Sunday 8 May 2016

అక్షయ తృతీయ


లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
అందువల్ల సముద్ర జలాల నుంచి తయారయ్యే ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమేనంటారు. నిజంగా పేదవాడు అక్షయ తృతీయ మీద అంత విశ్వాసం ఉంటే బంగారం బదులు ఉప్పుకొనుక్కుంటే అదే పదివేలు. వచ్చే సంపద రాకుండా మానదు. చేతుల్లో డబ్బున్నప్పుడు మన స్తోమతను బట్టి బంగారం కొనుక్కుంటూపోతే అదే సంపదగా పోగుబడుతుంది. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనాలన్న సంగతి పురాణాలకే పరిమితమై, నగలను కొనడం మాత్రమే నేడు వేలం వెర్రిగా మారింది.
అక్షయం అంటే నాశం లేకపోవడం.దినదినాభివృద్ది చెందడం కూడా.
ఈ రోజు బంగారాన్ని కొంటే అక్షయమౌతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయనాడు నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అక్షయమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ' అక్షయ ' తృతీయగా వ్యవహరిస్తారు.
అక్షయ తృతీయరోజే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. నాలుగు యగాల్లో మొదటిది కృత యగం.
ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట!
నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే.
క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే! కాబట్టే అక్షయ తృతీయ నాడు...రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే!
అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.
స్థోమత ఉంటే నగనట్రా కొనచ్చు. కానీ అప్పుచేసి కొంటే మాత్రం తిప్పలే! సకాలంలో తీర్చకపోతే ...రుణాలూ అక్షయమవుతాయి! ఈ విషయంలో పెద్దలు కొన్ని మినహాయింపులిచ్చారు. బంగారం కొనగలిగే శక్తి లేకపోతే ... వెండి కొన్నా మంచిదేనట. అదీ కొనలేమనుకుంటే ఉప్పు కొన్నా ఫర్వాలేదంట! లవణంలోనూ లక్ష్మిదేవి ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు సత్కార్యాలు చేయడం ద్వారా మంచిని అక్షయం చేసుకోవచ్చు.
అసలే వేసవి కాలం. ఎండలు మండుతున్నాయి. నలుగురు యాచకులకు చెప్పులో, గొడుగులో, దానం చేయవచ్చు. చల్లని మజ్జిగతోనో, పానకంతోనో పది మంది గొంతు తడపొచ్చు.
ఈరోజున విష్ణు మూర్తికి చందన లేపనం చేసిన వారికి మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు, శ్రీ మహావిష్ణువును కృష్ణ తులసి దళాలతొ అర్చించడం విష్ణువుకు మహా ప్రీతిదాయకం. అక్షయ తృతియ రోజున మహావిష్ణు ప్రీతిగా విష్ణు అర్చన, సహస్ర నామ పారాయణ చేసి, వడపప్పు, పానకం దానం చెయ్యడం మంచిది. వేసవి ముదురుతూ ఉంటుంది కాబట్టి, నీరు, పలుచని మజ్జిగ, చెప్పులు, వస్త్రము, గొడుగు, బెల్లం, మొదలైనవి కూడా దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది అని పెద్దల ఉవాచ. కొంథమంది ఈ మాసం లో వచ్చే మామిడి పళ్ళను, ఒక విసనకర్రతో పాటు, దక్షిణ తాంబూల సహితంగా బ్రాహ్మణులకు దానం చేస్తారు.

No comments:

Post a Comment