Tuesday 9 February 2016

సుబ్రహ్మణ్యుడి శక్తి సామాన్యము కాదు...!!


తారకుడిని ఎదిరించడానికి వీలుగా దేవతలందరూ తమ శక్తులన్నింటినీకుమారస్వామికి ధారపోశారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ కలిసిత్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము,గొడ్డలి, శక్తి, శూలములను (శూలము అమ్మవారి శక్తి) ఇచ్చారు. శంకరుడు వెనక్కి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని శాంభవీ విద్యనూ కూడా కటాక్షించాడు. బ్రహ్మదేవుడు వేదములను, యజ్ఞోపవీతమును, గాయత్రీ మంత్రమును, కమండలమును, బ్రహ్మాస్త్రమును, శ్రీమహావిష్ణువువైజయంతీ మాల, కంఠహారము, ఐరావతమును, వజ్రాయుధమును, వరుణుడు ఒక శ్వేత ఛత్రమును, రత్నమాలను, సూర్యుడు మనోవేగము కలిగిన రథమును, కవచమును, యముడు యమ దండమును, చంద్రుడు అమృత కలశమును, అగ్ని మహాశక్తిని, వాయువు వాయవ్యాస్త్రమును, కుబేరుడు గదను, మన్మథుడు కామ శాస్త్రమును ఇచ్చారు. పాలసముద్రము అమూల్యమయిన రత్నములను, రత్నములతో కూడిన ఒక అందెను బహూకరించింది. అమ్మవైపు తాతగారయిన హిమవంతుడు వచ్చి కట్టుకోమని పట్టుబట్టలు ఇచ్చాడు. గరుత్మంతుడు ‘చిత్రబర్హణుడు’అనబడే ఒక నెమలిని, అరుణుడు ‘తామ్రచూడుడు’ అనే కోడి పుంజును బహూకరించారు. అదే కుక్కుట ధ్వజము. పార్వతీదేవి వెనక్కి పిలిచి గొప్ప చిరునవ్వును కానుకగా ఇచ్చిందట. అందుకే మీకు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపములు అన్నిచోట్లా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి. అంతేకాక ఐశ్వర్యమును, చిరంజీవిత్వమునుఇచ్చింది. లక్ష్మీదేవి సంపదను, కంఠహారమును ఇచ్చింది. సావిత్రీదేవి సకల విద్యలను ఆయనకు ఇచ్చారు. ఇప్పుడు దేవేంద్రుడితో దేవతలతో కలిసి ఆయన తారకాసుర, సంహారమునకు బయలుదేరాడు. దేవ సైన్యంతో కూడి వెళ్ళిన వాడై దేవసేనానిగా తారకా సుర సంహారం చేశాడు. లోకములన్నీ ఎంతగానో మురిసిపోయాయి. యుద్ధానంతరం సుబ్రహ్మణ్యుడు సంతోషంగా తిరిగి కైలాస పర్వతమును చేరుకున్నాడు.

No comments:

Post a Comment