మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠఏ ఈ కలియుగానికి తరుణోపాయం’ అని శ్రీరామకృష్ణులు వాక్రుచ్చారు. సత్యం అన్నది సత్తుకు సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.
ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ రాళ్ళు కనపడ్డాయి. వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని భగవంతుణ్ణి నీవు పిలిచావు కాబట్టి వచ్చాను’ అన్నాడు.
‘అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు. ‘నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు. ‘అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.
నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’
దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.
‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”
‘నమ్ముతున్నాను’ అన్నాడు.
‘నేను ఏది చెప్పినా చేస్తావా?”
‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.
‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు
బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు.
‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.
‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.
సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి.
No comments:
Post a Comment