ఈ ప్రపంచంలో ఏది, ఎవరికి, ఎంత, ఎప్పుడు, ఎలా అవసరమో గమనించి తగిన విధంగా అందించే ప్రకృతి స్వరూపమే లక్ష్మీదేవి. సర్వజగతికీ, సర్వసంపదల మూల స్వరూపము కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు. మట్టి అనే మూలధాతువు వివిధ వస్తువులుగా అయినట్లే, లక్ష్మీ దేవి కరుణ మాత్రమే సిరిసంపదలను కలగజేస్తుంది. ఆ తల్లి ఎవరిని వరిస్తుందో వారే ధన్యులు. లక్ష్మీదేవిని చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.
యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్యపురాణంలో ఇలా చెప్పారు. "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి, ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరమాలా కంకణధారియై ఉండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలుఉండి, పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ, చక్ర , గదా, పద్మ, ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై ఉండును.
స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పారు. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.
No comments:
Post a Comment