Tuesday, 16 February 2016

ఆచమనం

ఆచమనం అనగా.....
మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం.
స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి. అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి.
ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొ|| గా విభజించారు.
ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది. అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది.
పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.
ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. 'కే" శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.
మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది. మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది. ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.
ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు.

No comments:

Post a Comment