Thursday 10 March 2016

మానసాదేవి


కశ్యప ప్రజాపతి ప్రార్ధన చేత పరమేశ్వరి ఆయన కుమార్తెగా ఆయన మనసులో నిరంతరమూ తెజోరూపంతో ప్రకాశిస్తూ సర్వకార్య సిద్ధిని కలిగించసాగింది. 
ఈ మానసాదేవి మూడు యుగాల కాలము తపస్సు చేసి, తపః ప్రభావం వల్ల శైవి, వైష్ణవి, వాగీశ్వరి, విషహరి అనే పేర్లతో ప్రఖ్యాతి చెందింది. జనమేజయుని సర్పయాగాన్ని మాన్పించిన ఆస్తీకుడు మానసాదేవి పుత్రుడే. 
పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు సర్పయాగం చేసాడు. ఎక్కడెక్కడి సర్పాలు అగ్నికి ఆహుతు అయ్యాయి. నాగరాజైన తక్షకుణ్ణి కుడా నాశనం చేయాలనే సంకల్పంతో జనమేజయుడు ప్రయత్నించాడు. ఆ తక్షకుడు ప్రాణ భయంతో ఇంద్రుణ్ణి ఆశ్రయించాడు. ఆ సంగతి గ్రహించిన జనమేజయుడు "సహేంద్ర తక్షకాయ స్వాహా" అని మంత్రోచ్చాటనం చేసాడు. తక్షకుణ్ణి రక్షించబోయిన తనకు సైతం ముప్పు వాటిల్లనున్నదని గుర్తించి ఇంద్రుడు, ఎలాగైనా సర్పయాగాన్ని మాన్పించ వలసినదిగా ఆస్తీకుణ్ణి ప్రార్ధించాడు. ఆస్తీకుడు జనమేజయుని వద్దకు వెళ్లి సర్పయాగాన్ని మాన్పించి, సర్పజాతికి ప్రాణభయం లేకుండా చేసాడు. అలంటి ఆస్తీకునికి తల్లి అయిన 'మానసాదేవి'ని ఆరాధించిన వారికి సమస్త భయాలు బాధలు తొలగిపోతాయి.
ఈ వృత్తాంతం చెప్పి, వ్యాసమహర్షి జనమేజయుణ్ణీ దేవీ యాగానికి ప్రోత్సహించాడు. ప్రతీకారేచ్చ లక్ష్యంగా, ప్రాణ హింస ప్రధానంగా సాగించిన సర్పయాగం వల్ల ప్రాప్తించిన పాపం పరిహారం కావాలంటే దేవీయాగం చేసి, మానసాదేవిని ఆరాధించడం మంచిదని వ్యాసుడు జనమేజయునకు ఉపదేశించాడు. దేవి అంశావతార రూపమే 'మానసాదేవి'.

No comments:

Post a Comment