Tuesday, 22 March 2016

నవగ్రహ ప్రదక్షిణఒక మంచి విషయము ధర్మ సందేహము

నవగ్రహ ప్రదక్షిణఒక మంచి విషయము ధర్మ సందేహము/.....సమాధానము ........
నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుగుకోవాలని అంటున్నారు.
కొంతమంది ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుగుకోవాలని, అట్లాగే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్నానం చేసి దొడ్డి గుమ్మం ద్వారా ఇంటికి వెళితే కనుక నవగ్రహ దోషములు అన్నీ తొలుగుతాయని అంటున్నారు.
నవగ్రహములకు ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుగుకోవటం మంచిదా ?
అదే విధంగా ఇంకా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉంటాయా ?
ముందుగా ఓ మాట ..... ఏ దేవతా ఆలయాలకు ప్రదక్షిణ చేసినా కాళ్ళు కడుగుకొనవలసిన అవసరం లేదు. కేవలం, దానములు చేసిన తర్వాత మాత్రమే, తీసుకున్నవారు - ఇచ్చినవారు కూడా పాద ప్రక్షాళన చేసుకోవాలి.
పూర్వం కొంతకాలం ..... సాంసారిక జీవితంలో వున్నవాళ్ళు శివాలయంలోకి ప్రవేశించరాదని, శివదర్శనం చేసుకుంటే స్నానంచేసి ఇంట్లోకి ప్రవేశించాలి అని కూడా ప్రచారం జరిగింది.
ఆ తరువాత పండితసభలు మరియు పీఠాదిపతుల అనుగ్రహ భాషణములు విని తిరిగి అందరూ శివాలయాలలోకి వెళుతున్నారు. ప్రస్తుతం నవగ్రహముల విషయంలో కూడా అదే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ....... మనమందరం గమనించే విషయం ఒకటి చెబుతాను. నవగ్రహములను ఆలయంలో ఈశాన్యము లేదా వాయవ్యంలో ప్రతిష్ఠ చేస్తారు. ఈశాన్యము అంటే, ఎనిమిది దిక్కులలోకి పవిత్రమైనటువంటిది.
ఈ విషయం మనకందరికీ తెలుసు. అంటే నవగ్రహములు ఉన్నతమైనవి అని అర్థమవుతోంది కదా !
అదే విధంగా, కొంతమంది నవగ్రహములలో శనీశ్వరుడు ఉంటాడు కనుక, ప్రదక్షిణ చేసిన తర్వాత పాద ప్రక్షాళన చేసుకోవాలి అని అంటున్నారు. శని+ఈశ్వర అని మనమే అంటున్నాము, మళ్ళీ మనమే నిందిస్తున్నాము.
అంటే, మనం చేస్తోంది తప్పు అని మనకి తెలుసు. కానీ, ఎవరో ఒకరు (మనలో వుండే బలహీనతను సొమ్ము చేసుకోవటానికి లేదా అజ్ఞానంతో) చెప్పిన మాట విని దానినే నిజమని నమ్మి, ప్రచారం చెయ్యటం జరుగుతోంది. ఇది మంచి ఆలోచన కాదు. ఇటువంటి ఆలోచనలు మన హిందూ ధర్మ ప్రచారానికి కూడా ఆటంకంగా ఉంటున్నాయి.
అదే విధంగా ..... నవగ్రహములకు అభిషేకము లేదా అర్చన చేసిన తర్వాత తీర్థ ప్రసాదములు తీసుకోకుండా అక్కడే వదిలేసి వస్తున్నారు. ఇది కూడా ఆమోదయోగ్యము కాదు. నవగ్రహముల అనుగ్రహము కోసం పూజ చేసి, చివర్లో ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలేస్తే, ఆ గ్రహ అనుగ్రహం ఎలా వస్తుంది. అలా చెయ్యటం కంటే అసలు నవగ్రహ పూజ, నవగ్రహ ప్రదక్షిణ, నవగ్రహ అభిషేకం చెయ్యకుండా వుంటే మంచిది. దూరంగా నిలబడి, ఒక నమస్కారం పెట్టి వదిలేయండి. ప్రత్యేకంగా నవగ్రహాల దగ్గరకు వెళ్లి మరీ, అవమానించినట్లు అవుతోంది కదా !
ఉదా.కు ఓ మాట ..... మనం ఒకరి ఇంటికి కలవాటానికి వెళ్లాం అనుకోండి. వారితో అంతా మాట్లాడిన తరువాత బయటకు వచ్చి వాళ్ళ ముందే కాళ్ళు కడుగుకొని, "మేము మీ ఇంటికి రాకూడదు. కానీ వచ్చాం. కనుక, మా మీద కోపం చూపించకండి" అంటే ఎలా వుంటుంది ? అతనికి లేని ఆలోచన, మనమే వెళ్లి మరీ కల్పించినట్లు అవుతుంది.
ఒకవేళ, పాద ప్రక్షాళన చెయ్యాలి అనే మాట నిజమైతే ..... నవగ్రహ ఆలయాలో అర్చకత్వం చేసే బ్రాహ్మణులు ఎన్నిసార్లు పాద ప్రక్షాళన చేసుకోవాలి ! ఆ ఆలయం నిర్వహిస్తున్న ధర్మకర్తలు ఇంకెన్నిసార్లు పాద ప్రక్షాళన చేసుకోవాలో మరి !
ఇంత చెప్పినా ..... మీ మనస్సు ఇంకా ఒప్పుకోకపోతే కొంతకాలం ఒక పని చెయ్యవచ్చు. ఏదైనా, ఆలయానికి వెళితే ముందుగా నవగ్రహ ప్రదక్షిణ చేసి, ఆ తారవాత ఆలయంలో వుండే ఇతర దేవతలకు ప్రదక్షిణ (లేదా) పూజలు చేయండి. ఇలా చేస్తే, మీ మనస్సులో కూడా ఆ అనుమానం తీరిపోతుంది

No comments:

Post a Comment