Saturday 30 January 2016

తులసీ దళాలను సరైన రోజులలోనే తెంపుతున్నారా?

కార్తీక మాసంలో మనం శివ విష్ణువులను సమానంగా పూజిస్తూ ఉంటాం. ఇంకా అనేక వ్రతాలు కూడా కార్తీకమాసంలో వస్తాయి. శివ విష్ణువులకు తులసి అత్యంత ప్రీతిదాయకం. తులసి దేవతావృక్షం. తులసీ దళాలను మనం ఎప్పుడు పెడితే అప్పుడు తెంపరాదు. వాటికి అనేక నియమాల్ని మనకు పురాణాల్లో వ్యాసాదులు తెలియజేసారు.
విష్ణుధర్మోత్తర, పద్మ పురాణాల్లో ఇట్లా ఉంది. వైధృతి, వ్యతీపాత యోగములయందు, ఆది, మంగళ, శుక్రవారముల యందు, పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి తిథుల యందు, సంక్రమణం రోజున, జాతాశౌచ, మృతాశౌచముల యందు, ఎట్టి పరిస్థితులలోనూ తులసిని తెంపరాదు. తెంపిన యెడల విష్ణువు శిరస్సును తెంపినట్లే యని పురాణ వాక్యం. ఇవి వదిలి మిగతా రోజులలో తులసిని తెంపవచ్చు.
తులసిని తెంపుతున్నపుడు ఈ శ్లోకాన్ని పఠించాలి.
తులస్యమృతనామాసి సదా త్వం కేశవ ప్రియే
కేశవార్థం విచిన్వామి వరదా భవశోభనే.
ఉసిరి ఆకుల విషయం
కార్తీకమాసములో ఉసిరి ఆకులు తెంపిన వారికి కూడా విష్ణువు శిరస్సును తెంచిన దోషం వస్తుందని పౌరాణిక వచనం. కార్తీక మాసంలో వనభోజనంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం అనేది మనకు సాంప్రదాయం. ఆ సందర్భంలో ఉసిరి ఆకులు తెంపే అవకాశం ఉంటుంది కాబట్టి, కార్తీకమాసంలో ఉసిరి ఆకులు తెంపరాదని ఋషులు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం.

No comments:

Post a Comment