మూడు, అయిదు సంవత్సరాలలో మాత్రమే చేయాలి అనే బలమైన ప్రచారం సంఘంలో వున్నది. మూడు, ఐదు సంవత్సరాలలో చేయుటకు ఆక్షేపణ లేదు కానీ నాలుగులో చేయరాదు అనుట అపహాస్యమైన విషయం.
నాల్గవ సంవత్సరం అక్షరాభ్యాసం చేయుటకు శాస్త్రంలో నిషేధ వాక్యములు ఎక్కడా లేవు. అలాగే అనధ్యయనములు అనబడే పాడ్యమి, అష్టమి, చతుర్దశీ, పౌర్ణిమ, అమావాస్య రోజులలో అక్షరాభ్యాసం చేయరాదు. ఇది బాగా తెలుసుకోండి. అలాగే దసరాలలో మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేయరాదు. మీకు ధర్మశాస్త్రం మరియు పురాణాలలో ఈ విషయం రాసి ఉన్నది. నేడు సంఘంలో ఆచారం అయినది మూలానక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతీ ఆవాహన చేసి నాటి నుండి విజయదశమి రోజు వరకు వ్రాయుట, చదువుట, పాఠం చెప్పుట నిషేధం అని శాస్త్రం. విజయ దశమినాడు అక్షరాభ్యాసం చేయవచ్చు. దీని గురించి నన్ను అడగవద్దు. శాస్త్ర వాక్యం ఇక్కడ రాస్తున్నా. మీరు నేడు సంఘంలో జరిగే ఆచారం ఎంత వరకు సబబు అనేది తెలుసుకోండి. భవిష్యోత్తర పురాణంలో సరస్వతీ పూజ విషయమై ‘్భవేన్మూలాద్య పాదోవై క్షణాదాయాం కురూత్తమ తదా సరస్వతీ పూజా ప్రభాతే స్యాత్ పరేహని.. నాధ్యాపయేన్నచ లిఖేన్నాధీ రుూత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో ద్విజోత్తమః’ అని వున్నది. ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా సమర్థించాయి. విజయ దశమి విశేషమే. అలాగే మరొక కొత్త ఆచారం ‘బాసరలో చేసినా’ ‘శ్రీపంచమి రోజు చేసినా’ ముహూర్తంతో అవసరం లేదు అని. మరి 30 సంవత్సరాల క్రితం ఈ వాక్యాలు ఉన్నాయా? వయస్సులో పెద్దలు ఆలోచించి చెప్పండి. ఈ బాసర, శ్రీపంచమీ గతంలో వినపడ్డాయా? లేదు. ముహూర్తం అక్కర్లేకపోతే మహర్షులు ఇంత శాస్త్రం ఎందుకు చెప్పారు? వారు రాసిన శాస్త్రంలో ఈ బాసర/ శ్రీపంచమి గురించి ఎందుకు రాయలేదు. ఆలోచించండి. తారాబలం, గ్రహబలం లేని రోజులలో ముహూర్తం చేయవద్దు. మూఢమి అనధ్యయనం, ఆషాఢం, భాద్రపదం, పుష్య మాసములలో చేయవద్దు. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిధులు విశేషం. మంగళవారం నిషేధం. ఆది శనివారాలలో మాధ్యమం. అలాగే ‘ప్రదగ్గతే భాస్వతి పంచమేబే ప్రాప్తేక్షర స్వీకరణం శిశూనాం’ అన్నారు కావున ఉత్తరాయణం విశేషం. అయిదవ సంవత్సరం అక్షరాభ్యాసమునకు విశేషం. హస్త, పునర్వసు, స్వాతీ, అనూరాధ, ఆర్ద్ర, రేవతీ, అశ్వినీ, చిత్త, శ్రవణ నక్షత్రములు విశేషం. లగ్నాత్ అష్టమ స్థానము నందు వున్న శుభ పాపగ్రహం ఏదైనా చెడు ఫలితాలే ఇస్తుంది. అందువలన అష్టమ శుద్ధి కావాలి. కేవలం పూర్వాహ్ణంలోనే 12.00 వరకే కార్యక్రమం విశేషం. 3,6,10,11 స్థానములు లగ్నాత్ పాప గ్రహములతో కూడిన యెడల విశేషం. 1,2,4,5, 7,9,12,10 లలో 11లోను శుభ గ్రహములు వుండాలి. చంద్రుడు, గురువు మనసు విద్యలకు కారకులు కావున వారు బలంగా వున్న ముహూర్తం విశేషంగా చూడాలి. ‘ఉత్తరాయణే సూర్యే కుంభ మాసం వివర్జయేత్’ ఉత్తరాయణంలో కుంభ మాసం విసర్జించాలి. ఇంత శాస్త్రంతో పని లేకుండా శ్రీపంచమి, దసరాలలో మూలా నక్షత్రం విశేషం అంటే ఎలాగ. ముహూర్త దర్పణం, ముహూర్త సుధ చదవండి. అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో ‘మూల’ లేదు. పంచాంగాలలో అక్షరాభ్యాస నక్షత్ర లిస్ట్ చదవండి. మూలా నక్షత్రం లేదు.
No comments:
Post a Comment