Thursday, 10 March 2016

భగవంతునికి ఇచ్చే హారతి మన అహంకారాన్ని కరిగిస్తుంది.....!!


భగవంతునికి పూజ చేసిన తరువాత చివర్లో హారతి ఇస్తాం. హారతి ఇస్తూ గంట వాయిస్తాం. ఇది షోడశోపచార పూజా కార్యక్రమంలో ఒక భాగం. హారతి ఇవ్వడం శుభసూచకమైన మంగళ నీరాజనంగా సూచింపబడుతుంది. కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇస్తాం. దేవునికి ఆ హారతిని చూపించి ఆ తరువాత మనం కళ్లకు , తలపైభాగానికి అద్దుకుంటాం.
హారతి కర్పూరంతో ఇస్తాం. కర్పూరం వెలిగించినప్పుడు ఏ మాత్రం మిగలకుండా పూర్తిగా కాలిపోతుంది. కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు ప్రతీక. మనలో ఉండే అహంకారాన్ని దగ్ధం చేసి భగవంతునికి దగ్గర చేస్తుంది. తనను తాను ఆహుతి చేసుకొంటూ కూడా చక్కని సువాసనని వెలువరిస్తుంది. అదే స్ఫూర్తితో మనం మన గురువుని, సంఘాన్ని సేవించుకుంటూ .. అందరికీ ప్రేమ అనే సుగంధాన్ని వ్యాపింపచేయడానికి మనస్ఫూర్తిగా మనల్ని మనం అర్పించుకోవాలి.
భగవంతునికి హారతి ఇచ్చిన తరువాత దానిని కళ్లకు అద్దుకుంటాం. భగవంతుని ప్రకాశింపచేసిన ఆ వెలుగు మనందరిపై కూడా పడి ..మన దృష్టిని కూడా వెలిగించాలని..మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలని భావిస్తూ చేతులు దానిపై ఉంచి కళ్లకి, తలపై భాగానికి అద్దుకుంటారు. ఇదే హారతి ఇవ్వడంలోని పరమార్ధం.
అయితే హారతిని కర్పూరంతో ఇవ్వడంలో ఆరోగ్యపరమైన కారణం ఉంది. కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని స్వచ్చంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడుతుంది.కళ్ళకు మంచిది. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, కర్పూరం వల్ల అసంఖ్యాకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి హారతి సమయంలో గంట కొడతారు. అంటే.. ఆలయంలో దేవుడి విగ్రహంలోకి సకలదేవతలను ఆహ్వానించడం. అందుకే.. హారతి సమయంలో.. ఆ వెలుగులో స్వామిని చూపిస్తారు. కాబట్టి హారతి ఇచ్చే సమయంలో కళ్లు మూసుకోకుండా దేవుడిని ప్రత్యక్ష దైవాంశ రూపంగా దర్శించాలి.

No comments:

Post a Comment