Friday, 15 April 2016

నక్షత్రముల జన్మము


కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.
ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెండ్లి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.
ఆ ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడు కాసాగాడు. పరమేశ్వరుని ప్రార్ధించాడు. దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు.
చంద్రుడు దక్షునికి నమస్కరించి "తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను" అన్నాడు. అందరు భార్యలను సమముగా ఎందుకు చూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు. సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.
రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు, మరి తొమ్మిది మంది (రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర) మానవ స్వభావులు, తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట, మూల ) రాక్షస స్వభావులు. కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందువలన అసత్యదోషం కలుగుతుంది.
వివాహ సమయంలో చేసే ప్రమాణములు
చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు - మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నంమీద, దోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనేముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తర్షులను అరుంధతిని చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు. ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతో సరిగా పలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.

తెలిసి చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు. కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి. మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గతజన్మలో జీవులు చేసిన కర్మఫలాలు (ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి.
వీటిలో ఆరుజన్మలనుండి ప్రోగైనవి సంచితములు.
ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్ధములు
ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి
వీటిలో తెలియక చేసిన అపరాధములకు పశ్చాత్తాపం పొంది, సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే పారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండి విడుదల పొందవచ్చును. ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసిందే.
కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు సంచితములనుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే. జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము. కర్మమేమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు.
ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు భేదబుద్ధి తొలగి, సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

No comments:

Post a Comment