Saturday, 20 February 2016

శని క్రూరదృష్టి ప్రభావాన్ని దేవతల గురువు సైతం అనుభవించాడు...

పూజలు, స్తోత్రాలు ఇన్ని చేస్తున్నాం కదా.. మరి వాటితో శనిని ఆపలేమా.. అని అనుకొనే వారు కూడా ఉంటారు. ఇలాంటి వారికి ఓ సమాధానం ఇస్తుంది సూర్య పురాణం ఎనిమిదో అధ్యాయంలో ఉన్న శని గురుకుల వాసం అనే కథ. జాతకంలో శని ప్రభావాన్ని శనికి గురువైన బృహస్పతి ఆపగలిగాడా లేదా అని అంటే ఇదిగో ఆ కథంతా ఇలా వివరిస్తుంది.ఎంతటి వారైనా సరే... చివరకు దేవతల గురువైనా సరే.. కాలానికి అతీతంగా ఉండటం సాధ్యం కాదు. జ్యోతిష్య శాస్త్రంలో కాలానుగుణంగా శనిలాంటి గ్రహాల ప్రభావం ఉంటుంది. ఆ శని ప్రవేశాన్ని నిరోధించి హాయిగా ఉండే అవకాశం ఏదైనా లభిస్తే బాగుండునని అనుకొంటుంటారు. అలా నిరోధించటమంటే కాలాన్ని నిరోధించటమే. కాని అది సాధ్యమయ్యేది కాదు.

ఛాయాదేవికి, సూర్య భగవానుడికి జన్మించిన శని మెల్లమెల్లగా పెరిగి పెద్ద వాడయ్యాడు. విద్యాభ్యాసం చేసే వయసొచ్చింది. ఓ రోజున శని సూర్యుడి దగ్గరకు వెళ్ళి తనకు విద్యలన్నింటిలోకీ గొప్పదైన దాన్ని నేర్పే గురువెవరో చెప్పమన్నాడు. అప్పుడు సూర్యుడు బ్రహ్మవిద్యను నేర్పటంలో బృహస్పతిని మించిన వాడు మరొకరు లేరని, ఆయన గొప్పతనానికి ప్రతిఫలంగా వాచస్పతి అనే బిరుదును కూడా పొందారని అన్నాడు. బృహస్పతి తన దగ్గరకు వచ్చిన శిష్యులందరికీ అన్న వస్త్రాలను ఇచ్చి మరీ చదువు చెబుతుంటారని, కనుక ఆయన దగ్గరకు నిజ రూపంలో వెళితే ప్రవేశం దొరక్కపోవచ్చని, అందుకని ఓ బ్రాహ్మణ బాలకుడిలా మాయా రూపాన్ని ధరించి వెళ్ళమన్నాడు. తండ్రి సూచన ప్రకారం శని బృహస్పతి దగ్గరకు వెళ్లాడు. తాను కపిల మహర్షి వంశానికి చెందిన వాడినని చెప్పుకొని అక్కడ చోటు సంపాదించాడు. ఎంతో బుద్ధిగా గురువు చెప్పింది చెప్పినట్టు ఇట్టే నేర్చుకోసాగాడు. ఇతర విద్యార్థులందరికన్నా ఎంతో ముందుగా పాఠ్యాంశాలు అప్పచెప్పుతుండేవాడు.

బ్రహ్మ విద్యను అంత తొందరగా నేర్చుకున్న శిష్యుడిని చూసి ముచ్చటపడ్డ గురువు శనికి తంత్ర శాస్త్రాన్ని కూడా నేర్పించాడు. అలా విద్య పూర్తయిన తర్వాత శిష్యుడు గురువుకు గురుదక్షిణ ఇచ్చే సమయం వచ్చింది. అప్పుడు ఆ గురుశిష్యుల సంభాషణలో శిష్యుడి మాటలు, రూపంలో కపటం కనిపించటంతో గురువుకు అనుమానం వచ్చింది. అప్పుడాయన తనకు వేరే గురుదక్షిణ ఏదీ అక్కర లేదని అతడెవరో, తల్లిదండ్రులెవరో వాస్తవం చెపితే సరిపోతుందన్నాడు. అప్పుడు శని ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్పాడు. ఆ మాటలు వినగానే బృహస్పతికి గుండె ఝల్లుమంది. గురు దక్షిణగా అప్పటికప్పుడు తానొకటి అడుగుతున్నానని అది ఇవ్వమని కోరాడు. ఏం కావాలో చెప్పమన్నాడు శిష్యుడు.

తన జీవితంలో శని క్రూర దృష్టి ఎప్పుడూ తన మీద పడకూడదని, అదే తాను కోరే గురుదక్షిణ అన్నాడు బృహస్పతి. అప్పుడు శని గురువుకు నమస్కరిస్తూ అదంతా జాతకంలో కాలానుగుణంగా జరిగే వ్యవహారమని, బ్రహ్మ రాసిన రాత అనుగుణంగా జరుగుతూ ఉంటుందని, తన ప్రవేశాన్ని జాతకంలో నిరోధించటం సాధ్యపడదని అన్నాడు. అయితే తన ప్రభావం ఉన్న రోజుల్లో తనను పూజించటం, అర్చించటం వల్ల చెడు పరిణామాల నుంచి తప్పించుకోవచ్చని అన్నాడు. బృహస్పతి జాతకంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు తన ప్రభావం ఉంటుందని, దానివల్ల కష్టాలు కలుగుతాయని, అయితే అప్పుడు అధైర్యపడక తనను స్మరిస్తే తాను ఆ ఆపదలను పోగొడతానని చెప్పి అంతర్ధానమయ్యాడు శని.

ఆ తర్వాత బృహస్పతి ఏదో లెక్కలు కట్టి తన జాతకంలో ఏ గ్రహ ప్రభావం ఎప్పుడు ఉంటుందోనని కొంతకాలం పాటు చూసుకున్నాడు. కానీ ఆ తర్వాత మామూలుగానే కాలం గడపసాగాడు. ఇంతలో ఆ గురువు జాతకంలో శని ప్రవేశించాడు. ఓ రోజున ఆయన పూజా ద్రవ్యాల కోసం అడవికి వెళ్ళాల్సి వచ్చింది. ఒక పెద్ద పూల బుట్టలాంటిది తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అదే సమయానికి వీరబాహువు అనే రాజు కూడా ఆ అడవికి వేటకొచ్చాడు. ఆ రాజు తన వెంట పసివాడైన తన కుమారుడిని కూడా తెచ్చుకున్నాడు. ఒకచోట ఉయ్యాల కట్టించి ఆ ఉయ్యాలలో రాకుమారుడిని ఉంచి సైనికులను చుట్టూ కాపలా ఉంచి వేట ప్రయత్నంలో ఉన్నాడు వీరబాహువు. కాసేపాగి చూసేసరికి ఉయ్యాలలో బాలుడు కనిపించలేదు. అన్ని చోట్లా వెతికిస్తుంటే పువ్వులు కోసుకుని ఆశ్రమానికి వెళుతున్న బృహస్పతి సైనికుల కంటపడ్డాడు. ఆయన చేతిలో ఉన్న పెద్ద పూల సజ్జ నుంచి రక్తపు బొట్లు పడుతున్నాయి. సైనికులు ఆయనకు నమస్కరించి అదేమిటని అడిగారు.

బృహస్పతి బుట్టలో చూసేసరికి గొంతు తెగిన పసి బాలుడు ఉన్నాడు. అదంతా ఏమిటో తనకర్థం కావటం లేదని గురువు అన్నాడు. భటులు రాజుకు విషయమంతా చెప్పారు. మంత్రి మండలి బృహస్పతి ఉత్తముడని, అలాంటి నీచకార్యం చేశాడంటే తాము నమ్మలేక పోతున్నామన్నారు. అయినా సాక్ష్యం ఉంది కనుక శిక్ష తప్పదు కదా అని అనుకొనేంతలో బృహస్పతికి శని విషయం గుర్తుకొచ్చింది. వెంటనే శనిని స్తుతించాడు. అప్పుడాయన అక్కడ ప్రత్యక్షమై రాజుకు విషయం వివరించి తన ప్రభావం వల్లనే అలా జరిగిందని గురువును శిక్షించక సత్కరించి పంపించమన్నాడు. తన మాట ప్రకారం నడుచుకొని తనకు పూజలు చేస్తే ఆ రాజుకు, ప్రజలకు మేలు జరుగుతుందన్నాడు. రాజు శనీశ్వరుడి ఆజ్ఞను అనుసరించాడు. ఈ కథా సందర్భంలో కాలచక్రంలో కష్టసుఖాలనేవి తప్పవని, అయితే కష్టాలొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి దైవ పూజలు, స్తుతులతో దైవబలాన్ని పొంది కష్టాలను అధిగమించాలన్న ఓ సూచన కనిపిస్తుంది.


No comments:

Post a Comment