అడవిలో ఆలయం ముళ్లు, రాళ్లలో ప్రయాణం అడుగడుగునా ప్రణవిల్లే దైవత్వం కోరిన కోర్కెలు తీర్చే పుణ్యధామం కష్టాలు తొలగిపోయే ఇష్టకామేశ్వరి దర్శనం శ్రీశైలం మల్లన్న స్వామికి చేరువలో భక్తుల కోర్కెలు తీరుస్తున్న ఇష్టకామేశ్వరి దేవి ఆలయం గురించి తెలుసుకుందాం.
పూర్వం సిద్ధుల పూజలు అందుకున్న ఇష్టకామేశ్వరీ దేవి నేడు భక్తులందరికీ దర్శనమిస్తూ అనుగ్రహిస్తోంది. శ్రీశైలం నుంచి డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం కనిపిస్తుంది. దట్టమైన నల్లమల అడవిలో కష్టతరమైన ప్రయాణం చేసి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు భక్తులు. పక్షుల కిలకిలలు జంతువుల అరుపులు జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుంది.
ఇక్కడి ఆలయంలో అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో తామర పుష్పాలను మిగతా రెండు చేతుల్లో జపమాల - శివలింగం ధరించి కనిపిస్తుంది. విష్ణుదర్మోత్తర పురాణంలో పార్వతీదేవి రుద్రాక్షమాల, శివలింగాన్ని ధరించి ఉంటుందని వర్ణించబడింది. అందుకే ఈ అమ్మవారిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఆ తల్లి నుదురు మెత్తగా ఉంటుందని అభిషేకాలు నిర్వహించే అర్చకులు చెబుతుంటారు. ఇష్టకామేశ్వరి నుదుటిపై బొట్టు పెడితే తమ కోరికలు 41 రోజుల్లో తప్పకుండా నెరవేరతాయని భక్తుల నమ్మకం. అమ్మవారిని దర్శించి తమ కోరికలు చెప్పుకుంటే, తప్పకుండా ఆ కోరికలు నెరవేరతాయని అంటారు. ఇదే విషయం 'ఇష్ట కామేశ్వరీ వ్రతం' లోను కనిపిస్తుంది.
అమ్మవారి ఆలయంలోకి పాకుతూ వెళ్లాలి.. చిన్న పాటి గుహలా కనిపిస్తుంది. గర్భగుడిలో నలుగురు కూర్చోడానికి మాత్రమే స్థలం ఉంటుంది. వారికి దర్శనం అయిన తర్వాతే మిగతావాళ్లు వెళ్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు అధికసంఖ్యలో ఇక్కడకి వస్తుంటారు. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పెరుగన్నం, పొంగలిని నివేదనగా సమర్పిస్తారు.
ఇక ఇక్కడి ఆలయ గోపురానికి ఓ ప్రత్యేకత ఉంది. మెట్ల రూపంలో కోలగా కనిపిస్తుంటుంది. జిల్లాలోని కొలమిగుండ్ల శివారులో నాలుగు శివాలయాలున్నాయి.. వాటి గోపురాలను కూడా మెట్ల లాగే నిర్మించారు. శ్రీశైలం మల్లన్న గర్భాలయ విమాన గోపురం కూడా మెట్లను కలిగి కోలగా కనిపిస్తుంది.
ఈ ఆలయానికి ఎదురుగా భిన్నమైన సిద్ధుని విగ్రహం, మహిషాసురమర్ధని విగ్రహం, కాపాలికుని విగ్రహం కనిపిస్తాయి. దీనినిబట్టి ఒకప్పుడు సిద్దులకు తర్వాత కాపాలికులకు ఈ ఆలయం కేంద్రంగా ఉండేదని భక్తులు చెబుతుంటారు. ఇక ఇక్కడ ఉత్తర వాహినిగా ఓ వాగు నిరంతరం ప్రవహిస్తుంటుంది. శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి, భ్రమరాంబదేవి వెలిసిన సమయంలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా వెలిశారని ఇక్కడి పూజారులు చెబుతున్నారు.
ఆవిడను దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఏ కారు వెళ్ళదు. శ్రీశైల క్షేత్రంలో వున్న కొన్ని జీపులు మాత్రం వెళ్తాయి. అది కూడా గుండె దిటవు వున్నవాళ్ళు అయితేనే వెళ్ళగలరు. ఈ జీపుల్లో ఏడుగురిని మాత్రమే ఎక్కించుకుంటారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 770 రూపాయలు వసూలు చేస్తారు. రోజు మొత్తం మీద చెక్ పోస్టు నుంచి 10 జీపులను మాత్రమే ఆలయానికి పంపిస్తారు.. గతంలో త్రిపురాంతకం నుంచి యర్రగొండపాలెం వెళ్లి అక్కడ నుంచి 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించి పాలుట్ల నెక్కంటి మీదుగా ఇష్టకామేశ్వరి ఆలయానికి చేరుకునే అవకాశం ఉండేది. కాని భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరి చేశారు. అయితే రోడ్డు సరిగ్గా లేదని కనీసం మట్టి రోడ్డయినా వేయాలని భక్తులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు.
పక్షుల కిలకిలలు . జంతువుల అరుపులు ... జలపాతాల సవ్వడి మధ్య ప్రయాణం సాగుతుంది. ఈ క్షేత్రంలోకి ప్రవేశించగానే మనం ఒక మహా శక్తిమంతమైన ప్రదేశంలో వున్నామనే భావన తప్పకుండా కలుగుతుందట.
No comments:
Post a Comment