శనీశ్వరుడు ఎప్పుడూ అధో దృష్టితోనే ఉంటాడు. దీనికి కారణమేమిటి? ఒకవేళ ఆయన నేరుగా ఎవరినైనా చూస్తే ఏమవుతుంది?
పూర్వం గణపతి పుట్టినప్పుడు జరిగిన కథ ఇది. గణేశుడు అవతరించారనగానే ఆ బాలుడిని చూడటానికి ఎందరెందరో దేవతలు, పార్వతీ పరమేశ్వరుల ఇంటికి వస్తూ ఉండేవారు. అలా ఆ ముచ్చటైన బాలుడిని చూసి ఆశీర్వదించి అంతా ఆనందంగా వెళుతుండేవారు. వారిలాగానే సూర్యుడి కుమారుడైన శని కూడా ఆ శిశువును చూడటానికి ముచ్చట పడుతూ వచ్చాడు. అయితే శని అందరిలాగా తల ఎత్తుకొని కాక తల దించుకొని నేల చూపులు చూస్తూ వచ్చాడు. అతడలా రావటానికి ముందు గోలోకంలో ఉన్న శ్రీకృష్ణుని మనసారా స్తుతించాడు. అలాగే ఆయన పక్కనే ఉన్న శ్రీహరిని, బ్రహ్మదేవుడిని, శంకరుడిని, ధర్మదేవత ను, సూర్యుడిని ఇతర దేవతలనందరినీ వినయంగా స్తుతించి నమస్కరించి ఆ తర్వాతనే శిశు రూపంలో ఉన్న గణపతిని చూడటానికి బయలుదేరాడు. ఆయన ముందుగా పార్వతీ దేవి అంతఃపురం ముందున్న శూలహస్తుడైన విశాలాక్షుడు అనే శివకింకరుడి దగ్గరకొచ్చి తల దించుకునే ఆ కింకరుడితో తానెవరో చెప్పి తనను లోపలకు పంపమన్నాడు.
విశాలాక్షుడు శనైశ్చరుడిని లోపలికి అనుమతించాడు. శని లోపలకు వెళ్ళేసరికి పార్వతీ దేవి రత్న సింహాసనం మీద కూర్చుని ఉంది. అయిదుగురు పరిచారికలు తెల్లని వింజామరలు వీస్తూ సేవిస్తూ ఉన్నారు. రత్నభూషణాలను అలంకరించుకొన్న ఆమె ఒళ్ళొ శిశురూప గణపతి ఉన్నాడు. అందరూ ఆ తల్లీ బిడ్డలను చూసి పలకరించి వెళుతున్నారు. రత్న సింహాసనం మీద ఉన్న పార్వతీదేవి దూరంగా తల దించుకొని నిలుచున్న శనీశ్వరుడిని చూసింది. ఆమెకు ఆయనొక్కడే అలా చాలా సేపటి నుంచి తలదించుకొనే ఉండటం విచిత్రమనిపించి అలా ఉండటానికి కారణమేమిటో చెప్పమని అంది. అప్పుడు శని అది తన కుటుంబానికి సంబంధించిన విషయమని, అయినా జగత్తుకంతటికీ తల్లిలాంటిదైన పార్వతీదేవి అడిగినప్పుడు చెప్పటమే ఎంతో మేలైన విషయమని అంటూ తన స్వవిషయాన్ని వివరంగా ఇలా చెప్పాడు.
తాను సూర్యుడి కుమారుడినని, తనకు యుక్త వయస్సు రాగానే సూర్యుడు చిత్రరథుడి కుమార్తెతో తనకు వివాహం చేశాడని అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి నిరంతరం శ్రీహరినే ధ్యానిస్తూ ఉండేవాడినని, హరి ధ్యానమే తప్ప వేరొకటి తెలియని తనకు మళ్ళీ తనలాగే భక్తి పరురాలైన భార్య దొరికినందుకు ఆనందించానన్నాడు. తన భార్య కూడా ఎప్పుడూ అలా ధ్యానంలోనే ఉండేదని, అయితే ఓసారి ఆమె రుతుస్నాత అయి సంతానార్థం తన దగ్గరకు వచ్చి నిలిచినా తానామె వైపు కనీసం చూడలేదన్నాడు. అందుకామెకు బాగా కోపం వచ్చి ఆనాటి నుంచి తాను నేరుగా ఎవరిని చూస్తే వారు నశిస్తారని శపించిందని పార్వతీ దేవికి శనీశ్వరుడు చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తాను ప్రసన్నురాలిని చేసుకున్నా ఆ శాపం మాత్రం విముక్తి కాలేదని, తాను ఎవరి వైపు నేరుగా చూస్తే వారు నశిస్తున్నారు కనుక అధో దృష్టితో కాలం గడుపుతున్నానన్నాడు శనైశ్చరుడు.
పార్వతీమాత ఆ మాటలు విని శని పరిస్థితికి బాధ పడింది. అయినా జరిగేదంతా భగవదేచ్ఛ ప్రకారం, కర్మను అనుసరించి జరుగుతుంటాయి కదా, మరేమీ ఇబ్బంది లేదు, మా ఇద్దరి వంక నీవు చూడవచ్చు అని పార్వతీ దేవి శనితో అంది. శని ఒకవేళ అలా చూడకపోతే ఆమెకు కోపం వచ్చి శపిస్తే మళ్ళీ ఎక్కడ ఆ శాపాన్ని అనుభవించాలో అని భయపడి ఆ తల్లి ఒళ్ళొ ఉన్న శిశువు వంక చూశాడు. ఆ మరుక్షణం లోనే ఆ శిశువు తల తెగి గోలోకంలోని శ్రీకృష్ణుడిలో లీనమైంది. శని చెబుతున్న విషయాన్ని పట్టించుకోక పార్వతీ మాత అలా పుత్ర శోకానికి గురైంది. శోకిస్తున్న ఆమెను ఓదార్చి శ్రీహరి గజ శిరస్సును తెచ్చి మళ్ళీ గణపతికి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. ఈ కథా సందర్భంలో శని అధో దృష్టికి సంబంధించిన ఆమె భార్య శాపం, అలాగే పార్వతీ సుతుడు గణపతికి గజాననం రావటానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.
కొన్ని పురాణాలలో శివుడు గజ ముఖాన్ని తెచ్చి బాల గణపతికి అమర్చినట్లు కనిపిస్తుంది. అయితే ఇక్కడ శ్రీహరి అలా చేసినట్లుంది. ఇది కల్ప భేదాన్ని అనుసరించి జరుగుతుండే విషయమని, ఒకే కథ ఒక్కో కల్పంలో కొద్దిపాటి తేడాతో మరోలాగా కూడా కనిపిస్తుండటం సహజమని పురాణజ్ఞులు వివరిస్తున్నారు.
No comments:
Post a Comment