Thursday 21 April 2016

జ్యోతిష్యంలో భవిష్యత్తు

జ్యోతిషంలో ఎవరైనా ఆశించేది ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగలగడం. 2 + 2 = 4 అన్నంత ఖచ్చితంగా జ్యోతిషం ద్వారా మనకి భవిష్యత్తు తెలిసి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అపి సాగర పర్యంతా విచేతవ్యా వసుంధరా।
దేశోహ్యరత్ని మాత్రోపి నాస్తి దైవజ్ఞ వర్జితః॥
పదిహేడవ శతాబ్దంలో నీలకంఠ దీక్షితులు తన ‘కలి విడంబనం’ లో చెప్పిన శ్లోకమిది. సముద్రపర్యంతమూ ఉన్న ఈ భూమిని మొత్తం శోధించినా, ఈ దేశంలో జ్యోతిష్కుడు లేని భూమి ఒక గుప్పెడు కూడా లేదు అని దాని భావం.
చాలామంది జ్యోతిష్కులు భవిష్యత్తు నిజంగానే తెలుస్తుందని అంటారు. అయితే అలా భవిష్యత్తు చెప్పకూడదనో, పార్వతీ దేవి శాపం ఉంది కాబట్టి భవిష్యత్తుని ఖచ్చితంగా తెలుసుకోలేమనో కొందరు అంటారు.
ఫలాని గ్రహచారేణ సూచయంతి మనీషిణ:
కోవక్తా తారతమ్యస్య తమేకం వేధసం వినా ||
గ్రహచారాన్ని బట్టి ఫలితాలు ఈ విధంగా ఉండవచ్చు అని పండితులు సూచిస్తారు. కానీ ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది అని ఎవరు చెప్పగలరు, ఆ బ్రహ్మదేముడు తప్ప అని ఆ శ్లోకానికి భావం.అంటే జ్యోతిషం ద్వారా సూచనగా భవిష్యత్తు తెలిసే అవకాశం ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితాలు చెప్పలేము అని.
శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోకూడా ఏమిటీ నమ్మకాలు అని పెదవి విరిచేవారు కొందరైతే జ్యోతిషం కూడా సైన్సే అనేవాళ్ళు మరికొందరు. ఏది ఏమైనా జ్యోతిషానికి ఉన్న ఆకర్షణశక్తి అసాధారణమైనది అని ఎవరైనా అంగీకరించక తప్పదు.
విచిత్రవ్యక్తి అనుభవాన్ని గురించి విన్నవాళ్ళు జ్యోతిష్కులంతా మోసగాళ్ళు అనే అభిప్రాయానికి రావడం తేలిక. కానీ అందరూ మోసగాళ్ళే అనడం అంత సులభమైన విషయం కాదు. జ్యోతిషంలో ఏ పట్టూ లేకపోతే ఇంతకాలం బహుళ ప్రాచుర్యంలో నిలబడ గలగడం, అనేకమంది అధ్యయనం చేసి జ్యోతిష్కులుగా సఫలమవ్వడం సాధ్యంకాదు. మరి నిజంగానే జ్యోతిషంలో ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగల ’సత్తా’ ఉందా? ఒక సైన్సుగా అది పరిశీలనకి నిలబడగలదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలంటే మొదట జ్యోతిషం అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి.
భౌతికశాస్త్ర పితామహుడు న్యూటన్ జ్యోతిషాన్ని (ఇంకా రసవాదమూ మొదలైన చాలా విషయాల్ని) నమ్మేవాడు. ఎవరో ఆయనదగ్గర జ్యోతిషాన్ని విమర్శిస్తే ’సర్, నేను జ్యోతిషాన్ని చదివాను, మీరు చదివారా?’ అని అడిగాడుట.
1975లో 186 మంది సైంటిస్టులు (అందులో 18మంది నోబెల్ గ్రహీతలు) జ్యోతిషం అశాస్త్రీయమైనది అని ప్రకటించారు. దానికి ఒక జ్యోతిష్కుడి సమాధానం ఏమిటో తెలుసునా? ’అవునుట. నిర్ణయించారుట. అయితే వాళ్ళెవరూ జ్యోతిషం తెలిసినవాళ్ళు కారుట. వాళ్ళు నోబెల్ బహుమతి పుచ్చుకున్నది జ్యోతిషంలో కాదు అని టక్కున చెప్పాడు ఆ జ్యోతిష్యుడు

No comments:

Post a Comment