Wednesday, 6 April 2016

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత....




ఉగాది పచ్చడి అనగానే ఎంతటివారికైనా నోరూరుతుంది. ఎందుకంటే తీపి .. చేదు .. పులుపు .. వగరు .. ఉప్పు .. కారం అనే ఆరు రుచుల కలయికతో తయారుచేయబడిన ఈ పచ్చడి కొత్తరుచిని పరిచయం చేస్తుంది. అప్పుడే కోయబడిన తాజా వేపపూతను .. కొత్త బెల్లమును .. కొత్త చింతపండును .. కొబ్బరిముక్కలను .. మామిడి ముక్కలను ... ఉప్పు .. కారమును కలిపి ఉగాది పచ్చడి తాయారు చేస్తుంటారు.
ఆరు రుచులతోనే ఉగాది పచ్చడి చేయాలనీ శాస్త్రం చెబుతోంది. అలాగే తీపికన్నా కాస్త చేదుగా ఉండటం వల్లనే ఉగాది పచ్చడి తినడం వలన పూర్తి ప్రయోజనం కలుగుతుందని శాస్త్రం స్పష్టం చేస్తుంది.
ఈ మాసం నుంచే క్రమక్రమంగా ఎండలు పెరుగుతూ ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం అనేక వ్యాధులకు ... బాధలకు నెలవుగా మారుతుంది. వాటిని ఎదుర్కోవడానికి ముందస్తుగా తీసుకునే ఔషధమే ఉగాది పచ్చడిగా చెప్పబడుతోంది. వేపపూతలో గల చేదు శరీరంలోపల గల ప్రమాదకరమైన క్రిములను నాశనం చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి పరచడమే కాకుండా శ్లేష్మ సంబంధమైన .. వాత సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది.
ఇక ఈ కాలంలో చిన్నపిల్లలకు అంటువ్యాధులు అధికంగా సోకుతుంటాయి. అలాంటి వ్యాధులకు వేప ఔషధంగా పనిచేస్తూ అడ్డుకట్ట వేస్తుంది. ఇక అతివేడిమి వలన శరీరంలో గల నియత్రణ వ్యవస్థ దెబ్బ తినకుండా బెల్లం కాపాడుతూ ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన చల్లదనాన్ని అందిస్తూ జీర్ణక్రియకు రక్షణగా నిలుస్తుంది. ఏదైతేనేం తీపికోసమేగా అనుకుని బెల్లానికి బదులుగా పంచదార వాడకూడదు. ఎందుకంటే బెల్లంలో వుండే పోషకాలు పంచదారలో వుండవు.
ఇక ఉగాది పచ్చడిలో ఉపయోగించే చింతపండు ... మిరియాలు .. ఉప్పు, వాత .. పిత్త .. కఫ సంబంధమైన దోషాలను తొలగిస్తాయని చెప్పబడుతోంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన ఉగాది పచ్చడి తినడం వలన, వ్యాధులకు లొంగని ధృఢమైన శరీరం ఏర్పడుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఆరోగ్యం అందాన్నీ ... ఆనందాన్ని ... ఆయుష్షును ఇస్తుంది. అలాంటి ఆరోగ్యాన్ని ఇవ్వడమే ఉగాది పచ్చడిలోని పరమార్థంగా కనిపిస్తుంది. కనుక శాస్త్రం
సూచించిన విధంగా ఉగాది పచ్చడి తయారుచేసుకుని తినడంవలన అటు ఆనందం ... ఇటు ఆరోగ్యం లభిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment