Wednesday, 17 February 2016

జగద్గురు

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులొక అనన్య సామాన్యమైన వ్యక్తి. ఆయన మన భారతదేశంలో జన్మించటం నిజంగా మన భారతీయుల కొక గర్వకారణం. అయితే ఆయన ఏ శతాబ్దంలో జన్మించాడనే విషయం మాత్ర మిప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. క్రీస్తుకు పూర్వమని కొందరంటే తరువాత అని కొందరంటున్నారు. అయినా ఏ శతాబ్దంలో ఎప్పుడు జన్మిస్తేనేమి, ఎప్పుడూ, ఎక్కడా అనేవి మనకు ప్రధానం కావు. ఆయన భాషలోనే చెబితే అవి కేవలం వ్యావహారికమే. అలాంటప్పుడనవసరంగా వాటిని గురించి మనం తలబ్రద్దలు చేసుకోవటం దేనికి. అనావశ్యకం. ఆయన ఎప్పుడైనా జన్మించి ఉండవచ్చు. ఎక్కడైనా జన్మించి ఉండవచ్చు. మొత్తంమీద అలాంటి మహానుభావుణ్ని మాత్రం మనమిక చరిత్రలో మరలా చూడబోమే. ఏమి కారణం. ఆయన ఈ మానవ లోకాని కుపదేశించిపోయిన విజ్ఞానమలాంటిది. అది పరిపూర్ణమైన అద్వైత విజ్ఞానం. సృష్టికంతా సారం మానవుడైతే-మానవుడికి సారమాతని విజ్ఞానమైతే, ఆ విజ్ఞానానికంతటికీ పరమసారమద్వైత విజ్ఞానమే.
అదేమిటి-మానవుడీలోకంలో ఆర్జించిన విజ్ఞానమెంతో ఉంది గదా. లోక జ్ఞాన Common Sense ముంది శాస్త్రజ్ఞాన Scientific sense ముంది. కళాజ్ఞాన Artistic sense ముంది. ఇన్ని జ్ఞానాలుండగా ఇందులో దేనికీ లేని విశిష్టత ఈ అద్వైత విజ్ఞానానికే ఎలా ఏర్పడిందని ప్రశ్న వస్తుంది వాస్తవమే. మానవుడార్జించిన విజ్ఞానమెంతో ఉంది. సందేహం లేదు. కాని ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా అవన్నీ చివరకు నిరుపయోగమే. కారణమేమంటే వాటిన్నింటిలోనూ రెండు ప్రబలమైన దోషాలున్నాయి. ఒకటి అపేక్ష Relativity. మరొకటి బాధ Controversity అపేక్ష అంటే దీని తరువాత ఏమిటనే ప్రశ్న. ఈ ప్రశ్న మనం సాధించిన ప్రతి విజ్ఞానంలోనూ పొడచూపుతుంది. చూడండి. మనమే విజ్ఞానాన్ని ఎంత సాధించినా ఇంకా సాధించవలసింది ఉండనే ఉంటుంది. సాధించింది ఒక బిందువైతే సాధించవలసింది ఒక మహాసముద్రం. ఎంత ఈదినా దాని తీరం చేరుతామనే ఆశ ఎప్పటికీ లేదు జీవితంలో. కాబట్టి అపేక్ష అనే దోషమొకటి ఉంది మన జ్ఞానానికి.
అలాగే బాధ అనే దోషం కూడా ఒకటుంది. బాధ ఏమిటి. బాధ అంటే మనమెందులో ఎంత జ్ఞానం సంపాదించినా అది పనికి రాకుండా పోవటం. ఇది కూడా మన కనుభవ సిద్ధమే. చూడండి. ప్రతి రంగంలోనూ మన మెంతెంతో పరిశోధన చేస్తున్నాము. ఎన్నెన్నో విషయాలు తెలుసుకొంటున్నాము. అవన్నీ అప్పటికప్పుడు సత్యమనే నమ్ముతుంటాము. కానీ అంతకన్నా ముందుకు పోయి మరి ఒక క్రొత్త రహస్యం కనుగొనే సరికంతకు ముందరిదంతా బలాదూరవుతున్నది. అది మరి కొంతదూరం ప్రయాణం చేసే సరికి పేలవమయి పోతున్నది. ఈ విజ్ఞాన యాత్ర ఇలా నిరంతరమూ కొనసాగవలసిందే గనుక చివరకంతా బాధితం కాక తప్పదు. ఏతావతా తేలిందేమంటే మానవుడార్జించిన ఆర్జిస్తున్న ప్రతి ఒక్క విజ్ఞానమూ కూడా అపేక్షా బాధలనే ఈ రెండు దోషాలకూ గురి కావలసిందే. అది నీవు లోకజ్ఞానమని చెప్పు. శాస్త్రమని చెప్పు. కళాజ్ఞానమని చెప్పు. ఏదైనా సరే. రెండింటి కబంధ హస్తాల నుంచీ తప్పించుకొని బయటపడడం కల్ల.
కాగా ఈ రెండు లక్షణాలూ లేని విజ్ఞానమేదైనా ఉందంటే అది ఒక్క అద్వైత విజ్ఞానమే. ఎంచేతనంటే అసలద్వైతమని పేరు పెట్టటంలోనే ఉన్నదా రహస్యం. అద్వైతమంటే ఏమిటి. రెండవ పదార్ధమంటూ ఏదీలేదు. ఉన్నదంతా ఒక్క ఆత్మచైతన్యమే నని గదా, చైతన్యం తప్ప మరొకటేదీ లేదన్నప్పుడిక అపేక్ష ఏముంది. బాధ ఏముంది. ఇది గాక మరొకటున్నదని ఒప్పుకొన్నప్పుడే వాటి రెంటికీ అవకాశమేర్పడేది. లేకుంటే అసలాస్కారమే లేదు వాటికి. అపేక్షా బాధలు రెండూ లేవంటే అది ఒక పరిపూర్ణమైన జ్ఞానం కాక తప్పదు. ఇలాటి పరిపూర్ణమైన జ్ఞానమే అద్వైత జ్ఞానం.
అంతేకాదు. పరిపూర్ణ మెప్పుడయిందో అప్పుడిక పురుషార్థమనేది కూడా దానితోనే పరిసమాప్తమవుతున్నది. పురుషుడు కోరేదేదో అది పురుషార్ధం The aim and goal of human life. పురుషుడంటే మానవుడే, మానవులందరూ కోరే పదార్ధాలు రెండే ప్రపంచంలో. అన్నీ తెలుసుకోవాలని ఒకటి. అనవరతమూ సుఖంగా బ్రతకాలని ఒకటి. ఇంతకు మించి మరేదీ కానరాదు. ఇందులో మొదటి దానికి జిజ్ఞాస అనీ, రెండవదానికి ముముక్ష అనీ పేరు పెట్టారు మన ప్రాచీనులు. ఇవి రెండూ నెరవేరే వరకూ పురుషార్థమనే దానికి మనం నోచుకోలేము. అద్వైత మన్నప్పుడింకొక భావానికే అసలాస్కారం లేదనిగదా చెప్పాము. అలాంటప్పుడిక జిజ్ఞాస ముముక్షలు మాత్రమెక్కడివి. ఇవి కూడా వాటిపాటి కవి సమసి పోవలసిందే. పోతే పురుషార్థమనేది మన కప్రయత్నంగానే సిద్ధిస్తుంది. అంచేత మానవుడు సాధించిన అన్ని విజ్ఞానాలకూ ఆఖరిమెట్టు అద్వైత విజ్ఞానమే. అవి సాపేక్షమైతే Relative ఇది నిరపేక్షం Absolute. అవి సబాధమైతే Contradicted ఇది నిర్బాధం Uncontradicted ఇది అద్వైత విజ్ఞానానికుండే విశిష్టత.
ఇలాంటి విలక్షణమైన జ్ఞానాన్ని మనకు బోధించగలిగారంటే అలా బోధించిన భగవత్పాదులెంతటి మహనీయులో వేరుగా చెప్పబని లేదు. అసలు వారికి భగవత్పాదులని బిరుద మేర్పడటంలోనే మనకీ విషయ మవగత మవుతుంది. తెలియవలసినదంతా తెలుసుకొని దాన్ని అనుభవానికి తెచ్చుకొన్న పూర్ణ పురుషులే భగవత్పాదులు. శంకరులలాంటి పూర్ణ పురుషులు. వారికి పరమార్ధమంతా చేతిలో వెన్నముద్దలాగా స్వానుభవానికి వచ్చింది. అనుభవమనేది లేకుంటే ఏదిగానీ ఒక సిద్ధాంతంగా Doctrine or theory బయటికి రాదు. మానవుల సిద్ధాంతాలన్నీ Concepts వారి వారి అనుభవాలకు ప్రతీకలే Indications. సిద్ధాంతా లన్నిటికీ తలమానిక మద్వైత సిద్దాంతమని గదా ప్రతిపాదించాము. అలాంటప్పుడది ఎవరి అనుభవానికి రాకుండానే ఎలా అవతరించగలదు. ఒకవేళ అవతరించిందని వాదించినా దాని కర్థమేముంది. కాబట్టి దాని నొక సిద్ధాంతంగా శంకర భగవత్పాదులు లోకానికి చాటారంటే ఆయన కది ముందుగా అనుభవ గోచరమయి ఉండవలసిందే, ఇందులో అనుభవానికి తెచ్చుకోవటం వల్లనే ఆయన భగవత్పాదులయ్యారు. అలా తెచ్చుకొన్న విజ్ఞానాన్ని మరలా ఈ మానవ సమాజాని కుపదేశించి పోవటంవల్ల ఆయన జగద్గురువులు కూడా అయ్యారు.
అయితే మనకిక్కడ ఒక ఆశంక కలగవచ్చు. శంకరులు బోధించారని చెప్పే ఈఅద్వైత విజ్ఞానమంతకు ముందునుంచీ మన ఉపనిషద్వాఙ్మయంలోనే ఉంది గదా. ఇక ఆయన మనకు క్రొత్తగా చేసిన బోధ ఏమిటి అని. అదీ వాస్తవమే. ఉపనిషత్తులలోనే ఉన్నాయి అద్వైత జ్ఞాన రత్నాలన్నీ. సందేహం లేదు.కాని అవి బాగా లోతుకు దిగి గాలించినప్పుడే చేతికందేది. ఆ పాతతః చూచామంటే వాటిలో ఒక్క అద్వైతమే గాదు. సాంఖ్యయోగాది ద్వైతవాసనలు కూడా గుబాళిస్తుంటాయి. ఎక్కడికక్కడే మనకుపనిషత్తుల భావమిదే కావచ్చుననే భ్రాంతి ఏర్పడుతుంది. మనకేమిటి. అసలు పెద్ద పెద్ద మతాచార్యులకే ఏర్పడింది ఇలాంటి అపోహ. కనుకనే ఎవరికి తోచినట్లు వారు ఉపనిషద్వాక్యాలకు వ్యాఖ్యానాలు వ్రాస్తూ వచ్చారు. దానితో అసలుపనిషత్తాత్పర్య Import మేమిటో ఎవరికీ అంతు పట్టకుండా మరగున బడిపోయింది. అలాంటి పరిస్ధితిలో అవతరించారు శంకర భగవత్పాదులు. అలా అవతరించి పరస్పర విరుద్ధంగా కనపడే భావాలనన్నిటినీ సమన్వయించి ఉపనిషత్తులన్నిటికీ కలిపి ఒక్క అద్వైతమే వివక్షిత Intention మని ఆయన సిద్ధాంతం చేశారు.
ఇది ఒక్క ఉపనిషత్తులకేగాదు. ఆ మాటకు వస్తే శ్రుతులకన్నింటికీ కూడా అద్వైతమే పరాయణమని ఆయన చేసిన తీర్మానం. ఋగ్యజుస్సా మాథర్వణాలనే నాలుగు శ్రుతులూ ఒక జ్ఞానకాండనే గాక విధ్యుపాసన రూపమైన కర్మకాండను గూడా ప్రతిపాదిస్తాయి. ఇందులో జ్ఞానకాండ అనబడే ఉపనిషత్తులొక వేళ అద్వైత భావాని కనుకూలమైనా కర్మకాండ మాత్రమలా అయినట్టు కనిపించదు. కర్మ అనేది దాని స్వరూపాన్ని బట్టి చూచినా అది ఇచ్చే స్వర్గాది ఫలాన్ని బట్టి చూచినా కేవల మీద్వైత ప్రపంచంతోనే ముడిబడి ఉన్నట్టు తోస్తుంది. కానీ చిత్రమేమంటే ఆ కర్మలు కూడా కామ్యవర్జితంగా ఆచరిస్తే చాలు. మానవుడికి చిత్తశుద్ధిని ప్రసాదించి తద్ద్వారా జ్ఞానోత్పత్తికే దోహదం చేస్తాయి. అప్పటి కుపనిషత్తులు సాక్షాత్తుగా Direct నైతే కర్మోపాసనలు రెండూ పరంపరగా Indirect సాధనాలవుతాయి అద్వైతానికి. దీనిని బట్టి కాండద్వయాత్మకమైన శ్రుతికంతటికీ అద్వైతమే పరమార్ధమని ఏక వాక్యతను Uniformity నిరూపించారు శంకరులు.
శ్రుతులకు నిరూపించ గలిగారంటే ఆ శ్రుతుల అడుగుజాడలలో పయనించేవే మను యాజ్ఞవల్క్యాది స్మృతులు కూడా. కాబట్టి వాటికి కూడా నిరూపించి నట్టయింది. పోతే ఈ శ్రుతి స్మృతులలోని భావాలనే కథా రూపంగా బయట పెడతాయి ఇతిహాస పురాణాలు. కనుక వాటికి కూడా ఇదే తాత్పర్యమని చాటినట్టయింది. మొత్తంమీద శ్రుతి స్మృతి పురాణేతి హాసభేద భిన్నమైన సమస్త వాఙ్మయానికీ అద్వైత జ్ఞానమొక్కటే చివరకు పరాయణమని ఆయన చేసిన సమన్వయం.

No comments:

Post a Comment