Friday 25 March 2016

చంద్రగ్రహ దోష నివారణకు అందం, ఆరోగ్యానికి రోహిణి చంద్ర శయన వ్రతం


చంద్రుడు జగత్తులోని అన్నానికి, ఔషధులకు, వనస్పతులకు అధిపతి. ఆయన లేనిదే సృష్టికి జీవకళ లేదు.వరాహపురాణ కథాక్రమం పరిశీలిస్తే చంద్రుడికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి ఏర్పడిన సంఘటనకు సంబంధించిన విషయాలను కూడా మనం గమనించవచ్చు. దక్షప్రజాపతి శాపంతో చంద్రుడు అదృశ్యమవుతాడు. చంద్రుడు ఎక్కడ ఉన్నదీ ఎవరికీ ఆనవాలు దొరకలేదు. దేవతలు, మనుషులు, పంటలు చంద్రుడు కనిపించకపోవటం చేత నిర్జీవం అయి సృష్ఠి అంతా దిక్కుతోచని స్థితికి చేరుకుంది. ఔషధులన్నీ నిస్సారాలయిపోయాయి. ఆ పరిస్థితికి చింతించి దేవతలంతా కలిసి శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. మహావిష్ణువు విషయాన్ని సునిశితంగా ఆలోచించి ఔషధులను అన్నిటినీ పాలసముద్రంలో వేసి ఆ సముద్రాన్ని మధించమని, అప్పుడు మళ్ళీ చంద్రుడి సాక్షాత్కారం జరుగుతుందని చెప్పాడు.
శ్రీమహావిష్ణువు సూచన ప్రకారమే దేవతలంతా సాగరమథనం చేశారు. అప్పుడు మళ్ళీ సముద్రం నుంచి చంద్రుడు ఉదయించాడు. దేహాలలో జీవుడుగా ఆనాటి నుంచి చంద్రుడు ఉండసాగాడు. దేహంలో ఉన్న పురుషుడు చంద్రుడేనని ఆ చంద్రుడు సౌమ్యమూర్తని పేరు పొందాడు. పదహారు కళలతో ఉన్న ఆ చంద్రుడిని రుద్రుడు శిరసున దాల్చాడు. సకలసృష్టికి జీవాధారమైన చంద్రుడు శివుడి శిరస్సున ఉండి మరింతగా తన గొప్పతనాన్ని పెంచుకున్నాడు. ఆ చంద్రుడి స్వరూపమే నీరు. చంద్రుడి లోకకళ్యాణ కారక తత్వాన్ని గమనించి ఆ చంద్రుడికి మానవలోకంలో మరింతగా పవిత్రతను కలిపిస్తూ బ్రహ్మదేవుడు పౌర్ణమాసి అనే తిధిని చంద్రుడికి ఇచ్చాడు. ఆ నాటి నుంచి పూర్ణిమ తిధిగా ఏర్పడింది.
పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి చంద్రపూజ చేసినవారికి మంచి జ్ఞానం కలుగుతుందని, కాంతి, పుష్ఠి, ధనం, ధ్యానం లాంటివి చంద్రుడు అనుగ్రహంతో పొందవచ్చన్నది ఆస్తికుల నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగానే చంద్రాయణ వ్రతాలు, ప్రతిమాసంలోనూ వచ్చే పౌర్ణమిరోజున చేసే పుర్ణిమ వ్రతాలు ఇలాంటివన్నీ ఆవిర్భవించాయి. పురాణాల కథల ఆధారంగా చంద్రుడికి సంబంధించిన విషయాలు ఇలా ఉంటే శాస్త్రీయ దృక్పథంతో చేసిన పరిశోధనలో కూడా సృష్టికి జీవకళ వచ్చేందుకు, జీవులు బలంతో వృద్ధిచెందేందుకు చంద్రుడు ఎంతగానో ఉపకరిస్తాడని శాస్త్రపరిశోధనలు వివరిస్తున్నాయి.
ఏ వ్రతం చేశారో? ఏమి నోములు నోచారో? ఇంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నారు అని కొందరిని చూసి అనుకుంటానే ఉంటాం. హాయిగా, అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఆస్తిక భావనల నేపథ్యంలో ఓ వ్రతముంది. దీని గురించి మత్స్య పురాణం వివరిస్తోంది. నారదుడికి పరమేశ్వరుడు ఈ వ్రతాన్ని గురించి వివరించాడు. లోకంలో నిరంతరం దీర్ఘ ఆయురారోగ్య వంశాభివృద్ధి సర్వగుణ సమృద్ధులు కలగటానికి పనికొచ్చే వ్రతాన్ని చెప్పమన్నప్పుడు ఈశ్వరుడు నారదుడికి రోహిణి చంద్ర శయనవ్రతం అనేది ఒకటుందని చెప్పాడు. ఈ వ్రతం చేస్తే ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కూడా అక్షయ ఫలితాలు కలుగుతాయన్నాడు.
వ్రతం చేయదలచుకున్న వారు శ్రీమహావిష్ణు ప్రతిమను తెచ్చి చంద్ర నామాలతో పూజించాలి. పూర్ణిమ, సోమవారం కానీ, రోహిణీ నక్షత్రంతో పూర్ణిమ వచ్చిననాడు కానీ ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయం, గోమూత్రం అనే పంచగవ్యాలతో ఆవాల పిండిని కలిపి స్నానం సమర్పించాలి. ఆ తర్వాత వ్రతానికి నిర్దేశించిన మంత్రం అష్టోత్తర శతనామాల వంటి వాటితో విష్ణువుకు పూజాదికాలు నిర్వహించాలి. ఈ పూజాదికాలు అన్నీ పండితుల సూచనల మేరకు నిర్వహించాలి. వ్రతం చేసే రోజున హవిష్య అన్నాన్ని మాత్రమే భుజించాలి. హనిష్య అన్నం అంటే ఉప్పు, కారం, పులుపు, నూనె తగలని ఆహారం. కేవలం బియ్యంతో పాలు, పెసరపప్పు లేదా బీరకాయ వంటి సాత్విక కూర ముక్కలను మాత్రమే కలిపి అత్తెసరు పెట్టి వండిన అన్నం. ఈ అన్నాన్ని స్వీకరించి నేలమీదనే పడుకోవాలి. ఆ మరునాటి ఉదయం స్నానాదికాలు ముగించుకొని స్వర్ణ జలపాత్రను దానమివ్వాలి. ఆ పగలంతా ఉపవాసం ఉండాలి. మధ్యలో గోమూత్రం మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. రాత్రికి మళ్ళీ నియమబద్ధమైన ఆహారాన్నే స్వీకరించాలి.
నియమబద్ధమైన ఆహారమంటే మాంసం, ఉప్పు, పులుపు కారం లేనిది. దీన్ని కూడా ఎంతబడితే అంతగాక కేవలం 28 ముద్దలు మాత్రమే తినాలి. ఆ తర్వాత భగవత్కథా శ్రవణం చేయాలి. ఇలా సంవత్సరంలో వచ్చే పన్నెండు పూర్ణిమలలో చేయాల్సి ఉంటుంది. చంద్రరూపంలో ఉండే శ్రీమహావిష్ణువు ప్రీతి కోసం ఏ మాసంలో ఏ పూవులు వస్తాయో, వాటిని ప్రత్యేకించి వాడాలి. కడిమి పూలు, నల్లకలువ, మొగలి, జాజి, తామర, శతదళ పద్మం, వాడగన్నేరు, తాజా తామరపూలు, తెల్లగన్నేరు, ఎర్రగన్నేరు, సంపెంగ లాంటి పూలు ఈ వ్రతం చేసే పూజలో వినియోగించటం మంచిది. పూర్ణిమ, సోమవారం కలిసొచ్చినా, పూర్ణిమ రోహిణీ నక్షత్రాలు కలిసి వచ్చినా ఈ వ్రత ప్రారంభానికి సర్వ శ్రేయస్కరం.
సంవత్సరకాలం పాటు చేసిన వ్రతం ముగిసిన తర్వాత కొన్ని దానాలను చేయాలి. వాటిలో ముఖ ప్రతిబింబం చూసుకొనే అద్దాలు లాంటి పరికరాలు, అలంకారాలు ఉన్నాయి. అలాగే ఒక మంచి మంచం, ఆరు అంగుళాల చంద్ర ప్రతిమ, నాలుగు అంగుళాల రోహిణి ప్రతిమలను బంగారంతో చేయించి దానం ఇవ్వాలి. అలాగే పాలపాత్ర మీద వస్త్రాన్ని పరిచి, అక్షతలు నింపిన కంచుపాత్రను దానిమీద ఉంచి దానం ఇవ్వాలి. దీనితో పాటు మంచి వస్త్రాల జత, ఆభరణాలు, శంఖం, తెల్లని బియ్యం, చెరకు, పండ్లు, ముఖానికి అద్దుకొనే బంగారు బిళ్ళ, వెండి గిట్టలు, వెండికొమ్ములు, పై వస్త్రం, పాలు పిండే పాత్ర ఇవన్నీ కలిపి దూడతో ఉన్న పాడి ఆవును మంత్రపూర్వకంగా ఉత్తములైన దంపతులకు దానం చేయాలి. అలా దానం ఇచ్చేటప్పుడు ఆ దంపతులను లక్ష్మీనారాయణులుగా, రోహిణీ చంద్రరూపులుగా త్రికరణ శుద్ధిగా భావించాలి. దానం ఇస్తూ ఇలా అనుకోవాలి. ఓ నారాయణా! రోహిణీ రూపమైన లక్ష్మి, చంద్రరూపుడివైన నిన్ను విడిచి వెళ్ళనట్లుగానే నన్ను కూడా ఐశ్వర్యాలన్నీ విడిచి వెళ్ళనట్లుగా అనుగ్రహించు. ఓ చంద్రుడా! నీవు సర్వప్రాణులకు పరమానందాన్ని కలుగ చేస్తుంటావు. సంసార భీతుడినై ముక్తికాముడినైన నాకు నీలోని దృఢశక్తి చేత భుక్తి, ముక్తి కలిగేలా అనుగ్రహించు అని ప్రార్థించాలి.
ఇలా నియమబద్ధంగా ఈ వ్రతాన్ని చేస్తే చక్కటి రూపం మంచి ఆయువు, ఆరోగ్యం లభిస్తాయి. ఈ వ్రతం పితృదేవతలకు కూడా ప్రీతికరమైనదని, ఇరవై ఒక్క వందల కల్పాల కాలం త్రిలోకాధిపత్యం, బ్రహ్మజ్ఞానం, ముక్తి అనే లాంటివి కలుగుతాయని వ్రతానికి ఫలశ్రుతిగా ఈశ్వరుడు చెప్పాడు. దీన్ని పురుషులు, స్త్రీలు ఇద్దరూ చేయవచ్చన్నాడు. ఈ వ్రత కథనంతా చదివి సునిశితంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అవగతమవుతాయి. భక్తి, నమ్మకాలతో కూడుకొన్న ఈ వ్రతంలో ఆరోగ్య నియమాలు ఇమిడి ఉన్నాయి. చంద్రగ్రహ ప్రతీకలైన ఆవుపాలు, పెరుగు, నెయ్యి, ఆవు మూత్రం పేడ (గోమయం) అనే వాటిలో దివ్యమైన ఔషధ లక్షణాలున్నాయని ఆయుర్వేద శాస్త్రం స్పష్టం చేస్తుంది. అలాంటి ఔషధాలతో అనవసరమైన ఉప్పు, కారం, నూనెలు, మాంసం లాంటి వాటి జోలికి పోకుండా సాత్వికమైన హవిష్య అన్నాన్ని భుజించటం లాంటివన్నీ వ్రతంలో చెప్పిన నియమాలు. ఇలాంటివన్నీ పాటిస్తే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే అందం కలుగుతాయని ఈనాడు కూడా చాలా మంది వైద్యులు చెబుతున్న మాటే. కనుక ఈ వ్రతం సువ్రతమేనని చెప్పవచ్చు

No comments:

Post a Comment