Saturday, 6 February 2016

ఋణం

సంతానం కలగక పోయినా మనిషి పితృ ఋణం విముక్తి పొందగలడా? 

పొందుతాడు. భగవంతుణ్ణి సర్వ విధాలా శరణు జొచ్చిన వాడికి ఏ రుణమూ ఉండదు. 
రాజా! ఎవరు సర్వ కార్యములూ విడిచిపెట్టి సంపూర్ణంగా శరణాగత వత్సలుడైన భగవంతుని శరణు పొందుతారో వారు దేవ, రుషి, ప్రాణి, కుటుంబజన, పితృగణాదులలో ఎవరికీ రుణ పడటం గాని, సేవకులగుట గాని జరుగదు (శ్రీమద్భాగవతం 11-5-41)

దేవ ఋణమేమిటి? దాని నుంచి విముక్తి పొందే ఉపాయమేమిటి?

వర్షం వస్తుంది. నెల వేడెక్కుతుంది. గాలి వీస్తుంది. భూమి అన్నిటినీ భరిస్తుంది. రాత్రి చంద్రుడు, పగలు సూర్యుడూ వెలుతురునిస్తారు. దానివల్ల అందరి జీవన నిర్వహణం జరుగుతుంది. ఇదంతా మన మీద దేవఋణం. హోమం, యజ్ఞం చేయటం వల్ల దేవతలకి పుష్టి కలుగుతుంది. వాని నిర్వహణం వలన మనం దేవఋణ విముక్తులమవుతాం.

ఋషి ఋణ మేమిటి? దాని నుంచి విముక్తి పొందే ఉపాయమేమిటి?

ఋషులు, మునులు, సాధువులు, మహాత్ములు రచించిన గ్రంథాలు, చెప్పిన స్మృతులు మనకి వెలుతురు(జ్ఞానం) నిస్తున్నాయి. విద్య లభిస్తోంది. కర్తవ్యాకర్తవ్య పరిజ్ఞానం కలుగుతోంది. అందువల్ల మనం వారికి ఋణ పడి ఉంటున్నాం. వారి గ్రంథాలు చదవటం, అధ్యయనం, పఠనపాఠనాదులు చేయటం వల్ల, సంధ్యా వందన, గాయత్రీ జపాదులు చేయటం ద్వారా మనం రుషి ఋణం నుంచి విముక్తులమవుతాం.

భూత ఋణ మేమిటి? దాని నుంచి విముక్తి పొందే ఉపాయమేమిటి?

ఆవు-గేదె, గొర్రె-మేక, ఒంటే-గుఱ్ఱం మొదలైన ప్రాణుల ద్వారా మనం మన పనులు నెరవేర్చుకొంటున్నాం. మన జీవనం కొనసాగిస్తున్నాము. వృక్ష లతాదుల వల్ల మనం ఫలములు, పుష్పములు మొదలైనవి అనుభవిస్తున్నాము. ఇది మనమీద పడిన ఇతర ప్రాణుల ఋణం. పశు పక్ష్యాదులకు గడ్డి, అన్నం, మొదలైనవి పెట్టడం ద్వారాను, వృక్షములకు నీరు ఇవ్వడం ద్వారాను, ఆహారమివ్వడం ద్వారా మనము ఈ భూత ఋణము నుండి విముక్తులం కాగలము.

మనుష్య ఋణమంటే ఏమిటి? దాని నుంచి విముక్తి పొందే ఉపాయమేమిటి?

ఇతరుల సహాయ సహకారములు లేనిదే మన జీవనము సాగదు. మనం ఇతరులచే నీరును పొందవలసి రావచ్చు. ఇతరులు నాటిన మొక్కలను, చెట్లను ఉపయోగించు కొంటున్నాము. ఇతరుల దారిని మనము ఉపయోగించ వచ్చు. ఇతరులచే పండించ బడిన ధాన్యము కానీ, ఇతరుల చేత తయారు కాబడిన అన్నాది ఆహార పదార్థములు మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇవన్నీ ఇతరుల యెడ మనం ఋణగ్రస్తులం కావడానికి దోహదం చేస్తాయి. ఇతరుల సుఖ సౌకర్యార్థం నూతిని త్రవ్వించటం, పంపులు వేయించటం, తోటలు వేయించటం, రోడ్లు వేయించటం, చలి పందిరులు, ధర్మ సత్రాలు కట్టించటం, అన్న క్షేత్రాలు, సత్రాలు నడపటం మొదలైన వాటి వల్ల మనం మనుష్య ఋణం నుండి విముక్తులం కాగలుగుతాము.

పితృ ఋణం, దేవ ఋణం, రుషి ఋణం, భూత ఋణం, మనుష్య ఋణం ఈ అయిదు రుణాలూ గృహస్థు మీద వ్యాపించి ఉంటాయి. సదా భగవంతుని శరణు పొందిన వాడు పితృ, దేవతాదులు ఎవరికీ రుణపడి ఉండదు. అన్ని రుణాల నుంచి విముక్తి పొందుతాడు.

No comments:

Post a Comment