చాలా మంది జపం చేసేటప్పుడు చేతిలో ఒక మాలను ధరిస్తుంటారు. అయితే చాలా మంది రుద్రాక్ష మాలలనే ధరించి జపం చేస్తూ ఉండటం కనిపిస్తూ ఉంటుంది. తులసి పూసలతోనూ, స్ఫటికాలతోనూ చేసిన మాలలను కూడా పట్టుకొని జపం చేస్తారు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది రుద్రాక్ష జపమాలేనని దేవీభాగవతం పదకొండో స్కందం వివరిస్తోంది. రుద్రాక్షలతో జపమాలను ఎలా తయారు చెయ్యాలి, జపానికి ముందు ఆ మాలను ఎలా శుభ్రం చేయాలి అనే విషయాలు దేవీభాగవతంలో విపులంగా ఉన్నాయి.
ప్రతి రుద్రాక్షలోనూ ముఖభాగం బ్రహ్మదేవుడు. బిందు భాగం (ముళ్ళు ఉన్న భాగం) రుద్రుడు, పృచ్ఛ భాగం శ్రీమహావిష్ణువు స్థానాలని పెద్దలు చెబుతారు. పంచముఖి రుద్రాక్షలు ఇరవై అయిదు తీసుకుని వాటితో చేసిన జపమాల ఎంతో శ్రేష్టమంటారు. ఈ రుద్రాక్షలు కంటకాలతో గరుకుగా ఉండాలి. ఎరుపు రంగులో కానీ, తెలుపు రంగులో కానీ లేదా ఆ రెండూ కలసిన మిశ్రమ వర్ణంలోకానీ ఉండొచ్చు. ముఖభాగం ముఖ భాగంతోనూ, పృచ్ఛభాగం పృచ్ఛభాగంతోనూ కలిసేలా రుద్రాక్షలను మాలగా గుచ్చాలి. ఆవుతోకను చుట్టినప్పుడు ఉండే రూపంలాగా నాగపాశముడి(బ్రహ్మముడి) ఉండాలి. ఇలాంటి రుద్రాక్షమాలను నాగపాశం అని పిలుస్తారు.
రుద్రాక్ష జపమాలతో జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుందంటారు. ఇలాంటి జపమాలను జపానికి ముందు సుగంధ జలాలతో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత ఆవుపాలు, ఆవుపేడ, ఆవునెయ్యి, ఆవుపెరుగు, ఆవు పంచతం తో తయారైన పంచ గవ్యాన్ని ఆమాలమీద చల్లాలి. ఆ తర్వాత మళ్ళీ పవిత్ర జలంతో స్నానం చేయించాలి. అప్పుడు జపించదలచుకున్న మంత్రాలను న్యాసం చేయాలి. శివాస్త్ర మంత్రం జపిస్తూ ప్రతి రుద్రాక్షను స్పృశించాలి. మూల మంత్రాన్ని న్యాసం చేసి ఆ తర్వాత మళ్ళీ పవిత్ర జలాలతో మాలను కడగాలి. అనంతరం పరిశుభ్రమైన పీఠం మీద ఉంచాలి. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఆ మాలలోకి ఆవాహన చేయాలి. అలా చేసిన మాలను "ప్రతిష్ఠిత మాల" అని అంటారు. అది సర్వ వాంఛా ప్రదమన్నది నమ్మకం.
రుద్రాక్ష జపమాలతో ఏ దేవతా మంత్రానైన్నా జపించవచ్చు. ఈ పవిత్ర మాలను శిరసున గానీ, మెడలోకానీ, కర్ణాభరణంగా కానీ, ధరించ వచ్చంటారు. జపం కాగానే కళ్ళకద్దుకొని యధావిధిగా మాలను ధరించాలి. స్నాన, దాన, జప, హోమ, వైశ్వదేవ, సురార్చన, ప్రాయశ్చిత, శ్రాద్ధ, దీక్షా కాలాలలో రుద్రాక్ష మాలలను ధరిస్తే విశేష ఫలితం లభిస్తుందంటారు. ఒకరు ధరించిన రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. అలాగే శుచిగా లేని సమయాలలో కూడా రుద్రాక్షమాలలను ధరించకూడదని దేవీ భాగవతంలో స్పష్టంగా ఉన్నది.
రుద్రాక్ష విశిష్టతను చెబుతూ రుద్రాక్ష చెట్టు నుంచి వచ్చిన గాలి సోకితేనే గడ్డిపరకలు సైతం పుణ్యలోకాలకు చేరుతాయని పురాణాలు వివరిస్తున్నాయి. రుద్రాక్షను ధరించిన పశువులు కూడా రుద్రత్వం పొందుతాయని జాబాలశ్రుతి వివరిస్తోంది. ఈ కారణం చేతనే కాస్తంత సంప్రదాయం తెలిసిన వారు రుద్రాక్షను ధరిస్తుంటారు. ఋషులు, మునులు, యోగులు రుద్రాక్షను ధరించకుండా కనిపించరు. జపం మీద శ్రద్ధ పెరగటానికి కూడా రుద్రాక్ష ఓ కారణమని పరిశోధకులు చెబుతున్నారు. రుద్రాక్ష మాలతో జపం చేస్తే అనంత పుణ్యఫలం లభిస్తోందని, చేతులకు, వక్షస్థలానికి, మెడకు, చెవులకు, శిరస్సుకు రుద్రాక్షలను ధరించిన వాడు సాక్షాత్తు రుద్ర సమానుడని దేవీ భాగవతంలో నారదుడు వివరించాడు.
రుద్రాక్షను ధరించి మరణిస్తే కుక్క సైతం ముక్తిని పొందుతుందని ఇదే సందర్భంలో వివరించాడు నారదుడు. ఇరవై ఒక్క రుద్రాక్షలను సంపాదించి ధరించగలిగితే శివలోక ప్రాప్తి సిద్ధిస్తుందని దేవీ భాగవతంలోని కధాంశం పేర్కొంటోంది. ఇది పురాణ పరంగా రుద్రాక్షమాలల ధారణకు సంబంధించిన విశేషమైతే, ఆధునికులలో రుద్రాక్షధారణ రక్తపోటు లాంటివి నియంత్రించగలదని కొందరు పరిశోధకులు అంటున్నారు.
No comments:
Post a Comment