Saturday, 30 January 2016

ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే

వైద్యశాస్త్రంలో భారతీయుల ప్రతిభ వేల ఏళ్ల నాటిది.....ప్రపంచంలోనే మొట్టమొదటి శస్త్రచికిత్స (Surgery) చేసినది సుశ్రుతులే.......
సుశ్రుతుల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందిన వారిగా ఆధునిక చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ,మన పురాణేతిహాసాల ప్రకారం ఆయన దాదాపుగా 5000 ఏళ్ల పూర్వం వారు. మనకు చరిత్రను రాసింది పాశ్చాత్యులు కావడం వలన, వాళ్లు బైబిలులో ఉన్నట్లుగా సృష్టి ఆవిర్భవించి ఆరు వేల ఏళ్లకంటే ఎక్కువ కాలేదని తీవ్రంగా నమ్మడం వలన, ఎవరినీ 3000 ఏళ్ల పూర్వం వాళ్లుగా అంగీకరించలేకపోయారు.
సుశ్రుతులు వేల ఏళ్ల క్రితమే వారణాసిలో జన్మించారు. ఆయుర్వేద వైద్య పితామహులుగా ఖ్యాతి గడించిన ధన్వంతరి వద్ద విద్యనభ్యసించారు. పాశ్చాత్య ప్రపంచం విజ్ఞాన పరంగా కళ్లు తెరవక ముందే ఆయన సర్జరీ చేసి చూపించారు.
1) పక్షుల ముక్కుల రూపురేఖలను అనుసరించి, దృఢమైన పట్టు ఉండే విధంగా, సుశ్రుతులు సర్జరీ పరికరాలను తయారు చేసి, వినియోగించినట్లుగా తెలుస్తోంది.
2) వైద్య నియమ సూత్రాలూ, శస్త్రచికిత్స, పురిటి విధులు, మందులు, ఔషధజ్ఞానం మానవశరీర నిర్మాణాన్ని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.
3) కొన్ని ఉత్పాదకాలు, వనమూలికల మొక్కలు, పుష్ప, ఫలాల ఔషధ మొక్కల గుర్తింపు, లాంటి వృక్షాల్లో ఔషధగుణాల్ని ఆయన కనిపెట్టారు.
4) శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని విశదీకరించే సుశ్రుత సంహిత అనే అద్భుత గ్రంథాన్ని ఆయన సంస్కృతంలో రచించారు.
5) మెడ నుంచి ముఖం వైపు చర్మపు పొరల ప్రతిరూప చికిత్స, ప్రస్తుత అధునాతన ప్లాస్టిక్ సర్జరీ కి సుశ్రుతులు నాందీ పలకడంతోనే ఆయన ప్రజ్ఞ అర్థమవుతోంది.
6) తెగిపోయిన, మరియు కోతకు గురైన ముక్కుకు, ప్లాస్టిక్ సర్జరీని చేసి చూపించారు.
7) సుశ్రుతులు సర్జరీ సందర్భంలో రక్తస్రావాన్ని అరికట్టే విధానంలో చీమతలను బంధన సూత్రంగా వినియోగించే కొత్త పద్ధతి కనిపెట్టారు.
8) సుశ్రుత సంహిత ప్రకారం, సర్జన్ కు ఉండవలసిన లక్షణాలు, ధైర్యం, చురుకుదనం, తక్షణచర్య, పరికరాల పదును, చెమట వణుకు లేకపోవడం..
9) ప్రొస్టేట్ గ్రంధిని ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటూ ఎలా తొలగించాలి? ఎముకలు చిట్లడం ఎన్ని రకాలుగా ఉంటుంది? దానికి శస్త్రచికిత్స చేయడానికి సూత్రాలు ఏవి? యిలాంటి ఎన్నో శాస్త్రీయ పద్దతులను సుశ్రుతులు వేల సంవత్సరాల క్రితమే శోధించి, మానవజాతికి అందించారు.
10) ఎముకలు విరగడం అనేది 12 రకాలుగా ఉంటుందని కనుగొన్నారు.
11) మూత్రనాళం లో పేరుకొనే రాళ్ళను తొలగించడం ఎలాగో, సశాస్త్రీయంగా నిర్వహించి నిరూపించారు. అతి సున్నితమైన కంటిలో ఏర్పడే శుక్లాలను, వారి శస్త్రచికిత్సా విధానం ద్వారా విజయవంతంగా తొలగించారు. పొట్టభాగాన్ని, జీర్ణాశయ పొరలను, చీమతలకాయంత సన్నని సూదులతో కుట్లు చేసి అతికించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.
12) పోస్ట్‌మార్టం (శవ పరీక్ష) వేల ఏళ్ళ క్రితమే నిర్వహించి మార్గదర్శకత్వం వహించిన తొలి శాస్త్రవేత్త సుశ్రుతులు.శరీర నిర్మాణ శాస్త్రం పట్ల గాఢమైన అవగాహన ఉండాలని చెప్పారు. స్వయంగా వివిధ ప్రయోగాలు చేశారు. ఆరోగ్యంగా ఉండి, పిన్న వయసులో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గడ్డిలో చుట్టి, నిరంతరం ప్రవహించే నీటిలో కొద్దికాలం ఉంచి తీసిన తర్వాత, శిష్యులందరి సమక్షంలో ఆ దేహాన్ని కోసి, అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని వివరించేవారు.
13) గర్భిణీ స్త్రీ ఉదరంలో శిశువు క్రమ వికాసం, ఫలదీకరణ దశలు, తొమ్మిది నెలల్లో గర్భాశయంలో చోటుచేసుకునే క్రమపరిమాణాలు, శిశువు పెరుగుదలలోని దశలను గురించి ఎంతో విజ్ఞానాన్ని అందించారు సుశ్రుతులు.
14) నూతన మిలీనియం సందర్భంగా, 2000 సంవత్సరంలో బ్రిటన్ లోని వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ, ఒక జాబితాను వెలువరించింది. అందులో ప్రపంచ ప్రసిద్ధి పొందిన శస్త్ర చికిత్స వైద్యుల ఫోటోలతో పాటుగా వారి వివరాలు పేర్కొన్నారు. ఆ జాబితాలో తొలి చిత్రం ఆచార్య సుశ్రుతులది. ఈయన ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రవైద్య శిఖామణిగా పేర్కొనడం జరిగింది
15) ఇలా చెప్పుకుంటూ పోతే సుశ్రుతుల ప్రతిభ అనంతమని తెలుస్తుంది.
16) అన్నీ పాశ్చాత్యులే కనిపెట్టారనీ, భారతీయులకు ఏమీ చేతకాదనీ, అన్నీ పాశ్చాత్యులు పెట్టిన భిక్షే అనీ, మనం ఆత్మన్యూనతకు లోను కాకుండా, వారిని ఆదర్శపురుషులుగా తీసుకుని, వారి మార్గంలో నడవడానికి సంకల్పిస్తే రేపటి రోజు మనదే కావచ్చు.
సుశ్రుతాయ నమః

No comments:

Post a Comment