల ద్వారా మన విఙ్ఞానం పశ్చిమంగా పయనించి వారిని కూడా విద్యావంతులను చేసింది.
ఆ తరువాత మనం బానిసలమయ్యాము. Defence లో పడ్డాము. పరిశోధనలు కాస్త ప్రాణ, సాంప్రదాయ రక్షణకు అంకితమయ్యాయి. ఇక బ్రిటిష్ వాడు మన దగ్గర మిగిలిఉన్న గ్రంథాలను అనువదించి, వాటిలోని సారాన్ని గ్రహించి కొత్త ఆవిష్కరణలతో కీర్తి గడించాడు.
400 సంవత్సరాల కిందటి వరకు మూర్ఖులుగా ఉన్న తెల్లవాళ్లు రాజ్యకాంక్షతో ఏదోఒకలాగా విఙ్ఞానాన్ని పెంచుకుంటే, కొన్ని వేల సంవత్సరాలు విఙ్ఞానవికాసం కలిగిన మనం రాజ్యాన్ని పోగొట్టుకొని విఙ్ఞాన హీనులం అయ్యాము.
ఇలా విధి వికటించింది.
అయినా నేటికీ మన విఙ్ఞానం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. ప్రఫుల్ల చంద్రరే, జగదీశ్ చంద్ర బోస్, సి.వి.రామన్, విశ్వేశ్వరయ్య, రామానుజుడు, హోమీబాబా, విక్రమ్ సారాభాయ్‌, యల్లాప్రగడ సుబ్బారావు, సత్యేంద్రనాథ్, మేఘనాథ్ సాహ, శిశిర్ కుమార్, శాంతి స్వరూప్ భట్నాగర్, అబ్దల్ కలామ్ వంటి భారతీయ విజ్ఞాన సింహాలు ప్ర్రపంచాన్ని ఉర్రూతలూగించారు. నేటికీ ప్రపంచమంతా భారతీయ ఉద్యోగులు ప్రతిభ చూపుతున్నారు. అమెరికాలో మనవాళ్ళు లేకపోతే ఆ దేశం తలకిందులు అవుతుంది.
"""" భవిష్యత్తంతా మనదే"""""
బానిస భావాలు వదిలేద్దాం. మన దేశ ఔన్నత్యాన్ని గుర్తించి, మన వంతు పాత్రను నిర్వహిద్దాం.
భారతీయులుగా పుట్టినందుకు గర్విద్దాం.. మరోసారి చెప్పుకుందాం.
భారత్ ది గ్రేట్‌. భారత్ మాతా కీ జయ్

Monday, 20 July 2015

డబ్బుతో కొనలేని సంతోషం

ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది. ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది. సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది.

వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్ర్తిని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు.
తన చేతిలో చీపురుని ఓ మూలన పడేసి ఆ స్ర్తి ఆ యువతి ముందు వున్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది.

‘‘నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను. అంతా దుఃఖం. ఏమీ తినలేకపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతో వారిని పలకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గినె్నలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గినె్నను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది. అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది. కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది.

నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.
ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను. వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను. ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది.

డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు. కాని సంతోషాన్ని కొనుక్కోలేరు. అది మనకి మనం పొందాల్సి ఉంటుంది.’’ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది.
నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది.
నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది.
సంతోషం అనేది గమ్యం కాదు అది ఒక ప్రయాణం.సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది
సంతోషం పరాధీనత కాదు అది ఓ నిర్ణయం.

Thursday, 16 July 2015

మనీషికి పుష్కరస్నానం

 కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేసేవాళ్లు అక్కడ తమకు ఇష్టమైనదేదైనా వదిలేసి రావడం మన సంప్రదాయం. పుష్కరాల్లో ఇలాంటి సంప్రదాయం ఏదీ లేదు గానీ, పుష్కరాలు జరిగే ఈ పన్నెండు రోజుల్లోనూ మన దుర్గుణాల్లో ఒక పన్నెండింటిని వదులుకుందాం. మన పాపాలను పుష్కరస్నానాలు కడిగేస్తాయి. మన మనసులోని మాలిన్యాలను మనం కడిగేసుకుందాం. ఈ మనోస్నానం మనిషిని మనీషిగా మారుస్తుంది.
   
    పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు పన్నెండు రోజుల పాటు జరుగుతాయి. పుష్కరాల ముఖ్యోద్దేశాలు.. పాప ప్రక్షాళన, పితృదేవతల సంస్మరణ. అయితే, మన జీవితాలను మనం ఏమాత్రం తీర్చిదిద్దుకోకుండా, మన లోపాలను మనం ఏమాత్రం సవరించుకోకుండా, మన పాపాలను మనం ఏమాత్రం మానుకోకుండా ఎంతటి పవిత్రనదిలో మునకలేసినా ఫలితం ఏముంటుంది? మన జీవితాలను పవిత్రంగా తీర్చిదిద్దుకుందాం. మనలో సర్వ సాధారణంగా కనిపించే, పుష్కరాల్లో మనం కడిగేసుకోవలసిన కొన్ని అవలక్షణాలు ఇవి..
   
   
    జీవహింస
    వినోదం కోసమో, మానసిక సంతృప్తి కోసమో జీవహింసకు పాల్పడటం చాలామందికి అలవాటు. ఇదంత మంచి లక్షణం కాదు. అయినా, మనలో ఎంతోమంది మూగజీవాలను హింసించడాన్ని ఘనకార్యంగా భావిస్తుంటారు. మూగ జీవాలనే కాదు, మితిమీరిన అహంకారంతో, అదుపులేని ఆగ్రహంతో, అధికార బలగర్వంతో తమ కంటే బలహీనులైన సాటి మనుషులనూ హింసించేవారు లేకపోలేదు. భౌతికంగా, మానసికంగా బలహీనులను హింసించి ఆనందించే లక్షణాన్ని మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. అందువల్ల హింసను విడనాడదాం. అహింసో పరమో ధర్మః అనే ఆర్యోక్తిని త్రికరణ శుద్ధిగా పాటిద్దాం.
   
    వంచన
    ఆధునిక కాలంలో మనుషులు వంచనాశిల్పంలో ఆరితేరిపోతున్నారు. చిన్న చిన్న చిల్లర మోసాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే పెద్దపెద్ద కుంభకోణాల వరకు వంచన మన జీవనశైలిలో భాగంగా మారిపోయింది. మోసానికి గురైనప్పుడు మనం ఎంతగా బాధపడతామో, మనం మోసగిస్తే ఎదుటి వారూ అంతే బాధపడతారు. వంచనకు పాల్పడేవారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు గానీ, వంచనకు గురైన వారు మాత్రం జీవితాంతం కుమిలిపోతూనే ఉంటారు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి, మన వంచనాశిల్ప  నైపుణ్యాన్ని గోదారిలో విడిచేద్దాం.
   
    అబద్ధం
    అవసరం ఉన్నా, లేకున్నా అబద్ధాలాడనిదే పూటగడవదు చాలామందికి. విపత్కర పరిస్థితుల్లో అబద్ధం ఆడటం తప్పుకాదని శుక్రనీతి చెబుతున్నా, అంతటి విపత్తులేవీ లేకుండానే, అనవసరంగా చెబుతున్న అబద్ధాలే ఎక్కువగా ఉంటున్నాయి. జనాభాలో అరవై శాతం మంది అబద్ధాలాడకుండా పట్టుమని పది నిమిషాలైనా ఉండలేరని మెసచుసెట్స్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. అబద్ధాలాడే వారు సాధించేది ఏమీ లేకపోగా, సమాజంలో తమ విలువనే కోల్పోతారు. అబద్ధాలను  గోదావరిలో వదిలేద్దాం. నిజంగా నిఖార్సయిన జీవితాన్ని జీవిద్దాం.
   
    తారతమ్యం
    ఎదుటి వ్యక్తిని సాటి మనిషిగా గుర్తించి, సమాదరించే సంస్కారం చాలామందిలో కొరవడుతోంది. కుల మత ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఎదుటివాళ్ల పట్ల చూపే గౌరవ మర్యాదలలో తారతమ్యాలను పాటించడం తరతరాలుగా కొనసాగుతున్న సామాజిక రుగ్మత. ఈ రుగ్మత నయం కావాలంటే, ఒక సంస్థకు యజమాని అయినా, ఆ సంస్థలో అతి చిన్న ఉద్యోగి అయినా..ఏ స్థాయికి చెందిన వారైనా ఎదుటి వ్యక్తులను సాటి మనుషులుగా గౌరవించడాన్ని అలవాటుగా చేసుకుంటే చాలు. పవిత్ర గోదావరిలో మనుషుల మధ్య తారతమ్యాలను త్యజిద్దాం.
   
    రుణభారం
    మన జన్మలో మనకు తటస్థించే వాటన్నింటికీ రుణానుబంధాలే కారణమనేది మన సనాతన విశ్వాసం. అలాగని రుణభారంలో కూరుకుపోతే మాత్రం మన బతుకులు దారుణంగా తయారవుతాయి. మన సమాజంలో ఒప్పుల కుప్పలు అరుదుగా తప్ప కనిపించరు గానీ, అప్పుల కుప్పల్లాంటి అప్పారావులు అడుగడుగునా కనిపిస్తారు. చేతిలో క్రెడిట్కార్డులు ఉన్నాయి కదా అని, ఆర్థిక శక్తికి మించి అప్పుచేసి పప్పుకూడు తినాలనే ధోరణి అంత క్షేమం కాదు. అలాంటి అప్పుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. రుణభార విముక్తి కోసం పుష్కరాలలో సంకల్పం   చెప్పుకుందాం.
   
    అసూయ
    మనశ్శాంతిని కరువు చేసే అవలక్షణాల్లో అసూయ ఒకటి. ఎదుటివారి ఉన్నతికి ఓర్వలేక అసూయతో రగిలిపోతూ ఉంటారు కొందరు. ఉన్నతిని కోరుకోవడం, అందుకు ప్రయత్నించడంలో ఎలాంటి తప్పులేదు గానీ, ఇతరుల ఉన్నతిని చూడలేకపోవడం అంత మంచిది కాదు. అసూయ ముదిరితే అదే అనారోగ్యానికి దారితీస్తుంది. అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి జబ్బులు రావడానికి అసూయ కూడా ఒక కారణం. మానసిక ప్రశాంతతను పూర్తిగా హరించే అసూయను పుష్కర స్నానంతో   కడిగేసుకుందాం.
   
    వృథా
    ప్రకృతి వనరులను వృథా చేయడం మనలో చాలామందికి ఉన్న పాడు అవలక్షణం. తిండిని, నీటిని ఇష్టానుసారం వృథా చేస్తాం. అవసరానికి మించి తినడం, భుక్తాయాసంతో తినలేని స్థితిలో తిండిని వృథా చేయడం రెండూ నైతిక నేరాలే! మనం తిరిగి సృష్టించలేని ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వృథా చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. తిండిని వృథా చేస్తే కొన్ని దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి. మన దేశంలో అలాంటి చట్టాలేవీ లేకపోయినా, భావి తరాల సంక్షేమం కోసం పుష్కరాలను పురస్కరించుకుని వనరుల వృథాను మానుకుందాం.
   
    చులకన
    చాలామందికి జనాలతో సామరస్యంగా మెలగడం తెలియదు. నోటికొచ్చిన మాటలతో తేలికగా ఎదుటి మనిషిని చులకన చేస్తారు. తమ కంటే బలహీనులను, స్త్రీలను మాటలతో గాయపరుస్తారు. భౌతిక గాయాల కంటే, పరుషమైన మాటల వల్ల కలిగే మానసిక గాయాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఎదుటివారు ఏం చేస్తే మనకు బాధ కలుగుతుందో, ఎదుటి వారి పట్ల మనం అలాంటి పని చేయకుండా ఉండటమే అసలు సిసలు ధర్మం అని పురాణాలు చెబుతున్నాయి. గోదారి సాక్షిగా ధర్మ వర్తనను అలవరచుకుందాం.
   
    పరదూషణ
    ఇతరుల గురించి చెడు మాట్లాడటం చాలామందికి అలవాటు. ముఖ్యంగా ఇతరుల పరోక్షంలో వారిని దుర్భాషలాడటం, వారి గురించి చెడు వ్యాఖ్యానాలు సాగించడం ఒకరకమైన మానసిక జాడ్యం. ఇలాంటి మాటలను ఆలకించడమూ మానసిక జాడ్యమే! ఇతరుల పరోక్షంలో మనం వారి గురించి చెడుగా మాట్లాడుతుంటే, మన పరోక్షంలో మన గురించి ఇతరులూ అలాంటి సంభాషణలే సాగిస్తుంటారనే స్పృహతో మెలగడం మంచిది. పరదూషణ వల్ల ఒరిగేదేమీ ఉండదు, పైగా మన సంస్కారరాహిత్యమే బయటపడుతుంది. పుష్కరాల సందర్భంగా మనం సంస్కారాన్ని పెంచుకుందాం.
   
    నిరాదరణ
    గతించిపోయిన పెద్దలను సంస్మరించుకునే సందర్భం పుష్కరాలు. అయితే, కొందరు ఇంకా జీవించే ఉన్న తమ పెద్దలను నిరాదరణకు గురి చేస్తుంటారు. ముదిమి మీదపడ్డ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలపాలు చేస్తుంటారు. గతించిపోయిన పెద్దలను సంస్మరించుకునే భక్తిశ్రద్ధలు ఉన్నవాళ్లు ఇంకా జీవించే ఉన్న తమ పెద్దలను ఆదరించకపోవడం సరైన పని కాదు. మాతృదేవో భవః పితృదేవో భవః అనే ఆర్యోక్తిని చిన్నప్పటి నుంచి నూరిపోసే సమాజంలో పుట్టి పెరిగిన మనం పుష్కరాల సాక్షిగా మన పెద్దలను గౌరవాదరాలతో   చూసుకుందాం.
   
    స్వార్థం
    మనలో సర్వసాధారణంగా కనిపించే అతిపెద్ద అవలక్షణం స్వార్థం. స్వార్థంలో ఎలాంటి పరమార్థం లేకపోగా, అది అనర్థదాయకం అని తెలిసినా, స్వార్థచింతనను ఏమాత్రం మానుకోలేం. స్వార్థప్రయోజనాల కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతుంటారు. స్వార్థం మితిమీరిన వారు ఇతరులు ఎంతటి ఆపదలో ఉన్నా, ఆదుకోవడానికి ముందుకు రారు. పుణ్య పురుషార్థాలు కోరి చేసే పుష్కర స్నానాల్లో స్వార్థబుద్ధిని వదులుకుని, ఆర్తులను ఆదుకుందాం.
   
    ద్వేషం
    మన పట్ల మనలో మితిమీరి పేరుకుపోయిన అసహనం, కోపం, నిస్సహాయతలే ఎదుటి వారి పట్ల ద్వేషంగా పరిణమిస్తాయి. ప్రపంచంలోని అన్ని మతాలూ ప్రేమను ప్రబోధిస్తుంటే, మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడంలో అర్థం లేదు. ముందుగా మనల్ని మనం ప్రేమించుకుంటే, ఇతరులనూ అదేరీతిలో ప్రేమించగలం. ఇతరులను ద్వేషించడం వల్ల మనకే మనశ్శాంతి కరువవుతుంది. మనలోని అలజడిని, అశాంతిని తగ్గించుకుని, ద్వేషాన్ని గోదారిలో విడిచిపెడదాం.

Monday, 13 July 2015

పరమాచార్య వాణి

శ్రీ గురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ శరవణభవాయ నమః
శ్రీమాత్రే నమః
ఓమ్ నమః శివాయ
శ్రీ సీతారామాభ్యాం నమః శ్రీరామదూతం శిరసా నమామి
మూడవరకం స్నానం గోధూళి స్నానం, దీనిని వాయవ్యం అంటారు, ఇది వాయు సంబంధమైనది. అందుకే ఎప్పుడైనా గోవులు వెళ్ళేటప్పుడు వాటి వెనుకగా నడిస్తే, ఆ ధూళి గాలికి ఎగిరి మన మీద పడితే, అప్పుడు మనం వాయు స్నానం / గోధూళి స్నానం చేసినట్లు.
నాలుగవ రకం స్నానం దివ్యస్నానం, ఇది ఆకాశ సంబంధమైనది. అనగా ఎప్పుడైనా ఎండగా ఉండగానే వర్షం కూడా పడుతూ ఉంటే, ఆ వస్తున్న జలాలు దేవలోకం నుంచి వచ్చినట్లుగా శాస్త్రం చెప్పినది. ఆ సమయంలో మనం ప్రయత్న పూర్వకముగా వెళ్ళి, ఆ వర్షంలో నిలబడితే అప్పుడు మనం దివ్య స్నానం చేసినట్లు.
ఇక ఐదవ రకం స్నానం బ్రహ్మస్నానం. ఇది పృథ్వి సంబంధమైనది. మనం సాధారణంగా పూజలు, హోమాలు, అభిషేకాలు చేసే ముందు, ఒక కలశ స్థాపన చేసి, అందులోని జలాలలోకి గంగాది పుణ్య నదులను ఆవాహన చేసి, ఆ తర్వాత మంత్ర జపం పూర్తి చేసిన (ఉదకశాంతి మొ..) తర్వాత, మంత్రపూరితమైన ఆ జలాలను, దర్భలతో పూజ చేస్తున్న బ్రాహ్మణులు మన మీద జల్లుతారు. అలా దర్భల నుంచి మన మీద చిలకబడిన ఆ మంత్రపూరిత జలములచే మనం బ్రహ్మస్నానం చేసినట్లు".
"ఆచారములు పాటించడం వలన మనలో శౌచం పెరుగుతుంది, కుటుంబములో క్రమశిక్షణ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజములో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. ఆచార సాంప్రదాయములను పాటించడం వలన దీర్ఘాయుష్మంతులౌతారు, సత్సంతానం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం కలుగుతుంది. ఆచార అనుష్టానములను పాటించడం వలన వ్యక్తులలో తేజస్సు పెరుగుతుంది, అందవికారం తగ్గుతుంది (ఇక్కడ అందం అంటే కేవలం బాహ్య అందం ఒక్కటే కాదు). ఆచార, అనుష్టానములను పాటించగా పాటించగా, వ్యక్తి పుట్టుకతో ఎటువంటి రూపుతో ఉన్నా, ఆతని తేజస్సు పెరిగి, నలుగురి చేత గౌరవింపబడి, ఎవరైనా అతనిని మొదటి సారి చూసినా సరే నమస్కార యోగ్యతని పొందుతాడు. చక్కని సదాచారం పాటించే వ్యక్తి, స్నానం చేసి, విభూతి/కుంకుమలు ధరించి, పూజ చేసి బయటకి వచ్చినప్పుడు చూస్తే, ఎటువంటి వారైనా ఆయన తేజస్సుకి నమస్కరించ వలసినదే. ఆచారాన్ని అనుష్టించడం వల్ల మనం నమస్కార యోగ్యతని, పూజనీయతని పొందుతాము".



"రాబోయే తరంలో, వేదం చదవడం రాని బ్రాహ్మణుడు ఒక్కరూ ఉండకూడదు. ఇతరుల మీద ఆధిపత్యం చలాయించడానికి కాదు బ్రాహ్మణులు, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే అతి ముఖ్యమైన కర్తవ్యం బ్రాహ్మణుడిది. ఈ విధంగా బ్రాహ్మణుడు వేద ధర్మాన్ని అనుష్టించడం కేవలం మన దేశ ఐక్యతకే కాదు, యావత్ ప్రపంచానికి శ్రేయస్సు కలిగిస్తుంది"


"ప్రతీ రోజూ మనం నిద్రించబోయే ముందు, ఈ రోజు నేను ఎవరికైనా సహాయ పడ్డానా అని మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. 63 మంది నాయనార్లలో ఒకరైన తిరునావుక్కరసర్ అనే నాయనార్ పాడిన తేవరంలో ఈ విధంగా చెప్పబడినది....'ఏ రోజైతే మనం భగవంతుడి నామాన్ని స్మరించమో ఆ రోజు మనం మరణించిన వాళ్ళతో సమానం, అసలు పుట్టనట్లే లెక్క'. అదే విధంగా ఏ రోజైతే మనం ఏ కొంచెమైనా కూడా మానవ/సమాజ సేవ చేయమో... ఆ రోజు మనం మరణించినట్లే/లేదా పుట్టనట్లే. ఇది ఎలా అంటే, ఎవరికైనా బంధు వర్గంలో ఎవరైనా శరీరం వదిలిపెడితే, వారికి మృతాశౌచం ఉంటుంది. వారికి కలిగిన మృతాశౌచం వల్ల పవిత్రమైన పుణ్య కార్యాలలో పాల్గొనే అధికారం లేదు. అలాగే మనం ఏ రోజైనా ఎవరికీ సహాయపడకుండా, కొంచెం కూడా పుణ్యానికి దగ్గరగా వెళ్లకపోతే, ఆ రోజు, మనమే స్వయంగా మరణించిన వాళ్లతో సమానము, ఆ అశౌచము వల్లనే మనం ఏ కొద్దిగా కూడా ఎవరికీ సహాయపడలేక పోయాము అని గుర్తు"

 "స్త్రీలు ప్రతీ రోజూ తలస్నానం చేయనవసరం లేకుండా, పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోతుందని, మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదే మగవాడు అయితే, ప్రతీ రోజూ తప్పని సరిగా తలస్నానం చేయవలసినదే. స్త్రీలకి మాత్రం మన శాస్త్రం ఈ మినహాయింపు ఇచ్చినది. అలాగే ఒక స్త్రీ గర్భం దాల్చిన తర్వాత, ఆ గర్భంలో ఉన్న జీవి పూర్తి స్థాయిలో పెరిగిన తరువాత, ఆ గర్భిణీ స్త్రీ ఏ వ్రతములు, ఉపవాసములు చేసినా ఫలించవు అని శాస్త్ర వాక్యం. అంటే అలా నెలలు నిండిఉన్న తల్లిని కష్టపెట్టకుండా ఉండాలని శాస్త్రమే ఇచ్చిన మినహాయింపు.

అలాగే ఒక బ్రహ్మచారి తనకు ఎంత ఆహారం కావలన్నా తినవచ్చు, కానీ అది సాత్త్విక ఆహారం మాత్రమే అయి ఉండాలి. వ్రతములు, ఉపవాసములు బ్రహ్మచారులకు శాస్త్రం నిర్దేశించలేదు. ఇలా ఎందుకంటే, చిన్నతనములోనూ మరియు వృద్ధాప్యంలోనూ శరీరానికి సరిపడ పోషణ అవసరం. చిన్నతనంలో ఎదుగుదల కొరకు, వృద్ధాప్యంలో శరీరం నిలబడే ఓపిక కొరకు. అలాగే ఆరోగ్యం బాగుగా లేని వారి కొరకు కూడా శాస్త్రం అనేక మినహాయింపులను శాస్త్రం ఇచ్చినది.

ఈ విధంగా మినహాయింపులు శాస్త్రం అంగీకరించడం పక్షపాతంతో కాదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మనకి ఆచార అనుష్టానాల పట్ల ఎంత భక్తి విశ్వాసాలున్నా, వాటిని ఆచరించలేని దౌర్బల్య స్థితిలో ఒక్కోసారి ఉండవచ్చు, అప్పుడు ఈశ్వరుడు, ఆయన యొక్క అవ్యాజమైన కారుణ్యంతో, ఆచార అనుష్టానంలో కలిగే ఆ లోపాలని క్షమిస్తాడు. అందుకోసమే, శాస్త్రం మనకి కొందరికి, కొన్ని సందర్భాలలో/పరిస్థితులలో ఆ మినహాయింపులను సమ్మతించినది.

ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ పరిస్థితులలో శాస్త్రం ఆయా మినహాయింపులను ఇచ్చినదో, ఆ కష్టం తీరిపోయిన తర్వాత, మళ్ళీ మన ఆచారము అనుష్టానము యథావిధిగా కొనసాగాలి తప్ప.

కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల కోసమో, కొందరు వ్యక్తుల కోసమో (ఉదాహరణ స్త్రీలకు పైన చెప్పిన స్నానం ఉదాహరణ..) శాస్త్రం సమ్మతించిన మినహాయింపులను, సార్వజనీకముగా స్వీకరించి, ఆచార అనుష్టానములను వదలరాదు".

పంచభూత స్నానం
"స్నానం ఐదు రకాలుగా మన శాస్త్రంలో చెప్పబడినది. దీనినే పంచ భూతస్నానం అంటారు. మనం సాధారణంగా స్నానం అంటే చెంబుతో నీళ్ళు తీసి తలమీద పోసుకోవడం అనుకుంటాము, కానీ అది స్నానమే కాదు. నదిలో మన తల పూర్తిగా మునిగేలా చేస్తే అది స్నానం అని శాస్త్రవాక్యం. దీనినే అవకహం అంటారు. ఇది మొదటి రకం స్నానం, ఇది వరుణ సంబంధమైనది.
రెండవరకం స్నానం విభూతి స్నానం, దీనిని ఆగ్నేయం అంటారు. ఇది అగ్ని సంబంధమైనది.

పరమాచార్య స్వామి వారు పైన చెప్పిన శాస్త్ర వాక్కులతో పాటు, మరొక విషయం కూడా మన పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పారు, మనం సంవత్సరంలో ఒక్కసారైనా మనం ఈ పంచభూత స్నానం తప్పనిసరిగా చేయాలి అని.
స్నానం ఏ దిక్కుకి నిలబడి చేయాలి?
"శాస్త్రంలో మనం చేసే ప్రతీ పనీ అది భగవంతుడి పూజ అయినా, లౌకికమైన పనులయినా సరే అన్నిటినీ ఆధ్యాత్మిక దృష్టి కోణంలో చూడబడినది. ఉదయాన్నే లేచి పళ్ళు తోమడం దగ్గర నుంచి, పడుకునేవరకు, సంతానాన్ని కనడం, అంత్యేష్టి సంస్కారం ఇలా అన్ని రకాల పనులూ ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూడడం మన శాస్త్రాలు నేర్పుతాయి. అందుకే ప్రతీ పని చేయడానికి, ఏ విధంగా చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామో, ఆ విధంగా శాస్త్రం విధి విధానాలను మనకు అందించినది. ఉదాహరణకు, నదిలో స్నానం చేయాలి అంటే, నదీ ప్రవాహం వెళ్ళే దిక్కువైపు నిలబడి స్నానం చేయాలి. ప్రవాహానికి ఎదురుగా చేయకూడదు. అలాగే నది కాకుండా, నిలబడి ఉన్న ఒక సరస్సు/చెరువులలో స్నానం చేయాలంటే, అప్పుడు తూర్పు దిక్కుగా నిలబడి స్నానం చేయాలి.
ఎప్పుడైనా మనం సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేయవలసి వచ్చినది అనుకోండి.... ఉదాహరణకి గ్రహణం అప్పుడో, ఎవరైనా చనిపోయారని వార్త తెలిసినప్పుడో, అప్పుడు ఎలా?? ఇలాంటి వాటిని కూడా మన పూర్వ ఋషులు దర్శించి, శాస్త్రాలను మనకందించారు. ఇటువంటి పరిస్థితిలో (రాత్రి పూట గ్రహణం అప్పుడు కానీ, మృతాశౌచం వల్ల కానీ) చెరువు/సరస్సులో కానీ స్నానం చేయవలసి వస్తే, తూర్పుకి కానీ, పడమరకి గానీ తిరిగి స్నానం చేయాలి అని శాస్త్ర వాక్యం. అదే రాత్రి పూట ఇంట్లోనే ఉన్న బావి దగ్గర కానీ, బక్కెట్లో నీళ్ళు తీసి చెంబుతో పోసుకునే విధంగాగానీ స్నానం చేయవలసి వస్తే, అప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే స్నానం చేయాలి".



"అశౌచంగా ఉండడం వల్ల (శరీరాన్ని, దుస్తులను శుభ్రంగా ఉంచుకోక పోవడం, అన్ని వేళలా అందరినీ తాకడం వంటివి..) కలిగే దుష్ఫలితాలు కానీ, 'మడి'గా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ మన కంటికి కనబడవు. కనబడవు కదా అని, చాలా మంది నమ్మరు మరియు వీటిని మూఢ నమ్మకాలు అని చెప్తారు.
కానీ మన శాస్త్రాలు చెప్పినది పరమసత్యం. శాస్త్ర వాక్యాలను మనం ఎంతగా దూరంగా పెడుతూ, మడి ఆచారాల నుంచి దూరంగా వెడుతున్నామో అంతగా మనలో అస్వస్థత పెరుగుతోంది, అనేక పవిత్రమైన పుణ్య స్థలాలలో కూడా ప్రమాదాలలో జన నష్టం జరుగుతూ ఉండడం, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతూ ఉండడం, అనావృష్టి, భూకంపాలు అన్నీ పెరుగుతున్నాయి.

ఇన్ని జరుగుతున్నా, వీటికి ప్రథాన కారణం "మనం శాస్త్రం చెప్పినట్టుగా ఆచార వ్యవహారాలను పాటింక పోవడం" అని అంగీకరించలేక పోవడం నా** దృష్టిలో పెద్ద మూఢ నమ్మకం".


ఆచార అనుష్టానముల వలన ప్రయోజనం

"ఆకలి కూడా ఒక వ్యాధి వంటిదే. మనకి ఏదైనా వ్యాధి వస్తే ఔషధం సేవించట్లేదా.. అలాగే ఆకలి అనే వ్యాధిని మాన్పడానికి ఆహారము కూడా ఔషధములా పరిమితంగా సేవించాలి. రోజుకి ఒక్క సారి భోజనం, ఒక్కసారి ఫలాహారం స్వీకరించి ఉండగలిగితే అది సర్వోత్తమైనది. అలా వీలుకాకపోతే, రోజుకి రెండు సార్లు భోజనం, ఒకసారి అల్పాహారం (టిఫిన్) స్వీకరించే విధానంలో అయినా, ప్రతీ సారీ తీసుకునే పదార్ధం తగుపాళ్ళలో పరిమితంగా ఉండాలి. మన సనాతన ధర్మ శాస్త్రాల ప్రకారం మరియు నేటి ఆధునిక వైద్య విజ్ఞాన శాస్త్రముల ప్రకారం కూడా మనం భోజనం ఎప్పుడూ కడుపు పూర్తిగా నిండేవరకు భుజించకూడదు. జీర్ణాశయంలో సగం వరకు (అంటే సుమారుగా ఎంత తింటే కడుపు పూర్తిగా నిండి పోతుందో అందులో సగం..) మాత్రమే భోజనం చేయాలి, మిగతా సగంలో సగం వరకు అనగా జీర్ణాశయంలో నాలుగో వంతు నీళ్ళు త్రాగాలి. ఇక మిగిలిన నాలుగో వంతు జాగా ఖాళీగా ఉంచాలి.
మామూలు రోజుల్లో అలా రోజుకి రెండు సార్లు భోజనం, ఒకసారి అల్పాహారం భుజించినా, శని, సోమ, గురు వారాల్లోనూ, అమావాస్య తిథులలోనూ, మన ఇలవేల్పు/కులదైవము ప్రకారం ఆ దేవతా స్వరూపము యొక్క ప్రీతికరమైన/ప్రతీక ఐన రోజులలో అనగా... షష్ఠి, కృత్తిక, చతుర్థి, ప్రదోషం వంటి రోజులలో... రోజుకి ఒకసారి భోజనం, ఒకసారి ఫలహారం మాత్రమే భుజించాలి. ఆదివారం నాడు సూర్యాస్తమయం అయిన తర్వాత, ఎటువంటి భోజనం తీసుకోరాదు. రాత్రి పూట పెరుగు తినరాదు. రాత్రి పూట పెరుగుని మజ్జిగలా చేసుకుని త్రాగవచ్చు. అలాగే మధ్యాహ్నం పూట పాలు త్రాగరాదు. ప్రతీ పక్షానికి (పదిహేను రోజులకి ఒకసారి), ఒక రోజు సంపూర్ణ ఉపవాసం ఉండాలి, అనగా ఏకాదశి తిథులలో అన్నమాట".

** ఇక్కడ 'నా' అంటే శ్రీశ్రీశ్రీ పరమాచార్య స్వామి వారు అని గమనించగలరు.

పరాయి సొత్తు


పూర్వం కాంచననగరాన్ని పురుషోత్తముడు పాలించేరోజులలో ఆయనకి రాత్రి పన్నెండు గంటలకు నిద్రపట్టక తన అంత:పురములో పచార్లు చేస్తున్నాడు. ఆయనకి కోశాగారం నుండి వెలుతురు కనిపించింది. చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే సేవకులను ఆజ్ఞాపించి కోశాగారం వైపు బయలుదేరారు. అక్కడికి వెళ్ళి చూడగా కోశాధికారి కూర్చుని లెక్కలు చూచుకుంటూ కన్పించారు. రాజుగారు "ఈ వేళప్పుడేంచేస్తున్నారు." అన్నారు. "లెఖ్ఖచూచుకుంటున్నాను" " ఈ అర్ధరాత్రి కూర్చుని చెయ్యవలసిన పనియేముంది? ఏం ఎమయినా లెఖ్ఖ తక్కువైనదా లేక ఎక్కువయినాదా? అనడిగాడు రాజు. "ఎక్కువయింది ప్రభూ!" అన్నాడు కోశాధికారి. "అవునా! మంచిదే! ఎక్కువయితే రేపు చూడవచ్చు ఎలాగెక్కువయిందో" అని రాజుగారంటే, కోశాధికారి " లేదు ప్రభూ! ఎవరైనా ఒక పేదవాడి డబ్బు పొరపాటుతో వచ్చి మన ధనముతో వచ్చి చేరిందేమో! అలాగయితే ఆ పేదవాడి "ఆక్రందన" మన ఖజానానే కాదు ! మన రాజ్యాన్ని కూడా భస్మం చేస్తుంది. అందుకే మొదటనే లెఖ్ఖ చూసి మనం ఆ పేదవాడి డబ్బు తీసి ప్రక్కకు జమ చేయాలి". అన్నాడు కోశాధికారి.
ఆ మాటలకు రాజుగారు ముగ్ధుడై తనుకూడా కోశాధికారితో కుర్చుని లెఖ్ఖ చూసి పేదవాడి డబ్బు పేదవాడికి జమ కట్టారు.
మరునాడు రాజు పురుషోత్తముడు సభ చేసి రాత్రి జరిగినదంతా వివరించి , పేదవాడిని పిలిపించి వాని సొమ్మును వానికి ఇచ్చివేసి, కోశాదికారిని తన కంఠహారం తీసి అలంకరించబోయాడు. రాజు గారి సత్కారాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, "ప్రభూ! మీరు ధర్మంగా పరిపాలిస్తున్నారు కాన, మీ సేవకులమైన మేము కూడా ఆ ధర్మాన్ని పాలిస్తున్నాము. ఈ ఘనత తమదే ప్రభూ!" అంటూ తిరిగి ఆ హారాన్ని తన ప్రభువు మెడలో అలంకరించాడు. సభ కోశాధికారి చేసిన పని సమర్ధిస్తూ, హర్షద్వానాలు చేసింది.

Sunday, 12 July 2015

ఆశ్రయ పరిత్యాగ దోషం


శ్రీ స్కాంద పురాణము లోని కథ
ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి విష్ణు అవతారమైన వామన మూర్తి తోసహా లక్షీకటాక్షం కొఱకు తీర్థయాత్రలకు బయలుదేరారు. అట్టి మహనీయులు దర్శింప కోరిన పుణ్యక్షేత్రాలు తీర్థాలు ఉన్న మన భారతదేశం ధన్యమ్. అట్టి అమ్మ కడుపున పుట్టిన మనమూ ధన్యులమ్.
మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు. ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది. ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది. అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు. చిలుక ఇలా బదులిచ్చింది
“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.
ఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”. అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.
చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయుతే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది. దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు. ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.
తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.
భగవత్ బంధువుల్లారా!
ఈ కథలోని నీతిని మరొక్కమాఱు చూద్దాం:
మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని (దేశాన్ని) ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది. అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.

Saturday, 11 July 2015

నారదముని వైకుంఠయాత్ర


ఒకసారి నారదముని భూలోకములో తన పని ముగించుకుని వైకుంఠములో శ్రీవిష్ణుమూర్తి దర్శనార్ధము బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆయనకు ఓ యోగి కనబడ్డాడు. ఆ యోగి ఎంతోనియమనిష్టలతో సాధనలో నిమగ్నమైయున్నట్లు కనబడ్డాడు. నారదమునిని చూడగానే ఆ తేజోమయుడెవరో తెలుసుకోవాలని ఆ యోగి "మీరెవరూ? ఎక్కడనుండి ఎక్కడకు వెడుతున్నారు " అని ప్రశ్నించాడు. అందుకు నారదముని "నేను నారదమునిని. భూలోకమునుండి వైకుంఠములో నున్న భగవంతుని దర్శనార్ధము వెడుతున్నాను." అని చెప్పాడు. అందుకు ఆ యోగి సంతోషించి, "స్వామీ! అయితే నాకు ఈ జననమరణ చక్రమునుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో కనుక్కుని రండి" నారదముని "అలాగే" నని ఆయన దగ్గరనుండి పయనైపోయాడు. దారిలో నారదముని ఒక చర్మకారుడు తారసపడ్డాడు. అతను నారదమునిని చూచి "మీరెవరూ? ఎక్కడనుండి ఎక్కడకు వెడుతున్నారు " అని ప్రశ్నించాడు. అందుకు నారదముని "నేను నారదమునిని. భూలోకమునుండి వైకుంఠము భగవంతుని దర్శనార్ధము వెడుతున్నాను." అని చెప్పాడు. అందుకు ఆ చర్మకారుడు సంతోషించి "స్వామీ! అయితే నాకు ఈ జననమరణ చక్రమునుండి ఎప్పుడు విముక్తి లభిస్తుందో కనుక్కుని రండి" నారదముని "అలాగే" నని వైకుంఠము చేరుకున్నాడు. వైకుంఠములొ నారదముని భగవంతుని సేవించుకుని తిరిగి బయలుదేరి వెడుతూ " స్వామీ! ఆ యోగికి, ఆ చర్మకారునికి మోక్షము ఎప్పుడు లభిస్తుందో చెప్పండి. నేను తిరుగుప్రయాణంలో వారికి తెలియచేయాలి" అని ప్రార్ధించాడు. అందుకు భగవంతుడు "ఆ యోగికి మరో వందజన్మలలో మోక్షము రాగలదు. ఆ చర్మకారునికి మాత్రము ఇదే కడపటి జన్మము. ఈ జన్మ తరువాత ఆతనికి మోక్షము లభించగలదు" అని చెప్పి "మరో మాట. వాళ్ళు నువ్వు నన్ను చూచినప్పుడు నేనేమి చేస్తున్నానో చెప్పు అని ప్రశ్నిస్తారు. అందుకు నీవు "భగవంతుడు చిన్నసూదిలోనుండి ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు" అని చెప్పు నారదా!" అని తనయోగ స్థితిలోకి వెళ్ళిపోయాడు.
నారదముని తన తిరుగుప్రయాణంలో యోగికి "తమకు మరో వందజన్మలలో మోక్షము లభించగలదు అని భగవంతుడు తెలిపినారు" అని చెప్పాడు. అందుకు యోగికి చాలా కోపము వచ్చినది. "మీరు నారదముని అని చెప్పగానే నాకు అనుమానము వచ్చినది. అసలు మీరు వైకుంఠము వెళ్ళారా? భగవంతుని చూచారా? ఇంత నియమనిష్టలతో ఉన్నా నాకు ఇంకా వందజన్మలేమిటీ? చూడబోతే మీరెవరో మోసగాడిలా కానవస్తున్నారు. మీరు భగవంతుని చూచినట్లయితే, అప్పుడాయన ఏమి చేస్తున్నారో చెప్పండి?" అని గద్దించి పలికాడు.
అందుకు నారదముని "భగవంతుడు చిన్నసూదిలోనుండి ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు" అని చెప్పాడు. అందుకాయోగి, " నేను అనుమానించినదే నిజము. ఇది సాధ్యమా? చిన్నసూదిలో ఏనుగు ఎలా దూరుతుంది? నువ్వు నిజముగా భగవంతుని చూడలేదు. నీవు నారదమునివి కావు" అని దుర్భాషలాడాడు.
నారదముని ఆయన దగ్గరనుండి చర్మకారుని దగ్గరకు వెళ్ళాడు. "తమకు ఇదే చివరి జన్మ. ఈ జన్మ తరువాత తమరు భగవంతునిలో ఐక్యము కాగలరు" అని తెలియపరిచాడు. అందులకా చర్మకారుడు ఎంతో సంతోషించి " మీరు భగవంతుని సేవిస్తున్నప్పుడు నా స్వామి ఏమి చేస్తున్నారో తెలుపవలసినది" అని ప్రార్ధించాడు. నారదముని నేను భగవంతుని దర్శిస్తున్నప్పుడు "భగవంతుడు చిన్నసూదిలోనుండి ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నాడు" అని పలికాడు. అప్పుడా చర్మకారుడు దానికి ఎంతో సంతోషించి స్వామిని స్తుతిస్తూ,నృత్యము చేస్తూ, కళ్ళవెంబడి ఆనందభాష్పాలు రాలుస్తూ కిందపడి దొర్లుతూ ఆనందపడసాగడు. నారదముని ఏమీ తెలియనివాడిలా "నాయనా! ఏనుగును సూదిలో దూర్చటము నీకు వింతగా లేదా?" అని అడిగాడు. అందులకా చర్మకారుడు తను నివసిస్తున్న మర్రివృక్షమునీడలోనుండి ఓ మర్రివిత్తనమును చూపిస్తూ, "ఓ నారదమునీ! ఈ మర్రి విత్తనమును చూడండి!. ఈ విత్తనములో అనేకానేకమైన మహా మర్రి వృక్షములను దాచివుంచిన ఆ భగవంతునికి ఎయ్యది అసాధ్యము!. భగవంతుని మహిమలు అత్యద్భుతములు" అని నారదముని పాదాలచెంత వ్రాలాడు.

Thursday, 9 July 2015

గోదావరి ప్రాశస్త్యం


పూర్వం ఒకసారి దక్షిణ భారతదేశంలో 12 సంవత్సరాల తీవ్రమైన కరువు వచ్చింది. ఎక్కడా ఆహారం, నీరు దొరకలేదు. గౌతమ మహర్షి మహాతపశ్శక్తి సంపన్నుడు. ఆయన తన తపస్సుతో సూర్యుడిని, గాయత్రిమాతను మెప్పించి చెల్లిన వెంటనే మొలకెత్తి పంటనిచ్చే విత్తనాలు వరంగా పొందాడు. ఆ విత్తనాలతో తన ఆశ్రమాన్ని ఆస్రయించిన వారందరికి భోజానాదులు ఏర్పాటు చేశాడు. మామూలు ప్రజలు, ఋషులు, మునులు కూడా ఆశ్రయం పొందారు. ఇంతగొప్ప పని చేస్తున్న గౌతమున్ని చూసి కొందరు ఋషులకు అసూయ కలిగింది. ఇదిలా ఉండగా, దక్షిణభారతదేశపు క్షామం తీరలంటే అది గౌతముని వల్లనే సాధ్యమవుతుందని, గౌతముడు శివుడిని మెప్పించి గంగను తీసుకురాగలడని గ్రహించాడు.
అప్పుడు ‪‎గణపతి‬ తన శక్తి అయిన జయను వెంటబెట్టుకుని, తాను బ్రాహ్మణరూపాన్ని ధరించి, జయను మాయాగోవుగా మార్చి, గౌతమమహర్షి ఆశ్రమంలో పంటలపై వదిలాడు. ఆ గోవు మొత్తం పంటను మేయసాగింది. ఇది గమనించిన గౌతముడు గోవును కొట్టడం తప్పని, చిన్న ధర్భపుల్లను తీసుకుని దాన్ని అదిలించాడు. అది మాయాగోవు కనుక ఆ ధర్భపుల్ల తగలగానే మరణించింది. బ్రాహ్మణరూపంలో ఉన్న గణపతి వెంటనే 'గో హత్య! గో హత్య!' అని అరిచాడు. సమీపంలో ఉన్న వారందరూ పరుగుపరుగున వచ్చి, గోహత్యాపాతకం చుట్టుకున్న గౌతమునితో తాము ఉండలేమని, ఆయన పెట్టే భోజనం తినలేమని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోతున్నామని చెప్తారు. అప్పటికే గౌతముని మీద అసూయతో ఉన్న ఋషులు గౌతముని తలోమాట అంటారు. కొందరు రాళ్ళతో కొడతారు. అయినా గౌతముడు వారిని బ్రతిమిలాడి, చేసిన పాతకం నుంచి బయటపడే మార్గం చూపించమని వేడుకుంటాడు.
అదే అవకాశమని భావించి బ్రాహ్మణరూపంలో ఉన్న గణపతి శివుని జటాజూటంలో ఉన్న గంగను తచ్చి, చచ్చిపడిన ఈ గోవు శరీరంపై నుంచి ప్రవహింపజేస్తే పాతకం నశిస్తుందని చెప్తాడు. అప్పుడు గౌతమ మహర్షి బ్రహ్మగిరి వెళ్ళి పరమశివుని గూర్చి తపస్సు చేస్తాడు. శివుడు కరుణించి ఒకనాడు తన జటాజూటంలో బంధించిన గంగలో నుంచి ఒక ధారను విడుస్తాడు. అదేకాక అక్కడ తాను త్ర్యంబకేశ్వరుడిగా వెలుస్తాడు. అక్కడ తీర్ధంలో ఉద్భవించిన గంగ గౌతమమహర్షితో కలిసి ప్రయాణం చేసి, పాపికొండలను చీల్చుకుని, గోమృత కళేబరం మీది నుంచి పారుతుంది. ఆ కారణంగా ఆ ప్రదేశానికి గోష్పాద క్షేత్రం అనే పెరు వచ్చింది. కాలక్రమంలో అది గోవూరుగా మారి ఇప్పుడు కొవ్వూరు అయింది. ఇప్పటికి ఆ ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డున ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి, కొవ్వూరుకు మధ్యనే గోదావరి ప్రవహిస్తుంది. గోదావరి‬ కూడా గంగ‬ తో సమానమైంది. అందువల్ల దీనికి దక్షిణగంగా అని పేరు. గౌతముడు కారణంగా వచ్చింది కనుక గౌతమీ అని, గోవు కోసం వచ్చింది కనుక గోదావరి అని పేరు. అటువంటి పవిత్రగోదావరిని భువికి తీసుకువచ్చిన గౌతమమహర్షి‬ విగ్రహాలు గోదావరీ తీరమంతటా ఉండాలి.

ప్రతిరోజూ ఈ నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని ఉదయాన్నే పఠిస్తే గ్రహపీడ తొలగి, కార్యసిద్ధి కలుగుతుంది.


రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

Wednesday, 8 July 2015

కెసెట్స్ పెట్టి రుద్ర మంత్రాలతొ అభిషెకం పూజలు చేయవచ్చా ?

గత్యంతరం లేనప్పుడు చేసుకుంటున్నారు. కానీ వాటిలో ప్రవీణుడై అనుష్ఠానపరుడైన విప్రుని బ్రహ్మస్థానంలో ఉంచి, అభిషేక, అర్చనాదులను ఆచరించడం సంప్రదాయం.

ఒక చెట్టును ఫోటోతీసి ఇంట్లో ఉంచుకొని, అందులోంచి చెట్టు ప్రయోజనాల్ని పొందడం ఎలాంటిదో - రికార్డు చేసిన మంత్రాలద్వారా అనుష్ఠానం, అర్చనాదులు చేయడం అలాంటిదే. అందులోంచి ప్రాణశక్తిని పొందలేం.

నేర్చుకోవడానికి, లేదా విని అనుభూతిని పొందడానికి ఈ కేసెట్స్ పనికిరావచ్చు. అంతేగానీ వ్రతాలు, అభిషేకాలు చేయడానికి మాత్రం పనికిరావనే చెప్పాలి.

వ్రతాది యజ్ఞ (ఆరాధనా) కార్యాలలో బ్రహ్మను (విప్రుని) ఉచిత స్థానంలో ఆసీనుని చేయాలి. యజ్ఞాలో ’ఋత్విగ్వరణం’ ఇదే. అలాగే పూజాదులను స్వయంగా అనుష్ఠించలేనప్పుడు, బ్రహ్మస్థానంలో ఒకరిని నియమితుని చేసి వారు మంత్రోచ్చారణ చేస్తుంటే వీరు ఆచరిస్తుంటారు

Tuesday, 7 July 2015

నదీస్నానం

నదీస్నానం‬ ఎలా చేయాలి? త్వరలో పుష్కరాలు జరుపుకుంటున్నాము. అదికాక ఎప్పుడూ ఏదో ఒక తీర్ధయాత్ర చేస్తుంటారు. అసలు నదిలో ఏట్లా స్నానం చేస్తే ఫలితం ఉంటుంది?
నీటికున్న అమోఘమైన శక్తి గురించి మొదట గుర్తించింది ఋషులే. ఋషులు ద్రష్టలు. మాములు వ్యక్తులకు ఇంద్రియగోచరం కానీ విషయాలు కూడా ఋషులకు కనిపిస్తాయి. అటువంటి ఋషుల కారణంగా మనకు ఈ సనాతనసంస్కృతి అందింది. ఈ విశ్వంలో మానవులు, జంతువులు, చెట్లు, పక్షి, క్రిమికీటకలే కాక, అనేకమంది ఇతరులు జీవిస్తున్నారు. వారి కర్మఫలాన్ని అనుసరించి వారి జన్మ ఉంటుంది, మన కంటికి కనపడేది ఈ ఒక్క లోకం మాత్రమే. కానీ ఇది కాక ఇంకా అనేకలోకాలు ఉన్నాయి. వాటిలో దివ్యశరీరాలతో అనేకమంది దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు, సిద్ధులు నివసిస్తూ ఉంటారు. వారూ మానవులు పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వారిని ఉద్దేశించే మానవులు వివిధరకాల వైదిక కర్మలు ఆచరిస్తారు. అట్లాగే ప్రతినదికి ఒక అధిష్టానదేవత ఉంటుంది. ఆమె అందరికి త్రాగడానికి, పంటలు పండిచుకోవుటకు నీరు ఇస్తోంది. నేలను సస్యశ్యామలం చేస్తోంది, వనాలను రక్షిస్తోంది. అక్కడితో ఆగిపోకుండా ఒక్క మునకతోనే మునిగినవానికి అనుగ్రహం ప్రసరిస్తోంది, పుణ్యం ఇస్తోంది, రోగక్షయం చేస్తోంది. అందుకే నదీమతల్లిగా, అమ్మగా ఋషులు నదులను కీర్తించారు. కానీ ఆమె అనుగ్రహం పొందాలంటే నదిలో స్నానం చేయటానికి ఒక విధానం ఉంది.
నదిలో స్నానం చేసే ముందు నదీమతల్లికి మనస్పూర్తిగా నమస్కారం చేయాలి. పాపాలను, దోషాలను, రోగాలను తొలగించి శుభములను ఇస్తున్న అమ్మకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
నదీస్నానం ఎప్పుడు చేసినా ముందు ‪#‎సంకల్పం‬ చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే పుణ్యస్నాన ఫలితం ఉండదు. అది ఇంట్లో చేసిన స్నానంతో సమానమే. నదీస్నానమే కాదు, తటాక, సముద్రస్నానమైన అంతే.
నదీస్నానం చేసేముందు ఒడ్డున ఉన్న కొంత మట్టి తీసుకుని నదిలో వేయాలి. చిటికెడైనా వేయాలి. అదే పుష్కరిణి, తటాకం, చెరువులో స్నానం చేస్తున్నట్లైతే చెరువులో ఉన్న మట్టి కొంచం తీసి ఒడ్డున వేయాలి. సముద్రస్నాన సమయంలో సముద్రంలోకి ఒక చిన్న రాయి విసరాలి. ఇది తప్పక చేయవలసిన విధి.
ఇది చేసే సమయంలో ఈ క్రింది శ్లోకం చెప్పాలి.
పిప్ప్లాదాత్ సముత్పన్నే కృత్యేలోకే భయంకరి |
పాషాణం తే మయాదత్తం అహారార్ధం ప్రకల్పయ ||
నదిలో స్నానం చేసేముందు ఇంట్లో తప్పనిసరిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, అప్పుడు నదీతీరానికి వెళ్ళాలి. ముందు స్నానం చేయకుండా నేరుగా వెళ్ళి నదిలో మునగకూడదు. నదిలో ఒళ్ళు రుద్దుకోవటం, ఉమ్మివేయటం, మలమూత్ర విసర్జనలు చేయటం నిషిద్ధం. నదీస్నానం అంటే నదిలో కేవలం 3 సార్లు మునకవేయటం మాత్రమే. అంతకుమించి అక్కడ సబ్బు రుద్ధుకోవటం, షాంపూలు వాడటం చేయకూడదు. అలా చేయడం నదీమతల్లికి చేసే అపచారం, పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది.
నదిలో స్నానం చేయటానికి కూడా ఉతికిన వస్త్రాలే ధరించాలి. స్నానం కోసం ధరించే వస్త్రాలకు తప్పినిసరిగా అంచు ఉండాలి. మగవారైతే పంచకట్టుకుని చేయాలి. ప్యాంటు, షర్టు వేసుకుని చేయకూడదు. వస్త్రాన్ని అనేకమార్లు కత్తిరించి కుట్టగా ప్యాంటు, షర్టు తయారైతాయి. శాస్త్రం ప్రకారం అవి చినిగిన వస్త్రాలతో సమానం. చినిగిన వస్త్రాలు ధరిస్తే దరిద్రం పడుతుంది. శాస్త్రం ప్రకారం చినిగిన వస్త్రాలు ధరించి పూజచేయటం అపచారం, అది కూడదు. ఎప్పుడూ పంచెకట్టుకునే అవకాశం లేకపోయినా కనీసం శుభకార్యాలు, దేవలయసందర్శన, పుణ్యస్నానం, పూజ సమయంలోనైన సంప్రదాయ దుస్తులు ధరించాలి. స్త్రీలు కూడా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. అలా ధరించేందుకు డబ్బు సరిపోని పేదవారైతే, వారికి ఉన్నదాంట్లో మంచి వస్త్రాలు కట్టుకుని స్నానం చేయాలి.
పురుషులు నదిప్రవాహానికి ఎదురుగాను, స్త్రీలు నదిప్రవాహం వెళుతున్న దిశగా నిల్చుని స్నానం చేయాలి. తల కూడా మునిగేట్లుగా 3 సార్లు మునకవేయాలి. ముందు ఊపిరి తీసుకుని, బొటను వేలుతో ముక్కురంధ్రాలను, మధ్యవేలుతో చెవి రంధ్రాలను మూసి, కన్నులు, నోరు మూసుకుని స్నానం చేయాలి. లేదంటే ముక్కు, చెవి రంధ్రాల ద్వారా నీరు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది.
నది ఆభిర్భావప్రదేశం నుంచి సాగరసంగమం వరకు ప్రతి చోటా దేవలయాలు, దివ్యధామాలు, ఆశ్రమాలు నెలకొని ఉంటాయి. వాటి నుంచి వచ్చే ‪#‎వేదమంత్రఘోషను‬ నదీజలాలు గ్రహిస్తాయి. నదిలో పూర్తిగా మునిగి స్నానం చేస్తే, ఆ దివ్యమంత్రశక్తి శరీరానికి, మనసుకు పట్టుకుని, రక్షణకవచం వలె పనిచేస్తుంది. సూర్యుడికి అర్ఘ్యప్రధానం చేయాలి. నదిలో నిల్చుని ఏదైనా మంత్రజపం కూడా చేయవచ్చు, కానీ పుష్కరసమయంలో, రద్దీ ఉన్న సమయంలో కాకుండా నదీతీరం ఖాళీగా ఉన్న సమయంలో ఇలా చేయడం ఉత్తమం. లేకపోతే అందరిని ఆపి ఇబ్బంది పెట్టినందుకు పాపం వస్తుంది. సాధ్యమైనత త్వరగా పుష్కరస్నానం ముగించుకుని బయటకు రావడం ఉత్తమం.
స్నానం ముగించిన తర్వాత ఒడ్డుకు వచ్చి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పుణ్యస్నానం చేశాక తడి బట్టలను నదిలో పిండకూడదు. అది కేవలం అశుభం జరిగినప్పుడు మాత్రమే చేస్తారు. అట్లాగే నదిలో బట్టలు ఉతకడం, జాడించడం లాంటి పనులు అసలే చేయరాదు. నది పవిత్రతకు భంగం కలిగించకుండా జాగ్రత్తపడాలి. వీలుంటే స్నానానంతరం గట్టు మీద, లేక ఒడ్డున కూర్చుని స్తోత్ర పారాయణ చేయడం, జపం చేయడం చేయాలి. నదీతీరాలు ఋషులు నడిచిన దివ్యప్రదేశాలు.
చాలామంది నదీతీరంలో దీపాలు వెలిగిస్తుంటారు, పూజలు చేస్తారు, దానాలు చేస్తారు. (నదిలో దీపాలు కార్తీకమాసంలోనే వదులుతారు.) అంతవరకు బాగానే ఉన్నా, వీటి కోసం తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తంతా నదిలోకానీ, నదితీరంలో కానీ పడేస్తారు. అరరే! ఇప్పుడే స్నానం చేశాను కదా, ఈవిడ నదీమతల్లి కదా, నాకు ఆశీర్వాదం ఇచ్చింది కదా అనే ఆలోచన అస్సలు ఉండదు. అలా నదిలో చెత్త విసిరేస్తే స్నానఫలితం వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? నదీతీరం పవిత్ర ప్రదేశం. అక్కడ చెత్త వేయరాదు. దగ్గరలో చెత్తబుట్ట ఉంటే, అందులో వేయండి, లేదా చెత్త మొత్తం ఒక కవర్లో పెట్టి, మీ దగ్గరే పెట్టుకోండి. ఇంటికి వచ్చాకో, లేదా ఇంకెక్కడైనా చెత్తబుట్ట కనిపిస్తే, అక్కడ పడేయండి. ఇష్టంవచ్చినట్లు నదిలో చెత్త వేస్తే, పుణ్యం రాదు, అసలు స్నానం ఫలితం కూడా రాదు, పాపం వస్తుందని గ్రహించండి.
అవకాశం ఉంటే పూలు, గాజులు, పసుపుకుంకుమలతో నదీమతల్లలకు తాబులం సమర్పించడం చాలా మంచిది, కానీ చీరలు, జాకెట్ పీసులు నదిలో వదలకుండా, అక్కడే స్నానం కోసం వచ్చిన సువాసినికి ఇస్తే, నదీమతల్లి ఆనందిస్తుంది. అలా చేస్తే జలగండాల నుంచి నదీమతల్లి రక్షిస్తుంది. అంటురోగాలు రాకుండా ఉంటాయి.
#నదీస్నానం శ్రద్ధను, మేధస్సును, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, పుణ్యాన్ని, శుభాలను, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. కేవలం మునక చేతనే చర్మరోగాలు, ధీరకాలిక వ్యాధులు నయమైన వారు ఎందరో ఉన్నారు. నదులకు శక్తి ఉంది, అధిదేవతలూ ఉన్నారు. శాస్త్రం చెప్పిన రీతిలో నదీస్నానం చేసే ఫలితాలు అనుభవంలో తెలుస్తాయి. నదీమతల్లుల పవిత్రతను కాపాడండి. నదులను కలుషితం కానివ్వకండి. అన్నిటికంటే ముందు నదుల్లో కూడా ప్రాణం ఉందని గుర్తించండి.

శేన్బక్కమ్

మనకి దక్షిణ దేశంలో ఒక క్షేత్రం ఉన్నది శేన్బక్కమ్ అని. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు త్రిపురాసురసంహారానికి బయలుదేరాడు. రథం కదలలేదు. ఎందుకు కదలలేదు అని ఆశ్చర్యపోయాడు. విఘ్నేశ్వర పూజ చేయలేదు అన్నారు. పరమశివుడంతటి వాడు విఘ్నేశ్వర పూజ చేశాడు. చేశాక రథం కదిలింది. చిత్తూరు దగ్గరలో షేన్బక్కమ్ అని ఊరు ఉంది. ఒకప్పుడు మహారాష్ట్రకు చెందిన మంత్రిగారు ఒకాయన రథంలో వెళ్ళిపోతున్నాడు. ప్రదోషవేళ కొంచెం చీకటిపడింది. రథచక్రానికి ఏదో తగిలి విరిగిపోయింది అని ఆయన రథం దిగాడు. రథచక్రం నెత్తుటితో తడిసిపోయి ఉన్నాయి. ఆయన హడలిపోయి ఇదేమిటి ఇంత పెద్ద నెత్తుటి ప్రవాహం వచ్చింది అని చెప్పి దీపాలు తెప్పించి జాగ్రత్తగా చూశాడు. చూస్తే భూమిలోనుంచి ఒక తలలాంటిది పైకి వచ్చింది. దానికి దెబ్బ తగిలింది. ఆయన మనస్సు చిన్నబుచ్చుకొని రేపు ప్రొద్దున ప్రయాణం చేద్దామని గుడారం వేయించుకొని పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు స్వప్నంలో దర్శనమిచ్చాడు. "ఈ క్షేత్త్రంలో అష్టగణపతి స్వరూపంగా ఉన్నాను. ఎనమండుగురు వినాయకులుగా ఉన్నాను. ఇవ్వాళ నీ రథ చక్రం వెళ్ళడానికి ముందు వర్షం పడింది. తల మొన పైకొచ్చింది. నీయొక్క రథచక్రం తగలడం చేత నా శిరస్సు భిన్నమైంది. కాబట్టి నీరథం ఆగిపోయింది. రేపటిరోజున సూర్యరశ్మి పడడానికి ప్రతిబంధకం లేని రీతిలో దేవాలయ నిర్మాణం ప్రారంభం చేసి తరువాత వెళ్ళు." అన్నాడు. ఆయన మరునాడు భూమినంతటినీ జాగ్రత్తగా మట్టితీయించి చూశాడు. అష్టవినాయక స్వరూపాలు భూమిలోనుంచి పైకి వచ్చి ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ పైన అంతా ఇనుప ఊచలతో ఉంటుంది. వర్షం పడితే తిన్నగా వచ్చి మూర్తుల మీద పడిపోతుంది. ఎనమండుగురు మూర్తులకీ కూడా పూజ చేస్తారు. ఎంత క్లేశంలో ఉన్నవాళ్ళూ కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అ కష్టంనుంచి వినిర్ముక్తులౌతూంటారు. చిత్తూరు దాటి జ్వరహరేశ్వర క్షేత్రం అని ఉంది. అది దాటి వెళుతూంటే కనపడుతుంది. అంతగొప్ప క్షేత్రం. కర్తవ్యంలో మినహాయింపులుండవు ఆయనకి.
తమిళదేశంలో ఇప్పటికీ ఒక ఆచారం ఉంది. ఎవరికైనా ఆ రోజు తలపగిలిపోవలసి ఉంది అనుకోండి అటువంటి వాడి తలపగిలిపోకుండా పెద్ద దెబ్బ తగిలికూడా వాడు బ్రతికి ఉండాలి అంటే వాడు అంతకుముందు విఘ్నేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి ఉంటే వదిలిపెట్టేస్తాడు.
కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి అపర విఘ్నేశ్వర స్వరూపులు, ఆయనకి గణపతి పిలిస్తే పలికేవారు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారికి. ఒకానొకప్పుడు ఈ క్షేత్రం దగ్గర మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతున్నారు ముందు. వెనక జయేంద్రసరస్వతీ స్వామి వారు ఏనుగుమీద వెళ్తున్నారు. మహాస్వామి వేగంగా నడుస్తూ ఇంచుమించు ఒక మైలు దూరం ముందుకు వెళ్ళిపోయారు. అకస్మాత్తుగా ఏనుగుకి పిచ్చెక్కినట్లు అయిపోయి పైనుంచి జయేంద్రసరస్వతీ స్వామి వారు క్రిందపడిపోతారేమోనని పరివారమందరూ భయపడ్డారు. పరుగుపరుగున పరివారమంతా మహాస్వామి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పారు. మహాస్వామి వారు వెంటనే కళ్ళుమూసుకొని ధ్యానంలోకి వెళ్ళారు ఎందుకలా జరిగింది అని. కళ్ళు తెరిచి అన్నారు -"కొద్ది దూరంలో శేన్బక్కం క్షేత్రం ఉంది. దానిని విడిచిపెట్టి నేను ముందుకు వచ్చేశాను. వెనక చిన్నస్వామి కూడా విచ్చేశారు. అందుకే విఘ్నేశ్వరుడు ఆ ఏనుగుకి భ్రాంతి కలిగేటట్లు చేశాడు. వెంటనే వెళ్ళి 108 కొబ్బరికాయలు కొట్టండి" అన్నారు. మనం సాధారణంగా కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తాం. ద్రవిడ దేశంలో ఒక ఆచారం ఉంది. విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ పీచు తీసేసి నేలకేసి కొట్టేస్తారు. రెండు ముక్కలకన్నా ఎక్కువ ముక్కలవ్వాలి. అలా అయ్యి పిల్లలు కానీ దానిని తీసుకుంటే పీడాపరిహారం. విఘ్నేశ్వరుడొక్కడే ఒకప్పుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు. అవమాన భారంతో ఇక పదిమందితో తిరగలేడు; తల చిట్లిందా ప్రాణములు నిర్గమిస్తాయి. అటువంటి వాడిని కొబ్బరికాయ చిట్లడం చేత మళ్ళీ ఆయుర్దాయం ఇచ్చి బ్రతికించేస్తాడాయన. ఒక కొబ్బరికాయకు ఒక తలకాయ నిలబెడతాడు. అంతటి అనుగ్రహశీలి

ఖ్యాతి

ఖ్యాతి, భృగువు భార్య. ఆమె యందు భృగువు ఇద్దరు పుత్రులనుకన్నాడు. వారు పేర్లు ధాత, విధాత. వారి పుత్రులు ప్రాణుడు, మృకండుడు.
ఈ ఇద్దరికీ జన్మించిన పుత్రసంతానం ఇలా వుంది....ప్రాణుని కొడుకు ద్యుతిమంతుడు. అతడి కుమారుడు అజావంతుడు, అజావంతుని పుత్రుడు వంశుడు. పొతే, మృకండుముని పుత్రుడు మార్కండేయుడు. ఈ మహామునికి జన్మించినవాడు వేదశిరుడు. ఇక్కడికి ఇలా ఉండనీ!
నవబ్రహ్మల్లో ఇంకొకడు మరీచి మహర్షి. ఈ మహర్షికి సంభూతి భార్య. వీరి సంతానం పౌర్ణమాసుడు. ఇతడికే విరజుడు పర్వతుడు అని ఇద్దరు పుత్రులు.
ఇట్లాగే మరొక బ్రహ్మ అంగీరసుడున్నాడు. ఈతని భార్య స్మృతి. సినీవాలి, కుహువు, అనుమతి అనే కన్య వీరి సంతానం.
అత్రి మహర్షి అనే బ్రహ్మకు అనసూయ సతి. మహాసాధ్వి ఈమె. వీరికి సోముడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు జన్మించారు. స్వాయంభువ మన్వంతరంలో ఇతడే అగస్త్యమహర్షి.
పులహునికి క్షమ యందు కర్దముడు, చార్వరీవంతుడు, సహిష్ణువు అని ముగ్గురు పుత్రులు జన్మించారు.
క్రతువునకు సంనతి అనే భార్య వల్ల బొటనవ్రేలి కణుపు ఎంత పరిమాణంలో ఉంటుందో, అంత ప్రమాణంలో వాలభిల్యుడు మొదలైన 60 వేల మంది పుత్రులు కలిగారు.
వసిష్ఠునికి ఊర్జవల్ల ఊర్థ్వబాహుడు, రజుడు, అనఘుడు, గోత్రుడు, సవనుడు, సుతపుడు, శుక్రుడు జన్మించారు. వీరు ఉత్తమ మనువుకాలంలో సప్తర్షులు.
బ్రహ్మ పెద్దకొడుకు వహ్నికి, స్వాహావల్ల గొప్ప ఓజస్సంపన్నులైన ముగ్గురు పుత్రులు కలిగారు. వీరే శుచి, పావకుడు, పవమానుడు. వీరికి తిరిగి జన్మించిన సంతానం 45 మందికి, ఈ వహ్ని మొదలగు అగ్నులు కలిసి మొత్తం 49 మంది అగ్నులుగా సుప్రసిద్ధులు.
బ్రహ్మవల్ల సృజింపబడిన అగ్నిష్వాత్‌, బార్హిషద్‌, అనగ్న, సాగ్నాది సంతతి తెలిసింది కదా! స్వధాదేవికి పితృదేవుని వల్ల పితృగణాలు, మేన - వైతరణి అనే యిద్దరు బ్రహ్మవాదినులైన కన్యలు కలిగారు. సర్వశుభలక్షణలు, గొప్పజ్ఞానవంతురాళ్లు. దక్షకన్యల గురించిన సంగతులన్నీ విన్నావు కదా! ఈ వైనం శ్రద్ధగా స్మరించిన వారికి సంతానహీనత కలుగదు" అని చెప్పాడు "పరాశరుడు"

హర హర, ఎన్ని పాపాలు చేసినా హరించుకుపోయాయి ఆ నామం వల్ల...




ఇంద్రసేనుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పంచమహాపాతకాలు మూటకట్టుకున్నాడు. ఇంకొక పనిలేదు. ఎప్పుడూ మాట్లడనివి రెండు మాటలే – ఆహర, ప్రహరస్వ. ఆహర – ఎత్తుకురండి, ఆయనకంటికి ఏది కనపడితే అది ఎత్తుకురండి అనేవాడు. ప్రహరస్వ – కొట్టండి. బ్రతికున్నన్నాళ్ళూ ఆ రెండు మాటలే అన్నాడు. ఎవడైనా కాలధర్మం చెందాలిగా. ఒకానొకనాడు శరీరం జర్జరీభూతం అయిపోయింది, పడిపోయాడు. యమధర్మరాజుగారి భటులు వచ్చారు. యమలోకానికి తీసుకు వెళ్ళిపోతున్నారు. యమధర్మరాజు “అరెరె మహాపుణ్యాత్ముడురా..వీడిని ఎందుకు తీసుకువచ్చారు?” అన్నాడు. వీడు పుణ్యాత్ముడా? అని ముక్కున వేలేసుకున్నారు. “మీకు తర్వాత చెప్తాను..ముందు తప్పు చేసినందుకు ఆయనకు నమస్కారం చేయండి”. ఈలోగా కైలాసం నుంచి శివకింకరులు వచ్చారు. వాళ్ళకి అప్పజెప్పి పంపించేశారు. ఆయనని కైలాసానికి తీసుకెళ్ళారు. ఆశ్చర్యపోయాడు నన్ను కైలాసానికి తీసుకువచ్చారు పొరబడ్డారా? ఏమిటి? అని. పరమశివుడు ఆయన కనపడగానే గబగబా ఆసనం మీద ప్రక్కకి జరిగి రావోయ్ అని అర్థసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. తెల్లబోయాడు, నన్ను అంత సింహాసనం మీద పరమశివుడు ప్రక్కన కూర్చోబెట్టుకోవడమా? ఎందుకు నన్ను పిలుస్తున్నారు మహాప్రభో? నేను చేసినవన్నీ పాతకాలే. నువ్వు బ్రతికున్నన్నాళ్ళు అన్నమాట ఏమిటి? – ఆహర, ప్రహారస్వ; ఎత్తుకురండి, కొట్టండి.
ఎప్పుడూ హర హర, ఎన్ని పాపాలు చేసినా హరించుకుపోయాయి ఆ నామం వల్ల. తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా అగ్నిహోత్రం కాలుస్తుంది. తెలిసి త్రాగినా తెలియక త్రాగినా విషం ప్రాణం తీస్తుంది. తెలిసి పలికినా తెలియక పలికినా శివనామం పాపాలు తీసేస్తుంది. “హరహర మహాదేవ శంభోశంకర” అన్నారు అందుకే. శివనామం అంత గొప్పది. తెలిసి గానీ, తెలియక గానీ పలికినంత మాత్రం చేత అంతటి అభ్యున్నతిని కల్పించగలదు. శివపరివారం చేయగలదు.
కాబట్టి శంకరుడి పరివారం అంటే నిజానికి ఎంతమందిని అని నేను చెప్పగలను. శివపరివారం కానిదంటూ లోకంలో ఏముంది?
భూరంభాం స్యనలోనిలోంబర మహర్నాధో హిమాంశుః పుమా
నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!!
అన్నీ ఆయనే. కాంచీపురంలో పృథివీ లింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానలింగం. అన్నీ ఆయనే అయినప్పుడు దీనిమీద ఉన్నవారంతా ఆయన పరివారం గాక క్రొత్తగా ఎవరౌతారు? ఇక పర్వతాలు, నదులు, సముద్రాలు అంటారా? ఆయన పర్వత రాజపుత్రి. కాబట్టి మామగారు పర్వతం. దానిమీద ఉండే చెట్లు, ఆ పర్వతాలలో పుట్టిన నదులు, నదులకు భర్తలైనటువంటి సముద్రాలు అల్లుళ్ళు, మహర్షులు, కిన్నెరలు, కింపురుషులు, ఆయన భక్తులు, పరివారము కానివారెవ్వరు? కానీ ఒక దేవాలయాన్ని, ఉపాసనని ప్రమాణంగా చేసుకొని మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఎవరెవరిని స్మరించవలసి వుంటుందో వారిని స్మరించడానికి చేసిన ప్రయత్నం మాత్రమే. “ఏకశ్శబ్దః సమ్యక్ జ్ఞాతః సుష్ట ప్రయుక్తః స్వర్గే లోకే కామదుఃఖ్భవతి!” పరమభక్తితో ఒక్కమాట చెప్పుకున్నా చాలు స్వర్గలోకంనుంచి సమస్త కామ్యములను అది వర్షిస్తుంది. అందులో సందేహం లేదు.

ధృతి

ధృతి అంటే పట్టుదల - నేను చేసి తీరుతాను; పట్టుదల మౌఢ్యము కాకూడదు. భగవంతునియందు భక్తితో ఆయనచేతి ఉపకరణంగా చేయగలనన్న విశ్వాసం అయి ఉండాలి. ఆత్మగౌరవం అన్న పేరుతో అహంకారం కాకూడదు.
దృష్టి అన్నమాటకి అర్థం నైపుణ్యం. ఏ పని ఎలా చేయాలో అలా చేయడం నైపుణ్యం. ఎంతసేపూ దీపం పెట్టనాండీ? దీపంలో వత్తులు ఎన్ని వేయాలండీ? నూనె వేయనాండీ? నెయ్యి వేయనాండీ? తూర్పుకి పెట్టనాండీ? ఉత్తరానికి పెట్టనాండీ? ఎన్నాళ్ళు అడుగుతావు ఆ మాట? ఎన్నాళ్ళు దీపం దగ్గర ఆగిపోతావు జీవితంలో. ఏది ఎందుకు చేస్తున్నావో, అలా చేయడం వల్ల నీకేం కలుగుతోందో తెలుసుకున్న నాడు కర్మ అన్న నిచ్చెన మీద మెట్లు ఎక్కుతావు. ఆ నైపుణ్యం లేనినాడు ఏది చేసినా పుణ్యంకోసమే. సుందరకాండ వింటే నాకు అపారమైన పుణ్యం వచ్చి రాష్ట్రపతిని అయిపోవాలి. పుణ్యం, పుణ్యం, పుణ్యం - ఏం చేస్తావు దానితో? మళ్ళీ పుడుతూండాలి, అనుభవిస్తూండాలి. పరమేశ్వరుడు చాలా చమత్కారి. అనంతమైన పుణ్యం నువ్వు చేసేస్తే అనుభవించడానికి ఒక జన్మనిస్తాడు, చక్రవర్తిని చేస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలివిగో అనుభవించేశావు చక్రవర్తిగా. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" - ఇంత పుణ్యం చేసీ దేవతా పదవిని పొందిన వాడు క్రిందపడిపోతాడు మర్త్యలోకంలోకి. పుణ్యం చేయడం కాదు పుణ్యాన్ని చిత్తశుద్ధికి వాడుకోవడం నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉండడం దృష్టి. దృష్టి ఒక కార్యం చేసేటప్పుడు తనకు కీర్తి వస్తే కీర్తికి కారణాన్ని దృష్టిలో పెట్టుకోవడం

అక్క మహాదేవి

అక్క మహాదేవి ఇప్పటికీ శ్రీశైలం దేవాలయంలోపల కనిపిస్తుంది. స్థల వృక్షమైనటువంటి మద్ది చెట్టు ప్రక్కన ఆ మహాతల్లియొక్క పెద్ద విగ్రహం వుంటుంది. ఆవిడ నగ్నంగా ఉండి ఒళ్ళంతా జుట్టుతో కప్పుకొని ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో శివలింగం పట్టుకొని ఉంటుంది. అక్కమహాదేవి ఒకానొకప్పుడు దక్షిణ దేశంలో ఉండే కర్ణాటక సామ్రాజ్యంలో ఉడుతడి అనే ఒక గ్రామంలో జన్మించింది. మహా సౌందర్యరాశి. మల్లికార్జునుని యొక్కఅనుగ్రహంతో జన్మించింది. తండ్రి పేరు నిర్మల శేఠ్ . తల్లి పేరు సుమతి. ఈమెని పెంచి పెద్ద చేస్తున్నారు. అక్కమ్మ అని పిలిచేవారామెని. ఆవిడ పెద్దది అవుతుంటే ఆవిడయొక్క అందచందాల గురించి విన్నాడు అక్కడ రాజ్యాన్ని పరిపాలించే ప్రభువు. కౌశికుడు అని పేరు ఆయనకి. ఆయన జైనుడు. ఆమె అందచందాల గురించి తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్ళి అక్కమ్మను నేను పెళ్ళి చేసుకుంటాను అన్నాడు. తల్లిదండ్రులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఈమె ఏమో శివభక్తురాలు, ఆయనేమో జైనుడు. శివార్చన లేకపోతే ఈమె బ్రతకలేదు. కాబట్టి మేము పిల్లనివ్వం అన్నారు. పిల్లనివ్వకపోతే మీ అమ్మాయిని, కుటుంబాన్ని కూడా ధ్వంసం చేస్తానన్నాడు. తండ్రి అక్కమాంబ దగ్గరికి వచ్చి "ఇలా అంటున్నాడు ప్రభువు, ఎదిరించలేము" అని. ప్రభువును పిలిపించండి, నేను మాట్లాడతాను అన్నది అక్కమాంబ. ప్రభువు వచ్చాడు. ఆమె బయటికి వచ్చింది. ఆమె అందచందాలు చూసి నిరుత్తరుడైపోయాడు ప్రభువు. ఆమె అన్నది నువ్వు శైవుడవైన నాడు నేను నిన్ను వివాహమాడతాను. నువ్వు శివభక్తి నాకోసం కృతకంగా అనుకరించడం కాదు. శివుడి గొప్పతనాన్ని పండితుల దగ్గర తెలుసుకొని శివభక్తియందు తాదాత్మ్యత పొందు. శివలింగార్చన నువ్వు కూడా చేసుకున్న నాడు నేను వివాహం చేసుకుంటాను. నేను వేరొకరిని వివాహం చేసుకుంటాను అని నీకు అనుమానమైతే నీ అంతఃపురానికే వచ్చి వుంటాను. కానీ ఒక్క నియమం. ఎన్నడూ నువ్వు నా మందిరంలోకి రాకూడదు, నన్ను తాకకూడదు. నా మందిరానికి వచ్చినా, నన్ను తాకినా నేను యథేచ్ఛగా వెళ్ళిపోతాను అన్నది. మహారాజు శివభక్తి తత్పరుడు కాలేదు, శివభక్తి గురించి తెలుసుకోలేదు. జైనుడిగానే ఉండి ఎప్పటికైనా ఆమెని పొందవచ్చని ఊహించాడు. తమకాన్ని నిగ్రహించుకోలేక శివలింగానికి పూజ చేస్తున్న అక్కమాంబ దగ్గరికి వచ్చి ఒక రోజున అకస్మాత్తుగా ఆమెను కౌగిలించుకున్నాడు. దుర్మార్గుడా! నేను నియమం పెట్టినా శివలింగాన్ని ఆరాధన చేస్తూండగా వచ్చి కౌగిలించుకున్నావు కనుక నువ్వు ఏ చేతులతో పట్టుకున్నావో ఆ బట్ట నీముఖం మీద పడేస్తున్నాను అని అమె వివస్త్రయై ఆ బట్ట తీసి ఆయన ముఖాన పడేసి తన కబరీ బంధాన్ని విప్పి ఆ కొప్పు వెంట్రుకల చేత తన శరీరాన్ని కప్పుకుంది. నగ్నంగా ఆమె కనపడేసరికి తన గురువులైనటువంటి జైన మతానికి సంబంధించినటువంటి తీర్థంకరులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళు దిగంబరులుగా ఉంటారు గనుక తన గురువు కనపడి వెంటనే ఆమె పాదముల మీద పడ్డాడు. ఆమె చరచరా బయటికి వెళ్ళిపోయింది.

పునర్జన్మ_ఆత్మ జ్ఞానము_సత్యాన్వేషణ

నువ్వు ఎవరు? కనిపిస్తున్న శరీరమా? ఒక వేలు తెగి ఊడిపోతే, మిగిలిన శరీరమా?ఒక చేయి తెగిపోతే, మిగిలిన శరీరమా? కాళ్లూ చేతులూ కళ్ళూ అన్నీ తెగిపోతే? మిగిలిన శరీరమా? కొంత మంది అవిభక్త కవలలు కలిసి పుట్టినప్పుడు ఒకరికి గుండె ఉండదు, ఒకరి గుండెనే ఇద్దరికీ ఆడుతుంది,. మరి ఆ గుండెలేని మనిషి మిగిలిన శరీరమా నువ్వు?కొంత మందికి BrainDead అయినా బతికే ఉంటారు, ఆ శరీరములో మిగిలిన శరీరమా నువ్వు? ఇంతకీ ఎవరు నువ్వు? శరీరములో ఏ భాగం?
నీ శరీరములో ఏ భాగమూ నువ్వు కాదు.. నీ ఆత్మ నువ్వు,. నీ ఒంటి మీద కట్టుకునే వస్త్రము నీది అని ఎలా అనుకుంటావో అలాగే నీ శరీరము నీ ఆత్మ కి కట్టుకున్న వస్త్రము,. నీ శరీరము కనిపించకుండా కట్టుకునేది నీ వస్త్రము, కనిపించని ఆత్మ అందరికీ కనిపించడానికి దేవుడు కట్టిన వస్త్రము నీ శరీరము...
నీ శరీరము నువ్వు ఆడదానివా మగవాడివా అని చెప్తున్నది,. మరి నీ ఆత్మ ? ఆడదా లేక మగవాడా ? శరీరముకి ఆకారము ఉంటుంది కానీ ఆత్మకి ఆకారము ఉండదు... “ఆత్మ నిరాకరము”.. ఆత్మకి కట్టబడిన ఆడ వస్త్రము ఆడ శరీరము.. ఆత్మకి కట్టబడిన మగ వస్త్రము మగ శరీరము..
కొంత మంది అజ్ఞానులు లేక జ్ఞానము సరిగా పొందనివారు మనిషిలో మాత్రమే ఆత్మ ఉంటుంది అంటారు.. మరి పశువులలో ఏమి ఉంది? అసలు ఆత్మ పొందిన ఒక రకము వస్త్రమే మనిషి శరీరము అయినప్పుడు మరి ఆత్మ పొందే ఇంకొక రకము వస్త్రము పశువు కాదా? తేడా ఏమిటి ? ఆత్మకి కట్టబడిన వస్త్రమే తేడా,. శరీరానికి గుణము ఉంటుంది కానీ ఆత్మకి కాదు..” ఆత్మ నిర్గుణమైనది”.. పొందిన శరీరము బట్టి ఆ ఆత్మ చేయగలిగేది చేస్తుంది, చేయలేనివి చేయవు.. నీ ఆత్మ నా ఆత్మ ఇలా మాట్లాడగలుగుతున్నది, ఇంతలా ఆలోచించగలుగుతున్నది,. మన ఆలోచనలో 70% ఆలోచన చింపాంజీ కూడా ఆలోచించగలదు,. కొన్ని ఆత్మలు నీళ్ళలో ఉండగలవు, కొన్ని ఆత్మలు గాలిలో ఎగరగలవు.. మనము చేసే అన్నీ పనులు అవి చేయలేవు, అలాగే అవి చేసే అన్నీ పనులు మనము చేయలేము,. దానిలో తేడా ఏమి ఉన్నది? ఆత్మలో తేడా లేదు.. ఆత్మకి కట్టబడిన శరీరమనే వస్త్రములో తేడా ఉన్నది.. ఈ శరీరములో ఉన్నంత కాలము మాట్లాడగలవు.. శరీరము విడిచాక మాట్లాడలేవు.. ఇంకొక శరీరము పొందినపుడు ఆ శరీర గుణము చేయగలిగినది చేస్తావు... శరీర గుణము నీ తాత్కాలిక గుణము అవుతుంది.. ప్రతి జీవిలోను ఆత్మ ఉంటుంది.. సరిగ్గా చెప్పాలి అంటే ప్రతి ఆత్మ ఏదో ఒక జీవ రూపము తీసుకుంటుంది..

శరీరానికి రోగములు వచ్చి లేక వయస్సు మీద పడి అనేక వికార వికల్పములు చెందుతున్నది, మరి ఆత్మ? నీ శరీరానికి కట్టుకున్న వస్త్రము పాడు అయితే శరీరము పాడు అవుతుందా?మరి నీ శరీరము పాడు అయితే నీ శరీరమనే వస్త్రము కట్టబడిన నీ ఆత్మ పాడు అవుతుందా? అవదు.. “ ఆత్మ నిర్వికారము - నిర్వికల్పము “ ఆత్మకి వికార వికల్పములు ఉండవు.. మరి నీ శరీరము నువ్వు కానప్పుడు శరీరము పొందే ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? మొట్ట మొదట నీవు పరమాత్మ నించి ఉధ్భవించినావు, అశరీరము గా ఉన్న నీ ఆత్మకి దేవుడు ఒక వస్త్రము కట్టి ఒక శరీరము ఇచ్చాడు,.. కట్టుకున్న వస్త్రము మలినమయినప్పుడు ఎలా విడిచేస్తావో శరీరము పూర్తిగా పాడు అయినప్పుడు నీ శరీరము విడిచి అశరీరము అయినావు.. తరువాత దేవుడు ఇచ్చిన ఇంకొక శరీరము కట్టుకున్నావు... దీని తరువాత ఇంకొక శరీరము పొందుతావు... అలా వికల్పము వికారములు లేని ఆత్మ వికార వికల్పములు చెందే శరీరము తీసుకుంటున్నది...
అదే పునర్జన్మ,. శరీరానికి వయస్సు ఉంటుంది కానీ నీ ఆత్మకి వయస్సు ఉండదు.. ఆత్మ వయస్సు కొన్ని లక్షల ఏళ్ళు.. ఒక కుక్క శరీరము 10 ఏళ్ళు బతుకుతుంది.. ఒక పిల్లి శరీరము 6 ఏళ్ళు బతుకుతుంది, ఒక తాబేలు శరీరము 200 ఏళ్ళైనా బతుకుంటుంది,. ఒక మనిషి శరీరము 100 ఏళ్లు బతకగలదు.. శరీరానికి వయసు కానీ ఆత్మకి కాదు.. పునర్జన్మ లేదు అనుకోని ఆత్మ జ్ఞాన నేత్రాన్ని మూసుకున్న ఓ అవిజ్ఞాని కళ్ళు తెరిచి చూడు.. నీ ఆత్మ ని తెలుసుకో.. నీ ఆత్మ గురించి జ్ఞానము పొందు.. పునర్జన్మ ఉన్నది..

మరి శరీరములు పుడుతున్నవి పోతున్నవి మళ్ళీ పుడుతున్నవి పోతున్నవి,. “మరి ఆత్మ ఎలా పుట్టినది?” పుట్టిన ఆత్మ శరీరములో ఎలా నడుస్తున్నది? అంటే శరీరము ఎలా నడుస్తున్నది.. చివరిదైనా జన్మలో శరీరము పడిపోయాక ఆత్మ ఎలా పోతుంది? నీ సృష్టి చెపుతా విను.. ఆత్మ పరమాత్మ అయిన పరమేశ్వరుడు నించి పుట్టినది.. బ్రహ్మ నీ శరీర సృష్టి చేసి శరీరము ఇస్తాడు,. శరీరము పొందినాకా నీలో జీవుడు పరమేశ్వరుడు ఒక రూపమైన శివుడు నించి పొంది శరీరములో చేరుతుంది.. శరీరము పడిపోయాక జీవుడు శివుడులోకి చేరుతాడు.. ఈ శరీరానికి భవంతుడు పెట్టిన పేరు “చిత్త్ జఢ గ్రంధి”, అంటే కదలిక కలిగించే చైతన్యము, జడముగా పడి ఉండే జీవము కలిసి ఉండేది నీ శరీరము,. నీలో జీవము కదలడానికి శక్తి ఇస్తున్నది శక్తి దేవి.. నీ శరీరముకి అనేక స్థితులు కలిపిస్తున్నది స్థితి కారుడైన నారాయణుడు,. నీ శరీరము నడవాడానికి ఆధారము నీలో పంచ భూతములు.. నీ ఆత్మ ఈ శరీరము వదిలి ఇంకొక శరీరము పొందడానికి ఈ శరీరము లయము చేసే వాడు పరమేశ్వర రూపమైన రుద్రుడు.. నీ ఆత్మకి మళ్ళీ ఇంకొక శరీర సృష్టి ఇచ్చే వాడు బ్రహ్మ.. అలా నీ సృష్టి క్రమము నడచి పునర్జన్మలు పొందుతూ చివరిదైనా నీ చివరి జన్మ అయిపోయాక నీ శరీరము పోయి ఆత్మ మోక్షము పొంది పరమాత్మలో చేరుతుంది...
ఓ జీవి, నీ ఆత్మ జ్ఞానము పొందు.. పునర్జన్మ ఉందని తెలుసుకొని అంగీకరించి నడుచుకో, మంచి ప్రవర్తనతో మళ్ళీ మళ్ళీ వేరే శరీరములు పొందే అవకాశము రాకుండా ఉండేలా సత్ప్రవర్తనతో బతికి మోక్ష మార్గమున పయనించు.. నీవు ఏ దేవుడు కాలు పట్టుకున్నా నీ పునర్జన్మను ఆపలేడు,. కేవలము నీ ప్రవర్తన మాత్రమే సాధించగల్గుతుంది





సర్వం శివమయం జగత్

చరాచర ప్రపంచం అంతా శివమయం. ఈ విశాల విశ్వంలో శివుడు కానిది ఏదీ లేదు. ఈ సమస్త సృష్టి పంచభూతాలతో నిండి వుంది. వాటికి ప్రతీకలుగా పరమేశ్వరుడు కంచిలో పృథ్వీలింగంగా, శ్రీ కాళహస్తిలో వాయులింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, అరుణాచలంలో తేజోలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా - పాంచభౌతిక లింగాకృతిని ధరించి, నిరంతరం పూజింపబడుతున్నాడు. మనం పరమశివుని లింగాకృతిలో పూజిస్తాం. అనంతము, అజరామరమూ, గుణత్రయాత్మకమూ అయిన మూలప్రకృతే లింగము. అదే సృష్టి, స్థితి, లయకారకుడైన ఈశ్వరుడు. శివలింగం సర్వదేవాత్మకమైనది. నిత్యామూ శివలింగాన్ని పూజించే వారికి మోక్షం ప్రాప్తిస్తుందని ఆగమసూత్రాలు చెబుతున్నాయి.

సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం


సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం. ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.
సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.

Monday, 6 July 2015

శ్రీ మహాలసా దేవస్థానం

సురాసురులు సాగర మథనం గావించినపుడు ముందు హాలాహలం ఉద్భవించగా దేవతలందరూ శంకరుని వేడుకొనగా అమ్మవారి అనుజ్ఞనొంది సాంబశివుడు ఆ గరళమును మ్రింగి తన కంఠమునందు ఇమిడ్చి నీలకంఠుడు అయ్యాడు. అమృతం ఆవిర్భవించగా విష్ణుమూర్తి రాక్షసులను మోసగింప ‘మోహినీ’ రూపమునొంది దేవతలకు అమృతమును ఇచ్చి అసురులకు జలము మాత్రము నిచ్చి యున్నాడు.
ఆ మోహినీ అవతారమును ‘మహాలసా’ అమ్మ వారుగానూ ‘మహాలసా నారాయణి’ గాను గోవా, మహారాష్ట్ర, కన్నడ రాష్ట్రాల వారు కొలుస్తారు. క్షత్రియులు, కొన్ని వర్గాల బ్రాహ్మణులు ‘కులదేవి’గా కొలుస్తారు.
గోవా ‘సష్ఠి’నందు ‘క్రైస్తవ మతము నాచరింపుమని ఉధృత పరిస్థితి నెలకొన్న సమయమున అక్కడ ప్రతిష్ఠించబడి యున్న మహాలసా అమ్మవారి విగ్రహాన్ని విధ్వంసం కాకుండా తరలించి పోండా తాలూకా ‘మర్డోల్’నందు పునః ప్రతిష్ఠింప జేసి దేవాలయం నిర్మించడమైనది.
దేవాలయ ఆవరణయందు ‘సంతేరి అమ్మ వారు’ లక్ష్మీనారాయణ వారికి ఉప ఆలయాలు కలవు. ఒక పెద్ద ఇత్తడి గంట, ఇత్తడి దీప స్తంభం ఇచ్చట ప్రసిద్ధం. అమ్మవారి అలంకరణ చాలా శోభాయమానంగా ఉంటుంది. నారాయణుడు గాన యజ్ఞోపవీతం ధరించి ఉంటుంది.
మధ్యాహ్నం, సాయంకాల హారతి కార్యక్రమానంతరం ఇచట గల భోజనశాలయందు భక్తులకు భోజన ప్రసాద వినియోగం కలదు.
ఆదివారం నాడు అమ్మవారికి ‘పల్లకి సేవ’ నిర్వహిస్తారు. భక్తులు పాటలు పాడుతూ భజనలు చేస్తూ పల్లకి సేవలో పాల్గొంటారు.
మాఘమాసమునందు శరన్నవరాత్రులు అమోఘంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.