Tuesday, 2 February 2016

రామాయణం కంటే బలమైన "రామనామం"


రావణాసురుని చంపిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక, అయోధ్యానగరంలో రామసభ కొలువుదీరి వున్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వచ్చాడు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరించారు. కానీ ఆంజనేయుడు రామనామ జపంలో మునిగి వుండటం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో "రామా ! నీ సేవకుడు నన్ను అవమానించాడు.నీవు అతడిని శిక్షించు" అని రాముడిని ఆదేశించాడు.
విశ్వామిత్రుడి మాటను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు 'రామ' నామాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించసాగాడు. 'రామ' నామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామబాణాలు ఏమీ చేయలేకపోయాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల అధికంకాగా చివరకు బ్రహ్మస్త్రం ప్రయోగించేందుకుసిద్ధమయ్యాడు. ఈలోగా నారదమహర్షి అక్కడకు చేరుకుని "మహర్షీ! హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించనంత మాత్రమున మీరు మరణదండన విధించమనాలా? 'రామ' నామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూ వుంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని ఆజ్ఞను ఉపసంహరించండి" అని విశ్వామిత్రుడితో చెప్పాడు.
ఈ మాటలను విని విశ్వామిత్రుడు బ్రహ్మస్త్ర ప్రయోగాన్ని నిలుపుదల చేయించి హనుమంతుడి రామభక్తిని మెచ్చుకున్నాడు.దీనిని బట్టి రామబాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమయింది. యుగయుగాలకు సర్వలోకాలను తరింపజేసిన మహిమాన్వితమైన నామం 'రామనామం.'
'రామత్తత్వో అధికం నామ
మితి మాన్యా మహేవయమ్
త్వయై కాతౌతారి తయోధ్యా
నామ్నుతు భువన త్రయమ్'
అని స్వయంగా రామభక్తుడైన హనుమంతుడు పేర్కొన్నాడు. అంటే శ్రీరాముడి చేత అయోధ్య తరింపబడింది. రామనామం చేత మూడు లోకాలు తరించాయని అర్థం.
'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరి మంత్రంలోని 'రా' అనే ఐదవ అక్షరం ' ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రంలోని 'మ' అనే రెండవ అక్షరం కలిస్తే ' రామ' అనే నామం అయింది. అంటే హరిహరతత్త్వాలు రెండింటిని ఇముడ్చుకున్న నామం రామనాయం!
'రామ' అనే పదాన్ని గమనిస్తే ర, అ, మ లు కలిస్తే 'రామ' అవుతుంది.'ర' అంటే అగ్ని. 'ఆ' అంటే సూర్యుడు, 'మ' అంటే చంద్రుడు అని అర్థం. అంటే 'రామ' అనే పథంలో విశ్వాసానికి మూలమైన మూడు శక్తులు ఉన్నాయని చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా 'రామ' అనే నామంలోని 'రా' అనే అక్షరం భక్తులను సంసారసాగరం నుంచి రక్షిస్తుందనీ 'మ' అనే అక్షరం భక్తుల మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొనగా 'రామ' అనే పదంలోని 'రా' అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయనీ, 'మ' అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు
'శ్రీరామ రామరామేతి రమే రామ మనోరమే
సహస్త్రనాయ తత్తుల్యం రామనామ వరాననే' అని పేర్కొన్నారు.
'రామ రామ రామ' అని మూడుసార్లు నామ జపం చేస్తే శ్రీవిష్ణుసహస్రనామం చేసినంత ఫలం లభిస్తుందట. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పదనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి

No comments:

Post a Comment