భూమి కొనేటప్పుడు, ఇల్లు కట్టించేటప్పుడు వాస్తు చూడటమనేది చాలామంది చేస్తుంటారు. అసలీ వాస్తు అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది.. అనే విషయాలను గురించి చెబుతుంది మత్స్య పురాణం రెండువందల యాభై ఒకటో అధ్యాయం పూర్వం సూతుడు రుషులకు భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలను వివరిస్తూ వాస్తు పురుష ఉత్పత్తి, వాస్తు శబ్ధ అర్ధం, భూమి పరీక్ష లాంటివి వివరించాడు.
పూర్వం అంధకాసుర వధ సమయంలో శివుడి నుదిటి భాగం నుంచి ఒక చెమట బిందువు రాలి పడింది. క్షణాల్లో ఆ బిందువు భయంకరమైన భూతంలా మారింది. పుట్టీ పుట్టగానే ఆ భూతం తన ఎదురుగా ఉన్న అంధకాసురుడికి చెందిన అంధకులు అందరినీ తినేసింది. అయినా ఆ భూతానికి ఆకలి తీరలేదు. వెంటనే అది తన ఆకలి తీర్చమని శివుడిని గురించి భీకరమైన తపస్సు చేసింది. చాలాకాలం పాటు ఆ తపస్సు సాగాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ భూతం తనకు మూడు లోకాలను మింగేసి ఆకలి తీర్చుకోవాలని ఉందని అంది. శివుడు అలాగే కానిమ్మన్నాడు.
పురుషాకృతిలో ఉన్న ఆ భూతం మూడు లోకాలకు విస్తరించింది. అందిన వారిని అందినట్లు నమిలేసింది. అయితే ఇంతలో లోకాలన్నిటా ఉన్న మానవులు, దేవతలు, రాక్షసులు అంతా ఆ భూతం మీదకు ఎక్కి కుర్చొని దాన్ని అణిచి వేసారు. అంతమంది ఎక్కి కదలనివ్వక పోవటంతో అది మళ్ళీ దీనంగా దేవతలను ఉద్దేశించి ఇలా సర్వలోకవాసులు తనను అణిచి వేస్తున్నారని, తాను బతకటానికి ఆహారం కావాలి కనుక ఏదైనా ప్రసాదించమని వేడుకొంది. ఆ భూతం మీద అందరూ వాసం ఏర్పరచుకున్నారు. కనుక అది అందరికీ వాస స్థానం అయింది. ఆనాటి నుంచి దానికి "వాస్తు" అని పేరొచ్చింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు దాన్ని అనుగ్రహిస్తూ ఇలా అన్నారు.
గృహస్తుడు తన ఇంట్లో అగ్ని కార్యం చేసి ఇంటి మధ్యలో వేసే బలి (అన్నం లాంటి పదార్ధాలు), అలాగే వాస్తు ఉపశమనం కోసం చేసే యజ్ఞంలో లభించే హవిస్సులు యజ్ఞ, ఉత్సవాల వంటి సమయాలలో వేసే వాస్తు బలి (అన్నం), వాస్తు పూజ ఆచరించని వాడు, అజ్ఞానంతో చేయాల్సిన పద్ధతిలో కాక తప్పు పద్ధతిలో యజ్ఞాలు చేసే వాడు వాస్తు పురుషుడికి ఆహారం అవుతారని బ్రహ్మాది దేవతలు పలికారు. అప్పుడు ఆ వాస్తు పురుషుడు ఆనందించాడు. నాటి నుంచి ఎక్కడ శాంతి పూజలు జరిగినా వాస్తు పూజ, హోమం లాంటివి చేయడం ఆచారంగా వస్తోంది. ఈనాటికీ సంప్రదాయబద్ధంగా చేసే ఉత్సవాలు, బ్రహోత్సవాల వంటి వాటిలో చేసే యజ్ఞయాగాలు ఇలా అనేక సందర్భాలలో వాస్తు పూజ, బలి ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి. గృహ నిర్మాణ, గృహ ప్రవేశాది విషయాలలో దీన్ని నిర్వహించటం కనిపిస్తుంది.
No comments:
Post a Comment