Tuesday, 26 April 2016

నక్షత్రము - నాటాల్సిన వృక్షం


వ్యక్తి జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్నే జన్మ నక్షత్రముగా జ్యోతిష్యశాస్త్రం తెలుపుతుంది. జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం. ఈ శాస్త్రంలో జీవితంలో సంభవించే సమస్యలు ఎలా వస్తాయో, వాటికి ఏ గ్రహాలకుకు శాంతులు చేయాలో ఈ శాస్త్రములో పరిహారాలు సూచించబడతాయి. దానికనుగుణంగా మనం నక్షత్ర శాంతులు, గ్రహ శాంతులు జరిపించుకోవాల్సి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రములోని 27 నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు, అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి. చాలామందికి నక్షత్రాలకి వృక్షాలు ఉంటాయన్న సంగతి తెలియదు. అయితే నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని స్వయంగా పెంచటం ద్వారా దోషాలేమన్నా ఉంటే తొలగటమే గాక, సర్వ సౌఖ్యాలను పొందవచ్చు. ఈ సూత్రాన్ని ఆచరించడం శుభం. మీరు జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచితే అది పెరిగి పెద్దయ్యే కొద్దీ శుభాలను కలుగుతాయి.
నాటవలసిన మొక్కనుగాని లేక, విత్తనాన్ని గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ, రోడ్లపక్కన, పార్కు, కొండ, అడవి, దేవాలయాలలో ఇలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ నాటవచ్చు. అయితే అది పెరిగేలా శ్రద్ద చూపించాలి. మీ నక్షత్రము చూసుకుని ప్రతి నెల ఒక్కసారయినా ఆ వృక్షాన్ని దర్శించి నమస్కరించడం శుభం. మీ గ్రామంలో లేదా నివాస సమీపంలో ఎక్కడ ఆ వృక్షం కనిపించినా నమస్కరించండి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆ వృక్షాన్ని దూషించటంగాని, నరకటం గాని చేయకూడదు. పసి పిల్లలచేత కూడా ఇలా జన్మనక్షత్రానికి అనుగుణంగా వృక్షాన్ని నాటించి చూడండి వారి జీవితంలోనూ శుభాలే కలుగుతాయి.
జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు
అశ్వని నక్షత్రము
అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.
భరణి నక్షత్రము
భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది
కృత్తిక నక్షత్రము
కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.
రోహిణి నక్షత్రము
రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.
మృగశిర నక్షత్రము
మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.
ఆరుద్ర నక్షత్రము
ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.
పునర్వసు నక్షత్రము
పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.
పుష్యమి నక్షత్రము
పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.
ఆశ్లేష నక్షత్రము
ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.
మఖ నక్షత్రము
మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి
పుబ్బ నక్షత్రము
పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తర నక్షత్రము
ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది
హస్త నక్షత్రము
హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.
చిత్త నక్షత్రము
చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.
స్వాతి నక్షత్రము
స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.
విశాఖ నక్షత్రము
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.
అనురాధ నక్షత్రము
అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.
జ్యేష్ఠ నక్షత్రము
జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.
మూల నక్షత్రము
మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.
పూర్వాషాడ నక్షత్రము
పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.
ఉత్తరాషాడ నక్షత్రము
ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.
శ్రవణం నక్షత్రము
శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.
ధనిష్ఠ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.
శతభిషం నక్షత్రము
శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.
పూర్వాభాద్ర నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.
ఉత్తరాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.
రేవతి నక్షత్రము
రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment