Saturday 26 March 2016

అద్దం పగలకూడదా.....!!


మనం అందం, ఆకారం ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం... అద్దం. అది మనల్ని మనకు పరిచయం చేస్తుంది. మన అందాన్ని పట్టి చూపిస్తుంది. అటువంటి అద్దం పగిలితే అరిష్టమంటారు మన పెద్దలు. పగిలిన అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. పగిలిన, మరకలు పడిన, మాసిపోయిన అద్దాన్ని అసలు ఇంటిలోనే ఉంచుకోకూడదని వారి వాదన. మన ఇంటి గోడకు హుందాగా వేళ్లాడే అద్దం వెనుక ఇటువంటి నమ్మకాలు, కథలు ఎన్నో ఉన్నాయి.
హిందువులు అద్దాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే అద్దం పగిలితే సంపద చెల్లాచెదురైపోతుందని అంటారు. అద్దంలో ఎప్పుడూ ఒకే బొమ్మ నిలిచి ఉండదు. లక్ష్మి కూడా అంతే. నిలకడగా ఉండదు. అందుకే అద్దం పగిలితే ధననష్టం జరుగుతుందని పెద్దలు చెబుతారు.
అద్దం పగిలితే ఏదో కీడు జరుగుతుందని భావిస్తారు కొందరు. దానికి ఏవో కారాణాలు చెబుతారు. అద్దం మనను ప్రతిబింబిస్తుందని, అది పగిలితే మన రూపం ఛిద్రమైనట్టేనని వారి అభిప్రాయం. అటువంటి నమ్మకాల వెనుక కొన్ని ప్రాక్టికల్ నిజాలున్నాయంటున్నారు ఆధునిక పరిశోధకులు. అద్దం అంటే గాజుతో తయారుచేయబడిన వస్తువు. కాబట్టి జారిపడి పగిలినప్పుడు ఎంత జాగ్రత్తగా ఏరినా… అక్కడక్కడా చిన్న ముక్కలు ఉండి కాళ్లలో గుచ్చుకుంటాయి.
కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదంజరుగుతుందని మన పూర్వీకులు ఆ విధంగా చెప్పి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా అద్దం పగిలితే మరో అద్దం కొనాలి. అందుకు ధనవ్యయం అవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిదని అంటున్నారు.

No comments:

Post a Comment