Tuesday, 24 May 2016

ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదు.......!!


దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి.
శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు.
ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.
కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు.
అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.
అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని.

కస్తూరి.........!!


జాతకచక్రంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారి కస్తూరి ని పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవచ్చును.
ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు కాదు.కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది.
వాస్తవానికి కస్తూరి అనేది అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి.
కస్తూరి ఉన్న ఇంట్లో ధనాభివృద్ధి ఉంటుంది. రుణభాదలు ఉండవు.అధికారుల వేదింపులు ఉండవు.
వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులను తొలిగిస్తుంది.దంపతుల మద్య ఏటువంటి గొడవలు లేకుండా అన్యోన్యత కలిగి ఉంటారు.
బిజినెస్ చేసే బీరవాలోగాని,గల్లా పెట్టెలోగాని ఉంచిన దనానికి లోటు ఉండదు.పూజా స్థలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.

ఏడు రోజుల పూజా విధానాలు:-


వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత వుంది. దాని ప్రకారం ఒక్కో దేవతకు ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో మన పూర్వీకులు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం.రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.
ఆదివారం: అనారోగ్య నివారణకు, చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతాన క్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారం నాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారం నాడు ఉపవాసం వుండి, సూర్యారాధన లేక సూర్యాష్టకం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారం నాడు ప్రారంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలు ఆచరించాలి. అలా ఆచరించలేని వారు కనీసం 12 వారాలైనా చేయాలి.
వ్రతవిధానం: ఆదివారం నాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సాష్టాంగ నమస్కారములతో సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆ పైన గంగా జలాన్ని, లేదా శుద్దోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయుణిడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం వుంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.
సోమవారం: అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనః కారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు చంద్రశేకరాష్టకంతో సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారంనాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ఓం నమఃశ్శివాయ అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, చంద్రశేకరాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పువ్వులు, శ్వేత గంధం, బియ్యంతో చేసిన పిండి వంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండి ఉంగరాన్ని ధరించాలి. పూజా సమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతో పాటు పాలు, పెరుగు, పండ్లు మరియు తెలుపురంగు వస్తువులను దానం చేయాలి.
మంగళవారం: ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి ఆంజనేయ స్తోత్రం గాని సుబ్రమణ్య అష్టకమ్ గాని పఠించి మంగళవార వ్రతం ఆచరించాలి.
వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్దిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, ఋణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపురంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరాన్నిలేదా మూలమంత్రం పఠించాలి.
బుధవారం: స్థితికారకుడు, శిక్షరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు మదురాష్టకాన్ని భక్తితో పఠిస్తూ ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజ చేసే వారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చ ద్రాక్ష మొదలైన ఆకుపచ్చ రంగులో వుండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డి తినిపించడం శ్రేష్ఠం. ముడిపెసలతో చేసిన పదార్ధాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.
గురువారం: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివౄఎద్దిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రే యుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యా ఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గురువార వ్రతం చేయాలి.
వ్రతవిధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్ళపాటు చేయాలి. స్నానా నంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచు లోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిసిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు. ఒకపూట తప్పనిసరిగా ఉపవాసం వుండి, స్వామికి నివేదించిన పదార్ధాలను స్వీకరించాలి.
శుక్రవారం: దుర్గ, లక్ష్మి, సంతోషిమాతా, గాయత్రి తదితర దేవతల అనుగ్ర హాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్త్రణామం శుక్రవార పూజకు శ్రేష్ఠమైనది.
వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం లేదా ఏ మాసంలోనైనా శుక్లప క్షంలో వచ్చే తొలి శుక్రవారం నాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లని తల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.
శనివారం: శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహువు, కేతువు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు నవగ్రహా స్తోత్రంతో శనివార వ్రతం చేయాలి.
వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమా సంలో వచ్చే తొలి శనివారం నాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచ రణ చేయాలి. వెంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వు లనూనె, ఆవు నెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు వత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో, సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.
ఏ పూజ, వ్రతం చేసేటప్పుడైనా ఫలితం కోసం కాకుండా శ్రద్దాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా వుండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మచర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా వుండాలి.

Monday, 9 May 2016

సప్త ఋషులు

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!
భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.
ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.
1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజనీయులు.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.
1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు). దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.
2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.
3. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.
4. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.
5. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.
6. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.
7. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.

శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం.

 ఇందువెనుక ఒక కధ ఉంది. ఆ కధ సాక్షాత్ శ్రీ మహా విష్ణువే చెప్పాడు.
పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు . అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలో కాలాన్ని వెళ్ళబుచ్చుతూండేవాడు. గుడాకేశుడు విష్ణువు భక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు. ఇది ఇలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలని అనిపించింది. ఫలితంగా, ఆ రాక్షసుడు పదహారువేల సంవత్సరాల పాటు విష్ణువు గురించి తపస్సు చెయ్యగా . అతని తపస్సుని మెచ్చిన విష్ణుమూర్తి,ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమన్నాడు. అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదు అని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహించమని కోరుకున్నాడు. అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి,తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరుకున్న వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. గుడాకేశుడు సంతోషించాడు. విష్ణుమూర్తి అనుగ్రహించిన అనంతరం గుడాకేశుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు. వైశాఖ శుద్ధ ద్వాదశినాడు ఆ రాక్షసుని కోరికను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు. విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండించింది. వెంతనే అతడి మాంసమంతా రాగిగా మారి పోయింది. ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి. మలినాలు కంచులోహంగా మారాయి. గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది. ఆ పాత్ర లో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది. ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడమంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్త్టం. అనంతరం తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి. రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు, ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణుమూర్తి సెలవిచ్చారు. అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమర్పించటం వెనుక ఇంత కథ ఉంది.

అక్షయ తృతీయ. దాని ప్రాముఖ్యత

ఈ నెల 9న అక్షయ తృతీయ. దాని ప్రాముఖ్యత:
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం
అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి. బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు. అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు 

వ్యవసాయ జ్యోతిష్యంలో మేషాది పన్నెండు రాసులు ప్రాముఖ్యత ఎంతో ఉంది.


మేషం ; ఉల్లిపాయ మరియు ఉల్లి వలె వాసన వచ్చే ఉడుపు మొక్కలు పాతుటకు విత్తనాలు చల్లుటకు ఉత్తమం.
వృషభం ; ముల్లంగిదుంప,క్యారెట్,బీట్రూట్,చిలకడదుంప మొదలగు పంటలు వేయటానికి మంచిది.
మిధునం; పచ్చిక గడ్డి కోయుటకు పొలం దున్నుటకుచాలమంచిది.
కర్కాటకం ; పండ్ల మొక్కలకు,తోటలకు ప్రత్యేకమైన రాశి కర్కాటకం.పండ్ల విత్తనాలు నాటుటకు
పండ్లమొక్కలు ఒక చోట నుండి పెకలించి మరొక చోట పాతుటకు చాలా మంచిది.
సింహం ; విత్తనాలు చల్లుతకు కానీ మొక్కలు ఒక చోట పెకలించి మరొక చోట పాతుటకు మంచిది కాదు.
కన్య ; పొలం దున్నుటకు,కలుపు మొక్కలు తీయుటకు కన్య రాశిచాలమంచిది.
తుల ; పండ్ల,పూల మొక్కలు నాటుటకు,విత్తనాలు చల్లుటకు చాల మంచిది.
వృశ్చికం ; పండ్ల మొక్కలకు మంచిది.పండ్ల,దుంప విత్తనాలకు మంచిది.
ధనుస్సు ; ఉల్లిపాయ పంటకు అన్ని రకాల పంటలు వేయటానికి చాలమంచిది.
మకరం ; దుంప పంటలకు మంచిది.
కుంభం ; పొలం దున్నుటకు,కలుపు మొక్కలు తీయుటకు చాలమంచిది.
మీనం ; పలుచని పండ్ల మొక్కల పంటలకు,అన్నిరకాల పండ్ల పంటలకు చాల మంచిది.
ముఖ్యంగా ఆదివారం ఏ మొక్కలు అయిన సరే వ్రేళ్ళతో సహా పీకి మరొక చోట నాటకూడదు.అల చేస్తే మొక్కలు చనిపోతాయీ.
పుష్యమి నక్షత్రంలో ఏ మొక్క నాటిన బాగుగ పెరుగును.

పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.


1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.
3. ధూపం
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.
4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.
5. గంధపు సేవ
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
7 పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
8 పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
9 ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.
10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.
11 కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే

Sunday, 8 May 2016

ఇలాంటివి మనకు ఆదర్శమా !

* హైందవసంప్రదాయంలో తల్లి తండ్రి కి ప్రేత్యేకమైన రోజూ లేదూ ప్రతిరోజూ దైవంకన్నా ముందూ తల్లి నే మాతృదేవోభవ - తల్లి దైవంతో సమానం..అని చెప్పింది మన వేదం.
* భారతీయ కుటుంబ వ్యవస్థకు మూలాధారం తల్లి.
* నవమాసాలు మోసి, కని, పెంచి, పెద్దచేసి , విద్యాబుద్దులు నేర్పించిన తల్లి ఋణం ఎంత చేసినా తీరదు.
* జీవితాంతం తన సంతానం, మనుమలు, మనుమరాళ్ళు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని ప్రతి తల్లీ, ప్రతి తండ్రీ కోరుకుంటారు.
ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన భారతీయ కుటుంబ వ్యవస్థ మన సంస్కృతికి ఆయువుపట్టు లాంటిది. దురదృష్ట వశాత్తూ భోగవాద దేశాలనుండి దిగుమతి చేసుకున్న ' దినాల' ఫలితంగా మన కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నది.
జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటూ, ఆరాధించవలసిన తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమాలకు పంపించి మనం కూడా ఏడాదికి ఒకరోజు ' తల్లుల దినం', 'తండ్రుల దినం' పేరుతో వేడుకలు చేసుకుంటున్నాము.
నిరంతరం, ప్రతి క్షణం ప్రేమించవలసిన అమ్మలను ప్రేమించడానికి ఒకరోజును ఎంచుకోవడం చాలా బాధాకరం.
అమెరికాలాంటి దేశాలలో కుటుంబ వ్యవస్థ లేదు. సంపాదన ప్రారంభించిన పిల్లలు తమ తల్లులను వృద్ధాశ్రమాలలో చేర్పిస్తారు. సంవత్సరంలో ఒకసారి, మే మాసం 2వ ఆదివారం నాడు సెలవుదినాన MOTHERS DAY పేరుతో సంబరం చేసుకుంటూప్రత్యేకంగా ఆశ్రమానికి వెళ్ళి తమ తల్లితో గడిపి కలిసి భోజనం చేసి ఆమెకు కానుకలను సమర్పించి తిరిగి వస్తారట .
ఇలాంటివి మనకు ఆదర్శమా ! కాదు.

అక్షయ తృతీయ


లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
అందువల్ల సముద్ర జలాల నుంచి తయారయ్యే ఉప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమేనంటారు. నిజంగా పేదవాడు అక్షయ తృతీయ మీద అంత విశ్వాసం ఉంటే బంగారం బదులు ఉప్పుకొనుక్కుంటే అదే పదివేలు. వచ్చే సంపద రాకుండా మానదు. చేతుల్లో డబ్బున్నప్పుడు మన స్తోమతను బట్టి బంగారం కొనుక్కుంటూపోతే అదే సంపదగా పోగుబడుతుంది. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనాలన్న సంగతి పురాణాలకే పరిమితమై, నగలను కొనడం మాత్రమే నేడు వేలం వెర్రిగా మారింది.
అక్షయం అంటే నాశం లేకపోవడం.దినదినాభివృద్ది చెందడం కూడా.
ఈ రోజు బంగారాన్ని కొంటే అక్షయమౌతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయనాడు నగల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. అక్షయమైన సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను ' అక్షయ ' తృతీయగా వ్యవహరిస్తారు.
అక్షయ తృతీయరోజే కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతాయి. నాలుగు యగాల్లో మొదటిది కృత యగం.
ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట!
నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే.
క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే! కాబట్టే అక్షయ తృతీయ నాడు...రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే!
అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.
స్థోమత ఉంటే నగనట్రా కొనచ్చు. కానీ అప్పుచేసి కొంటే మాత్రం తిప్పలే! సకాలంలో తీర్చకపోతే ...రుణాలూ అక్షయమవుతాయి! ఈ విషయంలో పెద్దలు కొన్ని మినహాయింపులిచ్చారు. బంగారం కొనగలిగే శక్తి లేకపోతే ... వెండి కొన్నా మంచిదేనట. అదీ కొనలేమనుకుంటే ఉప్పు కొన్నా ఫర్వాలేదంట! లవణంలోనూ లక్ష్మిదేవి ఉంటుంది.
అక్షయ తృతీయ రోజు సత్కార్యాలు చేయడం ద్వారా మంచిని అక్షయం చేసుకోవచ్చు.
అసలే వేసవి కాలం. ఎండలు మండుతున్నాయి. నలుగురు యాచకులకు చెప్పులో, గొడుగులో, దానం చేయవచ్చు. చల్లని మజ్జిగతోనో, పానకంతోనో పది మంది గొంతు తడపొచ్చు.
ఈరోజున విష్ణు మూర్తికి చందన లేపనం చేసిన వారికి మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు, శ్రీ మహావిష్ణువును కృష్ణ తులసి దళాలతొ అర్చించడం విష్ణువుకు మహా ప్రీతిదాయకం. అక్షయ తృతియ రోజున మహావిష్ణు ప్రీతిగా విష్ణు అర్చన, సహస్ర నామ పారాయణ చేసి, వడపప్పు, పానకం దానం చెయ్యడం మంచిది. వేసవి ముదురుతూ ఉంటుంది కాబట్టి, నీరు, పలుచని మజ్జిగ, చెప్పులు, వస్త్రము, గొడుగు, బెల్లం, మొదలైనవి కూడా దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది అని పెద్దల ఉవాచ. కొంథమంది ఈ మాసం లో వచ్చే మామిడి పళ్ళను, ఒక విసనకర్రతో పాటు, దక్షిణ తాంబూల సహితంగా బ్రాహ్మణులకు దానం చేస్తారు.

శని వజ్ర పంజర కవచమ్

శనిదోష నివారణ "శని వజ్ర పంజర కవచమ్"
సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెను వెంటనే కలిగించే దేవుడు శనేశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి,ధర్మాన్ని నిలిపే శనిభగవానుడు యమధర్మరాజుకు మరియు యమునకు అగ్రజుడు. వీరి శరీర ఛాయ నలుపే. సూర్యుని కుమారులైన శని మరియి యముడు, ఇరువురూ న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనలు విదిస్తే, శని, జీవులు బ్రతికి ఉండగానే హింసించి, యాతనలకు గురిచేసి శిక్షిస్తాడు.
గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాపమార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించేవారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి, నానాయాతనలకు గురిచేసి,అత్యంత కౄరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు, తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు వర్ణించాయి.
నల్లని ఛాయ అతని మేని వర్ణం. నల్లని వస్త్రములు అతని ఉడుపులు. ఖడ్గము, బాణములు మరియు రెండు బాకులు అతని ఆయుధాలు. నల్లని కాకి అతని వాహనం.శనిభగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయా మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాల-భైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు జ్యోతిష శాస్త్రాలలో వర్ణింపబడ్డాడు .
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.
శని వజ్ర పంజర కవచమ్
నీలాంబరో నీలవపుః కిరీటీ
గృధ్రస్థితాస్త్రకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః
సదా మమస్యాద్వరదః ప్రశాంతః ||
బ్రహ్మా ఉవాచ |
శృణుధ్వం ఋషయః సర్వే శని పీడాహరం మహత్ |
కవచం శనిరాజస్య సౌరైరిదమనుత్తమమ్ ||
కవచం దేవతావాసం వజ్ర పంజర సంంగకమ్ |
శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ ||
అథ శ్రీ శని వజ్ర పంజర కవచమ్ |
ఓం శ్రీ శనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః |
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః || 1 ||
నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా |
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః || 2 ||
స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః |
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా || 3 ||
నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా |
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా || 4 ||
పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః |
అంగోపాంగాని సర్వాణి రక్షేన్ మే సూర్యనందనః || 5 ||
ఫలశ్రుతిః
ఇత్యేతత్కవచమ్ దివ్యం పఠేత్సూర్యసుతస్య యః |
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః ||
వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోపివా |
కలత్రస్థో గతోవాపి సుప్రీతస్తు సదా శనిః ||
అష్టమస్థో సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే |
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ ||
ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా |
ద్వాదశాష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా |
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః ||

Saturday, 7 May 2016

అక్షయ తృతీయ

శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.
బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు.
అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం

Tuesday, 3 May 2016

భూత శుద్ధి – పంచభూతాలను మీకు సహకరింప చేసే ఒక మార్గం

ఈ పంచభూతాల విన్యాసమే మీ జీవితం . అవేగనక సహకరించకపోతే మీరెంత ప్రయత్నం చేసినా, మీ జీవితంలో చెప్పుకో దగ్గ విశేషాలేవీ జరగవు . వీటి సహకారంతోనే అతి సాధారణమైనవాటి నుంచి అత్యుత్తమమైన అంశాల వరకూ , ప్రతీదీ కూడా ఒక అవకాశంగా మారుతుంది.మీ శరీరం ఒక ద్వారం లాటింది. ఒక ద్వారానికి రెండు అంశాలు ఉంటాయి: మీకు ఎప్పుడూ మూసి ఉన్న తలుపులు ఎదురైతే, అదే ద్వారం మీకో అడ్డుగోడలా అనిపిస్తుంది; అలాకాక ద్వారాలు మీకెప్పుడూ తెరుచుకుంటూ ఉంటే మీకదో అవకాశంలా ఉంటుంది. ద్వారం అదే, కానీ మీరు దానికి ఎటువైపు ఉన్నారనేది మీ జీవిత గమ్యాన్ని నిర్ణయిస్తుంది.
‘ఒకే ఒక్క నిమిషం’ అని బాత్రూమ్ లోనుండి మీరు కేకవేస్తారు కానీ అదే క్షణం బైట ఎదురుచూస్తూన్న వాళ్ళకో యుగంలా అనిపిస్తుంది! లోపలున్న మీకు ‘ఆ…. ఒక్క క్షణమే కదా’ అని అనిపిస్తుంది, కానీ అవతల వాళ్ళకదో యుగం !  బాత్ రూమ్ తలుపుకెటువైపు ఉన్నారు అనే దాని పై ఒక్క నిమిషం లిప్తపాటుగా అనిపించవచ్చు లేదా ఓ యుగంలా అనిపించవచ్చు ! మీ జీవితానుభవం అద్భుతంగా ఉంటుందా , లేక ఈ జీవితమే ఓ అడ్డుగోడలా ఉందా అన్న విషయాన్ని మీ పంచభూతాల సహకణే  నిర్ణయిస్తుంది
ఒకసారి, ఒక బిషప్ న్యూయార్క్ కి వచ్చి సెంట్రల్ పార్క్ లో మీటింగ్ పెట్టారు, కాతొలిక్స్ అందరూ అక్కడికి రావలసి ఉంది. ఈ నగరంలో కేవలం కొద్దిమందే కాతోలిక్స్ ఉన్నారు అని అప్పుడే వారికి తెలిసింది. వారంతా వచ్చారు – నమ్మకాలను పునరుద్ఘాటించి, మత ప్రచారాన్ని చేసి తమ సంఖ్యను ఎలా పెంచాలో బిషప్ మాట్లాడుతున్నారు. అప్పుడే కొత్తగా మతం పుచ్చుకున్న  కాతోలిక్ ఒకరు ఇలా అడిగారు ‘ప్రియమైన ఫాదర్, జీసస్ తానే న్యూయార్క్ నగరంలో పునర్జన్మించి మళ్ళీ ఈ మతాన్ని పునరుద్ఘాటించొచ్చు కదా?’
ఈ బిషప్ ఒక క్షణం ఆలోచించి,  ‘ నాయనా ,జీసస్ మళ్ళీ పుట్టాలంటే కొన్ని నిర్దిష్ట పరిస్థితులు కావాలి,. మొట్ట మొదటిగా ముగ్గురు వివేకవంతులైన వ్యక్తులు కావలి, అది ఈ న్యూయార్క్ నగరంలో అసంభవము. పైగా ఓ కన్య కూడా కావాలి , అమెనెక్కడ వెతుకుతారు ?’
ఏదైనా జరగాలంటే అందుక్కావలసిన అంశాలు, తగిన వాతావరణం ఏంతో అవసరం . భూత శుద్ధి అనేది మీ వ్యవస్థలోని  పంచభూతాలను శుద్ధ పరిచి అవి సహకరించేలా చేసే ఒక మార్గం.
జీవితపు అవకాశాలూ , బంధనాలు ఈ రెండూ కూడా పంచభూతాల ద్వారానే జరుగుతాయి . విముక్తి  లేక బంధనం అనేవి ఒకే కత్తికున్న  రెండు అంచుల్లాంటివి. దాన్నోవైపు తిప్పితే అది స్వతంత్రం, మరో వైపు తిప్పితే పాశం!.
జీవిత ప్రక్రియంతా ఇంతే. ప్రేమాద్వేశాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయుంటాయి ; జీవన్మరాణాలెప్పుడూ ఒకదానిలో ఒకటి కలిసుంటాయి. అవి విడివిడిగా ఉంటే మనం తేలికగా నిర్వహించగలిగే వాళ్ళము, కానీ అవి ఎప్పుడూ ఒకదానిలో ఒకటి కలిసి ఉన్నాయి. మీరు మరణాన్ని తప్పించుకోవాలి అనుకుంటే మీరు ఈ జీవితాన్నే చేజార్చుకుంటారు. మీలో మీరు, ‘నేను మరణించ కూడదు ‘ అనే  ఒక భావనను సృష్టించుకుంటే మీరు కనీసం మీ మంచం దిగి ఒక్క అడుగు కూడా వేయలేకపోయేవారు. ఎంత బాగా ప్రయత్నించినా మీరు తప్పించు కోగలిగేది జీవితాన్నే కానీ మరణాన్ని మాత్రం కాదు. ఇదే జీవిత విధానం – ఒకదానిలో ఇంకొకటి ఉంటుంది. అక్కడేముందో ఇక్కడ అదే ఉంది, ఇక్కడ ఏముందో అక్కడా  అదే ఉంది. అన్నిటినీ మించి, మీరు నిశితంగా చూస్తే, అన్నీ మీలోనే ఉన్నాయి. అది ఎంతో సంక్లిష్టమైనదానిలాగా కనిపిస్తుందికానీ  అదే చాలా సులువైనది కూడా .
ప్రాచీన భారతదేశంలో సమ్మోహన కళలో నిష్ణాతులైన కొంత మంది వేశ్యలు ఉండే వారు. వారు చాలా ఎక్కువ నగలు ధరించేవారు,ఆపాదమస్తకం  ఆభారణాలే !. ఒక్కొకటిగా తీయాలంటే దానికి చాలా సమయం పడుతుంది. ఇవి తీసివేయటానికి మరో మార్గమే లేదు. కామవాంఛతో మరిగిపోతున్న పురుషుడు ఈ స్త్రీని వివస్త్రను చేయాలి అనుకుంటాడు, కానీ అతను తీయలేకపోతాడు. ఆమె ఇంకొంచం మత్తుపానీయాలతో కవ్వించి ప్రోత్సహిస్తుంది – కొంచం,ఇంకొంచం, మరికొంచంగా.  అతడికి మైకమొచ్చి చూపు ఇంకా తక్కువయ్యే కొద్దీ అతని పని ఇంకా కష్టతరమవుతుంది, ఆ తరువాత గురక పెడుతూ అతను నిద్రలోకి జారుకుంటాడు. అక్కడ ఒక పిన్ను ఉంటుంది, దాన్ని లాగితే మొత్తం అన్నీ ఒక్కసారిగా పడిపోతాయి. కానీ ఆ కిటుకు ఆమెకు మాత్రమే తెలుసు.
జీవితం ఇటువంటిదే. పైకి సంక్లిష్టమే కానీ ఒక సులువైన పిన్ను ఉంటుంది. దాన్ని లాగితే అన్నీ ఒక్కసారిగా పడిపోతాయి. ఆ పిన్ను మీరే. మిమల్ని మీరు బయటకు లాగటం ఎలానో తెలుసుకుంటే అకాస్మాత్తుగా అన్నీ కుదుటబడతాయి. ఆ పిన్ను లాగితే అన్నీ కుప్ప కూలిపోయి మీరు విముక్తులవుతారు!
మీ ఆరోగ్యాన్ని ,మీ శరీరపు ప్రాధమిక నిర్మాణాన్ని మార్చుకోవాలంటే మీరు పంచభూతాలను భక్తి, గౌరవాలతో చూడండి. ఒక్క సారి ఇలా చేసి చూడండి మీరు పూర్తి జాగరూకతతో ఉన్నప్పుడు , ఈ పంచభూతాల్లో ఏ ఓక్క దాన్నైనా స్పృశించినప్పుడు , అదే శివుడనో , రాముడనో , క్రిష్ణుడనో, ఎసుక్రీస్తనో , మార్క్స్ లేదా అల్లాగానో భావించండి , మీ జీవితంలో అత్యుత్తమమైనదేదో , దాన్ని స్ఫురించండి . ఇప్పుడొచ్చిన సమస్యేమిటంటే  మీరు ప్రస్తుతమొక  మానసిక జీవి, మీ మనస్సు నిండా ఒక అధికార క్రమం ఉంది. ఈ ప్రక్రియ ఇటువంటి అధికార క్రమాలను కుదుట పరుస్తుంది . కొంతకాలమిలా చేసిన తరువాత ఇదివరకు తలచుకున్న ఆ మాట మాయమైపోతుంది . కానీ మీ జీవితంలో మీరు జాగరూకతతో ఉన్న క్షణాలు పెరిగిన కొద్దీ మీరు ఈ మార్పు తక్షణమే  చూస్తారు.
దక్షిణ భారతదేశంలో పంచ భూతాల కోసమై అయిదు లింగాలు ఉన్నాయి. ప్రతీ ధాతువుకి,  దాని నుండి విముక్తులవడానికి మీరు చేయగలిగే ఒక ప్రత్యేకమైన సాధన ఉంది. దీని కోసమే పంచ భూత స్థలాలను సృష్టించారు. మీరు వెళ్లి సాధన చేసుకోవడానికి మహోన్నత దేవాలయాలు నిర్మించారు. భౌగోళికంగా అవన్నీ డెక్కన్ ప్రాంతంలోనే – నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నాయి. నీటికి సంబంధించిన దేవాలయం తిరువనైకావల్‌లో, అగ్నికి సంబంధించిన దేవాలయం తిరువన్నామలైలో, వాయువుకి సంబంధించిన దేవాలయం కాళహస్తిలో, భూమికి సంబంధించిన దేవాలయం కాంచిపురంలో, ఆకాశానికి సంబంధించిన దేవాలయం చిదంబరంలో ఉన్నాయి.
మనం అర్ధం చేసుకోవలసింది ఏమిటంటే ఈ అయిదు లింగాలు సాధన కోసం సృష్టించబడినవి, ప్రార్ధన కోసం కాదు. జనాలు ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి ఈ పంచ భూతాల సాధన కోసం వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, ఈ సంబంధం ఈనాడు లేదు. ఎందుకంటే ఈ సాధనకు కావలిసిన వాతావరణం తొలిగించేయబడింది. దీనికి కావలిసిన అవగాహనా, నైపుణ్యం సాధారణంగా కనుమరుగై పోయాయి, కానీ దేవాలయాలు ఇంకా ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ గుణాన్నీ, శక్తినీ నిలబెట్టుకున్నాయి, మిగతా ఆలయాలు బలహీనమైపోయాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు


Monday, 2 May 2016

కఠినంగా మాట్లాడుట మంచిది కాదు

పూర్వం యజ్ఞవల్క్య మహర్షి మిథిలా నగరంలో నివసిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప మహర్షి అని ఆ రోజుల్లో ఎంతో పేరుండేది. నిత్యం యజ్ఞయాగాలను చేస్తూ జీవితం గడుపుతుండేవాడు. రాజులు, రారాజులు, తోటి మునులు, ఋషులు ఆయన ఔన్నత్యాన్ని నిరంతరం కీర్తిస్తూ ఉండే వారు. ఇలా ఉండగా ఓ రోజున ఆయన ఆశ్రమంలోకి ఒక ముంగిస పరుగెత్తుకురావటం ఆయన కంటపడింది. వెంటనే పక్కనున్న వారితో ఆ ముంగిస ఆశ్రమం లోపల ఉంచిన పాలు తాగటానికి వస్తున్నట్లుందని, దాన్ని వెళ్ళగొట్టమని చెప్పాడు. ఆ చెప్పటంలో ముంగిసను పరిపరివిధాల పరుషపదజాలాన్ని ఉపయోగించి నిందించాడు ఆ మహర్షి. వచ్చిన ముంగిస సాధరాణమైనదికాదు. దానికి అత్యంత జ్ఞానశక్తి ఉంది. దాంతో ఆ ముగింస మానవ భాషలో యజ్ఞవల్క్య మహర్షిని చూసి మాట్లాడటం ప్రారంభించింది.
ఓ! యజ్ఞవల్క్యుడా పరుష పదజాలంతో నన్ను నీవు నిందించటం మహా ఘోరమైన విషయం. కఠినమైన పదాలలో ఎదుటి వారిని బాధిస్తే ప్రాప్తించే నరకాలు ఎంత బాధాకరంగా ఉంటాయో నీకు తెలియదనుకొంటాను. నేనేగొప్ప అని ఎదుటి వారు అధములని నోటికి వచ్చినట్లుగా నిందా పూర్వకంగా మాట్లాడవచ్చని ఏ శాస్త్రంలోనూ మరేస్మృతిలోనూ రాసిలేదు. కఠిన వాక్కు ఎదుటి వ్యక్తి మనుస్సును వాడి అయిన ములుకులాగా బాధిస్తుంది. దానికి ఫలితం ఆ పలుకులు పలికిన వ్యక్తి మరణించిన తర్వాత అనుభవించాల్సి ఉంటుంది. యమభటులు అలా మాట్లాడిన వాడి గొంతు మీద కాళ్లతో తొక్కి హింసిస్తారు. వాడి చెవులలో లోహపు ములుకులు దించుతారు. వదరుబోతు తనంతో అడ్డదిడ్డంగా మాట్లాడిన వాడిని వజ్రసమానం, కాలకూట విషపూరితం అయిన ములుకులతో యమభటులు బాధిస్తారు. అసలు కఠినమైన మాటలు మహాబాధాకరాలు. శరీరంలో గుచ్చుకున్న బాణాలనైతే పెకలించవచ్చేమో కానీ మనసులో గుచ్చుకొన్న పరుష వాక్యాలనే బాణాలను పెకలించటం కానీ ఆ బాణపుదెబ్బ తిన్న వ్యక్తికి సంతోషం కలుగచేయటం కానీ ఎవరి వల్ల సాధ్యపడదు. ఓ! యజ్ఞవల్క్యుడా నీవు నన్ను అనేక విధాల మాటలతో బాధించావు. అయితే అందరూ అంటూ ఉన్నారు కదా నేనంటేనే అంత పాపం వస్తుందా అని నీవు తిరిగి అనవచ్చు. ఒకడెవడో పాపం చేసాడని ప్రతివాడూ అలాగే చేస్తే అందరూ పాపాత్ములే అవుతారు. కనుక పాపాత్ముల మార్గంలో నడచుకోవటం ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదు. నీవు చేసిన పాపానికి ఇప్పుడు నేను నిన్ను శపిస్తున్నాను. మరుసటి జన్మలో జ్ఞానహీనుడుగా జన్మించు అని శపించి వెళ్లిపోయింది. ముంగిస శాపకారణంగా యజ్ఞవల్క్యుడు జ్ఞాన హీనుడై ఓ ఇంట జన్మించాడు. అయితే నిరంతరం భగవద్భక్తి మార్గంలో నడుచుకోవటం వల్ల గత జన్మలో తానెవరన్నది, ఏం చేసింది జ్ఞాపకం ఉంది. ముంగిస శాపం వల్ల ఏ శాస్త్రాలు పట్టుపట్టలేదు. కానీ ఒక్క దైవభక్తి ప్రభావం చేత ఎంతో సౌమ్యంగా ఉంటూ చివరకు మహీసాగర సంగమం వద్ద తీర్థవిధులను ఆచరించాడు. అప్పటికి ఎలాగోలాగా పాపవిముక్తి కలిగింది.
యజ్ఞవల్క్యుడు అంటే సామాన్యుడేమీ కాదు. ఎంతో గొప్ప మహర్షి. అలాంటి ఆయనకే పరుషపదజాలంతో ఎదుటి జీవిని నిందించినందుకు శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇక సాధారణ జీవితం గడిపేవారు ముంగిస చెప్పిన నరక బాధలను వాక్పారుష్యం వల్ల పొందుతారని కనుక ఎవరినీ కష్టపెట్టేలా ఎగతాళిగా, నిందాపూర్వకంగా పిలవటం, మాట్లాడటం మంచివి కాదు .