Friday 29 January 2016

స్థితప్రజ్ఞత్వం

దేహమునకు ప్రాణమాధారం, ప్రాణమునకు జీవుడు ఆధారం. జీవునకు ఆత్మజ్ఞానమాధారం.
గొడ్రాలికి బిడ్డ కలిగిందనే స్ఫురణయే పరబ్రహ్మమందలి సూక్ష్మమయిన మాయ. అలాంటి ధ్యాస ఎప్పుడు కలుగుతుందో మాయయందు ప్రతిఫలించిన పరబ్రహ్మమునకు ఈశ్వరుడన్న నామమొకటి ఆరోపింపబడింది. ఆ మాయా చిత్ర విచిత్ర రూపములు పెక్కులున్నాయి.
అందులో ప్రతిఫలించిన ఈశ్వరునికి సైతం చిత్ర విచిత్రములైన పెక్కు రూపములు కలిగాయి.
చలనశీలమైన మూలప్రకృతివలన గలిగిన శబ్దతన్మాత్రమైన ఆకాశమునందు ప్రతిఫలించిన
బ్రహ్మమునకు సదాశివుడనియూ, శబ్దగుణకమైన యాకాశము వలన కలిగిన శబ్దస్పర్శ తన్మాత్రమగు వాయువునందు బ్రతిఫలించి బ్రహ్మముకు మహేశ్వరుడనియూ, స్పర్శగుణకమైన వాయువువలన గలిగిన శబ్ద స్పర్శ రూప తన్మాత్రమగు తేజము ప్రతిఫలించిన బ్రహ్మమునకు రుద్రుడని, రూప గుణకమైన తేజమువలన కలిగిన శబ్దస్పర్శ రూప రసన్మాత్రమగు జలము ప్రతిఫలించిన బ్రహ్మమునకు విష్ణువనియూ, రసగుణకమయిన జలమువలన గలిగిన శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రయగు పృథివి యందు ప్రతిఫలించిన బ్రహ్మమునకు బ్రహ్మయనియూ నామములు కల్పించబడినవి. పంచకర్మలనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివులు. ప్రపంచోత్పత్తికి హేతుభూతమయిన మాయ పరబ్రహ్మంనందు ఒక అణువమాత్రమేనని వేదవిజ్ఞులు వ్యాఖ్యానించారు.
మాయ యను ఛాయయందు అనంతమైన ఆకాశం, ఆకాశమునందు వాయువును, వాయువునందు తేజస్సు, తేజస్సునందు జలమును, జలమునందు పృథివి అణిగియుండును. నిరాకారమగు పరబ్రహ్మముందు దోచిన మాయ పంచభూతములనుండి వానిని పరస్పరం
ఏకీభవింపజేయును. ఆ ప్రకారంగా ఏకీభవించిననెల్లనూ ఈశ్వర ప్రేరణ చేత అనేక కోటి
బ్రహ్మాండములయి వివిధ చిత్ర రూపములతో గానవచ్చును. స్ఫటికం అత్యంత స్వచ్ఛంగా
ఉన్ననూ, పంచవర్ణ సాన్నిధ్యంతో బహువిధవర్ణములుగా కనబడును. పంచభూతములందు ప్రతిఫలించిన పరబ్రహ్మము వాటి గుణములననుకరించి సదాశివుడనియూ, మహేశ్వరుడనియూ, రుద్రుడనియూ, విష్ణువనియు బ్రహ్మమనియూవ్యవహరించబడును.
సూర్యుడు ఉదయించిన వెంటనే చీకటి తొలగిపోయినట్లు, అంతర్జోతి అగుపడినంతనే
అహంకారము అడుగంటిపోవును. సర్వజంతువులకు సాధారణ ధర్మములయిన ఆహార, ఇంద్రియాది వ్యవహారములలో దగిలి పురుషార్థ చింతన లేక కేవలం పశుప్రాయులై
వర్తించు మూఢ జనులకంటే బింబార్చనాపరులు ఉత్తములుగా ఎంచబడుతున్నారు. బ్రహ్మ
తత్త్వమును బొందినవారు ఉత్తములుగా కాగా వారందరికంటే సచ్చిదానంద సంపద చేత
సర్వమును మరి సాక్షాత్కార దశను పొందినవారు ఉత్తమోత్తములు. సిద్ధులు, ముక్తులు పరమ
భాగవత ధర్మమునును అనుష్టించువారు సిద్దూ అనియూ, ముక్తులనియూ ఇరుతెగలుగా
ఉందురు.
మొట్టమొదట భక్తిమార్గము నవలంభించి చిత్తశుద్ధి కల్గిన మీదట యోగసాధనమునకు
పూనుకొని, నిరంతర సర్పమువలె వాయు భక్షణము చేయుచూ, కాయమునకు అపాయం
రానీయకుండా వాయువును వృద్ధి చేసుకొనుచూ, అణిమాది సిద్ధులను స్వాధీనపరచుకొని స్వేచ్ఛగా సంచరించుచూ, సంతోషించువారు సిద్ధులనబడుదురు. భగవద్భక్తితో, యోగమును
అభ్యసించి, సత్పురుష సాంగత్యం చేయుచూ, ఇంద్రియములను బంధించి, మనస్సును నిగ్రహించి దేహాభిమానము త్యజించి, పరతత్వమును విచారించి, తనను తాను తెలుసుకొని, బ్రహ్మమునందేకీభవించి, బ్రహ్మానంద సుధారసమును పానము చేయుచూ, నారూఢజ్ఞాన
సంపన్నులగు వారు ముక్తులనబడుదురు. కేవలం కుంభక ప్రాణాయామమే కర్మయోగమనియూ, అంతర్లక్షము అనగా అంతర్మేచయే జ్ఞాన యోగమని పెద్దలు చెప్పుదురు. కర్మయగము, జ్ఞానయోగము ఈ రెండింటియందు స్థితప్రజ్ఞగలవానికి మోక్షమరచేతిలోనుండును.

No comments:

Post a Comment